Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 22

 

    ఇలాంటి అమ్మాయిని ఇంతవరకూ తనేక్కడా చూడలేదు!


    ఈ అమ్మాయిని చూసీ చూడగానే తనకి అనిపిస్తోంది ఏమిటంటే -


    షీఈజ్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ప్రొఫెషన్!


    తను క్లబ్ సింగర్ గా వున్నప్పుడు లెక్కలేనంత మంది ఆడపిల్లలను చూశాడు! ఇష్టం వల్లో, కష్టాల వల్లో డాన్సర్ లుగా పనిచేస్తున్న అమ్మాయిలు చాలామంది తనకి తెలుసు. అయితే - బలవంతంగా తీసుకు రాబడిన అమ్మాయిలని మాత్రం తను పూనుకుని ఎప్పటికప్పుడు వెనక్కి పంపించేసేవాడు.


    కానీ -


    ఈ అమ్మాయి ఇందులో ఏ కేటగిరికి కూడా చెందినట్లు కనబడటం లేదు.


    ఈ అమ్మాయి ఈ ఆఠీన్ రాణీ - ఇష్టపడి ఇందులోకి రాలేదు. కష్టాలవల్ల వచ్చినా ఆ దిగులు మోహంలో కనబడనివ్వడం లేదు - బలవంతంగా లొంగేరకంలా లేదు.

 

    అందుకని ఒకటే అనిపిస్తుంది తనకి!


    పులినోట్లో తల పెట్టినట్లుగా -


    కావాలని వచ్చి ఇందులో చేరింది ఈమె! బహుశా - అమీతుమీ చూసి దీని అంతు తేల్చుకుందామనే ఉద్దేశ్యంతో కావచ్చును!


    మేబీ!


    మేనాట్!


    బట్ -


    షీ ఈజ్ స్పెషల్ !వెరీ వెరీ స్పెషల్!


    పరిశీలనగా ఆఠీన్ రాణీ వైపు చూశాడు రాజా. తర్వాత ప్యాంట్ జేబులో చెయ్యి పెట్టి, ఒక వందరుపాయల కట్ట తీశాడు.


     "దిసీజ్ ఫర్ యూ! కాంప్లిమెంట్స్ ఫ్రమ్ రాజా రాజశేఖరసింహ - రాజా ఆఫ్ రాణీపూర్!" అన్నాడు.


    వెంటనే ఆఠీన్ రాణీ మొహం ఎర్రబడింది. "హోహ్" అని అయిష్టన్నంతా చూపిస్తూ చిన్న శబ్దం చేసి చటుక్కున మొహం తిప్పేసుకుని, గిరుక్కున తన చుట్టూ తను ఒక్కసారిగా తిరిగి, లయ తప్పకుండానే అడుగులు వేస్తూ అతనికి దూరంగా జరిగిపోయింది.


    మెచ్చుకోలుగా ఆమె వైపు చూస్తూ వందరూపాయల కట్టని జేబులో పెట్టేసుకున్నాడు డైమండ్ రాజా. తర్వాత తను కూడా పాటకి అనుగుణంగా చేతులు పైకెత్తి చిటికెలు వేస్తూ లయబద్దంగా అడుగులు విన్యాసంతో చిన్న "జిగ్" చేసి, తర్వాత ఆగి, చిరునవ్వుతో అందరికి అభివాదం చేసి వచ్చి తన టేబుల్ దగ్గర కూర్చున్నాడు.


    అతను కూర్చోగానే -


    ఒక స్టీవార్డ్ అత్యంత శ్రద్దాసక్తులతో ఒక షాంపేన్ బాటిల్ పట్టుకొచ్చాడు. దానితో బాటు చిన్న సప్లయి ఉడ్ బాక్సులో వున్న ఖరీదైన హవానా సిగార్ద్ కూడా!


    "విత్ ద కాంప్లిమెంట్స్ ఆఫ్ ద మవుస్ సర్!" అన్నాడు అబివాదం చేస్తూ.

    
    "కానీ నేను తాగనే" అన్నాడు డైమండ్ రాజా.


    "ఓహ్! డైమండ్ రాజా మద్యం ముట్టడని మర్చేపోయాను" అని ఒక గొంతు వినబడింది.


    తిరిగి చూడకుండానే అన్నాడు రాజా.


    "మల్ హోత్రా?"


    "వారేవా గొంతు గుర్తుపట్టావన్నమాట" అన్నాడు మల్ హోత్రా దగ్గరికి వస్తూ.


    "అబ్బే గొంతు గుర్తుపట్టలేదు"

    
    "మరి?"

    
    "ఈజీ! పబ్లిక్ టాయిలెట్లని సమీపిస్తుంటే ముక్కలు పగిలిపోయేలా వాసన వస్తుంది చూడు, అలాగే నువ్వు దగ్గరవుతుంటే విస్కీ వాసన!"


    పెద్దగా నవ్వి రాజా భుజం మీద చరిచాడు మల్ హోత్రా.


    "డైమండ్ రాజా నిజంగానే ఒక రాజా అయిపోయాడని విన్నానే?"


    "అదలా ఉంచు నీతో అర్జెంటుగా మాట్లాడాలి మల్ హోత్రా!"


    "ష్యూర్!"


    "ఇక్కడ కాదు బయటి వెళ్దాం!"

    
    అనుమానంగా రాజావైపు చూసి 'పద' అన్నాడు మల్ హోత్రా.


    ఇద్దరూ బయటికి నడిచారు.


    ఫోయర్ లోకి రాగానే - "చెప్పు!" అన్నాడు మల్ హోత్రా.


    "ఇక్కడ కాదు - గేటు దగ్గర కెళ్దాం!" అన్నాడు రాజా.


    ఇద్దరూ గేటుదగ్గర కెళ్ళారు.


    తక్షణం మల్ హోత్రా షర్టుని కాలర్ దగ్గరపట్టుకుని దూది బొమ్మని ఎత్తినట్లు గాల్లోకి ఎత్తేశాడు డైమండ్ రాజా.


    ఉహించని ఈహఠాత్పరిణామానికి కీచుమని కేక పెట్టాడు మల్ హోత్రా.

    
    కఠినంగా అన్నాడు డైమండ్ రాజా.


    "మల్ హోత్రా! నీకో విషయం అర్జెంటుగా గుర్తు చెయ్యాలి! చాలా రోజుల క్రితం! అప్పట్లో నా సంగతి నీకు బాగా తెలీదు - నేను నీ హోటల్లో కాంట్రాక్టు కుదుర్చుకుని పాటలు పాడుతుంటే - బలిపశువుని తోలినట్లు ఒకమ్మాయిని డైస్ మీదికి తోలావ్. ఆ అమ్మాయి బిక్క చచ్చిపోతూనే డాన్స్ చేసింది. పాట - పాట తర్వాత పాట - ఇలా అర్ధరాత్రి పన్నెండయిపోయింది. హోటల్లో ఉన్నవాళ్ళందరు అప్పటికే తప్పతాగేశారు.. గొంతులు పెద్దవయ్యాయి - పిల్లి కూతలు, అరుపులు! చప్పట్లు ఎక్కువయ్యాయి.


    "స్ట్రీప్.....స్ట్రీప్....స్ట్రీప్...." అని అరవడం మొదలెట్టారు అలాగా వెధవలంతా ఆ అమ్మాయిని చూసి. ఆ అమ్మాయి భయభ్రాంతురాలయి చేష్టలుడిగి అలాగే నిలబడిపోయింది. అప్పుడు నువ్వు సర్కస్ లో రింగ్ మాస్టర్ లా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చావు. "విప్పేయ్! అన్నావు. ఆ అమ్మాయికి మరింత దగ్గరగా వెళ్ళి ఎవరికి వినబడనంత చిన్నగా ఏదో చెప్పావు. బహుశా పంపేస్తామనో, ఇంకేదో బెదిరింపు అయివుంటుంది. - నేను ఆ టైంలో అక్కడలేను. మంచినీళ్ళు తాగడానికి పక్కకెళ్ళాను.


    నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పి భయపెట్టావో  గాని మొహం సిగ్గుతో కందిపోగా, దుఃఖంతో పెదిమలు వణికపోతుండగా, కళ్ళు తడితడిగా అయిపోతుండగా, చలిస్తున్న చేతులతో ఆ అమ్మాయి జాకెట్టు విప్పింది. ప్రతి ఆడపిల్లా తన ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మానానికి అలా అవమానం జరుగుతుంటే -


    రెండుకాళ్ళ జంతువులన్నీ అనందం పట్టలేక కేరింతలు మొదలెట్టాయి.


    "స్కర్టు కూడా" అంటున్నావు నువ్వు. అప్పుడేం జరిగిందో గుర్తుందా మల్ హోత్రా?"


    మల్ హోత్రా భయంగా చూశాడు.


    "నేను మంచినీళ్ళ గ్లాసు పక్కన పడేసి పరుగెత్తుకొచ్చి నీ దవడ పగిలేలా కొట్టాను - ఇలా!" అని మల్ హోత్రా ని ఒక చేత్తో గాల్లో ఎత్తి పట్టుకునే , రెండో చెయ్యి పిడికిలి బిగించి, మల్ హోత్రా దవడమీద శక్తి కొద్ది కొట్టాడు రాజా.


    తక్షణం మల్ హోత్రా పన్ను ఒకటి ఊడి , ఎగిరి అల్లంతదూరంలో పడింది-


    "అప్పుడు కూడా ఒక పన్ను రాలింది కదూ? ఇది రెండోది! అప్పుడు ఆ అమ్మాయికి అవమానం జరిగినందుకు కొట్టాను. ఇప్పుడు ఈ దెబ్బ అడ్వాన్స్ వార్నింగ్ - ఆఠీన్ రాణీకి అవమానం జరగకుండా!" అన్నాడు.


    తలపక్కకి తిప్పి, భుజం కాస్త ఎత్తి నోట్లో నుంచి కారుతున్న రక్తం తుడుచుకున్నాడు మల్ హోత్రా.


    "నన్ను దించు" అన్నాడు హీనస్వరంతో. అలా అంటుండగానే అతని నోటినిండా మళ్ళీ రక్తం చేరింది.


    మల్ హోత్రాని కిందికి దించాడు రాజా.


    "చెప్పు! ఎవరా అమ్మాయి?"


    "ఆ అమ్మాయి పేరు మీనాక్షి" అన్నాడు మల్ హోత్రా.


    "ఆఠీన్ రాణీ అన్న పేరు నువ్వు పెట్టిందేనా?"


    "అవును! ఆరోజు మీ ఇద్దరి కాంబినేషన్ తో ప్రోగ్రాం జరిగి ఉండాలి కదూ? నీ పేరుకి సూట్ అవ్వాలని మీనాక్షి పేరు ఆఠీన్ రాణీ అని మార్చాను.


    "బలవంతంగా తీసుకురాలేదు కదా ఆ అమ్మాయిని?"


    "తల్లితోడు!" అని తల మీద చెయ్యి  పెట్టుకుని ప్రమాణం చేశాడు మల్ హోత్రా. వాళ్ళమ్మకి అనారోగ్యం! ట్రీట్ మెంట్ కి భాగా ఖర్చవుతుంది. అందుకని తనే వచ్చింది. ఆ తర్వాత దేశ్ పాండే కిడ్నాప్ చేశాడు. మళ్ళీ నేను రక్షించి తీసుకొచ్చాను. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తోంది. ఇంకో ఆర్నెల్ల తర్వాత నేనే సొంత హోటలు పెడితే నా పార్టనర్ గా చేరుతుంది" అన్నాడు మల్ హోత్రా.


    ఒక్క క్షణం ఆలోచించాడు రాజా.


    "ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ట్రీట్ మెంట్ కి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను. ఆ అమ్మాయిని పంపించేయ్" అన్నాడు .


    ఈవిల్ గా నవ్వాడు మల్ హోత్రా.


    "నువ్వు ఇస్తానన్నా తను తీసుకోవద్దు? ఆ అమ్మాయికి మహా పొగరు! దానాలు తీసుకోదు! పైగా ఆమెకి  డబ్బున్నవాళ్ళంటే పరమ అలర్జీ - చాలా చిత్రమైన సైకాలజీ!" అన్నాడు మల్ హోత్రా. అని, తన కొంటెతనాన్ని అపుకోలేనట్లుగా, భయం భయంగానే ఇంకో మాట అన్నాడు.


    రాజా! సైకాలజీలో ఏక్ పర్ట్ ని నేను! నువ్వు ఇదివరకు మిగతా అమ్మాయిలని రక్షించడం వేరు........ఈ అమ్మాయికి అండగా నిలబదాలనుకోవడం, ఇది పూర్తిగా వేరు! ఈ అమ్మాయి గురించి నువ్వు మాట్లాడుతుంటే .......బహుశా ఈ సంగతి నీకే తెలిసి వుండదు........యూ ఆర్ ఇన్ లవ్ విత్ హర్ రాజా! యా! నువ్వు ఆ పిల్లతో ప్రేమలో పడిపోయావ్. ఆ సంగతి నీ మోహంలో కనబదిపోతుంది! లవ్ అట్ ఫస్టు సైట్!"


    "ఐ విల్ కిల్ యూ బాస్టర్డ్!" అన్నాడు రాజా ఆగ్రహంగా.


    బెదిరిపోయినట్లే నటిస్తూ ఇంకా చెప్పాడు మల్ హోత్రా!

 Previous Page Next Page