Read more!
Next Page 
8 డౌన్ పేజి 1

                                 


                                                 8 డౌన్

                                                                              ----యర్రంశెట్టిశాయి

                                         
  

    క్లోజ్డ్ సర్కూట్ టీవిలో మామూలుగానే ఎనౌన్సర్ అతిభయంకరమైన తెలుగులో గోదావరి ఎక్స్ ప్రెస్ కొద్ది నిమిషాల్లో ఒకటో నెంబరు ఫ్లాట్ ఫారం మీద కొస్తోందని ఎనౌన్స్ చేసింది.
    ఆ ఎనౌన్సర్ ఏమిటంటోంది ఓ రాష్ట్ర ప్రభుత్వ తెలుసు భాషాధికారి తన పి.ఎ. నడిగాడు.
    ఇప్పుడే ఎంక్వయిరీలో కనుక్కుంటాన్సార్ అంటూ ఎంక్వయిరీ వేపు పరుగెత్తాడతను.
    "ఎందుకనో మన రాజధానిలో అన్ని రైల్వేస్టేషన్ లలోనూ ఈ క్లోజ్డ్ సర్క్యూట్ తెలుగువాడుతుంటారు అదెవరు కనిపెట్టారు". వైజాగ్ షిప్ యార్డ్ లో ఇంటర్వ్యూ కెళ్తోన్న యువకుడు అదే పనిమీద వెళ్తోన్న మరో యువకుడి నడిగాడు.
    అతను అయిదు నిమిషాలు ఆలోచించి "పేరు తెలీదుగాని టి.వి.లో తెలుగు ప్రచార ఫిలిమ్స్ వేస్తూంటారు చూడండి. డ్రగ్స్ తీసుకుంటే మీ పిల్లలు చెడిపోతారు. ఇంకా బాగుపడలేరు- అలాంటివి బహుశా ఆ ఫిలిమ్స్ తయారు చేయించినవారే కనిపెట్టి వుంటారు. అవి టి.వి.లో తప్పితే ఇంకెక్కడా జనం చూడరని" అన్నాడా యువకుడు.
    "ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాతృభాష అని టూరిస్ట్ గైడ్ చెప్పాడు, మరి మనం వింటున్నది తెలుగులాగా లేదేమిటి" ఓ కన్నడ పెద్దమనిషి భార్య నడిగాడు.
    "ఈ మధ్య ఇదేదో కొత్త భాష కనిపెట్టినట్లున్నారు" అందామె సిన్సియర్ గా.
    ఇలా ఇంతమంది ఆ భాష గురించి గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా ఎనౌన్సర్ మొఖం మళ్లీ తెరమీద కనిపించింది.    
    ఈసారి మరింత భయంకరమయిన తెలుగుని బోఫర్స్ గన్స్ లా ప్రయోగించి మాయమయిపోయింది.   
    దాని వెనుకే తెలుగు సినిమా పాట - హీరో హీరోయిన్ దూదేకుల వాళ్ళలాగా ఒకరినొకరు ఏకేయడానికి ప్రయత్నిస్తున్నట్లు బ్రేక్ డాన్స్ చేస్తూ జానపద గీతం లాంటిది పాడుతున్నారు.
    ఓలమ్మి కైపు ఎక్కిందా....
    ఓరయ్యో ముల్లుదిగిందా....  
    ప్రయాణీకులంతా తమ అభిమానచిత్రంలోని ఆ పాటను చూస్తూ మైమరచిపోయి ఆనందిస్తూండగా గోదావరి ఎక్స్ ప్రెస్ కొన ఊపిరితో ఉన్నట్లు నెమ్మదిగా ఫ్లాట్ ఫారం మీద కొచ్చింది.
    అంతవరకూ రైల్వే తెలుగుని వింటున్న కోమాలాంటి దశలో కెళ్ళిన ప్రయాణీకులందరిలోనూ ఒక్కసారిగా చలనం వచ్చింది. దాంతో ఎవరికి వారు పూనకం వచ్చినట్లు సామాన్లతో ఎగురుతూ దారికడ్డంగా వున్న సిగరెట్ బళ్ళను, పుస్తకాల బళ్ళను, బిస్కెట్ల బళ్ళనూ హార్డిల్స్ గా రేసింగ్ చేసి దూకుతూ పరుగెత్తసాగారు.   
    ఓ లావుపాటి నార్త్ ఇండియన్ తనకంటే మూడు రెట్లు లావుగా ఉన్న బెడ్డింగ్ ని స్లీపర్ కోచ్ డోర్ లోకి సగంతోసి ఆ తరువాత ముందుకి తోయలేక, వెనుకకులాగలేక చెమటలు కక్కుతుంటే మిగతా పాసింజెర్లు జుట్టు పీక్కుంటున్నారు.    
    రైల్వే కాటరింగ్ డిపార్టుమెంటుకి చెందిన బేరర్ ఒకడు ప్రయాణీకులందరికీ కాఫీ ఇస్తానని బెదిరిస్తున్నాడు.
    మరో బేరర్ అక్కడికక్కడే ఆమ్లెట్స్ వేస్తూ చుట్టుప్రక్కలున్న వారందరికీ ఆ వాసనకు వాంతులయ్యేందుకు సహాయం చేస్తున్నాడు.
    ఆఖరి కోచ్ లో ఓ కిటికీ బయట నిలబడి లోపల కూర్చున్న నూతన వధువును ఓ వరుడు సీరియస్ గా బ్రతిమాలుతున్నాడు.  
    "డోలప్స్ ఐస్ క్రీం తింటావా శిరీషా" ఆరాధనతో అడిగాడతను.
    "ఇప్పుడు తిందేగా" ప్రేమగా అందా యువతి.
    "అయితే ఈసారి డోలప్స్ తీసుకో, అయ్ మీన్ ఈసారి చాక్ లెట్...." మరింత ఆరాధన.
    "వద్దండి" అభిమానం.
    "పోనీ డోలప్స్ అయిస్ క్రీం తింటావా" దీనత్వం,ఆరాధన.
    "వద్దండీ" ప్రేమ, అభిమానం. కళ్ళల్లో ప్రేమకు చలించిన నీరు.
    "అయితే డోలప్స్ అయిస్ క్రీమ్ తీసుకో" యింకా బోలెడు ఆరాధన.
    "అయ్యో ఇప్పుడే కదా తిన్నాను."
    "అలాగా, అయితే ఓ పనిచేయ్. ఈసారి డోలప్స్ అయిస్ క్రీమ్ తీసుకో"
    "అబ్బా, వద్దండీ"
    "పోనీ, డోలప్స్ అయిస్ క్రీమ్ తెచ్చివ్వనా" ఆరాధన మితి మించి కన్నీటి చుక్కలవుతున్నాయ్.
    "అయ్యో."
    "ఓ.కే - ఓ.కే- బలవంతం చేయన్లే. డోలప్స్ అయిస్ క్రీమ్ తీసుకో ప్లీజ్" ఆరాధన శృతి మించింది. ఆమె అతనివేపు ఆరాధనాపూర్వకంగా చూసింది కరిగిపోతూ.
    "సరే."
    అతని గుండె వెలిగిపోయింది.
    "హమ్మయ్య" తనక్కావలసిన ఆరాధన దొరికింది. అమితానందంతో అతను బులెట్ లా జనంలో నుంచి డోలప్స్ అయిస్ క్రీమ్ కోసం పరుగెత్తాడు.   
    అదే కోచ్ లో బెర్తు నెంబరు థర్టీ సిక్స్ పిల్లాడిని నిద్ర పుచ్చుతూ ఎదురుగ్గా బుద్ధిమంతుడిలా కూర్చున్న కళ్ళజోడు భర్తతో దిగులుగా, జాలిగా, ప్రేమగా మాట్లాడుతోంది.
    "రోజూ ఆఫీసవగానే ఇంటికొచ్చేస్తారు కదూ"
    "వచ్చేస్తానే"
    "ఒట్టు"
    "వామనరావు వాళ్ళ గ్రూప్ తో పేకాడరు కదూ"
    "ఛ ఆడను"
    "నా తోడు"
    "నీ తోడు"
    "మీ ఆఫీస్ లో పనిచేసే ఆ అమ్మాయితో పెన్నులు మార్చుకోరు కదూ"
    "ఛ. ఎప్పుడూ ఎందుకు మార్చుకొంటాం. ఆ రోజు ఏదో అలా...."
    "చేతిలో చెయ్యేయండి"
    ఆమె చేతిలో చేయి వేశాడతను.
    అదే కోచ్ లోని పక్క కంపార్టుమెంటులో....
    బెర్తు నెంబరు ఫార్టీ సిక్స్ కిటికీ బయట నిలబడ్డ భర్తవేపు ఆరాధనగా చూస్తోంది.
    "ఇదిగో సావిత్రీ, రోజూ ఉదయం ఆ పచ్చరంగు టానిక్ తాగటం మర్చిపోకు"
    "అలాగేనండీ"
    "మధ్యాహ్నం భోజనం తర్వాత అయిరన్ కాప్యూల్స్ వేసుకోవాలి. తెలుసు కదా"
    "తెలుసండీ"
    "ఆ తర్వాత కాసేపాగి బి కాంప్లెక్స్ వేసుకో"
    "అలాగే"
    "మధ్యాహ్నం నాలుగింటికి సిరప్ మర్చిపోవు కదా"
    "మర్చిపోనండి"
    "సాయంత్రం ఆరింటికి మళ్ళీ ఎర్రరంగు టానిక్ తాగాలి గుర్తుందా"
    "ఉందండీ"
    "రాత్రి తొమ్మిదింటికి బలానికి పచ్చరంగుల కాప్సూల్స్ గుర్తున్నాయా"
    "ఉన్నాయండీ"
    "పచ్చరంగు టానిక్ అయిపోతే ఇంకో బాటిల్ కొనుక్కో"
    "సరే"
    "ఎర్రరంగు టానిక్ అయిపోయినా ఇంకోటి కొనుక్కో"
    "అలాగే"
    "ఒకవేళ రెండు టానిక్కులూ అయిపోతే మళ్ళీ రెండు టానిక్కులు కొనుక్కో."
    "అలాగేనండి"
    "ఒకవేళ మళ్ళీ ఆ రెండూ కూడా అయిపోతే ఇంకో రెండు బాటిల్స్...."
    ఆమె ఇంక జవాబివ్వలేక నీరసంగా కళ్ళు మూసుకుంది.
    ఆ పక్క కంపార్టుమెంటులోనే అప్పుడే మరో సన్నివేశం పతాకస్థాయిని చేరుకుంటోంది.
    బెర్తు నెంబరు ఫిఫ్టీన్ తన పక్కనే కూర్చున్న బెర్తు నెంబరు సిక్స్ టీన్ తో మండిపడుతూ మాట్లాడుతున్నాడు.  
    "ఇదిగో, ముందే చెప్తున్నా. వళ్ళు దగ్గరుంచుకుని విను. నేను మీ ఇంటిదగ్గర మీ అమ్మనుగానీ, నాన్ననుగానీ, బిచ్చగాడిలా అడుక్కోను తెల్సిందా."   
    "తెల్సిందండీ"
    "అంతా నువ్వే మీ వాళ్ళకు చెప్పాలి. నేను ఒక్క ముక్క కూడా మాట్లాడను అర్థమయిందా"
    "అయిందండీ"
    "ఏమని చెప్తావ్ మీ నాన్నతో...."
    "ఆయనకు బస్ లో వెళ్ళటం వల్ల ఆఫీస్ కి లేటవుతోంది. అందుకని స్కూటర్ కానివ్వండి అని చెప్తా."
    "చెప్పకపోతే తాటవలుస్తా తెల్సిందా"
    "తెలిసింది"
    "ఒకవేళ మీ నాన్న స్కూటర్ కొనివ్వకపోయాడో నువ్వు శాశ్వతంగా పుట్టింట్లోనే వుండిపోతావ్, అర్థమయిందా"    
    "అయిందండీ"
    "ఒకవేళ ఆ తరువాతెప్పుడయినా మళ్ళీ నా యింటికొచ్చావో రోడ్డు మీదే చెప్పు తీసుక్కొట్టి వెనక్కు పంపిస్తాను.

Next Page