Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 112

 

9.    వజ్రము వంటి మృత్యువాత పడిన నరులను కాల్చు క్రవ్యాదాగ్నిని వెళ్ళగొట్టుచున్నాను. విద్వాంసుడనగు నేను గార్హపత్యమున క్రవ్యాదమును శాసించుచున్నాను. అది పిత్రు లోకపు భాగము అగునుగాక.
   
10.    ఉక్ధ్య ప్రశంసక క్రవ్యాదాగ్నిని పితరుల మార్గమునకు పంపుచున్నాను. అది మరల దేవయానమున తిరిగి రాకుండునుగాక. పితరులలో వర్ధిల్లి పితరులందు జాగృతమై ఉండునుగాక.
   
11.    అగ్ని పవిత్రుడు. పరిశుద్దుడు. అతడు శవభక్షక అగ్నిని రగిలించి పాపములను విడుచుచున్నాడు. అప్పుడు అతడు ప్రజ్వలితుడై, పావకుడై, పవిత్రము చేయుచున్నాడు.
   
12.    శవభక్షక అగ్ని స్వయముగ పాపవిముక్తుడై, మమ్ము అశుభములనుండి రక్షించి స్వర్గమునకు ఎక్కుచున్నాడు.
   
13.    ఆ శవభక్షక అగ్ని యందు మేము మా పాపములను ప్రక్షాళన చేసికొన్నాము. మేము యజ్ఞము చేసిన వారలము అయినాము. పరిశుద్దులము అయినాము. అగ్ని మాకు పరిపూర్ణ ఆయుష్యము కలిగించునుగాక.
   
14.    ఏ అగ్ని సుంక సకము, విక సుకము, నిర్రుథము, నిస్వరము అయినచో అది వ్యాధులను ఎరిగి, వ్యాధులను వెంట తీసికొని, దూరమునకేగి నష్టపడినది.
   
15.    మా గోవులందు, వీరులందు, అజములందు చొరబడిన క్రవ్యాదాగ్నిని దూరమునకు దొబ్బినాము.
   
16.    జీవితమును కల్లోల పరచు అగ్నిని గెంటి వేయుచున్నాము. క్రవ్యాదాగ్నీ! నిన్ను అన్యనరుల నుండి, అశ్వముల నుండి, గోవుల నుండి పంపివేయుచున్నాము.
   
17.    ఘ్రుతస్తావ అగ్నీ! దేవతలను, మానవులను పవిత్రము చేయుచు, స్వర్గమును ఆరోహించుము.
   
18.    అగ్నీ! నీవు సమిద్దుడవు అగుచున్నావు. నీయందు హవిస్సులు అర్పించబడుచున్నవి. అసువులు బాయకుము. ఇటనే ప్రజ్వరిల్లుము. అంతరిక్షమునందలి సూర్యుని దర్శనము కలిగించుము.
   
19.    జనులారా! మీ శిరో రోగములను సీసమున శుద్దము చేయండి. నడఘాసమున దూరము చేయండి. సంకసుక అగ్నిలోను, అజములందును, స్త్రీల యందును, దిండ్లయందును శుద్దము చేయండి.
   
20.    యజ్ఞములారా! మలమును సీసమున, తలబాధను దిండులో, వ్యాధులను నల్లగొర్రెకు వప్పగించి మీరు పవిత్రులు కండి.
   
21.    మృత్యువా! దేవయానము కానట్టి అన్య మార్గమున సాగిపొమ్ము. నేత్రవతి, కర్ణవతివగు మృత్యువా! వినుము. 'ఇచట మా పుత్ర పౌత్రులు వర్ధిల్లుదురుగాక'.
   
22.    నేడు మేము దేవతలకు ఇచ్చిన ఆహుతులు శుభప్రదములు అయినవి. ప్రాణులు మృత్యువును దూరము చేయగల శక్తివంతులు అయినారు. మేము కుటుంబ సహితముగ ఆడుటకు, నవ్వుకొనుటకు వచ్చి ఉన్నాము. యజ్ఞమును కీర్తించుచున్నాము.
   
23.    జనులారా! మీకు చిరంజీవిత్వ పరిథిని ఇచ్చుచున్నాను. మీరు దీనిని వదలకండి. అన్యులకు ఇవ్వకండి. శతశరత్తులు జీవించండి. మృత్యువును రాతితో రాల్చండి.
   
24.    జనులారా! వార్ధక్యము వరకు ఆయువును కోరండి, అప్పటి వరకు జీవించండి. మీరు సుజన్ములు, సశక్తులు అగుదురుగాక. త్వష్ట మీకు పరిపూర్ణ ఆయువును ప్రసాదించునుగాక.
   
25.    దినములు ఒకదాని వెనుక ఒకటి సాగుచున్నవి. ఋతువులు ఒకదాని పిదప ఒకటి సాగుచున్నవి. పాతను కొత్త విడువకున్నది. ధాతా! అట్లే వీరి ఆయువును పొడిగించండి.
   
26.    మిత్రులారా! అదిగో రాళ్ళమీదనుంచి పారు ఎరు వినిపించుచున్నది. సాహసించండి. ఆ నదిని దాటండి. పాపములను విడువండి. ఆరోగ్యవంతులై వేగవంతులు కండి.
   
27.    మిత్రులారా! లేవండి. శిలలుగల నది శబ్దించుచున్నది. పాపములను నదిలో పారించండి. రండి. శుభప్రద, సుఖదాయక మార్గమున సాగండి.
   
28.    వర్చస్సు కొరకు వైశ్య దేవిని ఆరంభించండి. అగ్నులు శుచిమంతులు అగుదురుగాక మీరు పరిశుద్దులు అగుదురుగాక. దురితపదములను దాటి "శతం హిమాఃసర్వ వీరా మదేమ" కుటుంబసమేతముగ శతహిమములు ఆనందింతుముగాక.
   
29.    ఋషులు ఉదీచీన, వాయుమంత మార్గమును అధిగమించి ఇరువది యొక్క మారులు మృత్యువును లంఘించినారు.
   
30.    మృత్యువును అధిగమించిన మహర్షులు విశేష ఆయుష్మంతులై ఆసీనులై ఉన్నారు. మీరు సహితము మృత్యువును అణచండి. అప్పుడు ఈ జీవలోకమున నిలిచి జ్ఞానమును ప్రశంసింతము.
   
31.    స్త్రీలు విధవలు కాకుందురుగాక. పతి సహితులై ఆనందింతురుగాక. ఘ్రుతసంపన్నులు అగుదురుగాక. బాష్పరహితులు, రోగరహితులై ఆభరణ యుక్తలగుదురుగాక. సంతానవతులు అగుదురుగాక.
   
32.    మంత్రశక్తిచే ఈ భార్యాభర్తల మృత్యువును పరిహరించుచున్నాము. వీరిని శక్తివంతులను చేయుచున్నాము. పితరులకు అర్పించు పిండములను అజరము చేయుచున్నాము. దీర్ఘాయువు కలిగించుచున్నాము.
   
33.    పితరులారా! మేము మర్త్యులము మా హృదయములందు అమృతమయ అగ్ని ఉన్నది. అట్టి అగ్నిని నేను పరిగ్రహించుచున్నాము. అట్టి అగ్ని మమ్ము ద్వేషించ కుండును గాక. మేము ఆ అగ్నిని ద్వేషించకుందుముగాక.
   
34.    జనులారా! మీరు గార్హపత్యాగ్ని నుంచి తొలగండి. క్రవ్యాదాగ్నిచే దక్షిణ దిశకు చేరండి. అచట మీ కొరకు పితరుల కొరకు ప్రియ కార్యములు చేస్తుండండి.
   
35.    క్రవ్యాదాగ్నిని విధిప్రకారము త్యాగము చేయనివాడు తనజ్యేష్టపుత్రుని, తన వృత్తిని రెంటిని కోల్పోయిన వాడగు చున్నాడు.
   
36.    క్రవ్యాదాగ్నిని విడువనట్లైన అతడు చేసినకృషి, సేవించిన పదార్ధము, క్రయము చేసినది ఫలించకున్నవి, నిష్పలమగుచున్నది.
   
37.    క్రవ్యాదాగ్నిని సేవించు వాని తేజస్సు నశించుచున్నది. అతడు యజ్ఞార్హుడు కాకున్నాడు. దేవతలు అతని హవిని సేవించకున్నారు, అతని వ్యవసాయము, గోధనము చిన్నాభిన్న మగుచున్నవి.
   
38.    అనువిద్వాన్ క్రవ్యాదాగ్ని ఎవని వద్ద ఉండి తపింప చేయుచున్నదో అట్టి వాడు బాధలు పడుచు, కోరినది దొరకక ఏడ్చినవాడు అగుచున్నాడు.
   
39.    క్రవ్యాదాగ్నిని సంపూర్ణముగ సేవించువాడు నిర్భంధితుడు అగుచున్నాడు. స్త్రీ తన భర్తను కోల్పోవుచున్నది. అట్టి వారు వేదవేత్తను సేవించవలసి ఉన్నది.
   
40.    మేము చేసిన పాపము, మలినకృత్యము, దుష్క్రుత్యము, స్మశానాగ్నిని తాకిన పాపమునుండి జలములు మమ్ము ముక్తులను చేయునుగాక.
   
41.    క్రింది నుంచి దేవయాన మార్గమున పైకి చేరిన ప్రాచీన జలము నవ్యమై పర్వతముల మీద వర్షించి నదులుగా ప్రవహించుచున్నది.
   
42.    అక్రవ్యాదాగ్నీ! క్రవ్యాదాగ్నిని దూరము చేయుము. దేవయజనమును వహింపుము.
   
43.    ఇతని యందు క్రవ్యాదాగ్ని ప్రవేశించినది. అది వ్యాఘ్రము వంటిది నేను ఆరెండింటిని ఇతని నుండి తొలగించుచున్నాను.
   
44.    గార్హపత్యాగ్ని దేవతలకు అంతర్ది, మానవులకు పరిధి అగుచున్నది. అది దేవ - మానవుల మధ్య స్థిరమై ఉన్నది.
   
45.    అగ్నీ! జీవించి ఉన్నవారికి ఆయువును, మృత్యులకు పిత్రులోకమును ప్రసాదించుము. గార్హపత్యాగ్నీ! శత్రువులను తపింప చేయుము. మా యందు ఉషస్సులను చేర్చుము.
   
46.    అగ్నీ! మా సమస్త శత్రువులను హతమార్చుము. వారి శక్తి సంపదలను మాకు ప్రసాదించుము.
   
47.    సమర్ధ, సంపన్న అగ్నిని అర్చించ నారంభించండి. అతడు మిమ్ము అవద్య పాపములనుండి రక్షించునుగాక. అందు వలన మీద పడనున్న రుద్రుని శరము తొలగునుగాక రక్షణ కలుగునుగాక.
   
48.    మేము భార వాహకమును వహించుచున్నాము. అది మమ్ము దురితములనుండి రక్షించునుగాక. సవితా నావను ఎక్కి ఆరు ఉర్వులను దాటుదుముగాక.
   
49.    గార్హపత్యాగ్నీ! నీవు రాత్రింబవళ్ళను వెంట పెట్టు కొనుచున్నావు. క్షేమము, సంతానము కలిగించుచు స్తవనీయుడవు అగుచున్నావు. మమ్ము అనాతురము, సుమనసమగు తల్పమున చేర్చుము. ఆరోగ్యము నిచ్చి సుగంధము కలిగించుము.
   
50.    అశ్వము పచ్చికను త్రోక్కినట్లు, క్రవ్యాదాగ్నిచే త్రొక్కబడినవాని యజ్ఞములు నశించుచున్నవి. అతని జీవిక పాపపూరితము అగుచున్నది.
   
51.    ఎవరు ధనము కోరి శ్రద్దాళువులై క్రవ్యాదాగ్నిని ఉపాసింతురో వారు నిత్యము ఇతరుల బరువులు మోయు వారలగుచున్నారు.
   
52.    అనువిద్వాన్ క్రవ్యాదాగ్ని ఎవనిని చేరి తపింప చేయునో వాడు మరల మరల పుట్టి చచ్చుచున్నాడు. అధోగతి పాలగు చున్నాడు.
   
53.    క్రవ్యాదాగ్నీ! నల్లగొర్రె, సీసము, చంద్రుడు, రుబ్బిన మినుములు నీ భాగధేయమని పెద్దలు చెప్పుచున్నారు. నీవు వానిని తీసికొని గహనారణ్యమున పడుము.
   
54.    ఇంద్రుడు ఇషేక, తిల్పింజ, దండన, నడమును ఇంధనము చేసి యమాగ్నిని తొలగించినాడు.
   
55.    మానవులకు పూజనీయుడగు సూర్యుని అర్పించి విద్వాంసులు గార్హపత్యాగ్నిని దేవయానమున ప్రవేశపెట్టినారు. నేను జనులకు ప్రాణములను, దీర్ఘాయువును కలిగించుచున్నాను.
   
                                     మూడవ అనువాకము
                                      మొదటి సూక్తము - 3

   
    ఇది స్వర్గౌదన విషయక సూక్తము.
   
1.    పుంస్త్వగుణ విశిష్టా! ఈ నర పశువు చర్మము మీద ఆవిష్టుడవగము. నీకు ఇష్టులను పిలుచుకొనుము. పూర్వ దంపతులకు లభించినట్టి ఫలితమే యమరాజ్యమున మీ దంపతులకు లభించునుగాక.

 Previous Page Next Page