Previous Page Next Page 
ఖజురహో పేజి 26


    "ఊహూ!" అతన్ని మరింతగా హత్తుకుంటూ అంది కాంచన. అతన్ని ఆమె కలలో కూడా నొప్పించలేదు. 'నొప్పి ఇదివరకుకన్నా ఎక్కువగా వస్తోంది! డాక్టర్ గారు కార్డియో గ్రాఫ్ చూసి కలవరాన్ని దాచుకుంటూ జయచంద్రను ఓసారి రమ్మనమ్మా!' అనడం ఎందుకో నాకు తెలిసింది. బ్యాటరీ అయిపోయిన ట్రాన్సిస్టర్లా హృదయం 'బే....ర్' మంటోంది. ఇవన్నీ నీకు నేను ఎలా చెప్పాలి? నాకన్నా బేల గుండె నీది ఎలా తట్టుకుంటుందీ?' అనుకొంది మనసులో.
    
    "మమ్మీ.....మమ్మీ" సంధ్య పిలుపు వినిపించింది.
    
    "బేబీ వచ్చినట్లుంది" ఆమె కళ్ళు తుడుస్తూ అన్నాడు జయచంద్ర.
    
    "మమ్మీ! ఈరోజు ఏమైందనుకున్నావూ? డాడీ....మనం ఎంత లక్కీనో తెలుసా?" హడావుడిగా చెపుతూ పైకి వచ్చింది సంధ్య.
    
    అది ఇల్లంటే చాయకి నమ్మబుద్దికాలేదు. డోర్ టు డోర్ కర్టెన్స్ . అందమైన వాల్ పేపర్స్, పెద్ద సిన్మాసెట్టింగ్ లా వున్న హాలూ, పైన వేళ్ళాడుతున్న ఖరీదయిన షాండ్లియర్స్, ప్రతి వస్తువూ ఎంతో ఆర్గనైజ్డ్ గా వుంచబడిన విధానమూ, ఆమెకు విపరీతమైన ఉద్వేగాన్ని కలిగించాయి. ఇది ఇల్లు కాదు-ఇంద్రభవనమే అనుకుంది.
    
    చేపపిల్లలు అమాయకంగా ఎక్వేరియంలో ఈదుతున్నాయి. వాటి అందాన్ని కాదు చాయ చూస్తున్నది ఎక్వేరియం వెనకాల వున్న జలపాతం వర్ణచిత్రాన్ని. నిజంగానే నయాగారా పక్కన కూర్చోలేదుకదా....అన్నంత సహజంగా వుందది. ఆ నిశ్శబ్దమైన వాతావరణంలో ఆమెకి జలపాతం హోరు వినిపించసాగింది. ఆ అలజడి తన హృదయంలో ఎగిసిపడుతున్న ఆలోచనల సడి అని ఆమెకి తెలుస్తూనే వుంది.
    
    "జ్యూస్ తీసుకో చాయా!" అంది సంధ్య.
    
    చాయ ఉలిక్కిపడి డ్రింక్స్ తెచ్చిన ట్రేవైపు చూసింది. ఆ క్రోకరీని తాకడానికి కూడా చాలా సాహసం కావలి అనిపించి, అలాగే చూస్తుండిపోయింది. వాటి ఖరీదును అంచనా వేసేటంత శక్తి సామర్ధ్యాలు ఆమెకి లేవు.
    
    "కమాన్.....తీసుకో!" సంధ్య తనే తీసి అందిస్తూ అంది. "మమ్మీ....డాడీ నిన్ను ఇప్పుడు ఆకాశానికి ఎత్తిపొగిడేస్తారు.....తట్టుకోవాలిగా!"
    
    చాయ అతి పదిలంగా గ్లాసు పట్టుకుని డ్రింక్ సిప్ చేస్తూ చుట్టూ చూసింది. ఆ సోఫా కవర్లూ, ఇన్ డోర్ ప్లాంట్లూ, మనసును రంజింపచేస్తున్న లేత రంగు కర్టెన్లూ అన్నీ ఎవరో నిష్ణాతులైన డెకోరర్స్ అమర్చినట్లుగా వున్నాయి.
    
    "ఏమిటి చూస్తున్నావు? ఇదంతా డాడీ టేస్ట్. మమ్మీ టేస్ట్ తెలుసుకోవాలంటే పైకి రావాలి."
    
    "పద!" నవ్వుతూ లేచి నిలబడింది సంధ్య.
    
    పైకి మెట్లు ఎక్కుతుండగానే "నగుమోము....కనలేని....నీ జాలీ తెలిసీ...." అన్న త్యాగరాజకృతి వినిపించింది.
    
    గది గుమ్మానికి, శ్రీకృష్ణుడు రాధ పెదవుల్ని అందుకుంటున్న బొమ్మ వున్న కర్టెన్ వేసి వుంది.
    
    "అమ్మా!" అని పిలిచింది సంధ్య.
    
    పాత ఆగిపోయింది.
    
    "రండమ్మా!" అన్న ఆప్యాయమైన పిలుపు వినిపించింది.
    
    తెర తొలగించి సంధ్య "రా.....చాయా!" అంది.
    
    చాయ లోపలికి అడుగుపెట్టి ఆతృతగా ఆమె తల్లిని చూసింది.
    
    గోధుమరంగు సిల్కు చీరలో తను కూడా ఓ తైలవర్ణచిత్రంలా మెరిసిపోతోంది ఆమె. ముఖాన సూర్యబింబంలా వెలిగిపోతున్న కుంకుమ బొట్టూ, భారీ కురులని ముడి చుట్టుకున్న పద్దతీ, ఆమె ఎంత సాంప్రదాయమైన స్త్రీయో తెలియ జెపుతున్నాయి.
    
    చాయకి గుండెల్లో కలుక్కుమంది. సంధ్య తల్లిని అంత అందంగా ఆమె వూహించుకోలేదు.
    
    "రండి......కూర్చోండి మా సంధ్య ఎప్పుడూ నీ గురించే చెప్తుందమ్మా!" అంది నవ్వుతూ కాంచన. ఆమె కన్నుల్లో చాయ అందంపట్ల మెచ్చుకోలు కనపడింది. కళ్ళతోనే సంధ్యవేపు "నువ్వు చెప్పిన మాట నిజమే సుమా!" అన్నట్లు చూసింది.
    
    "నీవల్ల ఈరోజు మా సంధ్య ఇలా నవ్వగలుగుతోందమ్మా!" అంది కృతజ్ఞతగా.
    
    గదిలో ఓ పక్కన అద్దాల పెట్టెలో పెట్టిన వీణ సాలభంజికలా వయ్యారంగా నిలబడి వుంది.
    
    మరో పక్కన కాంచన అభిరుచిని పట్టిస్తున్నట్లుగా అద్దాల అరల్లో అమర్చిన పుస్తకాలూ, క్యాసెట్లూ కనిపిస్తున్నాయి.
    
    "ఇది చూసావా చాయా?" సంధ్య చిన్నపిల్లలా షెల్ఫ్ లో పెట్టిన ఓ వత్శువు చూపిస్తూ అంది.
    
    ఆ వస్తువుపై మెరూన్ కలర్ ముఖముల్ బట్ట కప్పి వుంది!
    
    సంధ్య ఆ బట్ట తొలగించగానే పాతకాలం గ్రామ్ ఫోన్ రికార్డు ప్లేయర్ బయటపడింది.
    
    "గ్రామ్ ఫోన్ రికార్డులు ఎప్పుడయినా విన్నావా? మమ్మీ దగ్గర సూర్యకుమారి 'పాడవే రాట్నమా!', భానుమతి ఓహోహో పావురమా!నించి అన్నీ వున్నాయి" గర్వంగా చెప్పింది సంధ్య.
    
    "సంధ్యా..." నవ్వుతూనే వారించింది కాంచన.
    
    "ఆ అల్లికలూ, దారాలు చూడు! కాస్త ఓపిక వస్తే చాలు ఏదో ఒకటి కుడుతూనే వుంటుంది" కాస్త గొప్పగా, కొంచెం బాధగా అంది సంధ్య.
    
    "ఉట్టి కబుర్లేనా? మీ ఫ్రెండ్ కి మర్యాదలేమైనా వున్నాయా?" మందలింపుగా అడిగింది కాంచన.
    
    "ఎందుకు చెయ్యనూ? ఈ రోజుకి చాయ ఇక్కడే వుంటుంది..... కదూ చాయా" అంది సంధ్య.
    
    చాయ అనుకోని ఆ పరిస్థితికి కంగారుపడ్డట్టుగా- "ఒద్దు.....ఒద్దు" అంది.
    
    "ఉండమ్మా.....నువ్వు లాకెట్ వెతికి పెట్టకపోతే ఈరోజు మా ఇంట్లో ఇలా ఆనందం తాండవించేదికాదు. తండ్రీ కూతుళ్ళిద్దరూ ఒట్టి చిన్న పిల్లల తంతు! సంధ్య అంతగా అడుగుతోందిగా......వుండు" అంది ఆప్యాయంగా కాంచన.
    
    తన కూతురు కోరితే కొండమీద కోతయినా దొరకాలి అన్నట్లుంది ఈవిడగారి సరసం! అనుకుంది చాయ.
    
    ఆమె దృష్టి మంచం పక్కన వున్న ఫోటోమీద పడింది.
    
    ఫోటోలోని వ్యక్తిని చూడగానే ఆమెకి షాక్ కొట్టినట్టయింది.
    
    'ఇతనా....ఇతనా సంధ్య తండ్రి' ఆమెకు ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడినట్టనిపించింది.
    
    "ఏవిటీ చూస్తున్నావు? మమ్మీ-డాడీల పెళ్ళిఫోటోనా? చాలా బావున్నాఋ కదూ! అచ్చు పాత సినిమాలో హీరో- హీరోయిన్లలా" గలగలా నవ్వుతూ అంది సంధ్య.
    
    చాయ ఫోటోని చేతుల్లోకి తీసుకుంది.

 Previous Page Next Page