Read more!
Next Page 
చిన్నమ్మాయ్ చిట్టబ్బాయ్ పేజి 1

                                      చిన్నమ్మాయ్ - చిట్టబ్బాయ్
                                                                                                                 -  మల్లిక్
    ఆదివారం-


    మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలైంది.


    విజయనగర్ కాలనీలో ఆ యింట్లోంచి నల్లని దట్టమైన పొగలు వచ్చి ఆ ప్రదేశం అంతా వ్యాపించాయ్.

    వెనువెంటనే "కెవు... కెవ్వు..." మంటూ ఆ యింట్లోంచి కేకలు వినవచ్చాయ్.

    అక్కడ అగ్నిప్రమాదం ఏమీ జరగడం లేదు. ఆ కేకలు మంటల్లో చిక్కుకుని ప్రాణభీతితో అరుస్తున్న మనుషులకు సంబంధించిన కేకలు కావు.

    మరి ఏం జరుగుతుందక్కడ?

    చిట్టబ్బాయ్ మొహం వేలాడేస్కుని ఆరిపోయి ఉన్న స్టౌ వంక, దట్టమైన నల్లని పొగలుకక్కుతూ స్టౌ మీద ఉన్న గిన్నెవంకా దీనంగా చూడసాగాడు. అతని స్నేహితుడూ, రూమ్మేటూ అయిన కన్నారావు చిట్టబ్బాయ్ వంక తీక్షణంగా స్టౌ వంక దానిమీద ఉన్న గిన్నెవంక జాలిగా మార్చి మార్చి చూడసాగాడు.

    ప్రేమని ఎక్స్ ప్రెస్ చేసి, అమ్మాయిచేత చెంపదెబ్బ తిన్న అబ్బాయి మొహంలా నల్లగా మాడిపోయి ఉంది స్టౌమీద ఉన్న గిన్నెలోని పప్పు.

    "ప్చ్... పప్పు మాడిపోయింది" నీర్సంగా అన్నాడు చిట్టబ్బాయ్.

    చిట్టబ్బాయ్ మాటలు విన్న కన్నారావుకి చచ్చేంత కోపం వచ్చింది.

    "పప్పు మాడిపోయింది... అది కనిపిస్తూనే ఉంది... కానీ ఎలా మాడిపోయింది?" విసుగ్గా అరిచాడు కన్నారావు.

    చిట్టబ్బాయ్ కన్నారావు వంక ఆశ్చర్యంగా చూశాడు.

    "ఎలా మాడిపోవడం ఏంటి?.... స్టౌ మీద ఎక్కువసేపు ఉంది... అందుకే మాడిపోయింది" చెప్పాడు ఆ మాత్రం తెలీదా అన్నట్టు చూస్తూ.

    "నేను అడుగుతుంది అదికాదు... స్టౌ ఎదురుగుండా నువ్వు ఉన్నావ్ కదా... మాడిపోతుంటే ఏం చేస్తున్నావ్ అని?"


    చిట్టబ్బాయ్ సిగ్గుపడ్డాడు.

    "ఎదురుగానే ఉన్నాననుకో..." నసిగాడు, ముసిముసిగా నవ్వుతూ.

    కన్నారావు నెత్తి కొట్టుకున్నాడు.

    "నువ్వు ఊహల్లో విహరించడం కాదుగానీ ఒకరోజు పప్పుమాడ్చి ఒకరోజు కూరమాడ్చి, ఒకరోజు అన్నం మాడ్చి, నా డొక్క మాడుస్తున్నావ్..."

    "నీ ఒక్కడిదేనా ఏంటి నా డొక్క కూడా మాడ్తుందిగా?" చికాకుపడ్తూ అన్నాడు చిట్టబ్బాయ్.

    "నువ్వు చేసే పొరబాట్లకి నా డొక్కెందుకు మాడ్చుకోవాలీ?"

    "అలాగయితే నువ్వే కమ్మకమ్మగా వండుకు తినరాదూ?" అన్నాడు చిట్టబ్బాయ్.

    "ఇది మరీ బాగుంది... ఈ వేళ వంట డ్యూటీ నీదైతే నేనెందుకు చేస్తానూ?.... నువ్వే వండిపెట్టు లేదా హోటల్ కైనా తీస్కెళ్ళు...."

    చిట్టబ్బాయ్ ఏదో అనబోయాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది.

    "ఎవరో చూడు" అన్నాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు వెళ్ళి తలుపు తెరిచాడు.

    ఎదురుగా ఓ ముష్టివాడు నిల్చుని ఉన్నాడు. కన్నారావుని చూడగానే చెవులదాకా నవ్వాడు.

    "దొరలెక్కున్నావ్... బాంచన్ నీ కాల్మొక్త" అన్నాడు.

    "ఏంటిది కాలింగ్ బెల్ నొక్కి మరీ పిలుస్తున్నావ్... వెళ్ళు వెళ్ళు" విసుక్కుంటూ అన్నాడు కన్నారావు.

    "బెల్లు నొక్కనీకే కద దొరా ఉన్నది?... బాంచన్... నీకాల్మొక్త... ఓ ముద్దెయ్యి దొరా..." 

    "వెళ్ళమంటుంటే నీక్కాదూ?... ఇది బ్రహ్మచారుల కొంప.. ఇక్కడ నీకేమీ దొరకదు..."

    "బెమ్మచార్లయితే ఏం తిన్రా... ఏదో ఒకటి తిననీకి ఎయ్యిండి దొరా... నీ కాల్మొక్త... బాంచెన్" అన్నాడు బొచ్చెని కన్నారావు మొహం చుట్టూ తిప్పుతూ.

    "ఏంటి నీ ముష్టి చిప్పతో నాకు దిష్టి తీస్తున్నావా? వెళ్ళవయ్యా..." అంటూ తలుపు ముయ్యబోయాడు కన్నారావు.

    కానీ ముష్టివాడు చటుక్కున రెండు తలుపుల మధ్యా తలుపులు వెయ్యనియ్యకుండా కాలు అడ్డుపెట్టాడు.

    "అట్లెట్ట లేదంటర్?... ఏమన్నా వెయ్యాల్సిందే!!... నీకాల్మొక్త" అన్నాడు ముష్టిగాడు మొండిగా.

    ఈ సంభాషణంతా లోపల్నుండి వింటున్న చిట్టబ్బాయ్ పప్పుగిన్నెతో బయటికి వచ్చాడు.

    "నువ్వుండరా కన్నా.... పాపం వాడికి ఈ పప్పు వేద్దాం" అన్నాడు చిట్టబ్బాయ్.

    కన్నారావు పక్కకి తప్పుకుని చిట్టబ్బాయ్ కి దారిచ్చాడు.

    బిచ్చగాడు సంబరపడిపోతూ బొచ్చెని ముందుకు చాపాడు. చిట్టబ్బాయ్ గిన్నెలోని పప్పుని బొచ్చెలోకి వేశాడు.

    బొచ్చెలోకి తొంగి చూసిన బిచ్చగాడి మొహంలో రంగులు మారాయ్.

    ఒక్కసారిగా వాడు కోపంగా తలెత్తి చూసి "ఏందిసాబ్ ఇది... పప్పిట్ల నల్లగా ఎందుకుంటది?...." అన్నాడు.


    "అది పప్పేనోయ్... నిజం..." అన్నాడు చిట్టబ్బాయ్.

    బిచ్చగాడు బొచ్చెమీద మొహం పెట్టి వాసన చూసి మొహం చిట్లించాడు.

    "ధూ... ఇస్కీ... మీర్రోజూ ఇస్మంటి తిండి తింటార్ దొరా?" ఇస్మంటివి తిని ఇంకా బత్కున్నార్?"

    "హర్రే!... నా బువ్వమీద నీ దయిద్రం నల్లపప్పు పోసి దాన్ని కూడా ఖరాబ్ చేసినవ్ కదదొరా.... నేను నాలుగిల్లలో అడుక్కున్నది మొత్తం  పెంటకుప్ప పొయ్యాల!... గిప్పుడు నేనేం తినాల దొరా!" కోపంగా అడిగాడు బిచ్చగాడు చిట్టబ్బాయ్ ని కొరకొరా చూస్తూ.

    వాడి మాటలు వింటే చిట్టబ్బాయ్ కి తిక్క రేగింది.

    "ఏదో కాస్త మాడినంత మాత్రాన ఆ పప్పు పనికిరానిదైనట్టు మాట్లాడ్తా వేం?... అడుక్కునేవాడివి నీకింత టెక్కు పనికిరాదోయ్" అన్నాడు కోపంగా.


    ఆ మాటలు వింటూనే ముష్టివాడు రోషంతో ముక్కు పొంగించాడు.

    "ఏంది దొరోయ్ అడుక్కునేవాడంటూ ఏక్వతక్వ మాట్లాడ్తున్నావ్!.... మీరు  రోజుకి ఒక్క కూర తింటే మేం నాల్గు కూరల్ తింటాం. ఛల్ పైసల్ తియ్..." అన్నాడు జబర్దస్తీగా.

    పైసలా?.... ఎందుకూ?...." ఆశ్చర్యంగా అడిగాడు కన్నారావు.

    "ఎందుకేంది?... నీ మాయదారి పప్పువల్ల నా బువ్వంత ఖరాబైంది.... దీన్నిప్పుడు ఎవ్వడ్ తింటాడ్... దీన్నంతా పెంటకుప్ప మీద పారెయ్యాల... నేనింక హోటల్లోనే తినాల!!...."

    "అదేంటోయ్.... నువ్వేగా ఏదో ఒకటి వెయ్యమన్నావ్?" చిట్టబ్బాయ్ కాస్త విసుక్కుంటూ అడిగాడు.


    "ఏదో ఒక్కటంటే తినేదాన్కి అడ్గినగానీ ఇస్మంటి నల్ల పప్పేస్తార్ దొర?... గిప్పుడు నాకు బువ్వెవలు పెడ్తార్?.... పైసలియ్యిదొరా నేను హోటల్ల తింటా..."

    చిట్టబ్బాయ్, కన్నారావు ఏదో చెప్పబోయారుగానీ ముష్టివాడు వాళ్ళ మాటలు విన్లేదు. వాళ్ళ ఎదురుగానే రోడ్డవతల ఉన్న చెత్త కుండీలో బొచ్చెలోదంతా దిమ్మరించి వెనక్కి వచ్చి డబ్బులిమ్మని కూర్చున్నాడు. వాడికి ఒక అయిదురూపాయలిచ్చి వదుల్చుకున్నారు వాళ్ళు.

    గదిలోకి వెళ్ళి దీర్ఘంగా నిట్టూర్చాడు చిట్టబ్బాయ్.

    "నువ్వేపని చేసినా ఇలానే ఉంటుంది. వాడికి పావలానో ఎంతో పడేస్తే వెళ్ళిపోయి ఉండేవాడుగా... భయంకరమైన పప్పు తీస్కొచ్చి వాడి బొచ్చెలో వేశావ్.... వాడు భయంకరమైన గోలచేసి వెళ్ళాడు..." అన్నాడు కన్నారావు సీరియస్ గా.


    చిట్టబ్బాయ్ ఏదో ఆలోచిస్తున్నట్టు అన్నాడు.

Next Page