మీనాక్షమ్మ గారు అప్పుడే నడుం వాల్చింది. నిర్మల గోడ కానుకుని కాళ్ళు చాచుకుని కూర్చుని డిటెక్టివ్ నవల చదవటం లో మునిగిపోయింది. భార్గవి టేబుల్ క్లాత్ కి యంబ్రాయిడరీ చేస్తున్నది. జయలక్ష్మీ కూతురి చీరలు మడతలు పెడ్తున్నది. ఎవరి పనుల్లో వాళ్ళు లీనమై పోయారు.
శ్రీధరం ఉత్తరం తీసుకు వచ్చి జయలక్ష్మీ కిచ్చి అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చున్నాడు.
నిర్మల వైపు చూశాడు శ్రీధర్. నిర్మల కూడా తలెత్తి శ్రీధర్ ని చూసింది. క్షణ కాలం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. నిర్మల శ్రీధర్ ని చూసి మూతి మూడు వంకరలు తిప్పి వెక్కిరించి పుస్తకంలో తల దూర్చింది.
ఆ ముఖంలో భార్గవి కనిపించింది శ్రీధరానికి.
"ఒరేయ్- శ్రీధరం మీ బావగారు ఉత్తరం వ్రాశారురా. ఈ శ్రావణ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయట. ముహూర్తం కూడా పెట్టించారుట. "సంతోషంగా చెప్తున్నా జయలక్ష్మీ మాటలకు అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న మీనాక్షమ్మ గారు కూడా లేచి కూర్చున్నారు.
నిర్మల సిగ్గుని ముని పంటితో పెదవి నొక్కుతూ దాచుకుంది. భార్గవి చేతిలో ఎంబ్రాయిడరీ పక్కన పెట్టి వినసాగింది.
"కాని నిర్మలని మాత్రం తీసుకొచ్చేసెయ్యమని వ్రాశారురా" అంది బాధగా.
"ఎందుకని?" అన్నాడు శ్రీధర్ అప్రయత్నంగా.
శ్రీధర్ ముఖంలోని ప్రసన్నతను గమనించిన జయలక్ష్మీ సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. ఈ మాత్రపు మాట కోసం ఆవిడ ఎన్నో రోజుల నుంచీ ఎదురు చూస్తున్నది.
ఎందుకేమిటిరా! పెళ్ళయిపొతే నీతో తీసుకెళ్ళి పోతావాయే! ఎంత లెక్క కట్టినా మా దగ్గర ఉండేది ఈ రెండు నెలలే కదా! అంది కళ్ళలో నీళ్ళు చిప్పిలుతుండగా.
శ్రీధర్ దీర్ఘంగా నిట్టూర్చి లేచి వెళ్ళిపోయాడు.
జయలక్ష్మీ ఆ రాత్రికే ప్రయాణం పెట్టుకున్నది. పెళ్ళి పనులలో సాయంగా ఉంటుందని భార్గవి ని కూడా కాకినాడ తనతో తీసుకెళ్తానంది. శ్రీధర్ ససేమిరా ఒప్పుకోలేదు. అంతగా అయితే పది రోజుల ముందు పంపిస్తానన్నాడు. కలకత్తా లో ఎన్నెన్నో ఊహించిన నిర్మల నిరుత్సాహ పడిపోయింది. అయినా ఎంత రెండు నేలలేగా అని సరిపెట్టుకుంది.
అ రాత్రే జయలక్ష్మీ, నిర్మలా వెళ్ళిపోయారు.
ఆ మరునాడు రాత్రే శ్రీధర్ కలకత్తా ప్రయాణం. అంతకు ముందే టిక్కెట్లు రిజర్వు చేసుకున్నారు. తెల్లవారక ముందే భార్గవి తలంటి పోసుకుని కొత్త చీర కట్టుకున్నది. ఆరోజు భార్గవి పుట్టిన రోజు. శ్రీధర్ నిద్రలేచే సరికి కొత్త చీరలో వచ్చి శ్రీధర్ కాళ్ళకి నమస్కరించింది.
చెల్లెల్ని ప్రేమగా చూస్తూ అస్పష్టంగా ఏదో ఆశీర్వదించాడు. కాలకృత్యాలు తీర్చుకుని "భార్గవీ! శేఖర్ ని భోజనానికి పిలుస్తాను" అన్నాడు బయటకు వెళ్ళబోతూ.
"ఎందుకన్నయ్యా! అనవసరంగా -- వద్దు" అంది ఖచ్చితంగా. "అదేమిటి? ఎంత సహాయం చేశాడు. ఒక్క దమ్మిడీ కూడా తీసుకోలేదు. ఆయన్ని భోజనానికి పిలుస్తే ఏం? దానికేం తెలుసురా-- నువ్వు పోయి పిలుచుకురా" అంది మీనాక్షమ్మ గారు.
"ఊరి కేల్తా నన్నారు- వచ్చారో, రాలేదో" ఆఖరి ప్రయత్నంగా అంది భార్గవి.
"అప్పుడే వచ్చుంటాడమ్మా- ఎవరో ఫ్రెండ్ కూతురు బారసాలాట-- అందుకు వెళ్ళాడు" అంటూ శేఖర్ ఇంటి వైపు బయలుదేరాడు.
శ్రీధర్ వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాడు శేఖర్.
"ఓ! శ్రీధర్! కమిన్. " అన్నాడు ఆదరంగా శ్రీధర్ ని చూస్తూ.
"శేఖర్! ఇవ్వాళ భార్గవి పుట్టిన రోజు. మీరు మా యింటికి భోజననైకి రావాలి."
అతను అద్దం ముందు నిలబడి తల దువ్వుకొంటున్నాడు. మంచి పర్సనాలిటి ఏమో అందంగా బలంగా ఉన్న శేఖర్ నలుపని అనిపించడు. అతను చామన చాయలో ఉంటేనే బాగుంటుందనిపించేట్టున్నాడు. శేఖర్ ని చూస్తున్న శ్రీధర్ మనసు తృప్తితో సంతోషంతో నిండిపోయింది.
"ఓ, యస్? మీరు పిలవటమూ-- నేను కదనటమూనా."
"పదండి , ఇప్పుడే వెళ్దాం" అన్నాడు శ్రీధర్.
శ్రీధర్ , శేఖరమూ వచ్చేసరికి భార్గవి ముందు వరండా లో జాజిపూలు మాల కడుతూ కూర్చున్నది. వీళ్ళ రాకను గమనించి లోపలి కెళ్ళిపోయింది.
భోజనాల సమయంలో కూడా భార్గవి బయటకు రాలేదు. భోజనాలు పూర్తయి తమల పాకులు వేసుకుంటూ అన్నాడు శేఖర్ . "శ్రీధర్ -- మీ చెల్లెల్ని ఒకసారి పిలిస్తే -- నేనింక వెళ్తాను."
"ఇప్పుడే పిలుస్తాను" అంటూ భార్గవి దగ్గర కెళ్ళాడు శ్రీధర్.
"నాకు తలనొప్పి గా ఉండన్నయ్యా" అంది భార్గవి రావటానికి నిరాకరిస్తూ.
"అతను వెళ్ళిపోతాట్ట. ఏమిటా మొండి తనం - నీ ప్రవర్తన ఎంత అసహ్యంగా ఉందొ తెలుసా"
శ్రీధర్ కి కోపం రావటం భార్గవికి ఊహ తెలిసిన తర్వాత ఎన్నడూ చూడలేదు.
"ఉత్త రోడ్ సైడ్ రోమియో లాంటి శేఖర్ మీద అన్నయ్య కేందుకింత అభిమానమో" అనుకుంటూ శ్రీధర్ వెనకాలే నడిచింది.
ఎంతో సరదాగా వాళ్ళతో ఆరోజు గడుపుదామని వచ్చిన శేఖర్ కి భార్గవి ముఖం చూడగానే ఆ ఆలోచనలకూ స్వస్తి చెప్పి "జేబులోంచి ఒక చిన్నపెట్టే తీసి భార్గవి కిచ్చాడు.
"ఏదో చిన్నకనుక. ప్రతి పుట్టినరోజు ఇలాగే ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటూన్నాను" అని వెంటనే లేచి
"శ్రీధర్ వెళ్ళొస్తాను" అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు.
భార్గవి , శ్రీధర్ ఇద్దరూ అయిదు నిముషాల పాటు అలానే కూర్చుండి పోయారు.
శ్రీధర్ చెల్లెలి చేతిలోంచి పెట్టె తీసుకుని తెరిచి చూశాడు. మధ్యలో పగడం - రెండు వైపులా రెండు ముత్యాలున్న -- ముచ్చటైన ఉంగరం అది.
లేచి భార్గవి చేతికిచ్చాడు. "భార్గవీ! ఈ ఉంగరం నీ చేతి కెప్పుడూ ఉండాలి....పాపం -- శేఖర్ మనసు నీ ప్రవర్తన వాళ్ళ ఎంత బాధపడిందో తెలుసా -- సాయంత్రం వరకూ మనతోనే ఉంటానని అన్నాడు. వెళ్ళిపోయాడు చూశావా." అతని గొంతులో బాధ ధ్వనించింది.
భార్గవి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తన వెలికి ఉంగతం పెట్టుకుంది. ఆ రాత్రే శ్రీధర్ తో కలకత్తా వెళ్ళిపోయింది. అసలే మితభాషి అయిన శ్రీధర్ ఆ సంఘటనతో మరింత మౌనం ధరించాడు.
* * * *
హౌరా స్టేషను లో రైలు దిగిన భార్గవి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని నాలుగు వైపులా చూడసాగింది.
"భార్గవీ! కాఫీ తాగి వెళ్దాం" అని నాలుగు వైపులా చూడసాగాడు శ్రీధర్.
"ఎవరి కోసమైనా చూస్తున్నావా అన్నయ్యా!"
"అబ్బే! మన కోసం ఎవరొస్తారు?"
ఇద్దరూ కాఫీ తాగుతుండగా "శ్రీధర్" అన్న పిలుపు వినబడేసరికి ఇద్దరూ వెనక్కి తిరిగారు.
చేతిలో చిన్న సూట్ కేసుతో శేఖర్ నిలబడి ఉన్నాడు. భార్గవి గతుక్కుమంది. చేసిన ఖర్మ పొరుగూరు పోయినా వదలనట్టు -- ఇంతదూరం వచ్చిన శేఖర్ వదల్లేదు అనుకుంది మనసులో.
"ఆరోజు నేను ఇంటికి వెళ్ళేసరికి టెలిగ్రాం వచ్చింది. ఇక్కడి వ్యవహారమేదో అర్జంటుగా చూసుకోవలసి ఉన్నది రమ్మనమని ఒక స్నేహితుడు ఇచ్చాడు. అందుకని అనుకోకుండా కలకత్తా రావలసి వచ్చింది."
"కలకత్తా లో అంత అర్జంటు పనేమీటబ్బా" అని అనుమానంగా చూసింది భార్గవి.
"సరే పదండి! హోటలు కేల్తారా. హోటలు కెళ్ళేట్టయితే -- మా ఇల్లుంది మా ఇంట్లో భోజనం చెయ్యవచ్చు . హోటలు ఆలోచన పెట్టుకోకండి" అన్నాడు శేఖర్.
"హోటలు కెందుకు? సరాసరి క్వార్టర్స్ కే వెళ్ళిపోతాం"
వాళ్ళు నడుస్తుండగానే "క్యా భాయీ! ఏం పని చేశావు? నాలుగు రోజులు శలవు పెట్టిన వాడివి -- నెల రోజుల దాకా పత్తా లేకుండా పోయావు. ఇదిగో నీకు టెలిగ్రాం వచ్చింది?' అని జేబులు తడుము కుంటూ టెలిగ్రాం తీసి ఇచ్చాడు.
శ్రీధర్ టెలిగ్రాం చదువుతూనే అతని ముఖంలో రంగులు మారినాయి.
"ఏమిటన్నయ్యా అది." అంది ఆదుర్దాగా భార్గవి.
"నే పోతున్నా భాయ్" అని అతను వెళ్ళిపోయాడు.
"ఏదో ఆఫీసుకు సంబంధించింది లేమ్మా" అని టైము చూసుకున్నాడు.
"శేఖర్! ఒక చిన్న సహాయం చేస్తారా! మా చెల్లెల్ని కాస్త జాగ్రత్త గా చూస్తె నేను రెండు రోజుల్లో వచ్చి తీసుకెళ్తాను. ఇవాళ నేను దీన్ని నిర్లక్ష్యం చేస్తే నా ఉద్యోగమే పోతుంది. అని గాభరాగా అని తన పెట్టె చేతిలోకి తీసుకున్నాడు శ్రీధర్.
"అన్నయ్యా!' పెద్దగా కేకపెట్టి శ్రీధర్ చేతిని గట్టిగా పట్టుకుంది భార్గవి.
"భార్గవి! నాకు మాట్లాడటానికి కూడా టైము లేదు. శేఖరం ఉన్నాడుగా నీకేం ఫర్వాలేదు. నేను రెండు రోజుల్లో వచ్చేస్తాను. ధైర్యంగా ఉండు" అని భార్గవి చెయ్యి విడిపించుకుని గబగబా అంగ లేసుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీధర్.
భార్గవి చైతన్యం కోల్పోయి చూస్తూ నిలబడింది. భార్గవి తెలివి వచ్చి ఈ లోకంలోకి వచ్చేసరికి స్టేషను లో రైలు దిగిన వాళ్ళెవ్వరూ లేరు. అంతా వెళ్ళిపోయారు. తను, తన వెనగ్గా శేఖర్ మిగిలారు.
భార్గవి కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. వచ్చి వచ్చి తను పులి నోట్లో తల దూర్చింది. అక్కయ్య కాకినాడ పోదాం అమ్మంటే కలకత్తా వచ్చింది. కోరి కోరి ఈ దురదృష్టాన్ని కొని తెచ్చుకుంది తను. రెండు రోజులు శేఖర్ తో గడపటమంటే తన జీవితం అయిపోయినట్టే! అన్నయ్యకేం బుద్ది లేదు, ఆడపిల్లను-- ఒంటరిగా పరాయి మగవాడి దగ్గర వదిలి వెళ్ళటానికి మనసెలా ఒప్పిందో! ఈ గొడవ నుంచి తను తప్పుకోలేదు. శలభం లా ఇందులో మాడి పోవలసిందే. పోనీ ఏదైనా హోటలు కెళ్తే , అమ్మో -- ఈ కొత్త చోట ఎక్కడి కని వెళ్ళాలి? ఎలా ఉండాలి? అంతకంటే శేఖర్ దగ్గరే తన జీవితం తెల్లవారి పొతే మంచిది"
"భార్గవీ! ఎందుకంత భయంకరంగా ఊహించుకుంటావ్? నీకేం భయం లేదు' శేఖర్ గొంతు మృదువుగా విన్పించింది.
తన మనసు చదివినట్టే మాట్లాడుతున్న శేఖర్ ని ఆశ్చర్యంగా చూసిన భార్గవి తన స్థితికి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించింది.
"భార్గవీ! ఇది స్టేషను పద - ఇంటికి పోదాం-- తీరుబడిగా నీ ఇష్టం వచ్చినంత సేపు బాధపడవచ్చు" ముందు దారి తీశాడు శేఖర్.
భార్గవి చేతిలోని పెట్టె తనే అందుకుని నడవ సాగాడు.
గత్యంతరం లేక భార్గవి శేఖరాన్ని అనుసరించింది.
టాక్సీ లో ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. భార్గవి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆకాశాన్నంటే భవనాలు గాని, చీమలు బారులా పోతున్న కార్లు గాని ఏమీ కనబడలేదు భార్గవి కి . శేఖరంతో తను గడపబోయే రెండు రోజుల జీవితం గురించి ఆలోచిస్తూ కూర్చుంది.
"భార్గవీ! దిగు" శేఖరం గొంతు వినబడే వరకూ ఆలోచనల్లోనే మునిగిపోయింది.
ఒక మేడ ముందాగింది టాక్సీ. టాక్సీ దగ్గరకు లోపలి నుంచి ఒక మనిషి వచ్చి పెట్టేందుకుని లోపలి కెళ్ళాడు.