అమృత వెంటనే తల దించుకుంది. ముసలాయన ఏం చెప్పి వుంటాడో వూహించలేనంత చినపిల్ల కాదు. ఇంటికి వెళ్ళగానే తండ్రి ఏం అడుగుతాడో తల్చుకుంటే అరచేతుల్లో చెమట్లు పడుతున్నాయి ఆమెకి. తన ఈ స్వభావం ఎప్పటికి మారుతుంది?
"పదండి! ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం" అన్నాడాయన గంభీరంగా.
వాళ్ళు ఆటోలో ఇల్లు చేరేసరికి మరో అరగంట పట్టింది. ఇంటి ముందు కారుంది! అది చూస్తూనే అమృతకి షాక్ తగిలినట్టయింది.
షాకులెప్పుడూ వంటిని జలదరింప జేస్తాయి. అందులో అన్ని బాదాకరమైనవి కావు. ప్రధమ స్పర్శలాటి షాకులు తియ్యటి జలదరింపునిస్తాయి.
"మా...మా కారు ఇక్కడ" అంది, సంభ్రమంగా. అదే టైమ్ కి అతడు కారు దిగుతున్నాడు. అంత దూరం నుంచి నాన్ - స్టాఫ్ గా ప్రయాణం చేసిన, అలసట మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
చక్రధరరావు అతడివైపు చూస్తూ, "అదేమిటి అల్లుడుగారూ...ఇద్దరూ కలిసే రావొచ్చుగా" అన్నాడు. అతడు మొహమాటంగా నవ్వి, "ముందు పని ఎక్కువగా వుండి రాకూడదనుకున్నానండీ. డైరెక్టర్స్ మీటింగ్ కాన్సిల్ అయింది. కారేసుకుని బయల్దేరాను" అన్నాడు.
కాదని అమృతకి తెలుసు. తలదాచుకుని తనలో తానే నవ్వుకుంది. పెద్దవాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళాకా, ఆమె దగ్గిరకొచ్చి రహస్యంగా "వుండలేకపోయానోయ్. ఇల్లంతా మరీ ఖాళీగా అనిపించింది. డైరెక్టర్స్ అందరికీ మీటింగ్ కాన్సిల్ అని చెప్పి వచ్చేశాను" అన్నాడు.
"తెల్సులేవోయ్ సుబ్బారాయుడూ" అంది అమృత అతడి కేసి ప్రేమగా చూస్తూ. "వంద కిలోమీటర్ల స్పీడ్ లో వచ్చాను తెలుసా" అన్నాడు.
"ఓహో"
"అంత కష్టపడి వస్తే నీ కళ్ళల్లో మెచ్చుకోలు కనపడదేమిటి?"
"నిన్నింతకన్నా స్పీడ్ లో చూశాను కాబట్టి."
అతగాడు బిత్తరపోయి "ఓసి రాక్షసీ" అన్నాడు.
"లోపలికి పద లోకేశ్వరర్రావూ. మెట్లమీదే మాట్లాడుకుంటూ నిలబడితే మీ అత్తా మావలకి అనుమానం వస్తుంది" అంటూ లోపలికి నడిచింది అమృత.
...అల్లుడూ కూతురు ఎన్నో రోజుల తరువాత కల్సినట్టు కబుర్లు చెప్పుకుంటూ మేడమీదకి వెళుతుంటే చూసి "చూశారా ఆ అబ్బాయికి అదంటే ఎంత ప్రేమో? అలా ఎప్పుడైనా నాకోసం పరిగెత్తుకుని వచ్చారా మీరు" అంది జగదీశ్వరి భర్తని మోచేత్తో పొడుస్తూ, నిష్టూరంగా.
"దెప్పడం ఆపి-అలా పరిగెత్తుకు వచ్చేట్టు ఎప్పుడైనా ప్రవర్తించావా- అని ముందు ఆలోచించుకో" అన్నాడు చక్రధరరావు.
* * *
మధ్యాహ్నం భోజనాలవుతుండగా "చక్రధరం. చక్రధరం" అంటూ లోపలికి వచ్చిన ముసలాయన్ని చూసి "రండి చలపతిరావుగారూ సమయానికి వచ్చారు, భోజనం చేద్దురుగాని," అన్నాడు చక్రధరరావు.
"భోజనం సంగతి సర్లేవయ్యా. మీ అమ్మాయిని మందలించావా? రాత్రంతా నాకు నిద్ర లేదనుకో" లోపాయికారీగా అంటూ హాల్లోకి వచ్చాడు.
టేబుల్ దగ్గర ప్రక్క ప్రక్కన కూర్చుని భోజనం చేస్తున్న అమృతని, హర్షని చూసి ఆయన గతుక్కుమన్నారు. ఆయన మొహం సగం కాలిన అప్పడంలా అయిపోయింది. కళ్ళు పెద్దవయ్యాయి. అప్రయత్నంగా చెయ్యి గుండె మీదకు వెళ్ళింది.
"ఏమిటలా చూస్తున్నారు? మా అల్లుడు హర్ష" అన్నారు చక్రధరరావు.
అమృత వోరగా, భర్తవైపు చూసింది. హర్ష అవసరమైన దానికంటే ఎక్కువ సీరియస్ గా భోజనం చేస్తున్నాడు.
ముసలాయన అయోమయంగా చూస్తుంటే "మా అమ్మాయి కాస్త చిలిపి లెండీ...అల్లుడు కూడా," అంటూ చక్రధరరావుగారు సర్ది చెప్పబోయారు.
అమృత తల దించుకుని నువ్వు ఆపుకోవటానికి విఫలయత్నం చేస్తోంది.
ఆయన అంతా విని "భలే వాళ్ళే ఈ కాలం పిల్లలు!!" అని కాసేపు కూర్చుని అవీ ఇవీ మాట్లాడి వెళ్ళిపోయారు. ముసలాయన వెళ్ళిపోగానే-
"ఆయన ఎందుకు వచ్చారో తెలుసా నాన్నా?" అడిగింది అమృత దగ్గిరగా వస్తూ.
"తెలుసమ్మా. నీ కూతురి ప్రవర్తన మంచిది కాదు, అని చెప్పాక కుతూహలంతో ఆయన మనసు ఆగలేదు.నిన్ను నేను కొట్టేస్తున్నానో, నరికేస్తున్నానో చూడాలన్న కోరిక ఆపుకోలేక పరిగెత్తుకొచ్చాడు" అంటూ ఆయన పెద్దగా నవ్వారు.
"నాన్నా ఆయన అన్నీ చెప్పారా?" ఆశ్చర్యంగా అడిగింది అమృత.