Previous Page Next Page 
భామ కలాపం పేజి 26

 

    "ఆత్మహత్య! ఆత్మహత్య! ఎవరు చెప్పారు అలాగ!"

 

    "పోలీసు రిపోర్టు అదేగా!"

 

    "అది ఆత్మహత్యే అయితే, చేతులొక చోటా, కాళ్ళు ఒక చోటా, మొండెం ఒక చోటా, తల మరొకచోటా ఎలా పడతాయి సుదీరా?"

 

    "అది చింతలతోపు! శవాన్ని ఏ కుక్కలో, నక్కలో పీకి ముక్కలుగా చేసి ఉంటాయని అనుకుంటున్నారు."

 

    అది నిజమనే నమ్ముతోంది సుదీర. కాదు- నమ్మాలని ప్రయత్నిస్తుంది.

 

    అతి ప్రయత్నం మీద తనని తాను నిగ్రహించుకున్నాడు భరత్.

 

    "మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను" అంది సుదీర సంకోచంగా.

 

    "ఇన్విటేషనా? దేనికి?"

 

    "ఇవాళ హొటలు బిల్డింగు కి శంకుస్థాపన. మీరంతా తప్పకుండా రావాలి.

 

    దుర్భరమైన నిశ్శబ్దం అలుముకుంది.

 

    చాలా సేపటి తరువాత "క్షమించండి సుదీరగారూ! మేము రాలేము" అన్నాడు భరత్.

 

    "అదేం మర్యాద అన్నయ్యా! నువు ఒక్కడివే అన్నా వెళ్ళిరా!: అంది భారతి బలహీనమైన గొంతుతో.

 

    తను అంత కష్టంలో ఉండి కూడా మర్యాదల గురించి పట్టింపు! ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన! ఆ సంస్కారం ఆమెకు సదాశివరావుగారి ద్వారా వచ్చింది.

 

    భరత్ మాట్లాదలేదు.

 

    ఇన్విటేషన్ కార్డులు అక్కడ పెట్టి వెళ్ళిపోయింది సుదీర.

 

    ఆ కార్డుకి నాలుగు వైపులా పసుపూ, కుంకుమా పెట్టి వున్నాయి.

 

    దయాకర్ గుర్తు వచ్చాడు భరత్ కి. ఒక మూల కాళ్ళు, ఒక మూల చేతులు, ఒక మూల మొండెం, ఒక మూల తల - వాటి మీద చల్లిన పసుపు కుంకుమలు!

 

    కడుపులో తిప్పింది భరత్ కి.

 

    వెంటనే పరుగెత్తి పెరట్లోకి వెళ్ళి, వాంతి చేసేసుకున్నాడు.


                                                                                      -------------

 

    పెద్ద బుల్ డోజర్ ఒక్కసారిగా కుమ్మి, గణపతి విలాస్ గోడలను, దాని పక్కనే వున్న చింత చెట్టుని, పడగొట్టింది. ఆ తర్వాత అడ్డం వచ్చిన ప్రతి చెట్టుని, పుట్టని తొక్కేస్తూ దున్నేస్తూ నేలమట్టం చేసేస్తూ వీరవిహారం చేసింది.

 

    ఆ సందట్లో ఒక మేక, తెలివి తక్కువగా బుల్ డోజర్ కి అడ్డం పరుగెత్తి అణిగిపోయింది.


    "హొటలుకి మేక పిల్ల బలి!" అన్నారెవరో నవ్వుతూ.

 

    "మెకెం ఖర్మ! ఏకంగా నరబలే జరిగిపోతే!" అన్నారు ఇంకెవరో జనాంతికంగా.

 

    షామియానా కింద ఒక మూలగా చిన్న గుంటలాంటిది త్రవ్వి వుంది.

 

    సరిగ్గా ముహూర్తం టైంకి ఆ గుంటలో అడుగు పెట్టి , పురోహితులు మంత్రాలు చదువుతూ వుంటే, నవరత్నాలు అందులో వుంచింది సుదీర. ఎవరో అందించిన పునాది రాయిని అక్కడ పెట్టి శాస్రార్ధం దాని మీద సిమెంటు వేసింది.

 

    ఈ తంతు జరుగుతున్నంత సేపూ ఆమె కళ్ళు భరత్ కోసం వెదుకుతూనే వున్నాయి.

 

    "ఏడీ? భరత్ ఏడీ? రాలేదా? ఎందుకని? తన జీవితంలో ఇది అత్యంత సంతోషకరమైన రోజు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి భరత్ తనకి కాబోయే భర్త, రాలేదా?

 

    చాలా నిరుత్సాహం అనిపించింది సుదీరకి. కొంచెం అవమానంగా కూడా ఫీలయింది.

 

                                                                                --------------

 

    శంకుస్థాపన తాలూకు హడావుడి తగ్గగానే భరత్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది సుదీర.

 

    కారుని భరత్ ఇల్లు వున్న సందులోకి మళ్ళించబోతూ, సంకోచంగా బ్రేక్ వేసింది.

 

    వాళ్ళ ఇంటికి వెళ్తే చీఫ్ అయిపోతుందా తను? అవును!

 

    అతనే తమ ఇంటికి రావాలి. వచ్చి కాళ్ళా వెళ్ళా పడి క్షమార్పణ చెప్పుకోవాలి. తను చాలా సేపు బింకంగా వుండి, తర్వాత అతన్ని దయతలచి క్షమిస్తుంది.


    అప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా , భవిష్యత్తు గురించి ప్లాన్సు వేసుకుంటారు.

 

    కారు రివర్సు గేర్ లోకి మార్చి , మెల్లిగా వెనక్కి టర్న్ చేసింది సుదీర.

 

    భరత్ ఆ రోజంతా రాలేదు.

 

    మర్నాడు రాలేదు.

 

    నాలుగురోజులు గడిచాక వచ్చాడు జంకుతూ.

 

    అతన్ని చూడగానే ముందుగా చెప్పలేనంత సంతోషం కలిగింది సుదీరకి. వెంటనే అతను చేసిన అపరాధం గుర్తొచ్చి మొహం కోపంగా పెట్టుకుంది.

 

    "హలో! ఇంకా గుర్తున్నానా నేను!" అంది వెటకారంగా.

 

    ఒక్క గుటక మింగాడు భరత్.

 

    "ఆరోజు రాలేదు మీరు!" అంది ఆరోపణగా.

 

    "అవును!"

 

    "నా జీవితంలో ముఖ్యాతి ముఖ్యమైన రోజు అది. నా పేరుతొ ఫైవ్ స్టార్ హొటలు కడుతున్నారు. ఆ సంతోషం కన్నా దారినపోయే దానయ్య ఎవడో ఆత్మహత్య చేసుకున్నాడన్న దుఖమే ఎక్కువయి నట్లుంది మీకు!"

 

    "అది ఆత్మహత్య కాదు! అక్షరాలా హత్య!" అన్నాడు చలించిపోతూ.

 

    "అని మీరనుకుంటున్నారు. అయినా, కాబోయే భార్య కంటే ఎవరో అనామకుడు మీకు ముఖ్యమా?"

 

    "అతను అనామకుడే కావచ్చు! కాని నా చెల్లెలికి భర్త కావలసిన వాడు."

 

    "ఆ పెళ్ళి జరగడం ఇష్టంలేదని, జరగదని మీకు ఇదివరకే చెప్పాను. అతను మనతో సంబంధం కలుపుకోవడానికి తగినవాడు కాడు."

 

    భరత్ మొహం ఎర్రబడిపోయింది. కొంచెం సంకోచించి అన్నాడు. "అది చెప్పడానికే నేను వచ్చాను. సుదీరా! నేనూ మీతో సంబంధం కలుపుకోవడానికి తగినవాడిని కానేమో!"

 

    "ఏమిటి?" అంది సుదీర ఆశ్చర్యంగా. "ఏం తక్కువయింది మీకు?"

 

    "సుదీరా! నేను బీదవాడిని కావడమే కాక, చాలా అసమర్దుడ్ని కూడా! దానికి తోడు ప్రతి చిన్న సంఘటనకి చలించిపోయే అవలక్షణం కూడా వుంది నాకు. నాతొ మీరు సుఖపదలేరు సుదీరా!"

 

    
    ఒక నిమిషం సేపు బిగుసుకుపోయి వుండిపోయింది సుదీర. తర్వాత మౌనంగా లేచి నిలబడింది.

 

    "నేను మీ మంచి కోరే చెబుతున్నాను సుదీరా! నేను ఎందుకు పనికిరాని వాణ్ని. ఆ ప్రయోజకుడిని, పిరికివాడిని, నేను మీకు తగిన వాడిని కాను సుదీరా!"

 

     "సరే! అర్ధమయింది ! మీరు ఇక వెళ్ళొచ్చు" అంది చాలా మాములుగా.

 

    "సుదీరా! నన్ను క్షమించండి!"

 

    "క్షమిచడానికేముంది ఇందులో? నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదంటున్నారు కాబట్టి నేను మీకు ఇచ్చింది తిరిగి నాకు ఇచ్చెయ్యాలి."

 

    "ఏమిటది?"

 

    "నా శీలం!" అంటూ పెద్ద చప్పుడతో తలుపు వేసేసింది సుదీర.

 

    స్తభించిపోయాడు భరత్.

 

    ఆ మూసిన తలుపుల వెనక, గుండెలు అవిసిపోయేలా ఆమె రోదించడం అతనికి వినబడలేదు.

    
                                                                   -----------

 

    "ఏడు రోజుల్లో ఏడు కిలోలు వెయిట్ తగ్గటమంటే కొంచెం సీరియస్ మేటరే! ఏమిటమ్మ కంప్లయింటు!" అంటున్నాడు ఫామిలి డాక్టరు.

 

    జవాబు చెప్పకుండా , అసహనంగా అటు వైపు పొర్లి పడుకుంది సుదీర.

 

    టెంపరేచరేమి లేదు. ఫల్స్ నార్మల్. హార్ట్ బీట్ ఒకే! ఆకలి మందగించిందా? ఎందుకు? బవెల్ మూవ్ మెంట్ సరిగా లేదా?"

 

    "అంకుల్! నాకే రోగము లేదు! నామానాన నన్ను వదిలేస్తారా?" అంది సుదీర కసురుకున్నట్లు.

 

    అయన నవ్వాడు.

 

    మెత్తటి రగ్గు గుండెల మీదకు లాక్కుని కళ్ళు మూసుకుంది సుదీర.

 

    "ఓకె! సాయంత్రం వస్తాను. రెండు బ్రెడ్ స్లయిసెస్ అన్నా తిను" అంటూ వెళ్ళిపోయాడాయన.

 Previous Page Next Page