Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 23


                                 మెల్ల మెల్లగా - జోరుజోరుగా

 

 

మెల్లమెల్లగా వస్తోంది
     చిట్టి పొట్టి అడుగుల చీమ నడకలు సాగిస్తూ
వస్తోంది నింపాదిగా
    విత్తనంలోంచి ఎదుగుతున్న వృక్షం లాగ
సావకాశంగా పరిపక్వం అవుతూ
    గర్భంలో పెరుగుతున్న పిండం లాగ
నిశ్చయంగా వస్తోంది చీకట్ల గందరగోళం నుంచి
    వేగుజుక్కలాగ నిరాఘాటంగా
ఇంతలోనే వేగం పుంజుకొని
   జోరుజోరుగా వస్తోంది
నాగొంతుకలో ఉప్పొంగుతున్న నినాదాల్లాగ రవళిస్తూ
   తుఫానులో సముద్ర తరంగాల్లాగ లేస్తూ
ఒక దేశం నుంచి మరో  దేశందాకా
   పెద్ద పెద్ద అంగలు వేస్తూ
నెత్తురు నాలుకలు చాస్తూ
   ఒక జీవితాన్ని మరో జీవితానికి పెనవేస్తూ
వస్తోంది వస్తోంది విప్లవం


                                                                                 రచన:19-11-197
                                                     ముద్రణ: సృజన మాసపత్రిక - మార్చి, 197
                                      పునర్ముద్రణ: మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 198

 Previous Page Next Page