శీలపరీక్ష
                                                                   వసుంధర

                                  

    "ఇది హత్య " అన్నాడు శివయ్య.
    "కాదు ఆత్మహత్య" అన్నాడు కేశవులు.
    అది హత్యయినా, ఆత్మహత్య అయినా ఆ శవం వారిద్దరికీ ఏ మాత్రం సంబంధం లేదు. అందుకే వారిద్దరూ అంత తాపీగా ఆ విషయమై చర్చించసాగారు.
    ఆ వీధిలో వీర వెంకయ్య గారి మూడో అమ్మాయి అమ్మాజీ. అమ్మాజీ వయసు ఇరవై ఒకటి. కానీ అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయి. ఇంట్లో దూలానికి చీర - చీరకు ఉరి.
    పోలీసులు వచ్చారు. హత్యో, ఆత్మహత్యో తేల్చలేక పోయారు. ఇంట్లో ఎలాంటి చీటీ పెట్టలేదు అమ్మాజీ. అంతా వెతకగా ఓ రెండు బెదిరింపు ఉత్తరాలు కనపించాయి. ఒక అజ్ఞాత వ్యక్తీ ఆమెను ఉరి తీసి చంపుతానని బెదిరించాడు. అమ్మాకీ డైరీ దొరికింది. అందుకు ఎక్కువ విశేషాలు లేవు. ఏదో ఓ పేజీలో మాత్రం ఉరేసుకుని చావాలని తనకున్నట్లు రాసుకున్నదామే. అంతకు మించి మరే వివరాలు దొరకలెదామే గురించి.
    వీర వెంకయ్య ఇద్దరు కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేశాడు. ఓ కొడుకు పొరుగు దేశంలో చదువుకుంటున్నాడు. ఇంట్లో ఉంటున్నది అయన, భార్య -- అమ్మాజీ మాత్రామే!
    ఆ రాత్రి వీర వెంకయ్య , భార్య వళ్ళు తెలియకుండా నిద్రపోయారు. అలా నిద్రపోవడం వారికి కొత్త కాదు. ఈ రోజు లేచి చూసేసరికి దూలానికి వ్రేలాడుతూ కూతురు కనబడింది.
    శివయ్య, కేశవులు ఆ వీధిలో పిల్లల తలలు గోరుగుతుండే పనిలేని మంగళ్ళు. వాళ్ళకు అమ్మాజీ అంటే పెద్ద ఆకర్షణ! ఆమెను, ఆమె చేష్టలను వాళ్ళు వెయ్యి కళ్ళతో కనిపెడుతుండే వాళ్ళు. అందుకొక కారణం వుంది.
    అమ్మాజీ ధైర్యం కల మనిషి. ఆమె మగాళ్ళను చూసి బెదరదు. ఆడవాళ్ళతో మాట్లాడినంత ఫ్రీగానూ ఆమె మగవాళ్ళతో మాట్లాడుతుంది. సాధారణంగా చాలామంది ఆడవాళ్ళు అన్నయ్యనో, బాబయ్యనో వరసలు కలుపుతారు. అమ్మాజీ అలా కాదు. అమె మగవాళ్ళను స్నేహితులుగా భావించేది.
    తన అభిప్రాయాన్నామె ఒకసారి శివయ్య కు చెప్పింది. "వయసులో ఉన్న కన్నె పిల్ల వంక సాధారణంగా దొంగ చూపులు చూస్తాడు మగాడు. అలాంటప్పుడు ఆత్మవంచన చేసుకుంటూ అన్నయ్యా, బాబయ్యా అన్న వరసలు కలిపి ఆ వరసల పరువు తీయడ మెందుకు?"
    ఈ మాటలు శివయ్య కు బాగా నచ్చాయి. అతడు కేశవులకు చెప్పాడు. అప్పుడు కేశవులు అమ్మాజీ తనతో ఏమన్నాదో చెప్పాడు -- "స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సృష్టికే అవసరం. అందువల్ల పురుషుడు స్త్రీని కాంక్ష గా చూడడం తప్పు కాదు. చూపులతోనే స్త్రీ పురుషులు విత్రులై పోరు. ఎటొచ్చీ సంఘం ఏర్పరచిన నియమాలు పాటించడం మంచిది."
    "ఈ అమ్మాయి వరుస బాగుంది. ఇలాంటి వాళ్ళ స్నేహం ఎందుకైనా పనికొస్తుంది ...' అన్నాడు శివయ్య ఆశగా.
    "ఆ ఆశతోనే ఈ స్నేహితులిద్దరూ ఆమెను కనిపెడుతుండేవారు. కూర్చుని తినడం తప్ప వేరే పని లేని వీళ్ళు అమ్మాజీ కారణంగా బోలెడు కాలక్షేపమయ్యేది.
    ఇద్దరూ విడివిడిగా ఆమెపై నిఘా వేసి అమ్మాజీ సాయంత్రాలు పార్కుల్లో శృంగార విహారాలు చేస్తున్నదని చెప్పుకున్నారు. అయితే అబ్బాయి పేరు విషయం లో ఇద్దరూ ఏకాభిప్రాయం కుదరలేదు. అబ్బాయి పేరు మాధవరావు అని శివయ్య అంటే ప్రసాదరావు అని కేశవులు అంటాడు. ఆఖరికి ఇద్దరూ కలిసి ఒకరోజున అమ్మాజీని కలుసుకున్నారు.
    "నువ్వూ మాధవరావు అనే అబ్బాయిని పార్కుల్లో కలుసుకుంటున్నావని నేనూ, ప్రసాదరావు అనే అతన్ని కలుసుకుంటున్నావని దేశవులూ వాదించుకుంటున్నాం. మా యిద్దరిలో ఎవరు రైటో చెప్పగలవా?" అన్నాడు శివయ్య.
    "ఇద్దరూ రైటే " అంది అమ్మాజీ.
    అమెకిద్ద్దరు బాయ్ ఫ్రెండ్స్ న్నారని అర్ధం చేసుకునేందుకు ఈ స్నేహితులిద్దరికీ కొంతసేపు పట్టింది.
    'అరె -- ఇద్దరితో తిరుగుతున్నావా -- తప్పుకాదూ?"
    అన్నాడు శివయ్య.
    "ఒకరితో తిరిగితే తప్పు కాదా?" అంది అమ్మాజీ.
    'అదీ తప్పే -- అయితే ఒక్కరితో తిరిగితే ఆ ఒక్కడిని పెళ్ళయినా చేసుకోవచ్చు. ఇద్దరితో తిరిగితే ఇద్దరినేలా పెళ్ళి చెసుకుంటావ్ ?'
    అమ్మాజీ నవ్వేసి -- "అదా మీ సందేహం ? అసలు నేనా యిద్దర్నీ పెళ్ళి చేసుకోవడం లేదు , తెలుసా ?" అంది.
    "పెళ్ళి చేసుకోనప్పుడు తిరగడం -- ఇంకా తప్పు " అన్నాడు కేశవులు.
    అమ్మాజీ అదోలా చూస్తూ "మీరు తప్పులన్నవన్నీ తప్పు లై పోవు. ఆ సంగతి మీకీ రోజు కాకపోయినా ఏదో ఒకరోజున తెలుస్తుంది " అంది.
    'సరిగ్గా చెప్పకూడదూ ?" అన్నాడు శివయ్య.
    "నేను ప్రసాదరావుతో గాని, మాధవరావు తో గానీ ఇంత వరకూ ఒక్కసారి కూడా ప్రేమ గురించి మాట్లాడలేదు. ఆ విషయం తెలుసా మీకు?"
    "తెలియదు ..."
    "వాళ్ళు నాకు స్నేహితులు. మీకు లాగే ఎటొచ్చీ మీవల్ల నాకు ప్రయోజనం లేదు. వాళ్ళ వల్ల నాకు ప్రయోజన ముంది " అంది అమ్మాజీ.
    "ఏమిటా ప్రయోజనం " అన్నాడు శివయ్య.
    "అది చెప్పకూడని దేవరహస్యం " అంది అమ్మాజీ.
    ఎంతడిగినా అమ్మాజీ వాళ్ళకా రహస్యం చెప్పలేదు.
    ఆ తర్వాత శివయ్య, కేశవులు ఆమె పై నిఘా పెంచారు. ఫలితంగా వాళ్ళకు తెలిసినదేమిటంటే ఆమె చాలామంది మగపిల్లల్ని పార్కుల్లో కలుసుకుంటూన్నదని . చూస్తూ ఊరుకోలేక పోయారు వాళ్ళు.
    ఒకరోజున ఆమెను మళ్ళీ నిలదీశారు.
    "నాకు ముప్పై వేల రూపాయలు కావాలి. ఇస్తారా?" అంది అమ్మాజీ.
    కేశవులు ఆశ్చర్యంగా --"ఎందుకు?" అన్నాడు.
    "అబ్బాయిలతో మాట్లాడడం మానేయడానికి --" అందామె.
    "నువ్వు మాట్లాడితే మాకేం - మాట్లాడక పొతే మాకేం?" అన్నాడు శివయ్య తీవ్రంగా.
    "అలాంటప్పుడు నా గురించి పట్టించుకోకండి " అంది అమ్మాజీ.
    'అసలు నీకు డబ్బెందుకు ?" అన్నాడు కేశవులు.
    'అది దేవ రహస్యం ' అంది అమ్మాజీ.
    "ఏమిటా దేవరహాస్యం " అన్నాడు శివయ్య చిరాగ్గా.
    అమ్మాజీ నవ్వేసి వెళ్ళిపోయింది.
    శివయ్య, కేశవులు వీరవెంకయ్య ను కలుసుకున్నారు. అమ్మాజీ పరిస్థితి చెప్పారు.
    'అది నిప్పులాంటి పిల్ల. దాన్ని అనుమానించడం మహా పాపం" అన్నాడాయన నమ్మకంగా.
    "మీ అమ్మాయికి ముప్పై వేలేందుకు ?" అన్నాడు శివయ్య.
    "ఆ డబ్బు తన కోసం కాదు. నాకోసం ...." అన్నాడు వీరవెంకయ్య.
    వీరవెంకయ్య కు పేరు తెలియని ప్రమాదకరమైన జబ్బు వచ్చింది. అందుకు మేజర్ ఆపరేషన్ అవసరం. మద్రాసుకు చెందిన గుహనాధన్ అనే ప్రముఖ వైద్యుడు ఆ ఆపరేషన్ చేస్తానన్నాడు. ఏడాది లోగా ఆపరేషన్ జరగాలి. రెండు నెలలు మద్రాసులో ఉండాలి. అంతా కలిపి ఖర్చు పాతికవేలు దాటుతుందని అంచనా.
    ఈ విషయం తన అక్కలకు గానీ, తమ్ముడికి గానీ తెలియనివ్వ వద్దంది అమ్మాజీ. అంత డబ్బు ఒక్కసారి తెచ్చి ఇచ్చే శక్తి వాళ్ళలో ఎవరికీ లేదు. వాళ్ళకు ఈ విషయం తెలియబర్చడం వల్ల మనసులు పాడవడం తప్ప ప్రయోజనం లేదు. కావలసిన డబ్బు సంపాదించే ఉపాయం అమ్మాజీకి తెలుసు....
    "వయసొచ్చిన ఆడపిల్లని అర్జంటుగా ముప్పై వేలు సంపాదించమని ఊళ్ళో కి వదిలితే నలుగురూ ఏమనుకుంటారనైనా మీరాలోచించలేదా?" అన్నాడు శివయ్య కాస్త తీవ్రంగానే.
    వీరవెంకయ్య తాపీగా "నిప్పును ఎవరైనా ముట్టుకుంటే ముట్టుకున్న వాళ్ళే దెబ్బ తింటారు. నిప్పు మీద నీళ్ళు పోస్తే దానికి ఉనికి లేకుండా పోతుంది. నా కూతురు తప్పు చెయ్యదు. తప్పు చేసి బ్రతకదు" అన్నాడు.
    "మీ అమ్మాయి డబ్బెలా సంపాదిస్తుంది?" అన్నాడు కేశవులు.
    "వళ్ళమ్ముకుని మాత్రం కాదు." అన్నాడు వీర వెంకయ్య.    
    శివయ్య కూ, కేశవులుకూ అంతకంటే ఎక్కువ సమాచారం లభించలేదు. అయితే వారికి అమ్మాజీ పట్ల కుతూహలం పెరిగింది.
    ఇలా కొన్ని రోజులు గడిచాక అమ్మాజీ ఒకరోజు హడావుడిగా శివయ్య ఇంటికి వచ్చింది. ఆమె వద్ద చిన్న చేతిసంచీ ఉన్నది.
    "శివయ్య గారూ మీరు నాకో చిన్న సాయం చేయాలి !" అందామె కంగారుగా.
    "ఏమిటో చెప్పు !"    
    "ఈ సంచీ మీ యింట్లో రెండు రోజులు దాచాలి!"
    "ఎందుకు ?"
    'అది మీరడక్కూడదు. దేవరహస్యం!"
    "నాకే ప్రయోజనమూ లేనప్పుడు నేను నీకెందుకు సాయపడాలి ?" అన్నాడు శివయ్య.
    "మీరు నా నుంచి ఎలాంటి ప్రయోజనం ఆశిస్తున్నారో చెప్పండి. కలగజేస్తాను " అంది అమ్మాజీ.
    శివయ్య తటపటాయించ కుండా "నేను పురుషుడు నువ్వు స్త్రీ. నేనెలాంటి ప్రయోజనం ఆశిస్తానో నువ్వే ఊహించగలవు" అన్నాడు.
    అమ్మాజీ చలించలేదు. "మీరు శీలాన్ని నమ్ముతారా?'
    "నీ సంగతి చెప్పు !"
    "నేను శీలాన్ని నమ్మను" అంది అమ్మాజీ.
    శివయ్య కళ్ళు మెరిశాయి. "అయితే ఒప్పుకున్నట్లేనా ?"
    "మీరు శీలాన్ని నమ్మని పక్షంలో ఒప్పుకున్నట్లే !" అందమే.
    "నేనూ నమ్మను" అన్నాడు శివయ్య ఆశగా.