"ఆపు తల్లీ, నీ నటన భాష్యాలు. ఈవిడగారు తనో పెద్ద స్టార్ లా ఫోజులు పెడుతూ, మనతో మాట్లాడినా సెట్టుమీదలా యాక్ట్ చేస్తుంది" స్రవంతి నవ్వింది.
"నాచేత చెప్పించారు. మీ అందరి పరిచయం చెప్పనేలేదు" మహిమ కుతూహలంగా అడిగింది.
"నేను పంజాబీ అమ్మాయిని. అక్క, నేను, అన్న ... ముగ్గురం. నాకు ముందు నుంచీ చదువు మీద ఇంటరెస్టు లేదు. చదువు అబ్బలేదు. బొమ్మలు, కార్టూన్లు గీసేదాన్ని. నా ఇంటరెస్ట్ చూసి నాన్నకీ అర్థమై, ఈ లైన్లో ప్రోత్సహించారు. ఆర్నెల్లు క్లాసెస్ అటెండ్ అయి, కార్టూన్లు, పోట్రెయిట్స్, జోక్స్ ... వాటికి సింపుల్ గా తక్కువ గీతలతో ఎక్కువ భావం చూపించే ప్రొఫెషనల్ గా హాబీని మలుచుకున్నాను. ఆర్టిస్టుల కోసం వీళ్ళ ప్రకటన చూసి అప్లయ్ చేశాను. ఉద్యోగం వచ్చింది. ఇంత దూరం పంపడానికి అమ్మ, నాన్న సందేహించినా, హైదరాబాద్ వచ్చి ఆఫీసు, అదీ చూశాక, ఒప్పుకున్నారు. నాకో బాయ్ ఫ్రెండ్. ఏ అపార్థాలు వద్దు. నా కొలీగ్ సూరజ్ ... అతను కూడా పంజాబీ, ఆర్టిస్ట్ అవటంతో, ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పటికి కథ అంతవరకే వచ్చింది" అంది సీమ.
"నా పేరు మంగళ. తమిళ సెక్షన్ లో కాపీరైటర్ ని. మిడిల్ క్లాసు అమ్మాయిని. సేలం నించి వచ్చా. చాలా మామూలు సంసారం. మామూలు కోరికలు నావి. కాస్త నాలుగు రాళ్ళు సంపాదించుకుని, అమ్మా నాన్న చూసిన అబ్బాయిని బుద్ధిగా పెళ్ళి చేసుకుంటాను" అంది మంగళ నవ్వుతూ.
ఆరతి గొంతు సవరించుకుని "యువర్ అటెన్షన్ ప్లీజ్... నాకు ముందు నుంచీ మోడలింగ్, యాక్టింగ్ అంటే ఇష్టం. టీనేజ్ నుంచీ నా ఫ్రెండ్స్ అందరూ 'అందం, మంచి ఫిగరు ఉంది. సినిమా స్టార్ లా ఉన్నావు' అనేవారు. నా బుర్రలో అదే నాటుకుంది. నేను సినీతార అవడం అంత సులువు కాదు గదా ... అందుకే నెమ్మదిగా మోడలింగ్ లో ప్రవేశిస్తే, టీ.వి., సినిమా వాళ్ల దృష్టిలో పడచ్చు అని ఈ ఉద్యోగంలోకి వచ్చాను. చాలామంది మోడలింగ్ నుంచి సినీఫీల్డ్ కి వెళ్లారు. చూస్తుండండి ... ఏదో ఒక రోజు..."
"సరే తల్లీ. చూస్తూనే ఉంటాం రోజూ. ఎన్నిసార్లు చెప్పి ఊరిస్తావు? ఇంకేమైనా ఉంటే చెప్పు ..."
ఆరతి మూతి ముడుచుకుంది.
"మీ అందరికీ కుళ్లు సినీతార అయిపోతానని ..." మూతి సున్నాలా పెట్టి అలిగినట్టు నటించింది. "మాకేం కుళ్లు, మా ఫ్ర్రెండ్ సినీతార అయిందంటే మాకు ఆనందమే. ఎటొచ్చీ ప్రీతిలా..." ఆగిపోయింది సీమ.
"ఏయ్ ఏమిటి నా గురించి మాట్లాడుకుంటున్నారా నేను లేకుండా. బ్యాడ్ మేనర్స్" ప్రీతి వచ్చి జాయిన్ అయింది.
"నీ గురించి మేం మాట్లాడేముంది. నీవే చెప్పు. మహిమ కొత్తగా వచ్చింది. నీ సూక్తులు వినిపించు" అంది స్రవంతి.
"చెప్పేశాగా నిన్ననే. అమ్మాయ్ మొదటిపాఠం ఏంటంటే, మగాణ్ణి నమ్మకు. తారని చేస్తా, అందలం ఎక్కిస్తా లాంటి పొగడ్తలకి పొగడచెట్టు ఎక్కద్దు. అది పెళుసు. కొమ్మ విరిగి కింద పడతావు. మునగ చెట్టెక్కాలన్నా నీవే స్వంతంగా ఎక్కు. సంపాదిస్తుండగా నాలుగు డబ్బులు దాచుకో. ఈ స్టార్ డమ్ అన్నది నిచ్చెన. ఎప్పుడు జారుతుందో తెలియకుండానే కిందపడుతుంది. అర్థం అవుతోందా? ప్రేమలో పడితే, నీ తాహతెరిగి పడు. పెళ్ళయిన ఏ వెధవనీ నమ్మకు. వాడి జాలి, సానుభూతి, లోకం భయం, పిల్లల మీద ప్రేమ... షన్నీ ఇంట్లోనే ఉంచుకుని, సరదాకి, వెరైటీకి వాడుకుంటాడంతే! పెళ్ళి గొప్పతనం అదే. లోకం అంతా పెళ్ళాన్నే సపోర్ట్ చేస్తుంది. వాడు బాగానే ఉంటాడు. చెడేది ఎప్పుడూ కళ్ళు మూసుకుపోయి వారి చేతుల్లో వాలిన రెండో ఆడదే! తెల్సిందా...? ఇవి గీతోపదేశాలు కావు. 'ప్రీతో'పదేశాలు"! నవ్వుతూ జాలిగా, కేర్ ఫ్రీగా అంటూ వెంట తెచ్చుకున్న సీసాలోంచి ఓ పెగ్గు గ్లాసులోకి వంపుకుంది. "ఛీర్స్ గర్ల్స్! మహిమ ... కంపెనీ ఇవ్వకూడదూ నాకు" డ్రింక్ ఆఫర్ చేసింది.
"నో ప్లీజ్! నాకు అలవాటు లేదు" సున్నితంగా అంది మహిమ.
ఎనిమిదన్నర అవుతుండగా రేణు డిన్నర్ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. కబుర్లు కట్టిపెట్టి ఆవురావురుమని అందరూ ప్లేట్ల మీద పడ్డారు.
భోజనం అయ్యాక గుడ్ నైట్ లు చెప్పుకుని ఎవరి గదుల్లోకి వారు వెళ్లారందరూ.
"కాసేపు చదువుకుంటాను. మామూలుగా నువ్వు ఎన్ని గంటలకు పడుకుంటావు?" అడిగింది సీమ.
"సాధారణంగా పది".
"ఓకే, పదికి లైట్స్ ఆఫ్ ... ప్రామిస్" అంది సీమ.
ఫోన్ తీసి తల్లిని పలకరించి విశేషాలన్నీ చెప్పింది మహిమ. ఆవిడ తల్లిగా జాగ్రత్తలు చెప్పింది. ఫోన్ లో మెసేజ్ లు, పోస్ట్ లు చూసుకుని, సగం చదువుతూ పెట్టిన ఇంగ్లీష్ నవల తీసుకుని పక్కమీద వాలింది. మొదటిరోజు సక్సెస్ అనుకుంది.
రెండోరోజు ఆఫీసుకి వెళ్లడంతోనే రొటీనులో పడింది మహిమ. కూర్చున్న అరగంటకి, మీనన్ పిలిస్తే వెళ్లింది. "నీ ఫైనల్ కాప్షన్స్ ని నిన్న బాస్ దగ్గరకి పంపించాను ... నిన్ను ఒకసారి కలవమన్నారు. వెళ్ళి కనిపించిరా ..." మీనన్ కాగితాల మధ్య నుంచి తలెత్తి అన్నాడు.
"ఓకే సర్" అంటూ విశాల్ దగ్గరికి వెళ్ళింది మహిమ.
తలుపు తట్టగానే "ఎస్...కమిన్" అన్నాడు విశాల్. మహిమని చూడగానే అతని కళ్లల్లో మెరుపు మహిమ దృష్టిని దాటిపోలేదు.