బయట ఒక అపరిచిత యువకుడు నిలబడివున్నాడు. అతడికి సుమారు పాతికేళ్ళ వయసుంటుంది.
"నా పేరు ఆనందరావు. రమాకాంతంగారితో మాట్లాడాలి. ఒక్కసారి పిలుస్తారా?" అన్నాడతను.
"ప్రస్తుతం మేము ఇల్లు అద్దెకిచ్చే ఉద్దేశ్యంలో లేము-" అన్నాడు రఘు.
"నేనొచ్చింది ఇంటి కోసం కాదు. హత్య గురించి మాట్లాడడానికని చెప్పండి...." అన్నాడు ఆనందరావు.
రఘు ఒక్క క్షణం మ్రాన్పడిపోయాడు. తర్వాత ఆనందరావు వంక ఎగాదిగా చూశాడు. ఉన్నట్లుండి ఒక్క పరుగున లోపలకు వెళ్ళి--"నాన్నా-ఎవరో ఆనందరావుట. మీతో హత్య గురించి మాట్లాడతాడట" అన్నాడు.
అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. రమాకాంతం గారు చటుక్కున లేచి నిలబడ్డాడు. ఆయన ముందు నడుస్తూంటే ఆ ఆగంతకున్ని చూడడానికి అంతా ఉబలాటపడుతూ వెనుకనే నడిచారు.
"నమస్కారమండి-మీరే రమాకాంతం గారనుకుంటాను. పది నిమిషాలు మీతో మాట్లాడాలి!" అన్నాడు ఆనందరావు.
రమాకాంతం, ఆనందరావు ఒక గదిలోకి వెళ్ళారు.
"మీకు వచ్చిన యిబ్బంది విన్నాను. మీకు సాయపడాలని వచ్చాను-" అన్నాడు ఆనందరావు సూటిగా రమాకాంతం మొఖంలోనికి చూస్తూ.
"నాకు ఎలా సాయపడగలవు?" రమాకాంతం అనుమానంగా అడిగాడు.
"డబ్బు తీసుకుని!" అన్నాడు ఆనందరావు నిర్లిప్తంగా.
"నాకు అర్ధంకాలేదు-" అన్నాడు రమాకాంతం.
"ఇందులో అర్ధంకావడానికేముందండీ-చాలా సింపుల్! ఇన్స్ పెక్టర్ మిమ్మల్ని చనిపోయిన యువతి వివరాలు చెప్పమన్నాడు. మీకేమీ తెలియదంటున్నారు. అందులోని నిజానిజాలు మీకే తెలియాలి. ఒక వేళ ఆ హత్య మీరేచేసినా చేసి వుండవచ్చు. అదంతా నాకు అనవసరం. ఆ అమ్మాయెవరో నాకు తెలుసు. ఆ హత్య నేను చేశాను. ఆ రెండూ ఒప్పుకుంటాను. పదివేల రూపాయలు నాకివ్వండి-" అన్నాడు ఆనందరావు.
"ఆ హత్య నువ్వు చేశావంటే పోలీసులెలా నమ్ముతారు?" అన్నాడు రమాకాంతం.
"కధలు నేను కల్పించగలను. ముందు పదివేలు ఇవ్వండి. ఆ తర్వాత పోలీసుల్ని నేను నమ్మిస్తాను-" అన్నాడు ఆనందరావు.
"డబ్బు తీసుకొని మోసంచేస్తే?"
"చేయకుండా మీకో ఉపాయముంది. హత్య జరిగిన గది తలుపుల మీద నా వేలిముద్రలు పడేలా చేసిపోతాను-" అన్నాడు ఆనందరావు.
"పదివేలకోసం హంతకుడిననిపించుకొని ఉరికంబం ఎక్కుతావా?" అన్నాడు రమాకాంతం అనుమానంగా.
"బ్రతికుంటే పైసా విలువ చేయను నేను-" అన్నాడు ఆనందరావు.
కాసేపు రమాకాంతానికీ, ఆనందరావుకీ వాదన జరిగింది. ఆఖరికి రమాకాంతం, ఆనందరావుకి డబ్బివ్వడానికి ఒప్పుకొన్నాడు.
ఆనందరావు బయటకు వచ్చి హత్య జరిగిన గది తలుపులమీద తన కుడి చేయి ఆన్చి-"దుమ్ము బాగా వుంది. వేలి ముద్రలు బాగా పడ్డాయి-" అన్నాడు.
రమాకాంతం అతడికి ఇంట్లోంచి పదివేలు తెచ్చి యిచ్చి "ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బిది నాకు. గతిలేక నీకు ఇస్తున్నాను. ఇప్పుడు నీ కధేమిటో చెప్పు!" అన్నాడు.
ఆనందరావు డబ్బు జేబులో పెట్టుకున్నాడు.
"నేనో గ్రాడ్యుయేట్ ని. ఉద్యోగంలేదు. ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించానని చెప్పి వాళ్ళింట్లో మకాంపెట్టి రోజూ ఫ్రీగా భోజనం లాగిస్తున్నాను. ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. ఈలోగా ఓ లక్షాధికారి కూతురు నన్ను ప్రేమించింది. ఆమె తండ్రికి కూడా నేను నచ్చాను. ఈ అదృష్టాన్ని నేను వదులుకోదల్చుకోలేదు. ఈ సంగతి చూచాయగా నా పేద ప్రియురాలికి తెలిసింది. లక్షాధికారి దగ్గర నా రంగు బయటపెడతానని బెదిరించింది.
నామీద ఎలాంటి ఫిర్యాదు వచ్చినా లక్షాధికారికి అనుమానం వస్తుంది. నా జీవితం నాశనమవుతుంది. అందుకని నేను నా ప్రియురాలీని చంపాలనుకున్నాను. ఆమెను మాయమాటలతో మోసగించాను. లక్షాధికారి కూతురిపై ప్రేమంతా నటన అని చెప్పి నమ్మించాను. మీ యిల్లు ఎన్నుకున్నాను హత్యకు. ఓ రోజు రాత్రి నా ప్రియురాలిని మంచి మాటలతో వంచించి మీ యింటిదాకా తెచ్చాను. మీ యింట్లో పిల్లలు హాల్లో కంబైన్డ్ స్టడీస్ చేసుకుంటూ వీధి తలుపులు దగ్గరగా వేసి నిద్రపోయారు. ఆ సమయంలో చప్పుడు చేయకుండా మేమిద్దరం యింట్లో ప్రవేశించాం. నా దగ్గరున్న మారు తాళంచెవులతో పక్క వాటా తాళంతీసి లోపలకు వెళ్ళాను.
ఉదయం ఆమెను హత్యచేసి తెలివిగా అక్కణ్ణించి బైటపడ్డాను. మీ హాల్లో జనసంచారం తక్కువ. అందువల్ల ఆ వాటా తాళంవేసి బయటపడటం నాకు కష్టంకాలేదు. అదీ కధ....ఈ కధలో చిరు లోపాలున్నాయి. వాటన్నింటినీ తెలివిగా సద్దుకుంటాను-" అన్నాడు ఆనందరావు. అతడి కళ్ళలో బెంగ, భయం ఏమీలేవు.
"ఈ పదివేలూ ఏం చేసుకుంటావు?" అన్నాడు రమాకాంతం.
"నావాళ్ళకిచ్చుకుంటాను. కాసేపటిలో మా తాలూకు మనిషి ఒకడు వస్తాడు. అతనికి డబ్బిచ్చి పంపెస్తాను. నేను మీ యింట్లో వుండిపోతాను. మీరు నన్ను తాళ్ళతో బంధించుకోండి. రేపు ఇన్స్ పెక్టర్ రాగానే నన్నప్పగించండి-" అన్నాడు ఆనందరావు.
రమాకాంతం నిట్టూర్చి-"నీ కథ చాలా తమాషాగా వుంది. కానీ నాకు నీ గురించి జాలిగా కూడా వుంది-" అన్నాడు.
"నామీద మీరు జాలిపడనవసరంలేదు. పోలీసుల్నించి తప్పించుకు పారిపోవడం నాకు వెన్నతో పెట్టినవిద్య!"అన్నాడు ఆనందరావు.
దీనికి రమాకాంతం ఇంకా ఆశ్చర్యపోయాడు.
"ఇది నా వృత్తి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటాను. డబ్బు తీసుకుంటాను. అమాయకులమీది నేరం నా మీదకు మళ్ళిస్తాను. ఇప్పుడు పోలీసుల దృష్టి నా మీదకు మళ్ళుతుంది. నేను పారిపోతే నా గురించే వేట ప్రారంభమవుతుంది. మీకు పోలీసుల బెడద తప్పుతుంది" అన్నాడు ఆనందరావు. చిన్న పిల్లలకు రహస్యాలు దాచేశక్తి వుండదు కాబట్టి ఈ విషయం ఆనందరావుకూ, రమాకాంతానికీ మధ్య వుండిపోవాలని చెప్పాడు ఆనందరావు. రమాకాంతానికీ అది కూడా సబబుగానే అనిపించింది.
కాసేపటికి ఆనందరావు మనిషి వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు.
ఆనందరావు ఆ యింట బందీగా వుండిపోయాడు. మర్నాడు పోలీస్ ఇన్స్ పెక్టరు వచ్చినపుడు ఆయనకు రమాకాంతం ఆనందరావును అప్పజెప్పాడు.
ఇన్స్ పెక్టర్ ఆశ్చర్యపోతూ-"ప్రపంచంలో ఎలాంటి విచిత్రాలుంటాయి! ఇది నేను ఏ మాత్రమూ ఊహించని సంఘటన!" అన్నాడు.
ఆయన ఆనందరావుని తీసుకుని వెళ్ళిపోతూంటే రమాకాంతం తేలికగా నిట్టూర్చలేకపోయాడు. పదివేల రూపాయలకు తన ప్రాణాలు పణంగా పెట్టే వృత్తిని స్వీకరించిన ఆనందరావంటే ఆయనకు జాలిగా కూడా వుంది.
3
రమాకాంతం ఆ హత్య కేసుగురించి మరిచిపోవడానికే ప్రయత్నించాడు. ఆ కేసు ఏమవుతుందనిగానీ, ఆనందరావు ఏమయ్యాడోగానీ ఆయన తెలుసుకుందుకు ప్రయత్నించలేదు. ఎటొచ్చీ తనింట్లో చనిపోయిన ఆ యువతి ఎవరో తెలుసుకోవాలని మాత్రం ఆయనకుండేది. ఆమె ఎవరో? ఎందుకు హత్య కావించబడిందో? అసలక్కడకు ఎలా చేరిందో?