'అయితే ఒక్క షరతు. మీకు పెళ్ళయింది కాబట్టి ఈ విషయమై మీరు స్వతంత్రులు కారు. మేరేమడగాలనుకున్నారో అది మీ భార్య ద్వారా అడిగించండి " అంది అమ్మాజీ.
ఆమె తన సంచీ తీసుకుని కేశవులు యింటికి వెళ్ళింది. అక్కడా ఆమెకు అదే అనుభవం జరిగింది.
సంచీ ఎవరింట్లోనూ ఉంచకుండా ఆమె తన కూడా తీసుకుని వెళ్ళిపోయింది.
శివయ్య, కేశవులు పరస్పరం అనుభవాలు చెప్పుకున్నారు.
"ఆ సంచీలో ఏముందంటావ్ ?" అన్నాడు శివయ్య.
'అదంతా పెద్ద నాటకం - మనకు తన మీద ఆకర్షణ వున్నదో లేదో తెలుసుకుందుకు వచ్చింది" అన్నాడు కేశవులు.
"తెలుసుకుని ఏం లాభం ?"
"కొందరాడాళ్ళకి అదో సరదా" అన్నాడు కేశవులు.
సరిగ్గా వారం రోజుల తర్వాత అమ్మాజీ మళ్ళీ వాళ్ళను కలుసుకుంది.
"మీరు నాకో పెద్ద సాయం చేయాలి. ప్రయోజనం గురించి అడగరాదు. మీరు సాయం చేయకపోతే నేను చచ్చిపోతాను."
"నీ ప్రాణాలు మేము కాపాడగలం. కానీ మాకు నీ శరీరం కావాలి " అన్నది శివయ్య, కేశవులు తేల్చి చెప్పిన సారాంశం.
"నా శరీరాన్ని మీకు అప్పగించకపొతే -- మీకు నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదా ?' అందామె.
లేదన్నట్లు ఇద్దరూ తలలూపారు.
అప్పుడు అమ్మాజీ వాళ్ళ వంక చిరాగ్గా చూసింది. "ఈ ప్రపంచంలో తప్పని నేనేది అనుకోను. కానీ రహాస్యంగా చేయడం మాత్రం నాకసహ్యం. బహిరంగంగా మీ కోరికను నలుగురి ముందూ వేలిబుచ్చలేని మీబోటి చచ్చు ఘటాలకు నా శరీరం అప్పగించబడదు. ఇదొక మహత్తర కార్యానికి వియోగించబడింది. ఆ మహత్తర కార్య సాధనలో కూడా మీవంటి వారిని సాధించలేక పోవడం నా దురదృష్టం "--
"నీ మహత్తర కార్యసాధన ఏమిటో నీ తండ్రి చెప్పాడు. ఆయనకు పేరు తెలియని జబ్బు. అందుకు ముప్పై వేలు కావాలి. ఆ డబ్బు నువ్వు సంపాదిస్తావు. నీ తండ్రి ఒప్పుకోకపోయినా ఆ డబ్బెలా సంపాదిస్తున్నావో నాకు తెలుసు. వళ్ళమ్ముకుని" అన్నాడు శివయ్య.
అమ్మాజీ అవేశాపడలేదు. ఓ నవ్వు నవ్వి వెళ్ళిపోయింది.
"ఆ నవ్వు చాలా నిర్మలంగానూ, నిర్లక్ష్యంగానూ ఉంది. ఈ పిల్ల తప్పు చేస్తుందని పించడం లేదు" అన్నాడు శివయ్య.
"ఈ పిల్లలో ఏదో రహస్యముంది. అది తెలుసుకోవాలి?" అన్నాడు కేశవులు. అప్పటికప్పుడు ఇద్దరూ కలిసి ఏదో ఆలోచించారు.
"ఈరోజు నుంచీ ఈ పిల్ల పేరున ఏమేం ఉత్తరాలు వస్తున్నాయో చూడాలి " అన్నాడు కేశవులు.
పోస్టాఫీసు ఆ వీధిలోనే ఉంది. మర్నాడుదయం వెళ్ళి అమ్మాజీ కి వచ్చే ఉత్తరాలు చూశారు. ఆమె పేరున అయిదుత్తరాలున్నాయి. అవి తామే తీసుకుని చదవాలని వాళ్ళనుకున్నారు. పోస్టు మాన్ మాత్రం 'అమ్మాజీగారే ఉత్తరాలు ఎవరికీ ఇవ్వడానికి లేదండి. ఆమె నాకు కచ్చితంగా చెప్పారు" అన్నాడు.
తన ఉత్తరాలు తనకు మాత్రమే ఇవ్వాలని ఆమె పోస్టు మాన్ కు అదేశమిచ్చిందట.
"ఎలాగూ పోస్టాఫీసు కి వచ్చాం గదా అని అడిగాం" అని సంజాయిషీ యిచ్చుకుని అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
అమ్మాజీ అసలు కధ తెలుసుకోవాలని వాళ్ళు పట్టుపట్టారు. పార్కులో ఆమె కలుసుకునే ఓ యువకుణ్ణి పట్టారు. ఆమెకూ, నీకూ ఏమిటి సంబంధమని నిలదీశారు. ఆ యువకుడు ముందు చెప్పలేదు. కానీ తర్వాత చెప్పాడు "నైట్ క్లబ్బులో క్యాబరే ద్యాన్సులకి ఆమెను బుక్ చేస్తుంటాను."
ఆశ్చర్యపడ్డారు స్నేహితులిద్దతూ. ఆ యువకుణ్ణి బ్రతిమాలి - అయిదు వందలిచ్చుకుని ఓ రాత్రి నైట్ క్లబ్బులకు వెళ్ళి అమ్మాజీ నృత్య ప్రదర్శన చూశారు. మేకప్ లో ఆమె ముఖం బాగా మారిపోయినా -- బాగా ఎరిగున్న వాళ్ళు కాబట్టి ఆమెను గుర్తుపట్టగలిగారు.
ఆరోజు వారు అమ్మాజీ అవయవపుష్టినీ, వంపు సొంపులనూ చూసి "బాప్ రే ఈ పిల్ల మాకు తెలిసి అమ్మాజీయేనా?" అని ఆశ్చర్య పోయారు. వాళ్ళకు మతులు చలించాయి.
అమ్మాజీ వాళ్ళను చూడలేదు.
"ఇదన్న మాట అమ్మాజీ కధ" అనుకున్నావాళ్ళిద్దరూ.
ఇది తెలిస్తే వీరవెంకయ్య ఎమైపోతాడు? తన జబ్బు కోసం కూతురు నలుగురి ముందూ వంపు సొంపులు ప్రదర్శిస్తోందన్న నిజాన్ని ఏ తండ్రయినా సహించగలడా?
మిత్రులిద్దరూ ఈ విషయాన్ని వీర వెంకయ్యకు చెప్పకూడదనే అనుకున్నారు. కానీ అమ్మాజీ వల్ల ప్రయోజనం పొందాలని మాత్రం అనుకున్నారు. తాము చూసిన వంపు సొంపులు కళ్ళ ముందు మేదుల్తున్నాయి వారికి.
అయితే చాలారోజులు అమ్మాజీ వారికి దొరకలేదు. ఈలోగా వారోనొక యువకుడు కలుసుకున్నాడు.
అతడి పేరు శేఖర్, అతడు అమ్మాజీ పరస్పరం ప్రేమించుకొన్నారు. శేఖర్ ఫారిన్ అవకాశ మొకటి వచ్చేలాగున్నదని అమెరికాలోని అతడి మిత్రుడు రాశాడు. శేఖర్, ఆమ్మాజీ కలిపి నేరుగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అన్ని ఏర్పాట్లకూ ఓ సంవత్సరం వ్యవధి వుంది. ఈ విషయమై శేఖర్ , అమ్మాజీ చర్చించారు.
అమ్మాజీ అతడి గురించి కాబరే డాన్సులు చేయడానికి ఒప్పుకుంది. ఇంట్లో ఆమె విషయమై ఇబ్బంది లేకుండా తండ్రికి లేని జబ్బు సృష్టించి చెప్పింది. ఇప్పుడు డబ్బు సమకూరింది. పాస్ పోర్టు, వీసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎలాగూ మద్రాసు లో రెండు నేలలుండాలి. డాక్టర్ గుహనాధన్ దగ్గర అప్పుడు వీర వెంకయ్యకు దొంగ వైద్యం జరుగుతుంది. అ ఖర్చు తను భారిస్తున్నట్లు శేఖర్ చెప్పి ఆమెను వివాహం చేసుకుంటాడు.
"ఇప్పుడింతకీ మీదగ్గర కెందుకు వచ్చానంటే మీ గురించి నాకు అంతా అమ్మాజీ చెప్పింది. మీ ప్రవర్తనకు మిమ్మల్ని నేను తప్పు పట్టను. మీ కారణంగా నాకో సహాయం కావాలి. నేనొక లేడీ డాక్టర్ని తీసుకుని వచ్చి మీకు అప్పగిస్తాను. మీరేదో విధంగా ఆమ్మజీని రెచ్చగొట్టి -- ఆ డాక్టరు చేత పరీక్షకు సిద్దపడేలా చేయాలి. ఆమె తన కన్యాత్వాన్ని కాపాడు కున్నదా , లేదా అన్న విషయం నాకు తెలియాలి !" అన్నాడు శేఖర్.
ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.
అమ్మాజీ తను శీలవతిగా మిగిలానని ఋజువు చేసుకున్న పక్షంలో అంతకాలం తమ దుష్ప్రవర్తనకు లెంప లేసుకుంటామనీ , లేని పక్షంలో ఆమె తమకు లొంగి పోవాలని స్నేహితులిద్దరూ అన్నారు.
అమ్మాజీ అమితోత్సాహంగా ఈ పరీక్షకు సిద్దపడింది. "తన శీలాన్ని రుజువు చేసుకొనడం కోసం సీత అగ్ని లో దూకింది. నాకీ పరీక్ష అంత కష్టమయిందని కాదు. అదీగాక నా సచ్చీలతను ఋజువు చేసుకున్నట్లవుతుంది!"
లేడీ డాక్టర్ పరీక్షలో అమ్మాజీ పురుష సంపర్కం ఏ మాత్రమూ ఎరగదని తేల్చి చెప్పినపుడు శివయ్య, కేశవులు మ్రాన్పడిపోయారు. ఆ నిజం నమ్మడం వారికి కష్టంగా వుంది. కానీ తప్పనిసరిగా ఆమె ముందు తప్పు ఒప్పుకుని లెంపలు వేసుకున్నారు.
అమ్మాజీ శీలవతి అనడంలో సందేహం లేదు. ఎందుకంటె ఆమెకు కాబోయే భర్త నియమించిన డాక్టరు పరీక్ష చేసి తేల్చిన విషయ మిది.
"మీ సందేహం తీరిందా?" అంది గర్వంగా అమ్మాజీ.
"నీగురించి మా కెన్నడూ సందేహం లేదు" అన్నాడు స్నేహితులిద్దరూ ఏక కంఠంతో.
"మీ సందేహంతో నాకు నిమిత్తం లేదు. మీలోంచి వెధవ బుద్దులు తొలగించాలన్న ఉద్దేశ్యంతో ఈ పరీక్షకు సిద్దపడ్డాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ననుమానించని వ్యక్తిని నేను ప్రేమించాను. పెళ్ళి చేసుకోబోతున్నాను." అని అమ్మాజీ క్షణం ఆగి - "సీతాదేవి అగ్నితో దూకడానికి కారణం ప్రపంచానికి తన పవిత్రతను తెలుపుకోడానికి కాదు. తన్ననుమానించిన వ్యక్తీ తన భర్త అయిన రాముడు కావడం. అలా జరిగినపుడు ఇంక బ్రతికి ఏం లాభం ఆడదానికి?" అంది.
కేశవులు ఉక్రోషంగా --"నీ ప్రియుడి కధ మాకూ తెలుసు. అతడెంతటి ఉన్నతుడో కూడా తెలుసు. నిన్ను పరీక్షించమని లేడీ డాక్టర్ని నియమించి మా సాయం కోరింది అతడే!" అన్నాడు.
"ఎమన్నారూ?' అంది అమ్మాజీ ఆశ్చర్యంగా.
శివయ్య ఆమెను ఆవేశంగా తనకు తెలిసిన కధ వివరించాడు.
అమ్మాజీ ఇంకేం మాట్లాడలేదు. తల వంచుకుని నెమ్మదిగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
మర్నాడుదయం ఆమె శవం దూలానికి వ్రేళ్ళడింది.
రాముడనుమానించినందుకు సీత అగ్ని లో దూకిందా?"
"ఇది ఆత్మహత్య " అన్నాడు శివయ్య.
"కాదు హత్య " అన్నాడు కేశవులు.
ఆ శవంతో శివయ్యకూ, కేశవులుకూ సంబంధం లేదు. కానీ అది హత్యయినా, ఆత్మహత్యయినా ఆ నేరంతో మాత్రం వారికి సంబంధం వుంది. అందుకని వారు అమ్మాజీ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ విషయం చర్చిస్తూనే వుంటారు.
***