"నేర్చేసుకున్నా" అన్నాడు రాజా.
అపనమ్మకంగా చూసింది అర్పిత.
"అప్పుడే?"
"మధ్యాహ్నానికే వచ్చేశాయ్"
"ఆఁ!" అంది నమ్మనట్లు.
"నీ పుస్తకం ఇవ్వు" అన్నాడు.
తెలుగు పుస్తకం ఇచ్చింది అర్పిత. కూడబలుక్కుంటూ ఒక పేజీ చదివాడు రాజా.
"నీకు ఇంతకు ముందే చదవడం వచ్చు" అంది అర్పిత.
"నన్ను నమ్ము అర్పిత! ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను. నేను అక్షరాలు చదవడం మొదలెట్టింది ఇవాళే....!" అన్నాడు.
అతని మాటల మీద సినిమా డైలాగుల ప్రభావం స్పష్టంగా కనబడుతోంది.
అది అర్థం కాలేదు అర్పితకి.
అతని వేపు మెరుస్తున్న కళ్ళతో చూసింది అర్పిత.
"అయితే నువ్వు చాలా ఇంటలిజెంట్ వి అన్నమాట" అంది.
నవ్వాడు రాజా.
ఇంగ్లీషు కూడబలుక్కుంటూ చదవడానికి అతనికి వారం రోజులు పట్టింది.
అది మొదలుకుని ప్రతిరోజూ ఒకే రకం షెడ్యూల్ అతనిది.
పొద్దున్నే లేవడం....
అక్కడికి దగ్గర్లోనే ఉన్న టీ కొట్టులో ఒక బన్ను తినడం.
తర్వాత ఊరి బయట ఏటిలో ఈత.
తిరిగి రాగానే కృష్ణాజీ ఫోటోకి సాష్టాంగ నమస్కారం చెయ్యడం, చదువు మొదలెట్టడం.
అక్షరాలను అతను చూడడం అది మొదలు కాదు.
అంతకుముందు వాటికో అర్థం ఉన్నట్లు అనిపించేదికాదు అతనికి. అక్షరాలను, వాక్యాలనూ చూస్తే ఏవో చిత్రమైన పురుగులు నిశ్శబ్ద భాషలో ఏదేదో చెబుతున్నట్లు అనిపించేది.
కానీ ఇప్పుడు హఠాత్తుగా....
ఆ రహస్య సంకేతాల తాలూకు కోడ్ ని తను డీకోడ్ చేసినట్లు అయిపోయింది.
నిక్షిప్త నిధి తాలూకు రహస్యం దొరికినట్లే అయిపోయింది.
అది మొదలు....
ఆ రోజు నుంచి చదవడం ఒక వ్యసనం అయిపోయింది రాజాకి.
కొంతమంది ఒకసారి మద్యం తాగగానే దానికి బానిసయిపోతారు. కొంతమంది జూదానికి గులాములైపోతారు. కొందరు మగువల వశీకరణానికి లొంగిపోతారు.
కానీ చదువు అనేది వీటన్నిటికంటే పెద్ద వ్యసనమైపోయింది అతనికి.
ఆ రోజు నుంచి అతనికి పగలంతా చదువే! రాత్రిళ్ళూ చదువే!
అర్పితకి మాత్రం ఇదంతా అంత నమ్మదగ్గ విషయంగా తోచలేదు. అతనికి అంతకుముందే చదువు వచ్చనీ, తనను ఫూల్ చేస్తున్నాడనీ ఆ అమ్మాయికి గట్టిగా నమ్మకం ఏర్పడిపోయింది. అందుకని యిక ముందు అతనితో జాగ్రత్తగా వుండాలన్న నిశ్చయానికి వచ్చేసింది కూడా!
ఆ మర్నాడు అర్పిత అతనికి కనబడలేదు.
కానీ అంతకంటే ఆసక్తికరమైన పోస్టరు ఒకటి కనబడింది అతనికి.
నేడే చూడండి!! నేడే చూడండి!!
ఫేమస్ సర్కస్
కనీ వినీ ఎరగని
కొత్త కొత్త ఫీట్స్ తో
మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి
మీ ఊరికి వచ్చేసింది
ఫేమస్ సర్కస్
వెంటనే అతనికి తెలియకుండానే అతని కాళ్ళు సర్కస్ టెంటు వేపు నడిచాయి.
ఈ లోకంలో భాగమే అయినా, పూర్తిగా వేరే లోకంలాగా వుంటుంది సర్కస్ ప్రపంచం. వాళ్ళ బతుకు వేరు...వాళ్ళ బంధాలు వేరు, బాంధవ్యాలు వేరు.
సినిమాలూ, టెలివిజన్ పాపులర్ కాకముందు పిల్లలనీ, పెద్దలనీ కూడా అలరించడంలో సర్కస్ ని మించిన సాధనం యింకోటి వుండేది కాదు. పిల్లలకి మాత్రం సర్కస్ ఊరికి వచ్చిందంటే పండగే! ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, పులులు, సింహాలు, కోతులు, ఎలుగుబంట్లు, రింగ్ మాస్టర్లు, బఫూన్లు... ఉత్సాహంగా...ఉద్వేగం....
సర్కస్ ఊరికి వచ్చినట్లు ప్రతి రాత్రీ అందరికీ గుర్తుచేసేలా ఆకాశంలో కాంతి స్థంభం లాంటి సెర్చ్ లైటు, టెంటు దగ్గరికెళితే వెలిగి ఆరిపోతుండే సీరీస్ లైట్లు...వాటిని పిల్లలు "వచ్చే పోయే లైటు" అనేవాళ్ళు. టెంటు బయట రకరకాల తినుబండారాల బళ్ళు, "రంగు" సోడాల బళ్ళు!
ఓహ్! తిరనాళ్ళలాగా ఉండేది ఆ వాతావరణం.
ఊళ్ళో పిల్లల్లో సగం మంది అక్కడే ఉండేవాళ్లు.
ఇప్పుడు ఈ రోజుల్లో సర్కస్ కి అంత ఆదరణ లేదు.
సర్కస్ టెంటు దగ్గరికెళ్ళాడు రాజా.
అక్కడి కెళ్ళగానే అన్ని రకాల జంతువుల వాసనా కలిసి చిత్రంగా వుంది వాతావరణం.