ఉన్నట్టుండి బయట శబ్దం ఆగిపోయింది.
అంటే పులి గదిలోని తన అడుగుల చప్పుడ్ని వినివుండొచ్చు లేదా విసుగుచెంది అక్కడ నుండి వెళ్ళిపోయి వుండొచ్చు.
తలుపు తెరిస్తే?
ఆలోచించాడు. చీకటిలోనయినా మనిషిని స్పష్టంగా గుర్తించగల పులి ఏ పొదలమాటునో నక్కిపోతుంది, తొందరపడి బయటకు వెళితే పర్యవసానం ప్రమాదకరంగా వుంటుంది.
సరయిన అదను సందర్భంలేకుండా నేల పైన నడుస్తూ, అందులో చీకటి వేళ మేనీటర్ ను ఎదుర్కోవాలనుకోవడం అవివేకం.
అడుగుల చప్పుడుబట్టి అరుపులనిబట్టి వివిధ రకాలయిన వన్యమృగాలను గుర్తించగల చైతన్య అక్కడకు వచ్చింది పెద్దపులిగానే నిర్ధారణ చేసుకున్నాడు. గాని చీకటిలో సాహసం చేయలేకపోయాడు.
హఠాత్తుగా అతని దృష్టి అడవిలో దూరంగా కదులుతున్న వో మంటపై పడింది.
వో మనిషి కదులుతున్నట్లు తుప్పల్లోంచి చెట్ల మధ్యగా పడమటి దిక్కుకు ప్రయాణం చేస్తూందామంట.
ఊహింపశక్యం కాని దృశ్యమది.
తను పొరపాటు పడుతున్నాడేమో అనుకున్నాడు.
అది కలకాదు నిజమే అని తెలుసుకునేసరికి వెరవన్నది ఎరగని చైతన్య తొలిసారి భీతిగా చూశాడు, రెప్పలార్చకుండా.
భయంకరమయిన కీకారణ్యంలో క్రూరమృగాలకు అలవలమయిన ఆ ప్రాంతంలో అలామంట కనిపించడంతో ఏనాడూ భూతాలపైన విశ్వాసంలేని చైతన్య బహుశా కొరివి దయ్యమేమో అనుకున్నాడు అసంకల్పితంగా.
మరికొన్ని క్షణాలలో మంట అదృశ్యమయింది.
అప్పటికే నిలువునా స్వేదబిందువులతో తడిసిపోయాడు.
ఎటు చూసినా భీతావహమైన వాతావరణం. ఒడలు జలదరింపజేసే పరిసరాలు.
ఆలోచిస్తూ కాట్ పై సాగిలబడ్డాడు.
అలా ఎంతసేపు నిద్రరాక పైకప్పుకేసి చూస్తూ ఉండిపోయాడో అతనికి గుర్తులేదు.
కళ్ళు మండుతుంటే అలవోకగా తల తిప్పాడు.
అంతే__
ఉలికిపాటుతో పైకిలేచాడు కిటికీవారగానిలబడ్డ ఆకారాన్ని చూస్తూ
అక్కడ నిలబడింది భూతంకాదు.
తవిటయ్య!....
12
ఆలస్యంగా నిద్రలేచాడు చైతన్య. కళ్ళల్లో ఇనుపరజను నింపినట్టు మంటలు పుడుతుంటే బడలికగా బాతురూంవేపు నడిచి అరగంటలో కాలకృత్యాలన్నీ ముగించుకున్నాడు.
అప్పటికే సింగి బ్రేక్ ఫాస్ట్ తయారుచేసింది.
బయట వరండాలోని ఈజీఛెయిర్ లో కూర్చుని టిఫిన్ చేస్తూ, తనువచ్చిన ఇరవై నాలుగుగంటల వ్యవధిలో ఎదురయిన అనుభవాల్ని మననం చేసుకున్నాడు.చెడ్డీ తొడుక్కున్న అబ్బులు ఒంటిపై మరే ఆచ్చాదనా లేకుండా అబ్బురంగా చూస్తుంటే, స్వతహాగా పసి పిల్లలంటే ఇష్టపడే చైతన్య కేవలం రిలీఫ్ కోసం అతన్ని పిలవబోతుండగా ప్రత్యక్షమయ్యాడు తవిటయ్య.
అసహ్యకరమయిన శరీర నిర్మాణంతో, దుర్వాసనతో నిండిన ఎలుగుబంటిని సైతం ఇష్టపడే చైతన్య ఎందుకో తవిటయ్యని చూడగానే ఒంటిపై కొండచిలువ చుట్టుకుంటున్నట్టు అనుభూతి చెందాడు.
ఏ నెపంతోనయినా తిట్టగల ఆఫీసరు చైతన్య. కాని, అతడు కారణం వెదుక్కునే అవసరం లేకుండానే రాత్రి సంఘటన గుర్తుకొచ్చింది.
"రాత్రి కిటికీ పక్కన ఏం చేస్తున్నావు?"
"తమరు తొంగున్నారో, నేదో సూతున్నానండి."
"యూ బుచ్చర్!" ఆవేశాన్ని నిగ్రహించుకుని, "చూడూ! ఈ కాంపౌండ్ లోవున్న తుప్పులన్నింటినీ పీకి సాయంకాలానికల్లా శుభ్రం చేసి వుంచు" అంటూ రైఫిల్ అందుకుని ఆవేశంగా బయటికినడిచాడు.
చైతన్య కోపాన్ని చూసిన అబ్బులు భయంగా ఓమూల ముడుచుకు పోయాడు.
కాని__
మెయిన్ గేటు సమీపించిన చైతన్య వెనక్కి తిరిగి చూసేసరికి బుసకొట్టని కళింగనాగులా తవిటయ్య తననే తదేకంగా గమనిస్తున్నాడు.
చైతన్య నిలబడ్డాడు.
తవిటయ్య వెంటనే ఆవరణలోకి తుప్పల్ని గొడ్డలితో నరకడం మొదలు పెట్టాడు కసిగా.
కాంపౌండ్ వాల్ ను దాటిన చైతన్య ఏదో గుర్తు వచ్చినట్టు ఆగి నేలకు వంగి పరిశీలనగా చూశాడు.
రాత్రి రెస్టుహౌస్ చుట్టూ సంచరించిన పులితాలూకు అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి.
ఇసకలో బలంగా దిగబడిన గోళ్ళను వాటి మధ్యగల దూరాన్ని అంచనావేసి మేనీటర్ భారీ పరిమాణం నడిచేసరికి పచ్చిక బయలు ప్రారంభం కావడంతో జాడలు స్పష్టంగా కనిపించక, అనుకున్న ప్రకారం అక్కడికి అయిదు మైళ్ళ దూరంలోని కుందనపల్లికి బయలుదేరాడు.
తవిటయ్యని తోడుగా తీసుకు వెళ్ళాలనుకున్నాడు కాని, అతని నీడనే వారించలేకపోతూంది చైతన్య మనసు.
ఆకారణంగా ఎవర్నీ ద్వేషించని తను తవిటయ్యని కారణం లేకుండానే అంతలా ఎందుకు అసహ్యించుకుంటున్నాడో చైతన్య ఓ పట్టాన బోధపడలేదు.
క్రూరమృగాల మధ్య తిరిగి తనూ సంస్కారాన్ని కోల్పోతున్నాడా? నిజాయితీగా బాధపడ్డాడు తన ప్రవర్తనకి తనే విస్తుపోతూ.
అతని మనసులో ఎన్నో సందేహాలూ....రాత్రి తనుచూసిన మంట గురించి, అడవిలో జరుగుతున్న అక్రమ కలప రవాణాగురించి ఎన్నో తవిటయ్య నడిగి తెలుసుకోవాలనుకున్నాడు. కాని, మనస్కరించడంలేదు. బహుశా తన సందేహాన్ని మించి అతడే ఓ సందేహంగా కనిపించటం వలనేమో.
ఉదయ సూర్యుడు అద్దుతున్న పసిమి చాయతో ప్రకృతి అప్పుడే ముస్తాబైన పెళ్ళికూతురిలా వుంది.
చీకటిలో భయపెట్టిన పరిసరాలు చిలిపిగా అల్లరిచేసిన నేస్తాల్లా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
పచ్చిక బయళ్ళపై నడుస్తున్న చైతన్య పక్కన ఆగాడు, రాత్రి తనకు కనిపించిన మంట ఏ దిక్కుగా, ఏ పరిసరాల్లో కనిపించిందీ గుర్తు చేసుకుంటూ.
తన అంచనా తప్పుకాకపోతే అది ప్రయాణం చేసింది లోయ పైభాగం నుంచి.
లోయ పైభాగంలో మంట అలా ఆరిపోకుండా ఒక పరిమాణంలో ప్రయాణించడం ఎలా సాధ్యం.
ఒకవేళ లోయ అంచున గట్టుపై దివిటీ పట్టుకుని ఎవరన్నానడిచి ఉంటారా? అదే నిజమయితే ఆ కాళరాత్రిలో ప్రమాదాన్ని ఆహ్వానిస్తూ వెళ్ళడంలో అర్ధమేమయి వుంటుంది?
అర్ధం కాని మరో నిగూఢ రహస్యం.
ఆలోచిస్తూనే ఏటవాలుగావున్న అడవిని దిగి రాత్రి అతడు చూసిన లారీ ఆగిన ప్రదేశాన్ని చేరుకున్నాడు.
ఆశ్చర్యం. ఎర్రచందనం మానుల్లేవక్కడ. రాత్రికి రాత్రే అదృశ్యమయ్యాయి. అంటే అక్రమ రవాణా చాలా పకడ్భందీగా జరుగుతుందన్నమాట.