Read more!
Next Page 
ఈనాటి శకుంతల పేజి 1

                                 

                            ఈనాటి శకుంతల   
                                                    --సి. ఆనందారామం

                            

 
    
    కోర్టు హాలు జనంతో కిటకిటలాడిపోతోంది. అందరికళ్ళూబోనులో నిలబడ్డ శకుంతలమీదే ఉన్నాయి.    
    శకుంతలకు మాత్రం ఇన్ని వేల కళ్ళు అలా తనను పరీక్షగా చూస్తున్నాయని తెలీదు. ఆ అమ్మాయి ఇండియా చూడటానికి వచ్చిన యూరిపియన్ లా ఉంది,    
    పధ్నాలుగేళ్ళ పసిముఖం. పచ్చని ఛాయలో కాంతితో కళకళలాడుతోంది. కళ్ళు అమాయకంగా స్వచ్చంగా వున్నాయి. గౌను తొడుక్కుంది. సన్నని నడుముకు ఎంబ్రాయిడరీ చేసిన బెల్టు బిగించిఉంది. బాల్డ్ హెయిర్ అల్లరిగా గాలిలో ఎగురుతోంది.    
    లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించబోతూ భగవద్గీత చేతికిచ్చి. "ఇది పట్టుకుని ప్రమాణం చెయ్యి" అన్నాడు.    
    "ఇదేం పుస్తకం?"    
    "భగవద్గీత?"    
    "ఇదేమిటో నాకు తెలీదు. దీనిని పట్టుకుని ఎందుకు ప్రమాణం చెయ్యాలి?"    
    హాలులో నవ్వులు. భగవద్గీత ఏనాడైనా తెరిహ్సినా తెరవకపోయినా హాలులో అలా చెప్పేవాళ్ళు మాత్రం ఉండరు.    
    "ఇది హిందువులకు పరమపవిత్రమైన గ్రంధం. ఇది పట్టుకుని ప్రమాణం చేసి అబద్దం ఆడితే పాపం వస్తుంది."    
    "పాపం అంటే"    
    హాలులో నవ్వులు.    
    "అదిసరే! నన్నేమో ప్రమాణం చెయ్యమంటున్నారు. మీరు మాత్రం ప్రమాణం చెయ్యకుండానే మాట్లాడుతున్నారు. అంటే, మీరు మాత్రం అబద్దాలాడొచ్చా"    
    ఈసారి హాలులో జనంతో పాటు జడ్జి కూడా ముసిముసి గా నవ్వుకున్నాడు. లాయర్ ముఖం ఎర్రబడింది.    
    "నువ్వు ప్రమాణం చెయ్యాలి. అది కోర్టురూలు."    
    "నాకు నమ్మకం లేని ప్రమాణం నేనెందుకు చెయ్యాలి?"    
    జడ్జి కుతూహలంగా చూస్తున్నాడు ఆ వయసులో పిల్ల అలా మాట్లాడటం చాలా ఆశ్చర్యమే! ఎంతటి ఆత్మవిశ్వాసంతో పెరిగిందో తెలుస్తోంది.     
    "ఆల్ రైట్ బేబీ! నీకు దేనిలో నమ్మకం వుంది?"    
    "మా అమ్మలో!"    
    "సరే? అబద్దమాడనని మీ అమ్మగారిమీద ప్రమాణం చెయ్యి." శకుంతల ముఖం కొద్దిగా ముడుచుకుంది. కళ్ళలో కోపం కనిపించింది.    
    "ఏం అడుగుతారో అడగండి! నేను అబద్దమాడను." అంది విసుగ్గా.    
    లాయర్, రమేష్ ని చూపించి, "ఇతడు నీకు తెలుసా?" అన్నాడు.    
    "తెలుసు"    
    "ఎవరూ?"    
    "వట్టి రోగ్!"    
    కోర్టు హాలులో నవ్వులు.    
    "అని నీకెవరు చెప్పారు?"    
    "నేనె తెలుసుకున్నాను?"    
    "ఎలా?"    
    "మా అమ్మ మంచిది కాదన్నాడు. రోగ్ కాకపోతే అలా ఎందుకంటాడు?"    
    ఈసారి జనం నవ్వలేదు. శకుంతలని ఆశ్చర్యంగా జాలిగా చూస్తున్నారు.    
    "ఇతడు మీ డాడీయా?"    
    "వీడు డాడీ కాదు రమేష్ . మా డాడి శ్రీధర్ శర్మ. నేను శకుంతలా శర్మ....."    
    "కాదు మీ డాడీ రమేష్. మీ అమ్మ రమేష్ ని మోసంచేసి శ్రీధర్ శర్మ దగ్గరకు వచ్చింది!"    
    "యూ....." కోపంగా అని అంతలో చేతులు ముఖానికి కప్పుకొని ఏడవసాగింది శకుంతల.    
    శ్రీధరశర్మ తరపున లాయరు లేచి, సాక్షిని అలా ఇబ్బంది పెట్టడానికి తన అబ్జక్షన్ ప్రకటించాడు. జడ్జి ఆ అబ్జక్షన్ సస్టెయిన్ చేశాడు.    
    రమేష్ తరపు లాయర్ ఏదో అపరాధం చేసినవాడిలాగా సిగ్గుపడి "అయామ్ సారీ బేబీ! ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు" అన్నాడు.    
    శకుంతల కళ్ళు తుడుచుకుని రోషంగాచూస్తూ నిలబడింది.    
    "ఇతడు నీకు తెలుసా!" రమేష్ ని చూపిస్తూ అడిగాడు.    
    "తెలుసు?"    
    "ఎలా తెలుసు?"    
    "మా ఇంటికి వచ్చేవాడు"    
    "ఎందుకు?"    
    "అమ్మతో మాట్లాడాలని."    
    "ఏం మాట్లాడేవాడు?"    
    "అదినాకు తెలీదు. ఇతడు రాగానే అమ్మ నన్ను చదువుకోమనో, ఆడుకోమనో పంపించేది."    
    "అప్పుడు శ్రీధరశర్మ అదే మీ డాడీ ఉండేవారా?"    
    "నో! అతడు మధ్యాహ్నమే వచ్చేవాడు. అప్పుడు మా డాడీ ఉండరు."    
    రమేష్ లాయరు జడ్జీవంక తిరిగి "దట్సాల్ యువర్ ఆనర్!" అన్నాడు.    
    శకుంతలబోనులోంచి బయటపడి, "డాడీ" అంటూ తిన్నగా శ్రీధర్ శర్మ దగ్గరికే వచ్చింది. శర్మ ఒక చేత్తో శకుంతలని తనకు దగ్గరాగా అదుముకున్నాడు. బుజ్జగిస్తున్నట్లు అతడిముఖంలో ఆవేదన అణచుకోవటానికి చేస్తున్న ప్రయత్నం కనిపిస్తోంది. కొన్నివేల కళ్ళు తనను ఎలా చూస్తున్నాయో అతడికి బాగా అర్ధమవుతుంది. లజ్జతో అతడి ముఖం కందిపోతుంది. శకుంతల చుట్టూ చేయిచుట్టి బయటకి నడిపించుకుంటూ వచ్చాడు. అక్కడ రమేష్ ఉన్నాడు.

Next Page