Previous Page Next Page 
డి.కామేశ్వరి కథలు పేజి 7


    ఇంట్లో ఒక్క సుబ్రహ్మణ్యంగారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కు అయిన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులొచ్చాయో, నాల్గు గోడల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయటివాళ్ళకి తెలియకపోవచ్చుగాని అన్నపూర్ణమ్మగారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయింది. ఇన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా వున్న కొడుకు ఈ ఇంటికింక నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోను మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఆరంభించాడు. మామగారున్నరోజులు మాటన్నా వినపడని కోడలు గొంతు రోజంతా వినిపిస్తూనే వుంది. రోజుకి పదిసార్లు... 'ఛా...ఛా...ఈ కొంప ఈ చాకిరి ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో చుట్టపు చూపుగా నాల్గురోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది. ఇంట్లో వుండి తేరగా తిని పోతున్నామన్నదే కనిపిస్తుంది. 'అందుకే వద్దన్నాను' మనదంటూ వేరే వుంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో' కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానం అయితే నెత్తినెక్కించుకోమనండి అంతేగాని ఈ చాకిరి నావల్ల గాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చిపోతారు. చాకిరికి జీతం బత్తె లేని నౌకరి దాన్ని నేనున్నాగా ఈ కొంపలో దేనికి స్వతంత్రం లేదు. ఇంక ఎన్నాళ్ళు ఈ బతుకు నాకు, నాది అంటూ ఓ కొంప, సంసారం నాకెప్పుడో అంటూ ముందూ ముందూ గొనుగుళ్ళతో ఆరంభించిన ఆ గొంతు ఆరు నెలలు తిరిగేసరికి తగుదునమ్మా అంటూ అన్నింట్లోను వేలు పెట్టకపోతే కృష్ణా, రామా అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు. ఏం ఈ ఇల్లు నాది కాదు, నాకు తెలియదూ ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో, ఎన్నాళ్ళు నాకు కోడంటికం అంటూ మొదలెట్టి - నాకు తెలుసు నాకెవరి సలహాలు అక్కరలేదు వరకు వెళ్ళి అత్తగారు ఏం అడిగినా దులపరించిపారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలక మీద పెట్టి సాధింపులు సరే - ఎదుటపడితే మొహం చిట్లించడం, మూతి విరుపులు లెక్కలేదు, రోజుకి పదిసార్లు చాకిరి చేస్తున్నానో అంటూ గోల... అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు - ముందు నించి ఆవిడ అంత గట్టిగా తెగేసి, ఎదుటపడి ఎవరిని ఏం అనలేని తత్వం - దానికితోడు నలభై ఏళ్ళ భర్త హయాంలో అన్నింటికీ పడివుండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో తనని కాదన్నట్టు వినకుండా వూరుకునేది కొన్నాళ్ళు - మరీ మితిమీరినప్పుడు 'ఏమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం - ఎందుకమ్మా పిల్లిమీద ఎలక మీద పెట్టి అంటావు' అంటూ కోడలిని ఎదురుకునేది.
    'అయ్యో నేనెవరినమ్మా అనడానికి నాకేం నోరు నెప్పా అనడానికి' అనేది కోడలు మూతి తిప్పి'
    'నా ఇంట్లో నేనుండి, నా సొమ్ము తింటూంటేనే మీకింత కష్టంగా వుందే - పట్టెడన్నం మీ ఎవరింట్లో నేను తినకపోయినా ఇన్ని మాటలంటున్నావే...
    'అయ్యో అయ్యో చూశారా ఈ ఇల్లు నాది ఆస్థినాది, నా సొమ్ము మీరు తింటున్నారుగాని నేనెవరి సొమ్ము తినడం లేదని ఆవిడంత కచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గు లేదు. పదండి ఏ అద్దె కొంపో దొరక్కపోదు. ఏ రెండు గదుల కొంపన్నా నాది అంటూ వుంటే ఇన్ని మాటలు వినక్కరలేదు. కలో గంజో తాగుదాం పదండి. అంటూ రాగాలు, అన్నపూర్ణమ్మకి మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి 'ఏమిటమ్మా రోజూ ఇంట్లో గొడవలు అనేవాడు పైగా - లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు వుండేవాడు - తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పపోతే మీ అత్తా కోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు.. ఛా... ఛా బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు - పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు - వాళ్ళకి చీర సారె ఇస్తే వున్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడ్తుంది. ఏం వాళ్ళూ ఆస్థి పంచుకుంటారుగా మీతో సమంగా ఇప్పుడింకా ఈ దోచిపెట్టడం ఎందుకు - ఇంట్లో పిల్లలున్నారు. 'నేనున్నాను ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించిందా ఆవిడకి. అంతేనండి ఇంట్లో వుంటే అందరికి లోకువే - అందుకే పోదాం అంటున్నాను.
    పోతే పొండి అనాలన్నంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి - లోకులేం అనుకుంటారోనన్న భయంతో పాటు, ఈ ఇంట్లో ఆడది తను ఒక్కర్తి ఎలా అన్న ఆలోచన ఆవిడకి వెనక్కి లాగేది - ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని అటు ప్రభాకర్ ని వేధించింది.
    సంవత్సరీకాలు వచ్చాయి, మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరీకాలు ముగిశాయి 'బాబాయ్ నాకంటూ ఏం వస్తుందీ నాకు పంచేయాలి బాబాయ్ ఈ ఉమ్మడి ఆస్థి వ్యవహారం నాకొద్దు - ఇంట్లో గోల భరించలేను - ఎవరి పాటికి వాళ్ళు హాయిగా వుంటే నాకెందుకీ జంఝాటం నా వాటా నాకు కావాలి' అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు రాత్రంతా పెళ్ళాంకీ ఇచ్చి పంపినది అప్పచెప్పేశాడు ప్రభాకర్.
    'అదేమిటిరా..ఇప్పుడేం అయిందని..." ఏదో చెప్పబోయారాయన.
    'ఏం అయిందో చెపితే అర్థం కాదులే బాబాయ్. ఎవరికి వారికుండడం మంచిది 'ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడాయన - తమ్ముడు లక్ష్మణుడిలా అన్నగారి మాట జవదాటను అన్నట్టు కూర్చున్నాడు.
    "మరి మీ అమ్మ ఒక్కర్తి ఎలా వుంటుందిరా"
    "ఒక్కర్తి వుండడం ఏం, ఆవిడకింకా ముగ్గురు పిల్లలున్నారు. ఆవిడకిష్టం వచ్చినచోట ఇష్టం వచ్చినన్నాళ్ళుంటుంది."
    "అలేగే పంచేయి మరిది.. ఇంట్లో రోజూ ఈ గొడవలకంటే అదే నయం అనిపిస్తూంది. నాకూను... ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు. నిష్ఠూరంగా అంది."
    "మరి ఈ ఇల్లు.. మీ అమ్మ ఎక్కడుంటుంది. ఇక్కడేవుంటే, మరి మీరు ఈ ఇల్లు నాన్న కట్టించినా, పిత్రార్జితంగా నా కొడుకులకి రావాలి - దివాకర్ బెంగుళూరు కనుక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి ఇదివరకు రాసుకున్నాంగా"
    "మరి మీ అమ్మకి..."
    "అమ్మకి డబ్బివ్వండి అనిడున్నన్ని రోజులు ఖర్చులకి.. ఆడపిల్లకి ఎలాగూ క్యాష్ అనుకున్నాంగా, పొలం దివాకర్ ని అనుకున్నాంగా."
    'అన్నయ్యా సొంత ఇల్లుండగా అమ్మ వీళ్ళ కొంప వాళ్ళ కొంప పట్టుకు ఎందుకు వెళ్లాడాలి" పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది.
    "అదేమిటమ్మా స్వంత ఇల్లుంచుకుని రెండుగదుల అద్దెకొంప ఖర్మ నీకెందుకు, అన్నయ్యా మేం అలా వప్పుకోం.. రెండో కూతురు అంది.
    "వద్దే తల్లీ, తినే రెండు మెతుకులన్నా వంట పట్టనీండి నాకు మీనాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా, ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను - ఆయన వున్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ, ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదే అమ్మా నా ఖర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది.

 Previous Page Next Page