Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 36
దేనికొరకు?
వేళకాని వేళలలో, లేనిపోని వాంఛలతో -
దారికాని దారులలో, కానరాని కాంక్షలతో -
దేనికొరకు పదే పదే దేవులాడుతావ్?
ఆకటితో, అలసటతో,
ప్రాకులాడుతావ్?
శ్రీనివాసరావ్!
శ్రీనివాసరావ్!
దేనికోసమోయ్?
నడిరాతిరి కడలి వద్ద
హోరుగాలి ఉపశ్రుతిగ,
నీలోనే నీవేదో ఆలపించుతావ్?
అవ్యక్తపు టూహలతో ఆలసించుతావ్
జగమంతా నిదుర మునిగి
సద్దణగిన నడిరాతిరి
నీలోనే నీ వేదో ఆలకించుతావ్?
శ్రీనివాసరావ్!
శ్రీనివాసరావ్!
- 1939 (?)
* * *
Previous Page
Next Page