అటామె ఆశ్చర్యపోవడం...ఇటు యోగి చిరాకుపడడంతో శ్రీధర్ టోటల్ గా కన్ ఫ్యూజన్ కి గురయ్యాడు.
స్పీకర్ ఫోన్ బటన్ ఆఫ్ చేసి, అమాంతంగా శ్రీధర్ చేతిలోని హేండ్ సెట్ తీసుకుని...దానికున్న హోల్డ్ బటన్ ప్రెస్ చేసి-
"నీకసలు బుద్దుందా? నువ్వు చేయాల్సింది ఏమిటో...మాట్లాడవలసింది ఏమిటో తెలీకుండా పోయిందేమిటి." అంటూ కసురుకున్నాడు యోగి.
అప్పటికిగాని శ్రీధర్ కి తనుచేసిన తప్పేమిటో తెలిసిరాలేదు.
"సారీరా...కంగారులో అలా అనేశాను" అన్నాడు శ్రీధర్.
"సర్లే...ఆడాళ్ళగురించి తక్కువ అంచనా వేయకు. వాళ్ళు తెలుసుకునేది తక్కువే అయినా, గ్రహించేది ఎక్కువ కనుక, మనకంటే వాళ్ళే తెలివైనవాళ్ళు, ఇంతసేపు మాట్లాడకుండా వున్నావేంటని అడిగితే- ఒళ్ళు తుడుచుకుంటున్నానని చెప్పు. నువ్వు చెయ్యవలసింది రెడ్ ఇంక్ తో నువ్వు అనవలసింది బ్లూ ఇంక్ తో రాస్తాను...జాగ్రత్త..." అంటూ హోల్డ్ బటన్ ని ఆఫ్ చేసి, హేండ్ పీస్ ని శ్రీధర్ కిస్తూ, బేస్ పీస్ స్పీకర్ ఫోన్ బటన్ ప్రెస్ చేశాడు యోగి.
"హలో...ఏం చేస్తున్నావ్...ఇంతసేపూ?" యోగి ఊహించినట్టుగా అడిగిందామె.
"సోఫా తడిచిపోతుంటే...పక్క కెళ్ళి ఒళ్ళుతుడుచుకుని వచ్చాను. సారీ ఫర్ ది ఇన్ కన్వీయెన్స్" అన్నాడు శ్రీధర్.
"బట్టలేసుకున్నావా?" అడిగిందామె.
శ్రీధర్ కి ఏం చెప్పాలో తెలీక యోగికేసి చూశాడు. ఏం మాట్లాడమంటావన్నట్టు.
"అది కూడా తెలీదా? నిన్ను బాగుచేయడం నా వల్ల కాదు...అని తొందరలో బ్లూ ఇంక్ తోరాసి చూపించాడు యోగి.
"అది కూడా తెలీదా? నిన్ను బాగుచేయడం నావల్ల కాదు" అన్నాడు శ్రీధర్ ఫోన్ లో.
"నిన్ను బాగుచేద్దామని నేను అనుకుంటుంటే...ఇలా అనేశా వేమిటి? ఆ మాత్రం తెలీకపోలేదులే... ఒక్కడివే వున్నావుగా ఫ్లాట్ లో...ఏ పొడిటవలో కట్టుకుని వుంటావ్. అవునా?" అందామె.
యోగికి ఏడుపొచ్చినంత పనయింది. పిచ్చిపిచ్చిగా జుత్తంతా చెరిపేసుకుంటూ, నుదురు కొట్టుకుంటూ పిచ్చిచేష్టలు చేస్తూ, వెర్రి చూపులు చూశాడు.
"పాపం ఏమయింది నీకు?" యోగికేసి జాలిగా చూస్తూ అడిగాడు శ్రీధర్.
ఫోన్...డాన్...మైక్రోఫోన్...అని అతిచిన్నగా అన్నాడు బేస్ పీస్ బిల్టిన్ మైక్రోఫోన్ హోల్ మీద వేలు అడ్డుపెట్టి.
"పాపం నీకెక్కువయినట్టుంది" అన్నాడు శ్రీధర్ తిరిగి యోగికేసి చూస్తూ.
యోగి ఇంక భరించలేక మూర్ఛవచ్చిన వాడిలా సోఫామీద పడిపోయి... గిలగిలా కొట్టుకోసాగాడు... శ్రీధర్ అమాయకత్వాన్ని భరించలేక.
"ఏమిటెక్కువయింది నాకు? నన్నేమిటి పాపం ఏమైంది నీకు అని ప్రశ్నిస్తున్నావ్...?" పూజ మాటలతో గాని ఫోన్ మౌత్ పీస్ కి చేయి అడ్డుపెట్టకుండానే ఆ మాటలన్నట్లు అతనికి తెలిసిరాలేదు.
"అరెరె...నేనిది చూసుకోలేదు" అన్నాడు తిరిగి అదే తప్పు చేస్తూ.
"ఏమిటి... టవల్ వూడిపోయిందా...?" ఫక్కున నవ్వుతూ అందామె.
ఆమె మాటలు వింటూనే యోగి సోఫాలోంచి లేచి-నమిలి మింగేస్తా నన్నంత ఉద్రేకంగా చూశాడు శ్రీధర్ కేసి.
కుడిచేత్తో లెంపలు వేసుకుని...తప్పయిపోయింది. సారీ అన్నట్లు అభినయించాడు శ్రీధర్.
వెంటనే యోగి సంభాషణ కొనసాగించమని సైగ చేశాడు.
"ఏమిటి ఏదేదో మాట్లాడుతున్నావ్? అసందర్భంగా ప్రవర్తిస్తున్నావ్... ఏమైంది నీకు? కొంపదీసి మందేమన్నా పుచ్చుకుంటున్నావా." ఫోన్ కి ఆవేపు నుంచి అడిగిందామె.
ఆ మాటలకు గతుక్కుమన్నాడు శ్రీధర్.
"ఆ...అవును. ఒక పెగ్గే...అదీ నా తప్పుకాదు...మా ఫ్రెండొకడు బాటిల్ పంపిస్తే..." తడబాటుగానే చెప్పాడు శ్రీధర్.
కొద్ది క్షణాలు నిశ్శబ్దం...ఫోన్ లో... "శభాష్. తప్పుచేసినా, ధైర్యంగా ఒప్పుకుంటే చేసిన తప్పు సగం మాఫీ అయిపోయినట్టే...చూడు అలవాట్లెప్పుడూ ఒంటరిగా రావు...స్నేహితుల రూపంలోవచ్చి మనలోకి చొచ్చుకుపోతాయి. అప్పుడే మనిషి జాగ్రత్తపడాల్సింది.
మనుష్యులెంత స్వార్థపరులు. వారు చూపే మర్యాద ఎంత కృతకమయిందో తెలియాలంటే ఓడ ప్రయాణం చెయ్యాలట. అలాగే స్నేహితులెంత మంచివాళ్ళో, ఎంత సంస్కారవంతులో తెలియాలంటే, మనమే మానవ బలహీనతల గురించి, చెడు అలవాట్ల గురించి వాళ్ళముందు ప్రస్తావించాలట. అప్పుడు వాళ్ళేస్థాయిలో స్పందిస్తారో - ఆ స్పందన నెగిటివ్ లావుందా? పాజిటివ్ లా వుందా...అని సమీక్షించుకుంటే, మన సరైన దారేదో నిశ్చయమై పోతుందట" సౌమ్యంగానే చెప్పినా పరోక్షమైన హెచ్చరిక ఆమె కంఠంలో తొంగిచూడకపోలేదు.
"నాకిది ఎలా అలవడినా, ఇక్కడ కాదు. స్టేట్స్ లో స్టడీస్ లో వుండగానే అలవడింది. ఇది చెడు అని నాకనిపించలేదు. తాగేవాళ్ళంతా చెడ్డవాళ్ళని- తాగని వాళ్ళంతా గొప్పవాళ్ళు, మంచివాళ్ళని అనుకోవడం నీ తెలివితేటల స్థాయిని కిందకు లాగేస్తుందేమో ఆలోచించుకో- నాకిప్పుడు దీని మూలంగా ప్లెజర్ లభిస్తోంది. దీనికంటే హై ఓల్టేజిలో మరేదన్నా ప్లెజర్ లభిస్తే, దీన్ని వదిలేస్తానేమో...నేనిప్పుడు వంటరివాడిని. నాకిదే ఇప్పుడు తోడు- అయినా నేనేం నిత్య తాగుబోతుని కాదు. బాటిల్స్ కి బాటిల్స్ లేపేసే పిచ్చి తాగుబోతుని అంతకంటే కాదు..." అన్నాడు శ్రీధర్ కావాలనే రవ్వంత కఠినత్వాన్ని తన సంభాషణకి జోడించుకుని.
బాగా మాట్లాడావన్నట్టు యోగి మెచ్చుకోలుగా సంజ్ఞ చేశాడు.
"సారీ...సారీ...సారీ...ఎందుకంత ఆవేశం ఇంతకీ డిన్నర్ రడీగా వుందా?" అడిగిందామె.
"బ్రహ్మచారికెప్పుడూ ఆ ఇబ్బంది తప్పదు. ఇట్స్ ఓకే...ఇంతకీ నువ్వెలా వుంటావ్?"
"చెప్పడం కష్టమేమో..."
"ఓ...పని చెయ్... నీ గది తలుపులు పూర్తిగా వేసుకుని నగ్నంగా నిలువుటద్దం ముందు నిలబడి చెప్పు" అని అన్నాక కొంచెం పరిమితుల్ని దాటానా అని కంగారు పడ్డాడు శ్రీధర్.