"వెడితే వెళ్ళావు - కాస్త ఫోన్ చేస్తే నాకీ ఆరాటం లేకపోను - సరే వెళ్ళు భోజనం చెయ్యి. అన్నీ మూత పెట్టి వుంచింది వంటావిడ. నీవు భోంచేసి కృష్ణకి పాలు తీసి కెళ్ళి యివ్వు - నేనింక పడుకుంటాను" సరస్వతమ్మ పుస్తకం మూసి గదిలోకి వెళ్ళింది. సరోజ భోంచేసి, సామాను సర్ది పెట్టి పాలు తీసుకుని పైకి వెళ్ళింది. గీత వచ్చి ఏం చెప్పిందో కృష్ణమోహన్ తో అన్న ఆలోచన ఆమెలో కుతూహలం రేకెత్తించింది.
గదిలో కృష్ణమోహన్ పడుకుని చదువుతున్నాడు. సరోజ రాగానే కళ్ళెత్తి అదోలా నిలువెల్లా పరీక్షిస్తున్నట్టు సూటిగా చూశాడు. గీత వచ్చి చెప్పిన మాటలు విన్న దగ్గిరనించి కృష్ణమోహన్ మనసు మనసులోలేదు."ఆ సరోజ చాలా బుద్ధిమంతురాలంటావు. మహా పొగుడుతావు. ఒక్కసారి వెళ్ళిచూడు ఆ సినిమాలో ఆ ప్రభాకరంతో కల్సి ఒకటే వికవికలు పకపకలు, ఒకరిమీద ఒకరు పడి పోవడం -అబ్బబ్బ - చూడలేక నాన్నగారు వెళ్ళిపోదాం అన్నారు."
అసలు అప్పటివరకు యింటికిరాని సరోజ కోసం కృష్ణమోహన్, సరస్వతమ్మ గాభరాపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిందీ చెప్పివెళ్ళనందుకు చిరాకుపడ్డాడు కృష్ణమోహన్. ఆ సమయంలో గీత వచ్చి రహస్యంగా చెవులో ఊదిన సమాచారం వినగానే కృష్ణమోహన్ కలవరపడ్డాడు...అతని మొహంలో కనపడిన అపనమ్మకం చూసి గీత మరి రెండు అబద్దాలు జోడించి నమ్మించింది "ఇదేం మొదటిసారికాదు. వాళ్ళిద్దరిని పార్కులో, హోటళ్ళలో ఎన్నోసార్లు చూశాను. ఎప్పుడూ జంటగా తిరుగుతూంటారు. ఇన్నాళ్ళూ స్నేహమేనేమో అనుకున్నాను. ఇవాళ దగ్గిర నించి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన చూశాక అసలు సంగతి అర్ధం అయింది. నన్ను వాళ్ళు ఇంటర్వెల్ వరకు చూడలేదు. చూశాక సరోజ ఎలా గాభరా పడిపోయిందో తెలుసా" అంత నమ్మకంగా గేతేహ చెప్పుతుంటే నమ్మకుండా వుండలేకపోయాడు కృష్ణమోహన్.
సరోజ తన గురించి ఏమన్నా చెప్పకముందే సరోజ అంటే అపనమ్మకం పుట్టించాలని, ఆమెపట్ల సదభిప్రాయం పోగొట్టాలని ఆలోచించి సినిమానించి కృష్ణమోహన్ ఇంటికి వచ్చింది గీత. సినిమాహాలులో సుగుణని చూడగానే గీత రంగారావు అన్నపూర్ణ ముగ్గురికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎంత తెలియదని తప్పించుకున్నా సుగుణ తమని గుర్తుపట్టనే పట్టింది. ప్రభాకర్, సుగుణ, సరోజ, వీళ్ళెలా కలిశారో - ఆ సుగుణ అసలు సంగతి చెప్పనే చెప్పుతుంది. అది విన్నాక సరోజ యిన్నాళ్లు సంగతి పూర్తిగా తెలియక ఊరుకున్నా విషయం తెలిశాక యిలాంటి సంగతి సరస్వతమ్మగారికి చెప్పకుండా వూరుకుంటుందా - ముగ్గురూ మతి పోయినవాళ్ళల్లా సోఫాల్లో కూలబడ్డారు. అన్నపూర్ణ కన్నీళ్ళు పెట్టుకుంది. "ఇదేం ప్రారబ్ధం. దీని బతుకు ఆఖరికి ఏమవుతుందో పరువుప్రతిష్ఠఏమవుతుందో" అని కుమిలిపోయింది. రంగారావు హతాశుడైనట్లు కూర్చున్నాడు. గీతకి భయంతో పాటు ఏదో మొండి ధైర్యం కల్గింది 'కానీ, చెపితే చెపుతుంది. మహా అయితే కృష్ణమోహన్ పెళ్ళిచేసుకోడు. అంతేగా' అనుకుంది నిర్లక్ష్యంగా. 'తను చెయ్యగలిగింది తను చేస్తుంది - ఆ పై సంగతి ఆలోచించవచ్చు' అనుకుని కారేసుకొని వెళ్ళి కృష్ణమోహన్ తో సరోజమీద నేరాలు చెప్పి అక్కసు తీర్చుకుంది.
గీత మాటలు విని కృష్ణమోహన్ మనసంతా పాడయింది. తన వస్తువేదో అన్యాక్రాంతమైనట్లు బాధపడ్డాడు, ప్రభాకరంమీద అసూయ భగ్గుమంది, తనను మోసంచేసి నట్లు సరోజమీద కోపం ముంచుకువచ్చింది. వంచకురా లన్న ద్వేషం కల్గింది. అసహనంగా కాలు గాలిన పిల్లి లాగ తిరిగాడు యింట్లో - సోర్జని రాగానే నిలదియ్యాలి! అనుకున్నాడు ఆవేశంగా. మరుక్షణం ఏమని? ఆమెని అడిగే హక్కు తనకేముంది. ఆమె స్వవిషయంలో కల్పించు కోడానికి తను ఆమెకే మవుతాడు. అడిగితే అవునంటే తనేం చెయ్యగలడు? ప్రభాకరంని ప్రేమిస్తుంటే వద్దనడానికి తనెవరు? ఆమె జీవితం ఆమె ఏర్పరచుకుంటే కాదనడానికి తనెవరు? ప్రభాకరంని ప్రేమిస్తూందనుకుంటే తనకెందుకింత వ్యధ?
ఎంత నచ్చచెప్పినా అతని మనసు ఏదో బాధపడసాగింది. సరోజ తనకేం కాదని ఎంత దులిపేసుకుందామన్నా సాధ్య పడలేదు. ఏం తెలియనట్టే వూరుకోవాలనుకున్నాడు.
కాని తీరా చేసి సరోజ రాగానే అతనికి తెలియకుండానే "ఎక్కడికి వెళ్ళావు?" అన్నాడు. అతని గొంతు అతనికి తెలియకుండానే కటువుగా మారింది. సరోజ ఆశ్చర్యపడింది- సినిమాకి వెళ్ళానని తెలిసి మళ్ళీ ఏమిటీ అడగడం అనుకుంది.
"సినిమాకి-" ఇంకా ఏదో చెప్పబోయింది.
"ప్రభాకరంతో సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి వెళ్లేంతదూరం వచ్చిందన్నమాట నీస్నేహం -మంచిదే- కాని ఒక సంగతి మరిచిపోకు. ఆడదానిబ్రతుకు అరిటాకు లాంటిదంటారు పెద్దవాళ్ళు. యిప్పుడిలా తిరిగి రేపొద్దున్న ఆ ప్రభాకరం పెళ్ళి చేసుకోనంటే ఏం చెయ్యగలవు. ప్రభాకరం పెళ్ళి చేసుకుంటాడోలేదో అడిగావా అసలు చేసుకుంటానన్నాడా..."
అతను మాట్లాడుతున్నది అర్ధం అయి సరోజ మొహం ఎర్రబడింది. "నీ స్వవిషయంలో కలుగ చేసుకోడానికి నాకేం హక్కు లేదనుకో. కాని నీ శ్రేయోభిలాషిగా ముందు జాగ్రత్త పడమని సలహా యిస్తున్నాను.
సరోజకి కోపం ముంచుకు వచ్చింది. "మీ సలహాకి థేంక్స్. కాని నేను ప్రభాకరంని పెళ్ళాడతానని మీతో ఎవరు చెప్పారో-" వ్యంగ్యంగా అంది.
"ఎవరు చెపితేనేం, మొగాడు అతను ఎలా తిరిగినా ఏం చేసినా లోకం ఏం అనదు-కాని ఆడపిల్లవు కాస్త ఆలోచించి"....తొందర తొందరగా అన్నాడు.
"కృష్ణమోహన్ గారూ, నామీద మీకున్న అభిమానానికీ ధన్యవాదాలు. కాని మీరనుకున్నంత తప్పుడు పనులు నేనేం చెయ్యలేదు" కోపంగా అంది.