Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 38
పేదలు
అంతేలే, పేదల గుండెలు!
అశ్రువులే నిండిన కుండలు!
శ్మశానమున శశికాంతులలో
చలిబారిన వెలి రాబండలు!
అంతేలే, పేదల మూపులు!
అణగార్చగ విధి త్రోద్రోపులు,
పయోధితట కుటీరములవలె
భరియించవు బాధల మోపులు!
అంతేలే, పేదల చేతులు!
శ్లథశైశిర పలాశరీతులు!
విశుశ్కములు, పరిపాండురములు!
విచలించెడు విషాదహేతులు!
అంతేలే, పేదల కన్నులు!
వినమ్రములు, వెతల వ్రణమ్ములు!
తుపానులో తడిసిన, జడిసిన
గోమాతల కన్నుల తమ్ములు!
అంతేలే, పేదల బ్రతుకులు!
తిరిపెమునకు పిడికెడు మెతుకులు!
తెరువెరుగని దీర్ఘరాత్రిలో
తల పగిలెడి తలపుల గతుకులు!
(Emile Verhaeren వ్రాసిన Les Pauvres అనే గీతానికి అనువాదం)
1939 (?)
* * *
Previous Page
Next Page