Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 33
జ్వాలాతోరణం
స్వర్గనరకముల ఛాయా దేహళి,
తెలి, నలి తలుపులు తెరచి, మూసికొని-
సర్గ విలయ హేమంత వసంత
ధ్వాంత కాంతి విక్రాంతి వేళలో,
చావు పుట్టుకల పొలిమేరలలో
ఆవులించె నొక చితాగ్ని కుండం!
అనాథజీవుల సమాధులన్నీ
అఘోరించి ఘోషించాయి!
ఇదేమి! లోకం హిరణ్యనేత్రుని
పదాఘాతమున ప్రతిధ్వనించగ,
కురుక్షేత్రమున క్రుద్ధవృకోదరు
గదాఘాతమున గజగజలాడగ,
జాతి జాతి నిర్ఘాత పాత సం
ఘాతహేతువై, కాలకేతువై
అదె సంవర్తపు తుపానుమేఘం
తొలి గర్జించిన తూర్యవిరావం!
ప్రదీప్తకీలా ప్రవాళమాలా
ప్రపంచవేలా ప్రసారములలో,
మిహిరవాజితతి! మఖవ ధనుర్ద్యుతి!
పుడమికి నేడే పుట్టిన రోజట!
- 1938
* * *
Previous Page
Next Page