కింద చాపమీద పది పన్నెండుమంది స్త్రీలు కూర్చొని వున్నారు. ఎదురుగా వెంకటేశ్వరస్వామి ఫోటోతోపాటు సాయిబాబా ఫోటో కూడా వుంది. సాయిబాబా ఫోటో పక్కన వుండటంవల్ల నామాలు ధరించిన వెంకటేశ్వరస్వామి కొంచెం పెద్దమనిషి తరహాగా కన్పిస్తున్నాడు.
గ్రామసేవిక మీనాకుమారి వరండాలో నిల్చొని, ఆఫీసరుగారి ఆగమనం కోసం ఎదురుచూస్తూ వుంది.
కామాక్షమ్మ గాజులపొత్తి తొలగించి, చేతినున్న గడియారం చూసుకుంది. చాలా చిన్నదైన ఫారెన్ వాచీలో అంకెలు కామాక్షమ్మ చూపులకు అందలేదు.
"ఇదిగో! సేవికా! ఇట్టారా!" బొంగురు గొంతుతో గ్రామ సేవికను పిల్చింది కామాక్షమ్మ.
గ్రామసేవిక ముఖం చిట్లించుకుంటూ లోపలకు వచ్చింది.
"టైమెంతయింది?"
గ్రామసేవిక ఒకసారి కామాక్షమ్మ గాజుల మధ్యవున్న గడియారం కేసి చూసింది. మళ్ళీ తన చేతిగడియారం చూసి "పదకొండు" అన్నది ముసిముసిగా నవ్వుకుంటూ.
కామాక్షమ్మ కించపడింది.
"నీ బోడిగడియారం ఎప్పుడూ సరిగా పనిచెయ్యదు. నా గడియారం చూసి చెప్పు!" చెయ్యి ముందుకుచాచి కసురుకుంది కామాక్షమ్మ.
మీనాకుమారి ముఖం చిన్నబోయింది. కామాక్షమ్మ దగ్గిరగావచ్చి, ఆమె గడియారంకేసి చూస్తూ "పదకొండుంబావ్!" అన్నది చిన్నగా.
"నేను చెప్పలా! నీది బోడి గడియారం అని?" అన్నట్టు నవ్వింది కామాక్షమ్మ.
"ఇంకా వాళ్ళు రాలేదేం?" అన్నది కామాక్షమ్మ.
"అదుగో! వస్తున్నారు! భజన మొదలు పెట్టండి?" అన్నది గ్రామసేవిక.
"ఆఫీసరేరీ! ఆమేనా కొత్తగా వచ్చిన ముఖ్య సేవిక?" అడిగింది కామాక్షమ్మ.
గ్రామ సేవిక కామాక్షమ్మ మాటలు పూర్తిగా వినకుండానే వరండాలోకి వచ్చింది.
లోపల ఆడవాళ్ళు భజనకు లంకించుకున్నారు. అనేక కంఠాలు వివిధ శృతుల్లో విన్పిస్తున్నాయి.
సునంద ఒకచేత్తో చిన్న క్యారియరూ, రెండో చేత్తో సంచీ పట్టుకొని వచ్చింది.
"ఆఫీసరుగారు రాలేదా?" గ్రామ సేవిక సునందను అడిగింది.
"రాలేదు టూర్ క్యాన్సిల్ అయింది" ముక్తసరిగా సమాధానం చెప్పి లోపలకు అడుగు పెట్టింది.
సునందను చూసి ఆడవాళ్ళ కంఠాలు తారాస్థాయిని అందుకున్నాయి.
సునందకు వాళ్ళు భజన చేస్తున్నట్లు అన్పించలేదు. అందరికీ ఒకేసారి కడుపులో ఏదో భరించరాని బాధ కలిగి లబోదిబోమని అరుస్తున్నట్లనిపించింది.
గ్రామసేవిక, సునందకు కామాక్షమ్మకు పరిచయం చేసింది. సెక్రటరీ ముందుకొచ్చి తనను తాను పరిచయం చేసుకుంది.
"భజనగా లేదు. ఒకటే కాకిగోలగా వుంది. ముందా భజన ఆపమను" గట్టిగా అన్నది సునంద గ్రామ సేవికతో.
భజన ఆగింది. "అమ్మయ్య!" అనుకుంది సునంద.
"మీ మండలి కార్యక్రమాలు కొంచెం వివరించండి!" సునంద కామాక్షమ్మను అడిగింది.
కామాక్షమ్మ, "చెప్పు!" అన్నట్టు గ్రామ సేవిక ముఖంలోకి చూసింది.
మీనాకుమారి ముందుకొచ్చి గబగబా గుక్కతిప్పుకోకుండా చెప్పసాగింది.
"వారానికి రెండుసార్లు మామూలు భజన్లు, పుణ్య దినాల్లో ప్రత్యేక భజన్లూ, అమావాస్య, పౌర్ణమికీ పురాణ కాలక్షేపాలు, చలికాలం అయితే లోపల, వేసవికాలం అయితే ఆరుబయటా."
బటన్ నొక్కినట్టు వరసగా చెప్పుకుపోతున్న గ్రామ సేవికను మధ్యలోనే ఆపింది సునంద. "ఈ భజన ప్రత్యేక భజనా.... మామూలు భజనా?" అడిగింది వచ్చే నవ్వును ఆపుకుంటూ.
"మామూలు భజనే. ఇవ్వాళ మామూలు ప్రసాదం.... ఒక కొబ్బరికాయ మాత్రం...."
"అంటే మామూలు ప్రసాదం వుంటే మామూలు భజనా.... స్పెషల్ ప్రసాదం వుంటే స్పెషల్ భజన అన్నమాట?" సునంద పకపక నవ్వింది.
మీనాకుమారి తలతిప్పింది.
"భజన్లూ, పురాణ కాలక్షేపాలు తప్ప మరే కార్యక్రమాలూ లేవా ఈ మండలికి?" అడిగింది సునంద.
"వున్నాయి. కుట్లూ.... అల్లికలూ.... కోళ్ళ పెంపకం.... కూరగాయలు పండించడం...."
"కోళ్ళ పెంపకం ఎలా వుంది? ఎన్ని కోళ్ళను సప్లయి చేశారు! ఎన్ని గుడ్లు రోజూ వస్తున్నాయ్?" సునంద అడిగింది.
గ్రామ సేవిక కామాక్షమ్మ ముఖంలోకి చూసింది.
"చెప్పు!" అన్నది కామాక్షమ్మ.
"వెటర్నరీ డిపార్టుమెంటువారు 40 పెట్టలూ, 60 పుంజులు సప్లయి చేశారు. రోజుకు 86 గుడ్లు పెడుతున్నాయ్."
"అదేమిటి మీ దగ్గర పుంజులు కూడా గుడ్లు పెడ్తాయా?" అన్నది సునంద.
"అంతా మా ప్రెసిడెంటుగారి కృషి ఫలితమే" అన్నది గ్రామసేవిక.
"కామాక్షమ్మగార్ని చూసి పుంజులు కూడా గుడ్లు పెడ్తాయన్న మాట!" సునంద వచ్చే నవ్వును ఆపుకుంటూ అన్నది.
ఆడవాళ్ళంతా గొల్లున నవ్వారు. అప్పటికి కాని కామాక్షమ్మకూ, మీనాకుమారికీ సునంద ప్రశ్న అర్ధంకాలేదు.
కామాక్షమ్మ ముఖం ముడుచుకుంది. మీనాకుమారి చిన్న ముఖం చేసుకొని సునంద ముఖంలోకి చూసింది.
"అఫీషియల్ గా రిపోర్టు ఇస్తున్నప్పుడు కాస్త మతి దగ్గర పెట్టుకోవాలి. 40 పెట్టలు వున్నాయ్ అన్నావు. నలభై పెట్టలు ఎనభై ఆరు గుడ్లు ఎలా పెడ్తాయ్?"
మీనాకుమారి తన తప్పు గ్రహించి నాలుక కరచుకుంది.
"పోనీయ్! ఆ గుడ్లు ఏం చేస్తున్నారు?"
"అదీ అలా అడగండి!" అన్నట్టు ముఖం పెట్టింది సెక్రెటరీ.
గ్రామ సేవిక, కామాక్షమ్మ ముఖంలోకి గాబరాగా చూసింది. కామాక్షమ్మ కళ్ళలోనే ఏదో సమాధానం దొరికినట్టు గబగబా చెప్పసాగింది.
"బాలింతలకీ....చూలింతలకీ.... మనిషికి గుడ్డున్నర చొప్పున...."
"మరి బాలబాలికలకో?"
"బాలలకు తల ఒక్కింటికి గుడ్డు చొప్పున...."
మీనాకుమారి చెబుతుంటే, కామాక్షమ్మ తల ఊపుతూ వుంది.
క్రింద కూర్చొని వున్న ఆడవాళ్ళలో కొందరు నోళ్లు తెరుచుకొని సెక్రటరీ ముఖంలోకి చూశారు. మరికొందరు గ్రామ సేవిక చెబుతున్నది అక్షరాలా నిజం అన్నట్టు తలలు తాటిస్తున్నారు.
"ఏదీ! రిజిష్టర్ చూపించు!" అన్నది సునంద.
"రిజిష్టరెక్కడుందీ!" అంతవరకూ మౌనంగావున్న సెక్రెటరీ అందుకుంది.
"ఎందుకులేదూ? మా ఇంట్లోవుంది. మధ్యలో నువ్వెందుకు కలుగజేసుకుంటావ్" కస్సున లేచింది కామాక్షమ్మ.
ప్రెసిడెంటుకూ, సెక్రటరీకీ పడదనీ, కొందరు సభ్యులు సెక్రటరీని సపోర్టు చేస్తున్నారనీ అర్ధం చేసుకుంది సునంద.
కామాక్షమ్మ కలవాలం తిప్పితే గ్రామసేవిక మీనాకుమారి వాలం తిప్పుతుందని కూడా సునంద తెలుసుకుంది.
"రిజిష్టర్ ప్రెసిడెంటుగారింట్లో ఎందుకుంది?" అడిగింది సునంద.
"గుడ్లు పంచిపెట్టేది ప్రెసిడెంటు గారింట్లోనేగా?" గ్రామ సేవిక అన్నది.
"అవునవును!" కొందరు క్రింద కూర్చొనివున్న స్త్రీలు వంతపాడారు.
"ఏమిటవునవును! గుడ్లు పంచుతున్నారా? ఎవరికి?" సెక్రెటరీ కోపంగా అందుకుంది.
"నువ్వూరుకో మంటుంటేనూ ఇప్పుడు నాలుగు రోజులుగా లేకుంటే సరిపోయిందా? మొన్నటి దాకా పెట్టలేదూ!"
కొందరు కామాక్షమ్మ ముఖంలోకి చిత్రంగా చూశారు.
"మొన్నటి దాకా పెట్టారా? కోళ్ళ గూట్లో కోళ్ళు వున్నాయా?" రెట్టించింది సెక్రటరీ.
సునందకు విషయం అర్ధమయింది.
"పద కోళ్ళ గూడు చూద్దాం!" గ్రామసేవికతో అని లేచి నిల్చుంది సునంద.
గ్రామసేవిక కామాక్షమ్మ ముఖంలోకి అసహాయంగా చూసింది.
"అమ్మాయ్ చూడు! ఈ ఊళ్ళో గండు పిల్లుల బెడద చాలా ఎక్కువగా వుందమ్మా!" అంది కామాక్షమ్మ.
క్రింది కూర్చున్న వాళ్ళల్లో ఒకామె "అవునమ్మా! ఈ మాయదారి గండు పిల్లులు మనుషుల్నికూడా తినేట్టున్నాయ్!" అన్నది.
సునంద ముఖం ఎర్రబడింది.
"కనీసం కోళ్ళ షెడ్డయినా వుందా?" కోపంగా అడిగింది.
"షెడ్డెందుకులేదూ, వుంది. అందులో ప్రెసిడెంటు గారి గొర్రెలూ, మేకలూ వుంటాయి" అన్నది ఒక స్త్రీ.
సునంద కోపంగా గ్రామసేవిక ముఖంలోకి చూసింది. గ్రామసేవిక కామాక్షమ్మ ముఖంలోకి చూసింది. కామాక్షమ్మ గాజుల పొత్తి తొలగించుకుంటూ గడియారంకేసి చూసింది.
"అన్ని కోళ్ళను గండు పిల్లులు తినెయ్యడమేమిటండీ? ఎవరైనా నమ్మేమాటేనా?" సునంద ఈ సారి కామాక్షమ్మనే ప్రశ్నించింది.