వాళ్ళిప్పుడు ఒక పనిమీద జరూరుగా వెళ్తున్నారు. వాళ్ళు మొత్తం ఆరుగురు... ఆ ఆరుగుర్ని శాసించిన అధికారి స్టేషన్ లో అసహనంగా తిరుగుతూ మధ్య మధ్యలో ఖాళీగా వున్న లాకప్ కేసి చూస్తున్నాడు.
అతనికి లాకప్ లెప్పుడూ నిండుగా కళకళలాడుతూ వుండాలి. అందుకే బోసిగా వున్న ఆ లాకప్ అతన్ని అసహనానికి గురి చేసింది.
మొత్తానికి ఓ ఇరవై నిమిషాలకి వాళ్ళు ఓ పెంకుటింటి ముందున్నారు.
"అరేయ్... రారా బయటికి..." అతని భాషలో సంస్కారం బొత్తిగా లోపించింది.
కొద్ది క్షణాలు నిశ్శబ్దం....
ఎవరూ బయటకు వస్తున్న అలికిడి లేదు...
"దొంగతనం చేసి దర్జాగా లోపల తొంగున్నావా? రారా బయటికి" మరో కానిస్టేబుల్ తలుపు మీద లాఠీతో కఠోరంగా ఓ దెబ్బ వేసి మరీ అరిచాడు పొగరుగా.
అయినా అలికిడి లేదు.
వారిలో క్రమంగా అసహనం పెరిగిపోసాగింది.
"మేం లోపల కొచ్చామంటే నీకొంప కొల్లేరయి పోతుంది. మర్యాదగా బయటకు రా..." శక్తి కొద్దీ అరిచాడు మరో కానిస్టేబుల్.
ఇక లాభం లేదు. తలుపుల్ని బ్రద్ధలు కొట్టాలనుకునేంతలో మాటలు వినిపించాయి.
"చూపు సరీగ్గా ఆనటం లేదా? అప్పుడే మందగించిందా?"
ఆ ఆరుగురూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశారు.
అక్కడో ఆజానుబాహుడు. వాళ్ళో క్షణం కలవరపడ్డారు.
అర్థం కాక ఆ ఇంటికేసి పరీక్షగా చూశారు. చిన్న తాళం కప్ప ఒకటి వారి మందమతిని ప్రశ్నిస్తూ, వెక్కిరిస్తూ కనిపించింది.
వారికి తల కొట్టేసినట్టయింది.
అది వారి మంద భాగ్యమే అయినా, దాన్ని మరొకరు ఎత్తి చూపడాన్ని సహించలేక పోయారు.
"ఒళ్ళు కొవ్వెక్కిందా?" గుడ్లురుముతూ అన్నాడు ఓ కానిస్టేబుల్.
"మరే...మీరు కాపాడుతున్న శాంతి భద్రతల్ని మెక్కి కొవ్వెక్కిపోయాను..." అతను నిర్లక్ష్యంగా అన్నాడు.
"అరేయ్... సాము... నువ్వనవసరంగా మా జోలికి రాకు"
"పేర్లు మార్చొద్దు. కావాలంటే ఎఫ్.ఐ.ఆర్.లు మార్చుకో. నా పేరు సామంత్. ఒక వ్యక్తికి పేరు పెట్టే హక్కు ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులకే వుంటుంది. పోలీసులుకు కాదు..." సామంత్ కళ్ళు తమాషాగా నవ్వాయి.
వాళ్ళకు గుండెల్లో కొరివి పెట్టినట్లయింది.
ఓ పక్క తాము ఎవరికోసమైతే వచ్చారో వాళ్ళు కనిపించక కంగారెత్తి పోతుంటే... మరోపక్క తమ అజ్ఞానాన్ని ప్రశ్నించే లాజిక్... వాళ్ళకు క్షణకాలం ఏం చేయాలో అర్థం కాలేదు.
"ఎవరికోసం వచ్చారు?" సామంత్ తిరిగి ప్రశ్నించాడు.
రేగుతున్న అసహనాన్ని కప్పి పుచ్చుకుంటూ "మల్లేష్ ఎక్కడ?" ప్రశ్నించారు.
"తెలీదు. ఏం?"
"ఏమో... నీకెందుకు? మాకెందుకు? అయ్యగారు తీసుకురమ్మన్నారు. చిరాగ్గా అన్నాడో కానిస్టేబుల్.
"ఎవరు... ఎవరికి ఎందుక్కావాలో తెలీదు. కాని కావాలి. అసలు పోలీసులు టోపీ లెందుకు పెట్టుకుంటారో తెలుసా?"
వాళ్ళు ఓ క్షణం వాళ్ళ అవసరాన్ని, పనిని మర్చిపోయి "ఎందుకు?" అంటూ ప్రశ్నించారు. తాము టోపీలు పెట్టుకునేందుకు ప్రత్యేకమైన కారణమేమయినా వుందేమోనని.
"పోలీసులకు నుదురుపై నుంచి మెడ వరకు ఏమీ వుండదు. అది ప్రపంచానికి తెలీకుండా వుండడానికి." నవ్వుతూ అన్నాడు సామంత్.
చాచి చెంప మీద కొట్టినట్లయింది వాళ్ళకు.
"పోలీసులతో ఎట్టుకోమాకు. అడ్రస్ కిరికిరైపోద్ది. ఏదో దొంగ కేసుల్ని ఒప్పుకొని నాలుగురోజులు లాకప్ లో, పదిరోజులు జైల్లో గడుపుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావ్. ఇలాగే ఎకసెక్కాలు చేశావంటే ఎప్పుడో ఒకప్పుడు చిక్కకపోవు. అప్పుడు చిట్టా తిరగెయ్యకపోము..." అంటూ అక్కడి నుంచి వేగంగా సాగిపోయారు.
* * * *
సాయంత్రం ఆరున్నర గంటల సమయం.
పుట్ట పగిలి చీమలు బారులుతీరినట్లు జనం.
సామంత్ రోడ్డు వారగా కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు.
అతను అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు.
ఏదో ఓ అవకాశం వస్తే తప్ప ఆరోజు గడవదు.
ఒకవేళ ఏదో విధంగా తనకు గడిచినా ఇంట్లో...? కలవరపాటుకి గురయ్యాడో క్షణం.
అంతలో అదృష్టం హోండా కారు రూపంలో తరుముకు వస్తోంది. కిక్కిరిసిన జనం మధ్య దారి చేసుకుంటూ, వేగంగా దూసుకు వస్తోంది కారు.
సరిగ్గా సామంత్ కూర్చున్న ఇంటి అరుగు మూలమీద కారు టర్న్ తీసుకుంటూ కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది.
కానీ అప్పటికే జరగరానిది జరిగిపోయింది.
ఆ ప్రాంతంలో యధేచ్చగా తిరిగే ఓ మూగజీవం ప్రాణాలు క్షణాల్లో అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
ఆ కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న యువతి భయంతో బిగుసుకుపోయింది.
అప్పటికే జనం కారు వేపుకు దూసుకు రాసాగారు.
పరిస్థితిని క్షణాల్లో అంచనా వేయగలిగాడు.
తప్పు జరిగిపోయింది.
ఫలితం కాళ్ళముందు కనిపిస్తోంది.
ఆ తప్పు చేసిన వ్యక్తి భయంతో బిగుసుకుపోయింది.
తప్పు ఎందుకు చేశావంటూ నిలదీసేందుకు పనికిరాని జనం పరుగెత్తుకు వస్తున్నారు.
చాలు... సరీగ్గా... అలాంటి అవకాశాల కోసమే తను ఎదురు చూస్తుంటాడు.
అది ఆరోజు అంత త్వరగా తన దరి చేరుతుందని ఆశించలేదు. సామంత్ చెంగున అరుగు మీంచి దూకడం, రెండంగల్లో కారుని చేరడం, డోర్ ని తెరవడం, డ్రైవింగ్ సీట్లో వున్న యువతిని అవతలి వేపుకు నెట్టడం... తాను డ్రైవింగ్ సీటుని ఆక్రమించుకోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఇప్పుడెవరు చూసినా ఆ యాక్సిడెంట్ చేసింది సామంతనే భావిస్తారు తప్ప ఆ యువతిని ఏ కోశానా అనుమానించరు.
సరీగ్గా అదే కావాలి సామంత్ కి.
"నీ తప్పు నేనొప్పుకుంటాను. ఎమౌంట్ ఎంత...?" సామంత్ తాపీగా అన్నాడు.
భయంతో బిగుసుకు పోయిన ఆ అమ్మాయికి సామంత్ అన్నదేమిటో ఓ క్షణం అర్ధం కాలేదు.