"జానకి నా గుండెలో ఉంది. జానకి కోసం నా ప్రాణం ఇస్తాను" అంతే అతను అన్న మాటలు. అవే రతనాల మూటలుగా కనిపించాయి రమాదాసికి.
రమాదాసి వెళ్ళిపోయింది.
ఆస్పత్రి మూశారు.
పాల్ ఇంటికి వెళ్ళాడు. అతనికి భోజనం సయించలేదు. నిద్ర రాలేదు.
17
తెల్లవారింది. అయినా బద్దకంగా ఉంది. పాల్ ఇంకా మంచంలోనే ఉన్నాడు. ఏసుదాసు కాఫేకప్పుతో వచ్చాడు. ఫాదర్ జాన్ వస్తున్నారని చెప్పాడు. పాల్ లేచాడు. గబగబా ముఖం కడుక్కున్నాడు. తుడుచుకొని కుర్చీలో కూర్చున్నాడు. కాఫీ అందుకొని చప్పరిస్తున్నాడు. ఫాదర్ జాన్ ప్రవేశించారు. పాల్ లేచాడు. గుడ్ మార్నింగ్ చెప్పాడు. ఫాదర్ ప్రతి నమస్కారం చేశారు. వచ్చి ఎదుట కుర్చీలో కూర్చున్నారు. పాల్ కు ఒక ఫోటో అందించారు.
"గుర్తించగలవా?"
పాల్ పటాన్ని చూచాడు. అది జూలుది. జూలీ మెడిసిన్ లో పాల్ క్లాస్ మేట్ చాలా అందమైంది. అంతేకాదు సంపన్నురాలు. జూలీ మనసు పాల్ మీద పడింది. జూలీ పాల్ కు సన్నిహితం కాసాగింది. పాల్ జూలీతో మాటలు కలిపాడు. మనసు కలపలేకపోయాడు. అభిప్రాయాల్లో వారిద్దరివీ బిన్న దృవాలు. ఆమాటే జూలీతో చెప్పాడు. జూలీ పాల్ ను వదల్లేక పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిపోయారు వారు. జూలీ ఎన్నడు గుర్తుకు రాలేదు పాల్ కు - ఆమె పటం చూచేదాకా - ఇప్పుడు.
"అవును డాడీ! తెలుసు. జూలీ నాతొ చదువుకుంది.
"ఎలాంటి పిల్ల?"
"అమ్మాయి మంచిది. బాగా డబ్బున్న వాళ్ళు."
"నీకు నచ్చిందా?"
"అంటే?"
"నీకు నచ్చితే పెళ్లి ఏర్పాట్లు చేస్తామని రాశారు."
విచిత్రమైన వల తనమీద పడుతుందనుకున్నాడు పాల్. మెల్లగా నవ్వాడు పాల్. ఫాదర్ నవ్వును గ్రహించలేదు. పాల జవాబు కోసం చూస్తున్నాడు.
"నేనా అమ్మాయిని పెళ్ళాడలేను. ఎందుకో జూలీ వైపు నా మనసు పోవడం లేదు."
"జూలీ డాక్టర్ . సంపాదిస్తుంది. నువ్వూ డాక్టరువు. మీ జంట బావుంటుందని నా ఉద్దేశ్యం."
"కావచ్చు పెండ్లాడే వాణ్ణి నేను . నాకు జూలీ మీద మనసు లేదు. డబ్బును పెళ్ళాడం నా కిష్టం లేదు."
"అ అమ్మాయికి నువ్వంటే యిష్టం."
"అది నాకు తెలుసు. నా విషయమూ ఆవిడకు తెలుసు. జూలీని పెళ్ళాడే వాళ్ళకు కొదవ లేదు. నేను ఆమెను ప్రేమించలేను."
"ఏం?"
"ఏమంటే ఎలా చెప్పడం? ప్రేమ గణితం కాదు. వైద్యం కాదు. ఎందుకు కలుగుతుందో చెప్పలేం. అలాగే ఎందుకు కలగదో చెప్పలేం. సూర్యుణ్ణి చూచి కమలం ఎందుకు వికసిస్తుంది? కలువ ఎందుకు వికసించదు? తుమ్మెద పూవునే ఎందుకు వెదుక్కుంటూ పోవాలి? ఆకుల మీద ఎందుకు అనురాగం లేదు? ప్రేమ మనసుకు సంబంధించింది. మనసును కనుగొన్న మహామహులు లేరు."
"ఉపన్యాసం బావుంది. వినడానికి హాయిగా వుంది. కాని నీ భవిష్యత్తును గురించి ఆలోచించు. ప్రేమ భోజనానికి పనికి రాదు. జీవితంలో ప్రేమ కూడా ఒక భాగం......కానీ ప్రేమ మాత్రమే జీవితం కాదు. జూలీతో నీ భవిష్యత్తు బంగారం అవుతుంది. తొందర లేదు. అలోచించి నిర్ణయించు."
"ఆలోచించాను . ఈ పెళ్ళికి వప్పుకోలేను."
"మరి?"
"అంతే"
"జానకిని ప్రేమిస్తున్నావా?"
తుపాకి లోంచి వచ్చిన గుండులా వుంది ప్రశ్న.
పాల్ తండ్రిని చూచాడు. ఫాదర్ జాన్ కళ్ళలో ఉచ్చులు కనిపించాయి. అవి ఉరితాళ్ళవలె ఉన్నాయి. పధకం తయారుచేసి తన దగ్గరికి వచ్చారు . జూలీ ఆ పధకంలో ఒక పాచిక.
"అవును"
"ఆ విషయం నాకు తెలుసు. నువ్వు జానకిని ప్రేమించగలవు. పెళ్ళాడలేవు. జూలీని పెళ్ళాడగలవు. ప్రేమించలేనంటున్నావు. పెళ్ళి లేని ప్రేమను ఏ సమాజమూ గుర్తించదు. జానకిని వుంచుకుంటావా?"
"డాడీ! మీరు చాలా దూరం పోతున్నారు . జానకిని అనే హక్కు మీకు లేదు"
"అవును , నాకు తెలుసు . అది నీకు పిచ్చి తల కెక్కించింది. ఆ వెర్రి వేయి తలలు వేస్తున్నది. ఆ ముకుందంగడున్నాడే - వాడు స్కౌండ్రల్ మన మతాన్ని మంట కలపడానికి కంకణం కట్టుకున్న రోగ్. వయసొచ్చిన పిల్లకు పెళ్ళి చేయలేకపోయాడు. వాళ్ళలో ఒక్కడూ ముందుకు రావడం లేదు. అంతా కట్నాలు అడుగుతున్నారు. జానకిని నీకు తార్చడానికి ....."
"డాడీ! మీరు అనవసరంగా.....
"అవును , నిజం నీకు నిష్టూరంగా కనిపిస్తుంది. ఆ ముకుందంగాడు వేసిన వలలో పడిపోయావు. నేనేం చెప్పినా నీకు చేదుగానే వుంటుంది. డబ్బు కోసం జూలీని చేసుకోమ్మంటున్నా ననుకుంటున్నావు. కాదు. మనవాళ్ళలో బిచ్చగత్తెను చేసుకో, వప్పుకుంటాను. పోనీ, జానకినే చేసుకో, అభ్యంతరం లేదు , మతం మార్చుకోమను. అప్పుడు బయటపడుతుంది వాళ్ళ రంగు. విన్నావా? నీ తల కెక్కిన పిచ్చి వదులుకో. జూలిని చేసుకో! ఆలోచించుకో. మతం మారకుండా జానకిని చేసుకోడానికి వీల్లేదు. మతం మారితే జానకే జూలీ అవుతుంది. ఆలోచించు. ఇంకా నేను బతికే వున్నానని గ్రహించు. నా శవమే చూడాలి జానకితో నీ పెళ్ళి."
ఫాదర్ జాన్ పటం అందుకున్నారు, లేచారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న ఫాదర్నీ చూస్తూ నుంచున్నాడు పాల్. "మతం మర్చాలట!" అని కూలబడ్డాడు ఆ పూట ఆస్పత్రికి వెళ్ళలేదు.
18
చైర్మన్ స్కూలుకు వెళ్ళాడు.
"చాలా రోజులకు జ్ఞాపకం వచ్చానే!" అన్నది శకుంతల.
"ఊళ్ళో లేను. ఇవ్వాళే వచ్చాను."
"ఉంటె మాత్రం నేను గుర్తుకు వస్తానా?"
"సంతోషించాం గాని కాస్త జానకిని పిలిపించు."
"ఓహో మనసు అటు తిరిగిందా! ఆ మహారాణి ఎక్కడుంది? స్కూలుకు రావడం లేదుగా!"
"నీ బుద్ది పోనిచ్చావు కావు. ఆడవాళ్ళంతా నీలాంటి వాళ్ళేననుకుంటావు. సరే గాని ఆమె స్కూలుకు ఎందుకు రావడం లేదు?"
"ఏమో నాకేం తెలుసు? అది ఆ కిరస్తానీ డాక్టర్ వెంట పడింది. ఇది అడ పిల్లల బడి, అలా తిరగడం మంచిది కాదన్నాను , అంతే"
"అయితే నువ్వే వెళ్ళగొట్టావన్నమాట!"
"నీతి నిజాయితీ లేని వాళ్ళకు ఈ స్కూల్లో స్థానం లేదు."
"ఓహో! నీతీ నిజాయితీని గురించి నువ్వా మాట్లాడేది - సిగ్గు లేకుంటే సరి, ఆ అమ్మాయి పాల్ ను ప్రేమించిందేమో! నువ్వెవరు అనడానికి?"
"ధర్మం, సంప్రదాయం ఉన్నాయి. కిరస్తానీ వాడి వెంట తిరుగుతుంటే ఎలా ఊరుకోను?"
"నీవంటి దాని నోటపడి ధర్మం, సంప్రదాయం ఎన్నడో భ్రష్టం అయిపోయాయి. నువ్వు యిప్పటికి ఎందరి వెంట తిరిగావో! ఇదీ సంప్రదాయమేనా? నా వెంట పడ్డావు. నేను గ్రహించలేదు. ఒక వల పన్నావు. నన్ను గుంజావు . ఇదీ ధర్మమేనా? పిల్లలకు పోయాల్సిన పాలు బజార్లో అమ్ముకున్నావు. అదీ సాంప్రదాయమా? పిల్లలను మతాల పేర , కులాల పేర విడగొట్టి పసివాళ్ళలో ద్వేషాన్ని రగిల్చావు. అది నీ సంప్రదాయం కావచ్చు. జానకి పిల్లల్ను ఏకం చేసింది. స్కూలుకు ఒక ఆదర్శం చూపింది. మానవతను పెంచడానికి కృషి చేసింది. ఆమెను చూచి కంట్లో నిప్పులు పోసుకున్నావు. వెళ్ళగొట్టావు. నువ్వు ఎలా ఉంటావో చూస్తా. రేపన్నుంచి నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నా. జానకి హెడ్ మిస్ట్రెస్ అవుతుంది" చైర్మన్ లేచి నుంచున్నాడు.