"ఇదిగో తను ఆరతి. విజువల్స్. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న యాడ్స్ లో యాక్ట్ చేస్తోంది. చేరి ఆర్నెల్లయిందిలే ... మంచి మోడల్ అయిపోవాలని, ఆ తర్వాత ఫ్యాషన్ వరల్డ్ లోకి వెళ్లిపోవాలని, ఆ తరువాత దేవుడనుగ్రహిస్తే సినిమాల్లోకి... చాలా చాలా కలలున్నాయి" హాస్యంగా అంది సీమ.
"యార్, నవ్వకు. ఏదో ఒకరోజు సినిమాతారనయిపోయి చూపిస్తా" తనూ నవ్వుతూ స్పోర్టివ్ గా అంది ఆరతి. మార్వాడీ అమ్మాయి. చక్కగా, అందంగా...అందం కంటే ఆకర్షణీయంగా ఉంది. కళైన మొహం. చూడగానే బాగుంది అనిపిస్తుంది. సినీతార కాదగ్గ అర్హతలన్నీ ఉన్నాయి. యాడ్ వరల్డ్ నుంచి ఎంతమంది సినీరంగానికి వెళ్లలేదు. ఆరతి మహిమని చూస్తూ చేయిపట్టుకు స్నేహంగా "క్రియేటివ్ సెక్షనేమిటి, ఇంత చక్కగా ఉన్నావు. రాంగ్ ఛాయిస్. యాడ్ వరల్డ్ లో ఉండాలి నీవు" అంది చనువుగా.
"ఇదిగో నీకు పోటీ వచ్చిందంటే తట్టుకోలేవు. పిచ్చిసలహాలిచ్చి నీ ఫ్యూచర్ ని నువ్వే పాడుచేసుకోకు" సీమ నవ్వుతూ అంది. అంతా నవ్వారు.
రేణుక కేస్ రోల్స్ తెచ్చి టేబిల్ మీద పెట్టింది. మరో దాన్లో సాంబారు, ఒక బౌల్ లో పచ్చడి తెచ్చిపెట్టింది. అంతా ఎవరికి కావల్సిన ఇడ్లీలు వారు పెట్టుకున్నారు. అందరి ప్లేట్ల దగ్గర తలో అరటిపండు తెచ్చిపెట్టింది. అంతా తినడం పూర్తి అయ్యేలోగా అందరికీ వేడివేడి కాఫీ, టీ తెచ్చింది. 'ఫరవాలేదు, ఇంత మాత్రం టిఫిన్ దొరికితే. ఇడ్లీ, సాంబారు రుచిగానే ఉన్నాయి' అనుకుంది మహిమ.
"మహిమ ... వారంలో రోజుకొక టిఫిను. అంటే ఇడ్లీ, పూరి, ఉప్మా, ఆదివారం స్పెషల్ దోశ ... ఇలా చేయిస్తాం. ఉదయం కాఫీ, టీ, ఎవరికేది కావలిస్తే అది. మళ్ళీ టిఫిన్ తో పాటు కాఫీ, టీలు. లంచ్ బాక్స్ లో తలో రెండు చపాతీలు. కూర చేసి ఇస్తుంది. రాత్రి డిన్నరు. మనం అంతా వెళ్లాక సావకాశంగా రూములన్నీ తుడిచి, బట్టలుతికి మిగతా పనులు చేస్తుంది. కూరలు కావల్సినవి తనే తెచ్చుకుంటుంది. మొత్తం పని బాధ్యత అంతా రేణుకదే. ఇస్త్రీకి రోజూ చాకలి వస్తాడు. ఇంటి అద్దె, కరెంటు, భోజనం ఖర్చు, రేణుక జీతం మొత్తం అందరం షేర్ చేసుకుంటాం. లెక్కలు రాయడం, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం... మన ఫైనాన్స్ మినిస్టర్ స్రవంతి చూస్తుంది" టిఫిన్ చేస్తూ అన్నీ వివరించింది సీమ.
"ముందు అడ్వాన్స్ గా ఇవాళ పదివేలు ఇవ్వు. నెలాఖరుకి మిగతా లెక్కలు. సరేనా?"
మహిమ తల ఊపి, "ఏటీఎమ్ లో డ్రా చేసి సాయంత్రం ఇస్తాను" అంది. తల ఊపింది స్రవంతి. అందరూ టిఫిన్ తిని, కాఫీ తాగుతుండగా, నైట్ గౌనులో బద్ధకంగా ఆవలిస్తూ ఒక అమ్మాయి వచ్చింది. "హాయ్! గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ!" మహిమని ప్రశ్నార్థకంగా చూస్తూ "ఎవరీ ఏంజిల్?" అంది ముద్దు ముద్దుగా. "ఇంకా మత్తు వదల్లేదా తల్లీ? ఏ దేవకన్యా దిగి రాలేదులే. తను మహిమ. ఇవాళే కొత్తగా జాయిన్ అవుతోంది" సీమ ముక్తసరిగా అంది.
"మహిమ ! బ్యూటిఫుల్ నేమ్, బ్యూటిఫుల్ ఫేస్. ట్రై యువర్ లక్ ఇన్ దిస్ ఫ్యాషన్ వరల్డ్. బట్, కేర్ ఫుల్! ఏ మగాడినీ నమ్మకు. పనిని నమ్ముకో, నీ టాలెంట్ ని నమ్ముకో. ఇదిగో నా అనుభవంతో చెపుతున్నాను... నమ్మకు, ఏ మగాడినీ నమ్మకు. ఏ మగాడి పొగడ్తలకి పడిపోకు. నిన్నేదో స్టార్ ని చేసేస్తామని ఎవరన్నా అంటే, బుల్ షిట్, నమ్మకు" కసిగా అంది.
"ప్రీతి స్టాపిట్! మహిమ విజువల్స్ కాదు. క్రియేటివ్ సెక్షన్. నీ సెర్ మన్స్ చాలు" స్రవంతి విసుగ్గా అంది.
"ఏ యూనిట్ అయితేనేం ... అందంగా ఉంది కదా. నిన్ను యాడ్ వరల్డ్ లో స్టార్ ని చేసేస్తాం అంటూ చుట్టుముడతారు. నమ్మకు ఆ మాటలు ..."
"సరే, సరే, అలాగే. మాకు టైమైంది. వెళ్లాలి. పద మహిమ" అంటూ సీమ లేచింది.
అమ్మాయిలంతా లేచి వెళ్లారు. సీమ రూముకెళ్ళి కాస్త జుత్తు బ్రష్ చేసి క్లిప్ పెట్టి, లైట్ గా లిప్ స్టిక్ వేసుకుని, చున్నీ తీసుకుని, రూము తాళం వేసి, రింగు లోంచి ఓ తాళం తీసి మహిమ కిచ్చింది. "నీ 'కీ' నీ దగ్గరుంచుకో. ఎప్పుడొచ్చినా నీ ఇష్టం. నా దగ్గరొకటి, రేణుక దగ్గర ఒకటి ఉంటుంది. మనం వెళ్లాక రూము శుభ్రం చేస్తుంది గదా. కప్ బోర్డు తాళం వేశావుగా, అది నీ దగ్గరుంచుకో. రేణుకతో ముందే చెప్పాం. నిన్ను నమ్మి తాళం ఇచ్చాం. ఏం పోయినా నీదే బాధ్యత అని చెప్పాం. అయినా నమ్మకంగానే ఉందిలే. అందుకే జీతం కాక అందరం బోలెడు బట్టలు అవి అన్ని బాగా ఇస్తాం. మనతోపాటే భోజనం అన్నీ ... తనకి పెళ్ళయింది. కానీ మొగుడు ఇంకొకామెతో చెప్పా చెయ్యకుండా వెళ్లిపోయాడు. పిల్లలు, బాదర బందీలు లేవు. నమ్మకంగా మన దగ్గరే ఉంటోంది. అందుకే ..." లిఫ్ట్ లో వస్తూ గబగబా అన్నీ చెప్పింది. "నీ ట్రాన్స్ పోర్ట్ నీవు ఏర్పాటుచేసుకునే వరకు నాతో వచ్చేయి. లేదంటే పెట్రోలు ఇద్దరం షేర్ చేసుకుంటూ ఇదే వాడుకోవచ్చు. చూడు ... ఇలా ఖచ్చితంగా అంటున్నానని ఏమనుకోకు. డబ్బు దగ్గర గొడవలు రాకూడదు. అందుకే అందరం ముందే మాట్లాడుకున్నాం. ప్రతి రూపాయి ఖర్చు షేర్ చేసుకుంటాం. లేకపోతే గొడవలు వస్తాయి. ఐ హోప్ యూ అండర్ స్టాండ్ ..."
"ఇదే మంచి పద్ధతి. నాకు ఇదే ఇష్టం. మా డాడీ ఎప్పుడూ అంటారు ఎంత మంచి స్నేహితులైనా డబ్బు దగ్గర మొహమాటాలుండకూడదని".
"ఇక్కడ మేమందరం ఒక ఫ్యామిలీలా ఉంటూ, ఎవరికి ఏ అవసరం, ఇబ్బంది వచ్చినా అందరం ఒకరికొకరం అన్నట్టు ఉంటాం ..."
"సీమా! రియల్లీ అయామ్ వెరీ హ్యాపీ! కొత్త ఊర్లో మంచి అకామడేషన్, భోజన ఏర్పాట్లు అన్నీ ఇంత తొందరగా, ఇంత చక్కగా అమరిపోయాయి. మీలాంటి ఫ్రెండ్స్ దొరికారు. రియల్లీ హ్యాపీ!" అంది మనస్ఫూర్తిగా.
"ఇందాక ప్రీతీ అన్న అమ్మాయి ఎవరు? ఆఫీసుకు వెళ్లదా ...?" ఆఫీసు లిఫ్ట్ లో కుతూహలంగా అడిగింది. "ప్రీతి ... తనకు ఒక టైము పాడు ఏం ఉండదు. ఏదన్నా షూటింగ్ కాల్ వస్తే తయారయి వెళ్తుంది. లేదంటే తిని దొర్లుతూ ఉంటుంది" విరక్తిగా అంది సీమ.