Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 40
నిజంగానే?
నిజంగానే నిఖిలలోకం
నిండుహర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా?
నిజంగానే, నిజంగానే
నిఖిలలోకం హసిస్తుందా?
దారుణ ద్వేపాగ్ని పెంచే
దానవత్వం నశిస్తుందా?
బానిసల సంకెళ్ళు బిగిసే
పాడుకాలం లయిస్తుందా?
సాధుసత్వపు సోదరత్వపు
స్వాదుతత్త్వం జయిస్తుందా?
జడలు విచ్చిన, సుడులు రెచ్చిన
కడలి నృత్యం శ్రమిస్తుందా?
నడుమ తడబడి, సడలి ముడుగక
పడవ తీరం క్రమిస్తుందా?
నిజంగానే, నిజంగానే?
- 1941 (?)
* * *
Previous Page
Next Page