చాలా కరెక్టు పని చేశావ్! లేకపోతే మరీ అల్లరి చిల్లరిగా ప్రవర్తిస్తున్నాడు."
భవానీశంకర్ కొద్ది క్షణాల తర్వాత కింద నుంచి లేచి కూర్చున్నాడు. చాతీ పై భాగమంతా నొప్పి, భయంకరమైన నొప్పి, ఓర్చుకుంటూ తలెత్తి వాళ్ళిద్దరి వేపూ చూశాడు. లావుపాటి వ్యక్తీ నోటి మీద తగిలినట్లుంది తను కొట్టిన దెబ్బ. పెదాల మీద రక్తం చార కనబడుతోంది.
చొక్కా పట్టుకుని భవానీశంకరుని లేపి నిలబెట్టాడు లావుపాటి వ్యక్తీ.
"నువ్వొక్కడివే తీన్ మారే ఖాన్ నని అనుకోకు! నిన్ను మించిన వాళ్ళు చాలా మంది వున్నారు -" అన్నాడతను.
"సరిపోయిందా! ఇంకొంచెం ట్రీట్ మెంట్ కావాలా?" అడిగాడు సన్నని వ్యక్తీ.
భవానీ శంకర్ ఏమీ మాట్లాడలేదు. ఉన్న నొప్పికంటే ఇంకొంచెం ఎక్కువ బాధతో విలవిలలాడుతున్నట్లు నటించసాగాడు.
"ఇప్పుడు చెప్పు! సంధ్యారాణి దగ్గర్నుంచి తెచ్చి ఎక్కడ దాచావ్ అది!"
"అదేమిటో నాకు తెలీదు-"
"నేను చెప్పలేదూ - వీడంతా తేలిగ్గా లొంగే రకం కాదని .........?" అన్నాడు సన్నని వ్యక్తీ.
"ఎలా లొంగడో చూద్దాం! సిగరెట్ లైటర్ ఇలా ఇవ్వు. కొత్త పద్దతి ప్రయోగిద్దాం."
అతను సిగరెట్ లైటర్ తీసి లావుపాటి వ్యక్తికీ ఇచ్చాడు.
లైటర్ తో భవానీ శంకర్ దగ్గరకొచ్చాడు.
"నీ కర్లింగ్ హెయిర్ చాలా బాగుంది - నిప్పంటిస్తే క్షణంలో బోడి గుండు మిగుల్తుంది. కానీ తరువాత నీ రూపం చూసుకోడానికి నువ్వే మిగలవనుకో - నేనిది నీ జుట్టుకి అంటించే లోపల చెప్పేయ్ అది ఎక్కడ దాచావో. లేకపోతే చేతులారా నువ్వే నీ ప్రాణం తీసుకున్నట్లవుతుంది.
భవానీ శంకర్ కిటికీ వేపు చూశాడు నెమ్మదిగా. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం వుంది. అదేమిటంటే కిటికీ కి వున్న అలారం టైం పీస్ ని వీధి పక్కనున్న పాక అవతలకు విసిరేయాలి అది చేసే శబ్దానికి పాకల వాళ్ళందరూ లేస్తారు. అప్పుడు గానీ వీళ్ళు కాలికి బుద్దీ చెప్పరు. అయితే ఇదంతా కనుమూసి తెరిచే లోపల జరగాలి.
లావుపాటి వ్యక్తీ లైటర్ వెలిగించాడు.
సరిగ్గా అదే సమయంలో భవానీ శంకర్ వెనక్కు జరిగాడు. భయపడుతున్నట్లు. అతని చేయి వేగంగా అలారం టైంపీస్ మీద పడింది మరుక్షణంలో కిటికీ చువ్వల మధ్య నుంచి ఎగిరి రాజయ్య తలుపుకి కొట్టుకుని పాకల మధ్య శబ్దంతో పడింది.
ఆ చర్యకు తెల్లబోయాడు లావుపాటి వ్యక్తీ. భవానీ శంకర్ ఉద్దేశ్యమేమిటో అర్ధమయిందతనికి. అప్పటికప్పుడే ఆ పాకల్లో సంచలనం కనిపించిందతనికి.
"పద - వీడి సంగతి తరువాత చూచుకుందాం! ఆలస్యమయితే వాళ్ళేవరయినా వస్తారేమో" అన్నాడతను.
"ఒరేయ్ , నీ దగ్గరునుంచి అదెలా సాధించాలో మాకు తెలుసు నిన్నిలా వదిలేస్తున్నామనుకోకు! అది మాకు దొరక్కపోతే ఇంకెవరికి దొరక్కుడదు."
ఇద్దరూ తలుపు తెరచుకుని బయటకు పరుగెత్తారు. మరుక్షణంలో రాజయ్య మరికొంతమంది పరుగుతో వచ్చారక్కడికి.
"ఏంటి బాబూ. మీ గడియారం ఎగిరొచ్చి మా ఇంటిముందు పడింది - " అన్నాడు రాజయ్య.
"మన రూంలోకి కొంతమంది సినిమా విలన్స్ వచ్చారు రాజయ్యా. వాళ్ళ బారినుంచి తప్పించుకోడానికి మీకు నిద్రాభంగం చేయాల్సి వచ్చింది."
అప్పుడే రోడ్ మీద కారు స్టార్టయిన చప్పుడయింది. రాజయ్య అందరిని వెంబడేసుకుని కారు వెనుక పడ్డాడు కానీ ఉపయోగం ల;లేకపోయింది.
కాసేపటి తర్వాత అందరూ వెళ్ళిపోయారు మళ్ళీ.
భవానీశంకర్ ఉత్సాహంగా టెలిఫోన్ డైరెక్టరీ తీశాడు. సంధ్యారాణి ఇంటి అడ్రస్ కనుక్కోగలిగితే మొత్తం మిస్టరీ అంతా సాల్వ్ అయిపోతుంది. తలకు తగలిన గాయాన్ని చన్నీళ్ళతో కడిగి మంచం మీద పడుకుని డైరక్టరీ వెతకటం ప్రారంభించాడతను.
రాత్రి రెండు గంటలకు దొరికిందా నెంబరు.
అడ్రస్ చూసి తన డయిరీలో రాసుకున్నడతను.
"20౩, షబ్నమ్ అపార్టుమెంటు , దోమల్ గూడా. హైదరాబాద్."
ఆ భవనం భవానీశంకర్ కి తెలుసు. అంతా ఖరీదయిన వ్యక్తులు వుండే అపార్టుమెంటు. గల్ఫ్ దేశాల నుంచి కోట్లు సంపాదించుకోచ్చిన వారి కోసం ఎంతో అధునికంగా , ఎంతో సుందరంగా నిర్మించిన భావానాలవి.
బద్దకంగా లేచి ఒళ్ళు విరుచుకున్నాడతను!
ఇంకొద్ది గంటల్లో తను ఆ వస్తువు రహస్యమేమిటో తెలుసుకోగలడన్న ఉత్సాహం అతన్ని ఆనందంతో ముంచెత్తింది.
వెంటనే ట్యూన్ నెంబర్ సిక్స్ పాడసాగాడు బిగ్గరగా. కొద్ది సేపటి తర్వాత అలికిడయి పక్కకు తిరిగి చూసేసరికి రాజేశ్వరి నిలబడి ఉంది నిద్రకళ్ళతోనూ, చింపిరి జుత్తుతోనూ -
"ఇది కొత్త ట్యూన్ అంకుల్! చాలా బాగుంది" అంది సంతోషంగా.
"థాంక్యూ జూనియర్! ఈ శుభ సందర్భంలో మీ మమ్మీ నడిగి అర్జెంటుగా ఓ కప్పు స్పెషల్ చాయ్ తీసుకురా!"
"ఓ! అలాగే అంకుల్!" అంటూ పరుగెత్తబోయి నిరాశగా అక్కడే ఆగిపోయింది "మా ఇంట్లో పంచదార లేదు అంకుల్.ఎలా మరి?"