ట్రాఫిక్ సిగ్నల్స్ ఎర్ర సిగ్నల్ లో దాటేసరికి ట్రాఫిక్ పోలీస్ కి అనుమానం వచ్చేసింది. ఆ పక్కనే నిలబడ్డ ఇన్ స్పెక్టర్ బుల్లెట్ స్టార్ట్ చేసి వెంటపడ్డాడు.
కొంతదూరం వచ్చాక స్కూటర్ రోడ్డు పక్కన వదిలి సందులోకి పరుగెత్తి అక్కడ ఆపి వున్న ఆటో ఎక్కి తనే డ్రైవ్ చేసుకుంటూ తనింటికి సమీపంగా చేరుకున్నాడు.
ఆటో రోడ్డుమీద ఆపి ఇంటివైపు నడవసాగాడు నెమ్మదిగా.
ఉండుండి వెనక్కు తిరిగి చూస్తున్నాడు. ఎవరయినా వెంటాడుతున్నారేమోనని.
సడెన్ గా అతి సమీపంలో పోలీస్ సైరన్ వినిపించేసరికి అతనికి అర్థమయింది.
తనింటిమీదకే వస్తున్నారు వాళ్ళు.
పరుగుతో ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు.
అతని అసిస్టెంట్ వీర్రాజు తలుపు తెరిచాడు.
లోపలకు దూరి తలుపులు గడవేసేశాడు.
వీర్రాజు ఆశ్చర్యంగా చూశాడు.
"పోలీసులొచ్చారా?" ఆతృతగా అడిగాడు విక్కీ.
"అవును బాస్"
"ఎప్పుడు?"
"ఇంతకుముందే"
"సరే సరే! నువ్వెళ్ళి ఆ కిటికీ దగ్గర నిలబడి చూస్తూండు. వాళ్ళొస్తే నాకు సైగ చెయ్..."
వీర్రాజు వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి రోడ్డువైపు చూడసాగాడు.
విక్కీకి అర్థమయిపోయింది.
తన తండ్రి చెప్పినంతా అయింది.
పోలీసుని నమ్మి మళ్ళీ మోసపోయాడతను.
కానీ వజ్రాలు తను రాంబాబుకి తెలీకుండా కాజేయటం ద్వారా... పోలీసోడికి భలే చక్కని గుణపాఠం కూడా నేర్పాడు.
తనను వజ్రాల చోరీ కేసులో ఎలాగైనా జైలుకి పంపిస్తే_ ఆ తరువాత వజ్రాలు తనే కాజేయవచ్చని ప్లాన్ వేశాడు రాంబాబు.
వీర్రాజు బిగ్గరగా అరిచాడు.
"బాస్! పోలీస్...."
విక్కీకి అర్థమయిపోయింది.
తన దగ్గరున్న వజ్రాలు ఏమయినా సరే పోలీసులకు దక్కడానికి వీల్లేదు. తన కష్టార్జితం అవి. చెమటోడ్చి లాకర్ ఓపెన్ చేసి సంపాదించిన ఆస్తి అది. అల్లాటప్పాగా, అప్పనంగా వచ్చింది కాదు.
బాక్స్ లోని వజ్రాలు తీసి హాల్లోని చేపల ఎక్వేరియంలో పడేశాడు.
నీళ్ళ అడుగున వున్న రంగురంగుల రాళ్ళలో కలిసిపోయినాయ్ వజ్రాలు.
మరుక్షణం పెరట్లో నుంచి లోపలికొచ్చారు పోలీసులు.
విక్కీని చూస్తూనే గన్ గురిపెట్టారు.
"చేతులు పైకెత్తి బయటకు పద" అరచాడొక ఇన్ స్పెక్టర్.
విక్కీ బయటకు నడిచాడు. వీర్రాజు దీనంగా వెనుకే వచ్చాడు_ "దిగులు పడకురా తంబీ! వెంటనే వచ్చేస్తాన్లే..."
వీర్రాజు హ్యాపీగా ఫీలయ్యాడు. బాస్ జైలుకెళ్తే ఆ వజ్రాలు తను కాజేయవచ్చు.
వాడికి తనంటే విపరీతమయిన ప్రేమ, గౌరవం.
పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు విక్కీ.
తనను చిత్రహింసలు చేయనీగాక_ వజ్రాలు ఎక్కడ దాచింది. ఛస్తే నోరు విప్పడు. రెండ్రోజుల తర్వాత వీర్రాజుకి చెప్తాడు. వాడు వాటిని జాగ్రత్తగా దాస్తాడు. తను జైలు నుంచి విడుదల అయ్యేవరకూ.
* * * *
భజన్ రావు కాఫీ ఫలహారం తెచ్చి డైనింగ్ టేబుల్ మీదుంచాడు. బెడ్ రూమ్ దగ్గరకు నడిచి గట్టిగా అరచాడు.
"ఇదిగో_ కాఫీ ఫ్లాస్కులో వుంది. ఫలహారం హాట్ పాక్ లో వుంది. ఇప్పుడొస్తే నే వడ్డిస్తా. మళ్ళీ వంటింట్లో కెళ్ళానంటే మీరు అరచి గీ పెట్టినా రాను. ఆనక మీ యిష్టం."
"వచ్చేస్తున్నాం.... వచ్చేస్తున్నాం..." కంగారుగా అన్నాడు గోపాల్రావు.
సీతకు వళ్ళు మండిపోయింది.
"వాడి బెదిరింపులేమిటో నాకర్థం కావటం లేదు. వాడిని బయటకు గెంటేయాలనుంది నాకు."
"మరి మనకి వంటెవరు చేస్తారు?"
"హోటల్లో తిందాం. వీడికిచ్చే జీతం, వీడికయ్యే ఖర్చూ లెక్కేస్తే మాంచి హోటల్లోనే రెండు పూట్లా భోజనం చేయవచ్చు"
"అదో పెద్ద ప్రాబ్లమ్ అయిపోతుంది సీతా మనకి. ఇరవై నాలుగ్గంటలూ హోటల్ చుట్టూ తిరగడానికే సరిపోతుంది మనకు."
"నన్ను మీరేం గెంటనక్కర్లే_ నేనే మర్యాదస్తుల ఇల్లు చూసుకుంటున్నాలెండి. మీలాంటోళ్ళ దగ్గర పనిచేయటం నాకు హెడేక్ గానే వుంది" బయటనుంచీ అన్నాడు భజన్ రావు.
సీత వాడి చెంప వాయగొడతానికి ఆవేశంగా బయటకు నడిచిందిగానీ గోపాల్రావు పరుగుతో వెళ్ళి ఆమెకు అడ్డుపడ్డాడు.
"సీతా ప్లీజ్! ఫుడ్ కి ప్రాబ్లమ్ అయిపోతుంది."
సీతా శాంతించింది.
ఇద్దరూ ఫలహారం తీసుకుని కాఫీ తాగారు.
"సాయంత్రం ఆఫీస్ నుంచి పెందలాడే వస్తావ్ కదూ?"
"ఓ! అయిదున్నరకల్లా వాల్తాను."
"ఇంకొంచెం ముందుగా రాలేవా? నాలుగ్గంటలకు."
"రావచ్చనుకో. కానీ ఎందుకు?"
ఫోన్ మోగిందప్పుడే.
పరుగుతో వెళ్ళి ఫోన్ అందుకుందామె.
"హలో డాడీ! హౌ ఆర్ యూ?" అంది ఆనందంగా.
"ఫైన్ బేటీ! విష్ యూ ఎ హ్యాపీ అండ్ లవ్లీ బర్త్ డే."
"ఓ! థాంక్యూ డాడీ! మీరూ, మమ్మీ ఎప్పుడొస్తున్నారు డాడీ?"
"ఈవినింగ్ కేక్ తీసుకుని వస్తున్నాం బేటీ! ఈసారి ఎంత కాస్ట్ లీ కేక్ ఆర్డరిస్తున్నామో తెలుసా? టెన్ థౌజండ్ రూపీస్ కేక్."
"మైగాడ్! టెన్ థౌజండ్ రూపీస్ కేక్!"
"ఎస్ బేటీ! మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచావా?"
"ఎక్కువమంది లేరు డాడీ! ఓన్లీ ఫైవ్ ఫామిలీస్."
"వెరీ నైస్! డిన్నర్ ఇంట్లో చేయిస్తున్నావా?"
"నో డాడీ! భజన్ రావుగాడిని నమ్ముకుంటే కొంప కొల్లేరయిపోతుంది. అందుకని ఫైవ్ స్టార్ హోటల్ కి ఆర్డర్ చేస్తున్నాను."
ఫోన్ డిస్కనెక్ట్ చేయగానే ఆదరంగా సీతను దగ్గరకు తీసుకున్నాడు గోపాల్రావ్.
"అయితే నాకు చెప్పకుండానే బర్త్ డే చేసుకుంటున్నావన్న మాట"
"అందుకేగా మిమ్మల్ని సాయంత్రం నాలుగింటికి రమ్మంది"
"ఓ.. అదా సంగతి. ఎనివే... విష్ యూ హ్యాపీ అండ్ రొమాంటిక్ బర్త్ డే సీతా!"
"ష్... అవతల భజన్ రావుగాడు.."
"ఉంటే ఏం లెండి _ వాడో మనిషి కింద లెక్కా ఏమైనానా? ఇంతకూ మధ్యాహ్నానికయినా భోజనం తయారు చేయాలా... ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించుకుంటారా?" అడిగాడు భజన్ రావు.