మధు రిషి భుజం మీద చెయ్యి వేసి "అంత త్వరగా డిసైడ్ చేసుకుంటావనుకోలేదురా. పాపం ఆశ్రిత చాలా బాధపడ్తూ వెళ్ళిపోయింది" అన్నాడు.
రిషి వింతగా చూస్తూ "అంత త్వరగా ఏం డిసైడ్ చేసుకున్నానూ?" అన్నాడు.
"హోటల్ కి వెళ్ళాక పెసరట్ అడిగి, లేదంటే దోశతో సరిపెట్టు కుంటామనుకో. అలా కాకుండా పెసరట్ చేస్తున్నారంటే అందాకా ఆగడమే బెటరేమో" అన్నాడు నెమ్మదిగా మధు.
రిషి విసుగ్గా "నేనలా చెయ్యను! నాకు పెసరట్ తినాలనిపిస్తే పెసరట్ దొరికే హోటల్ కే ముందుగా కసుక్కుని మరీ వెళ్తాను. నాకలాంటి మొహమాటాలూ, తప్పనిసరి తద్దినాలూ ఇష్టం వుండవు" అన్నాడు.
"మరి.... మరి సుబ్బుల్ని పెళ్ళి చేసుకుంటానని మాటెందుకు ఇచ్చావు?" అడిగాడు మధు.
"నాకు ఆడబిడ్డ లాంఛనాలు ఇప్పిస్తున్నావా? లేదా?" అతని దగ్గరకొస్తూ అడిగింది శ్రీజ.
రిషి అయోమయంగా "నేను సుబ్బుల్ని చేసుకోవడం ఏమిటి? మధ్యలో మీకు లాంఛనాలేమిటి? మీరేమంటున్నారో నాకు అర్ధం కావడం లేదు" అన్నాడు.
రిషి ఈ మాటనగానే మాట్లాడ్తున్న అందరూ మాటలు మానేసి అతని చుట్టూ మూగారు.
"ఇందాకా ఆదివారమే పెళ్ళి జరిగి తీరుతుంది అని నువ్వు అనలేదూ!" బామ్మగారు పెద్ద గొంతుతో అరిచింది.
"అవును. అన్నాను కానీ, సుబ్బులు పెళ్ళి విషయం కాదు. ఆదివారం బుజ్జిగాడూ వాళ్ళు బొమ్మల పెళ్ళి గ్రాండ్ గా చేస్తున్నాం కాస్త సాయం చెయ్యమన్నారు. నేను ఇందాకట్నుంచీ ఆ విషయమే తీవ్రంగా ఆలోచించి వాడు రాగానే ఎనౌన్స్ చేసానంతే!" అన్నాడు.
"ఆ! అంటే నువ్వు ఆదివారం పెళ్ళి అన్నది బొమ్మల పెళ్ళి గురించా?" బామ్మగారు నీరసంగా అడిగింది.
సుబ్బులు లేచి "నువ్వు ఎప్పుడూ ఇంతే బామ్మా! పేపర్లో తప్పు నంబర్ చూసి పదో తరగతి పాసయ్యానని ఊరందరికీ ఇప్పటికి ఆరుసార్లు చెప్పావు" అంది.
"ఐయామ్ ఎక్స్ ట్రీమ్ లీ సారీ సుబ్బులూ!" అన్నాడు బాధగా మొహంపెట్టి రిషి.
"మరి నా కంచి పట్టు శారీ సంగతో...." అడిగింది శ్రీజ.
మధు కోపంగా "నీ మొహానికి కంచి పట్టు శారీ కూడానా! ముందు నా ప్యాంటూ, షర్టూ విప్పి సీసాడు డెట్టాల్ పోసి జాడించి ఆరెయ్యి" అన్నాడు.
శ్రీజ కెవ్వున అరిచి "రిషీ! అవతల ఆశ్రిత అపార్ధం చేసుకుని ఏం అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో! త్వరగా వెళ్ళు" అంది.
"అవును. ఏడుస్తూ వెళ్ళింది" అన్నాడు మధు.
"ఎడ్రస్ చెప్పు" రిషి అడిగాడు. శ్రీజ ఆలస్యం చెయ్యకుండా చెప్పింది. రిషి కూడా ఆలస్యం చెయ్యకుండా రయ్యిమని గేట్లోంచి దూసుకుపోతూ వుంటే మల్లేష్ ఎదురొచ్చి "బాజా వాళ్ళని తోల్కొచ్చినా బయానా ఇప్పించు" అన్నాడు.
"బయానా!" అని రిషి ఆశ్చర్యంగా చూసాడు.
"జరంత బజాయించి సూసించే" అన్నాడు మల్లేష్.
వెంటనే వాళ్ళల్లో ఒకడు "ఏక్ .... దో.... తీన్" అని వాయించడం ఆరంభించసాగాడు. దాంతో పిల్లలంతా వాడి చుట్టూ చేరి డాన్స్ ప్రారంభించారు.
ముసలాయన కూడా వంట మనిషిని వెంటపెట్టుకుని వచ్చి బామ్మగారితో "ఎడ్వాన్స్ ఇప్పించండి. అన్ని వంటలూ చక్కగా చేస్తారట. పిండివంటలు మరీ బాగా చేస్తారట" అన్నాడు.
బామ్మగారు కోపంగా "గారెలు వండడం వచ్చా" అంది.
"అదేం ప్రశ్నమ్మా! భేషుగ్గా చేస్తాడట" అన్నాడు పరమానందంగా ముసలాయన.
"ఇంకేం మరీ నీ శ్రాద్ధానికి వీళ్ళనే పెట్టిద్దాం" కోపంగా చెప్పిందావిడ.
"ఆ!" తెల్లబోయాడు వంటతను.
మల్లేష్ కూడా బ్యాండ్ వాళ్ళని ఆగమని, బామ్మగారి దగ్గరకొచ్చి, "ఏంది కిరికిరి?" అన్నాడు.
"వాళ్ళని పంపించెయ్యి, పెళ్ళి కాన్సిలయింది" అంటూ మధు మల్లేష్ కి అంతా వివరించి చెప్పాడు.
"వచ్చినవాళ్ళు ఊరికేపోతారా? ఏదో ఒకటి ఇచ్చి పంపించండి" చెప్పాడు ముసలాయన.
బామ్మగారు కసిగా "చూడండి నాయనా! ఈ ముసలాయన ఇందాకా ఊపిరి అందక అవస్త పడుతుంటే తొందరపడి మీ అందర్నీ పిలిపించాం. కాస్త తేరుకున్నాడుగా ఈసారికి వెళ్ళిరండి. అవసరం పడితే మళ్ళీ పిలిపిస్తాం.... అప్పుడు వాయిద్దురుగాని ఏక్....దో....తీన్....అని" అంది.
రిషి ఈ సందట్లో మెల్లగా జారుకుని ఆశ్రిత దగ్గరకు పరుగుపెట్టాడు.
* * * *
ఆటోదిగి గేటు తీసుకుని లోపలికి పరుగుతీస్తున్న రిషిని రెండు చేతుల్తో ఆపుతూ "కౌన్ హై? క్యా హోనా?" అని అడిగాడు వాచ్ మన్.