Previous Page Next Page 
8 డౌన్ పేజి 39

    సంగీత మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది.
    జరిగింది తప్పేనని తను వప్పుకునివుంటే విజయ్ కుమార్ తనను వెంటనే క్షమించి వుండేవాడు. కానీ తనలోని అహం తననా విషయం వప్పుకోనీయలేదు.
    అక్కడితో ఆగక అతనిలోని తప్పులను వెతికి అతనిని ఛాలెంజ్ చేసింది. ఫలితం ఏమయింది? తండ్రి లేనిపిల్ల ఒకరు, తల్లిలేని పిల్లాడు ఒకడు! రెండు సంసారాలు. నిజంగా ఏం సుఖం అనుభవిస్తోంది జీవితంలో తను?
    ఒక మనిషి ఆనందంగా జీవితం గడపడానికి 'సెక్స్' ఒకటే ముఖ్యం కాదుకదా! దానికన్నా ముఖ్యమయిన అంశాలెన్నో ఉన్నాయ్.
    భర్తతో, పిల్లలతో కలసి గడిపే ఓ అందమయిన జీవితాన్ని తను పోగొట్టుకుంది. జీవితం అంటే కేవలం ఉద్యోగం చేయటం, తనను తను జీవితాంతం పోషించుకోగల ఆర్ధిక స్తోమత కలిగివుండడం అనుకుంది.
    జీవితం అంటే రాజీపడకుండా గడపటం అనుకుంది.
    కానీ ఇప్పుడు తెలుస్తూంది.
    తన ఆలోచనలు ఎంత తప్పు మార్గంలో ప్రయాణించాయో! విజయ్ కుమార్ ని చూస్తుంటే, అతని మొఖంలో కనిపిస్తోన్న వంటరితనం చూస్తుంటే-
    ఆరేళ్ళ కొడుకు విమల్ గాడిని చూస్తుంటే-
    ఒక తప్పు చేసి, దాని నుంచి తప్పించుకోడానికి మరెన్నో తప్పులు చేసినట్లు- చెదిరిపోయిన తన సంసారాన్ని సరిదిద్దుకోవటం కోసం ఇప్పుడు ఇంకో వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటోంది!
    కానీ లోలోపల తన భయం తనకుంది. తన సందేహాలు తనకున్నాయ్!
    ఈ వివాహం మాత్రం విఫలమవదని ఏమిటి నమ్మకం?
    పైగా ఇప్పుడు తనకో కూతురు_
    తనను చేసుకుంటున్న యువకుడు తన కూతురుని కూడా అంతే అభిమానంగా చూడగలడని గ్యారంటీ ఉందా?
    మళ్ళీ విజయ్ కుమార్ వేపు చూసిందామె.
    అతనూ తనవంకే చూస్తున్నాడు. తనతో మాట్లాడాలన్న తపన అతని మొఖంలో స్పష్టంగా కనబడుతోంది.    
    "సంగీతా!" అతను పిలిచాడు.
    "ఊ!"
    "నీకు తెలుసో తెలీదో- మా హోమ్ మినిష్టర్ వట్టి రోగ్! ఎలాంటి పరిస్థితిల్లోనూ వాడిని నమ్మకు. మీ ఇంటికొస్తాననీ, నిన్ను తనింటికిరమ్మనీ ఏం చెప్పినా వినకు!"
    "సరే!"
    "వాడి హిస్టరీ అంతా కూడా ఇలాంటి చెడుతోనే నిండి వుంది."    
    "ఐసీ! మీరు చెప్పడం మంచిదయింది."
    "ఇందాకటి నుంచి చెప్దామనుకున్నానుగానీ ఇప్పటికి అవకాశం దొరికింది."
    "ఇలాంటివాడికింద పని చేయాలంటే మీకూ చాలా ఇబ్బందిగా వుండి వుండాలి."
    "కాస్తా కూస్తా కాదు. ఐ.పి.యస్, ఐ.ఏ.యస్.ల పరిస్థితి ఈ రోజుల్లో నిజంగా దారుణమే! వీడు హోమ్ మినిష్టర్ అవ్వకముందు ఒక ఊళ్ళో పెద్ద కల్లు కాంపౌండ్ ఓనర్. అందులో డబ్బు బాగా సంపాదించి ఎలక్షన్లో పార్టీ టికెట్ కోసం ఖర్చుపెట్టి ఎమ్మెల్యే అయ్యాడు. అయిన రెండోరోజు నుంచి ముఖ్యమంత్రి భజన కార్యక్రమం ప్రారంభించాడు. చాలా డబ్బు విరాళాల ద్వారా సేకరించి ముఖ్యమంత్రికి సమర్పించుకుని హోమ్ మినిష్టర్ పోస్టు కొనుక్కున్నాడు. అక్కడి నుంచి దశ తిరిగిపోయింది.
    ప్రతి ఊరునుంచీ రకరకాలుగా కేసులు టేకప్ చేయటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కేసులు తీసేయించడం, తద్వారా ముఖ్యమంత్రికి మరింత సన్నిహితుడవటం-ఒకటని కాదు వీడు చేయనిదంటూ లేదు."
    "మైగాడ్! నాకిదంతా తెలియదు. జెంటిల్మెన్ అనుకున్నాను."  
    "ఆ మధ్య ఒక అమ్మాయి తన భర్త, అత్తగారు కలిసి తనని చంపడానికి ప్రయత్నిస్తున్నారనీ, వాటికి పొలిటికల్ ఇన్ ఫ్లుయెన్స్ ఉండటం వల్ల పోలీసులు కేసు రిజిష్టర్ చేసుకోకుండా తననే వేధిస్తున్నారనీ అప్పీల్ ఇవ్వటానికొచ్చింది. ఆమె వేరే వూరు నుంచి రావటం వల్ల ఆమెకు తనే బస ఏర్పాటు చేస్తానని చెప్పి-కొంచెం చనువు తీసుకోవటం ప్రారంభించేసరికి ఆమె గొడవచేసి అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయం బయటకు పొక్కకుండా చాలా తంటాలు పడాల్సి వచ్చిందతనికి."
    "మగాడికి స్త్రీ తనను ఇష్టపడుతోందో లేదో తెలుసుకోవటం చాలా తేలిక. బలవంతంగా అనుభవించాలి అనే మనస్తత్వం ఎందుకు డెవలప్ అవుతుందో తెలియటం లేదు. బహుశా పవర్ అండ్ మనీ కారణం అనుకుంటాను."
    "మేబి!"
    "మనం అనుకోకుండా ఇక్కడ కలుసుకోవటం, ఈ బండికే ప్రమాదం జరగబోతూండటం-తమాషాగా లేదూ?" అడిగిందామె కొద్దిక్షణాల తర్వాత.
    "నేనూ అదే అనుకుంటున్నాను. బహుశా చనిపోయేక్షణాల్లో మనం కలిసివుండాలని భగవంతుడి కోరికేమో!"
    ఆ మాట ఆమెలో సెంటిమెంటుని కదిలించింది.
    "నిజంగా మనం చనిపోతామంటారా?"
    "ఏమో! ఈ వేగంలో ఏదయినా ప్రమాదం జరిగితే ఎవరు మాత్రం బ్రతుకుతారు? బ్రతికినా ఎలాంటి బ్రతుకది? కాళ్ళు తెగిపోయి, నడుము విరిగిపోయి, చేతులు క్రష్ అయిపోయి, భుజాలు నరుక్కుపోయి దానికంటే చావే నయం కదూ?"
    "అవును!" భయంతో పిల్లలిద్దరినీ దగ్గరకు తీసుకుందామె.  
    ఆమెకు ఆ సమయంలో గోదుంగూడాలో జరిగిన హాలిడే స్పెషల్ యాక్సిడెంట్ గుర్తుకొచ్చింది. టి.వి.లో, న్యూస్ పేపర్ ఫోటోల్లో కనిపించిన ఆ దృశ్యాలు ఇంకా హృదయం నుంచి చెరగనేలేదు. ఎంత దారుణమయిన ప్రమాదం అది. తన కళ్ళెదురుగానే ఇనప శకలాల మధ్య ఇరుక్కుపోయి సహాయం కోసం అరుస్తూన్న మేజర్ భార్య, ఇరవై నాలుగ్గంటలయినా ఆమెను రక్షించలేకపోయిన రైల్వే డాక్టర్లూ, ఇతర అధికారులూ, కన్నతల్లి కళ్ళముందే ఇనుపకోరల మధ్య ఇరుక్కుని 'అమ్మా అమ్మా' అని సహాయం కోసం అరుస్తూ ప్రాణాలు వదిలిన పసిపాప_ ఎంతోమంది ఎంత నరకం అనుభవించి ప్రాణాలు వదిలారో!
    విజయ్ కుమార్ ప్రాణాలు తన కళ్ళెదురుగానే పోతూంటే భరించగల ధైర్యం తనకుందా? తను అతని కళ్ళెదురుగానే ప్రాణాలు వదులుతూంటే విజయ్ కుమార్ ఫీలవకుండా వుండగలడా? కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
    ఆమె మనసంతా అతనిమీద అనురాగంతో నిండిపోయింది.
    తనకేం జరిగినా ఫర్లేదు. తన పిల్లలూ, అతనూ బ్రతికితే చాలు! వారి గురించి తనిక నిశ్చింతగా వుండగలదు.
    "సంగీతా!" పిలిచాడతను.
    ఆమె ఛప్పున కన్నీరు తుడుచుకుని అతనివేపు చూసింది.
    "ఈ యాక్సిడెంటులో మనం బ్రతుకుతామో లేదో తెలియదు. అందుకే అది జరిగేలోపల నేను నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను."
    "ఏమిటది!"
    "ఆ రోజు నేను తొందరపడ్డాను సంగీతా! తర్వాత ఆలోచిస్తే తప్పంతా నాదేననిపించింది. కానీ నా అంతట నేను వచ్చి తప్పు వప్పుకోవాలంటే ఇగో అడ్డం వచ్చింది. నా తొందరపాటు వల్ల ఒంటరిగా నేనెన్ని కష్టాలు అనుభవించానో అంతకు రెట్టింపుగా ఒక వర్కింగ్ వుమెన్ గా నువ్వూ అనుభవించి వుంటావని నాకర్ధమయింది. అయామ్ సారీ సంగీతా!"
    ఆమె కళ్ళనిండుగా నీరు చేరింది.
    "మీరు చెప్పిన మాటలన్నీ నేనే మీకు చెప్పాలి అసలు. నిజంగా ఆ విషయంలో తప్పు నాది. ఆరోజు పార్టీలో నేనలా బిహేవ్ చేసి వుండాల్సింది కాదు. పెళ్ళి అయిన తర్వాత అలాంటివాటికి భార్యభర్తలిద్దరూ దూరంగా వుండగలిగితేనే ఆ వివాహం నిలబడుతుంది. మనం విడిపోయిన ఇంత కాలానికి కూడా మీరు వివాహం చేసుకోలేదని తెలిసేసరికి నాలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఈ జర్నీ ముగిసిన వెంటనే నా ప్రవర్తనకు క్షమార్పణ చెప్పుకుంటూ నేనే మీకు ఉత్తరం రాయాలనుకున్నాను." అతను ఆమె మాట్లాడుతూంటే నమ్మలేనట్లు చూస్తున్నాడు.
    "సంగీత! జరిగిందంతా మర్చిపోయి మనం కొత్త జీవితం ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. నీకది ఇష్టమేనా?"
    "ఆ ప్రశ్న అడగాల్సింది నేను."
    అతను ఆమె శిరస్సు మీద అనురాగంతో చుంబించాడు.
    "ఏమిటి మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ?" అడిగాడు జమదగ్ని అనుమానంగా.
    "పర్సనల్ విషయాలు" అన్నాడు విజయ్ కుమార్.
    "ఇంతకుముందు ఒకరికొకరు ముక్కు మొఖం తెలీదు. ఇంతలోనే పర్సనల్ విషయాలు మాట్లాడుకునేంత చనువొచ్చిందా?"
    "మీకు తెలీదేమో! ఆమె నా భార్య."
    ఆ మాట వింటూనే రఘునాథ్ ఉలిక్కిపడ్డాడు.
    అందరూ వారివేపు ఆశ్చర్యంగా చూడసాగారు.
    ఒక్కసారిగా ఎ.సి. కోచ్ తలుపు తెరుచుకుంది. జనం కొంతమంది సామానులతో జొరబడి వెనుకకు పరుగెత్తసాగారు. అంతా కోలాహలం, కేకలు!
    ఫణికి అంత చల్లదనంలోనూ చెమటలు పట్టేసినయ్.
    క్షణక్షణానికీ రఘునాథ్ ని కిడ్నాప్ చేసే అవకాశం చేయిజారిపోతున్నట్లనిపిస్తూంది.

 Previous Page Next Page