ఇంతలో ఆమెను ఎవరో "వేదితా!" అని పిలిచినట్లయింది.
ఆమె ఉలికిపడి ఆగిపోయింది.
"చూడు! నువ్వెవరివో మరిచిపోయావా!"
ఆమె వళ్లు ఝల్లుమంది. శరీరమంతా ముచ్చెమటలు పోశాయి.
"నీలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఇప్పుడేకాదు. ఏనాడయితే శేషశాయి నిన్ను ఆక్రమించడానికి తలపెట్టి నానా అనుభవాలకూ గురిచేశాడో, అప్పట్నుంచీ నీలో మార్పు ప్రారంభమయింది. రాను రానూ నీవు బలహీనురాలివి అయిపోతున్నావు గాని, ముందుకు పురోగమించటంలేదు. సులభంగా నిశ్చలతని సాధించిన నీవు తిరిగి అంత సులభంగా పోగొట్టుకున్నావు. వేదితా! అత్తవారింటి నుంచి యిక్కడకు అమంగళిగా తిరిగివచ్చి, నీ తండ్రి ఉద్భోడంతో ఈ నూతనజీవితం ఆరంభించాక ఏవ్యక్తితో నయినా యింత వ్యావహారికంగా మాట్లాడి యెరుగుదువా? నీ గంభీరత్వం ఏమయింది? నీ మానసిక బలం ఏమయింది? కాల్పనిక జగత్తులోని ఆకర్షణలకు అంత తొందరగా లోనవుతున్నావేం? ఇవేళ కల్యాణమూర్తి వచ్చాడు. ఎంత నిగ్రహించుకుందామన్నా అనేక చోట్ల అతనికి దొరికి పోయావు. ఇదేనా నీ సాధన, నీ జీవితపరమావధి?"
ఆమె మెల్లిగా కదిలింది. అడుగులు తడబడుతున్నాయి. ఎలాగో నడిచివెళ్ళి కృష్ణ విగ్రహం ముందు మోకరిల్లింది. కళ్ళు మూతలు పడినాయి.
"ప్రభూ! గోపాలా! ఏమిటి నాకీ పరీక్షలు? రోజులకొద్దీ ప్రోగుచేసుకున్న నిగ్రహశక్తి అంతా క్షణంలో దూదిపింజలా ఎగిరిపోతోంది. నా పూజలో, నా ప్రార్థనలో నా తపస్సులో శారీరకంగా శ్రమపడుతున్నానుగాని, ఏకాగ్రత లభించటంలేదు. సుఖశాంతులు ఉండటంలేదు. నామీద కరుణ కలగటంలేదా నీకు? నన్ను అనుగ్రహించవా?
చాలాసేపు అచేతనావస్థలో ఉన్నాక వేదిత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. పాలరాతితో ముగ్థ మోహనంగా చెక్కబడిన కృష్ణ విగ్రహం ఎప్పటి చిరునగవుతో, చిలిపిగా మెరిసే కనులతో అలాగే నిలబడివుంది.
* * *
తర్వాత నాలుగయిదు రోజులలోనూ కల్యాణమూర్తి రెండుసార్లు వచ్చాడు వేదిత కుటీరానికి. కాని రెండుసార్లూ ఆమె వంటరిగా లేదు. ఒకసారి గోవిందాచార్యులుగారు గీతాపారాయణం చేస్తూ కూర్చుని ఉన్నారు. "రావోయ్ రా! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి?" అని ఆప్యాయంగా పలుకరించి కబుర్లు చెబుతూ కూర్చున్నారు. మరోసారి ఊళ్ళోని ముత్తయిదువులు కొందరు ఆమెతో గోష్టిలో వుండగా చూసి దూరంనుంచే వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అతని యింటికి బేరం కుదిరింది. ఇంకా ఒకటి రెండురోజుల్లో పనిపూర్తయిపోయేటట్లుగా ఉంది. అతని దూరపు బంధువులుంటే వారి యింట్లో భోజనంచేసి తన యింట్లో వంటరిగా పడుకుంటూ కాలం గడపసాగాడు. ఒకటి రెండుసార్లు ఇందుమతమ్మగారి దగ్గరకు వెళ్ళి పరామర్శచేసి, కాసేపు మాట్లాడి వచ్చాడు అతన్ని చూసి ఆవిడ ఆనందంతో ఉప్పొంగుతూ కన్నీళ్ళు పెట్టుకుంది.
అతను వచ్చినప్పుడల్లా వేదితకు ధైర్యం సడలిపోతూ వుండేది. "మీరంతా ఎందుకిలా వచ్చినాతో దాగుడుమూతలాడుచున్నారు? నన్నెందుకిలా సంకుచిత భావాలకు గురిచేస్తున్నారు? "నువ్వు వెళ్ళిపో కల్యాణమూర్తి! నువ్వు తక్షణం యిక్కడ్నుంచి వెళ్ళిపో! నిన్ను చూస్తే నాకు భయంగా వుంది." అని మనసులో పదే పదే ఆక్రోశించేది. మళ్ళీ వెంటనే పాపం అతనేం చేశాడు? నా నీడని చూసి నేనే బెదిరిపోతున్నాను. బొత్తిగా బేలనయిపోతున్నాను, నన్ను నేను దగా చేసుకుంటున్నాను. ఇదంతా ఓ భ్రమ, లీల, భ్రాంతి, ప్రవాహం, అందులో నేను అల్పపు బిందువునయి ప్రవహిస్తున్నాను." అంటూ ఖేదంపొంది తనని తాను సరిదిద్దుకోవటానికి ప్రయత్నంచేస్తూ ఉండేది.
ఓ రోజున అనుకోని విధాన ఆమెకు సీత దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది చదువుతూంటే చేతులతో పాటు మనసూ ఒణికింది.
"అక్కా!"
ఎక్కడలేని శక్తి కూడదీసుకుని అతి ప్రయాసతో నీకీ ఉత్తరం రాస్తున్నాను. చెయ్యి ఒణికిపోతోంది. కళ్ళు మసక క్రమ్ముతున్నాయి. అయినా... రాస్తున్నాను సౌజన్యరాశివయిన నీకు, మళ్ళీ కలుసుకోలేమో నన్న భయంవల్ల.
నాకు వ్యాధి బాగా ముదిరిపోయింది. విషజ్వరం అంటున్నారు యిక్కడి వైద్యులు. నాకెవరూ ముఖంమీద చెప్పకపోయినా, వాళ్ళ ముఖాల్లోని ఆందోళననూ, హావభావాలనూ బట్టినా శరీరంలోని జవసత్వాలు ఉడిగిపోవటంబట్టీ నా పరిస్థితి యెంత ప్రమాదంగా వుందో నేను గ్రహించగల్గుతున్నాను. అయినా నాకేం భయం వెయ్యటంలేదు. మార్పులేని జీవితంలో మార్పువచ్చే తరుణంలో యెన్నో వసంతాలు, ఋతువులూ నిర్దయగా గడిచిపోతూ యివ్వలేని హామీ మేమిస్తామంటూ కొన్ని క్షణాలు దగ్గరపడుతున్న సమయంలో - భయం ఎందుకు అక్కా?
అయినా మనిషికి కొన్ని చిత్రమైన లేకపోతే అల్పమైన కోరికలు వుంటాయి. వారిని.... ఈ దశలో చూడాలని ఎంతో.... ఎంతో... అనిపించి ఆనందపురం నుండే ఎన్నో ఉత్తరాలు రాశాను. ఇక్కడికి వచ్చాక టెలిగ్రాం యిప్పించాను. జవాబు లేదు. వారు రారు.
నువ్వు ముముక్షువువు. నీకు పునర్జన్మ ప్రసక్తి లేదు. కాని నేను అల్పురాలను కాబట్టి, మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం తిరిగి ఎక్కడో జన్మిస్తాను. ఎవరినో పెళ్ళి చేసుకుంటాను. సుఖాలో, యాతనలో పడతాను. ఛీ ఛీ! ఎంత అసహ్య మక్కా!
నువ్వెవరివి? నీకు నాకూ సంబంధమేమిటి? నీకు ఉత్తరం రాస్తూంటే నాకెందుకింత తృప్తిగా ఉంది? ఇవన్నీ సమాధానంలేని ప్రశ్నలు. నువ్వంటే నాకెందుకింత ఆసక్తి? తెలీదు.
ఆనాడు నీ కుటీరానికి మొదటిసారి వచ్చి నిన్ను కలుసుకున్నప్పుడు, తోటలో చెట్టాపట్టాలు వేసుకొని మనం తిరిగినప్పుడు, కోనేటి గట్టున ఒకరి ప్రక్కన ఒకరు ఆనుకుని కూర్చున్నప్పుడు - నా మనస్సులో రేగిన భావ సంచలనం... నా విపరీతపు ఆలోచనలూ.... అబ్బా! రాయలేను. అదంతా గతంలో జరిగిన పీడకల.
కల అంటే జ్ఞాపకం వచ్చింది. నిన్నరాత్రి నా కలలో నీవు కనిపించావు. ఎలా వున్నావనుకున్నావు? మంచి వెలగల చీరె కట్టుకుని నుదుట కుంకుమ పెట్టుకుని, తల శుభ్రంగా దువ్వి ముడివేసుకుని, ఆ ముడిలో సువాసనలు గుబాళించే పూలచెండు తురుముకుని అపురూపమైన శోభతో అప్సరసలా వెలిగిపోతున్నావు! ఈ ప్రపంచానికి నువ్వు మహారాణి వనిపించింది. తనివితీరా తిలకిస్తూ ఎంతసేపు నిల్చున్నానో....!