Previous Page Next Page 
సాహసి పేజి 33


    ఏదో నిమిషంలో పులి పైన బడుతుందన్న ధ్యాసతో, అటూ ఇటూ పరీక్షగా చూస్తూ అడుగులు వేస్తున్నాడు ముత్యాలనాయుడు.

    ఆ భయం ఏమాత్రం లేని-

    యువరాజు... మొండిగా నడుస్తున్నాడు.

    చెట్ల ఆకుల్లో ఏదో జర, జరమని పాకిన చప్పుడు... సింధూర చెట్లను గుట్టల్నీ దాటి ముందుకొచ్చాడు యువరాజు...

    వరసగా పెద్ద రాతిబండలు... ఆ బండలకు ఆనుకుని దట్టమైన రెల్లు పొదలు... నడుస్తున్న యువరాజు-

    ఒక్కక్షణం ఆగిపోయాడు... ఆ పొదల ప్రారంభంలో వెన్నెల కాంతిలో మసగ్గా మెరుస్తూ, చచ్చిపోయిన బురిడి దుప్పి... తలో పక్క మిగతా శరీరం ఒక పక్క... కొమ్ములకు అంటుకున్న రక్తం... ఆ దుప్పిని పరిశీలించడానికి మోకాళ్ళమీద వంగాడు యువరాజు. అదే సమయంలో-

    రెల్లు పొదలో ఏదో చప్పుడైంది.

    యువరాజుకిగానీ, ముత్యాలనాయుడికిగానీ... తెలీదు... ఓ పసుపు కన్ను వాళ్ళిద్దరివేపే నిశితంగా చూస్తోందని...

    సరిగ్గా, సరిగ్గా-

    అదే సమయంలో- అక్కడ పరుచుకుని వున్న గంభీరమైన నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఓ కణుసు అరిచింది- ఆ అరుపు భయంకరంగా వుంది. ఆ అరుపు దుస్సహంగా వుంది.

    ఆ అరుపుకి నిద్రపోతున్న పక్షులు ఒక్కసారిగా ఉలిక్కిపడిన కలకలం కుండలోని నీళ్ళను కుదిపినట్టు అడవంతా ఓ క్షణం కదిలిపోయింది భీకరరవానికి.

    ఏదో అలజడి... ఏదో ఉద్వేగం-

    రెల్లు పొదలో పచ్చికమీద నుంచి ఏదో జంతువు పరుగెడుతున్న చప్పుడు...

    "ఆ చప్పుడు పులిదే..." చిన్నగా కేకవేశాడు ముత్యాలనాయుడు. మెరుపుకంటే వేగంగా పొదలోకి పరుగుతీశాడు యువరాజు.

    నిజానికి ఆ చప్పుడు పులిది కాదు- పులిని చూసి, ప్రాణభయంతో పరిగెడుతున్న ఎలుగుబంటి అడుగుల చప్పుడది.

    పులి వాళ్ళిద్దరికీ, చాలా సమీపంలోనే మాటువేసి వుందన్న విషయము, వాళ్ళిద్దరికీ తెలీదు!

    ముందుకెళ్తున్న యువరాజుకి చటుక్కున మెరుపులాంటి ఆలోచన వచ్చింది... ఏదైనా ఎత్తయిన ప్రదేశానికి ఎక్కితే...

    మరే మాత్రం ఆలస్యం చేయలేదు యువరాజు. అటూ ఇటూ చూశాడు. రెల్లుపొదకు కొంచెం దూరంలో తురాయిచెట్లు- ఆ చెట్లలో ఒక చెట్టునెక్కి-

    కొమ్మల మధ్యన కూర్చున్నాడు.

    చుట్టూ చూస్తున్న యువరాజుకు ఎక్కడా పులి కనిపించలేదు- ఏ శబ్దమూ విన్పించలేదు. పల్చటి వెన్నెల్లో.

    రెల్లు పొదలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడవరకూ వచ్చిన పులి ఎటు మాయమైపోయింది-?

    అదే విచిత్రంగా ఉంది యువరాజుకు... మనుషుల అడుగుల్ని, రాకను పసికట్టిన మేనీటర్ అకస్మాత్తుగా, తన దిశను మార్చుకుని ఇంకో చోటికి వెళ్ళిందా?

    సరిగ్గా, అప్పుడే- ఊహించని సంఘటన ఒకటి జరిగింది- వరసగా ఉన్న తురాయి చెట్లలో... వెనుకనున్న తురాయి చెట్టుప్రక్కన- బ్రహ్మజెముడు మొక్కలు కదలడంతో-

    తలతిప్పి చూసిన యువరాజుకి,గుండె ఆగినంత పనైంది.

    దగ్గరలో, అతి దగ్గరలో-

    పెద్దపులి- క్రూరంగా చెట్టుపైనున్న యువరాజు వైపు చూస్తూ-

    యువరాజు గుండె బితుకు బితుకులాడింది. యువరాజు వంటిమీద రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి.

    వళ్ళంతా చెమటలు పట్టేశాయి.

    మేనీటర్ గొంతులోంచి, గుర్రుమంటున్న శబ్దం- ఆ శబ్దం వింతగా, భయంకరంగా ఉంది.

    ఒక క్రూరమృగాన్ని ఓపెన్ ప్లేస్ లో అంత దగ్గరగా చూడడం అదే ప్రధమం- భారీ శరీరాన్ని నెమ్మదిగా కదుల్చుకుంటూ, ముందుకొస్తోంది మేనీటర్-

    రైఫిల్ ని తీసి, పులివేపు గురి చూస్తున్నాడు యువరాజు.

    నెమ్మదిగా ముందుకి, ముందుకి వస్తూ యువరాజెక్కిన చెట్టు దగ్గర కొచ్చింది పులి... పంజాని చెట్టుకానిచ్చి ఒకసారి పైకి చూసి పై కొమ్మని అందుకోడానికి ప్రయత్నిస్తోంది.

    పులి పంజాకి, ఆ కొమ్మ దొరికితే- యువరాజు కిందపడి పోవడము ఖాయం... యువరాజుకి భూమ్మీద నూకలు చెల్లిపోయినట్టే!

    ఒక్క పక్క పులి కదలికల్ని గమనిస్తూ, మరో పక్క ట్రిగ్గర్ మీద వేలినుంచాడు...

    పులిని, షూట్ చేయాలంటే, తను ముందుకి వంగాలి- ముందుకు కదలాలి- ఆ ప్రయత్నంలో- తను కూర్చున్న కొమ్మ వంగితే... అది పంజాకు అందిపోవడం ఖాయం.

    శత్రువును స్పష్టంగా గుర్తించిన మేనీటర్, ఒక్కసారిగా పెను అరుపు అరుస్తూ-

    ముందు కాళ్ళతో చెట్టు మొదట్లో నిచ్చెనలా వేసి, పైకి ఎగబ్రాకడానికి ప్రయత్నిస్తోంది ఉగ్రంగా-

    ఆ పెనురవానికి అడవిలో మళ్ళీ కలకలం ప్రారంభమైంది. ఏం చెయ్యాలో తోచలేదు యువరాజుకి- అటూ ఇటూ శరీరాన్ని కదుపుతూ చెట్టుపైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్న-

    పెద్దపులిపై తను రైఫిల్ పేల్చితే, ఆ గుండు సూటిగా తగులుతుందా? గురి తప్పుతుందా? గురికోసం... రకరకాల యాంగిల్స్ లో శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. చెట్లకొమ్మలు ఇరుగ్గా ఉండడంతో గురి దొరకడం లేదు.

    లాభం లేదు... సమయం మించక ముందే పులిని కొట్టాలి.

    యువరాజు-

    కుడిచేయిచూపుడువేలు, రైఫిల్ ట్రిగ్గర్ మీద కెళ్ళింది- క్షణాలు గడుస్తున్నాయి. యువరాజు ఉచ్చ్వాస నిశ్వాసలు భారంగా ఉన్నాయి. అతని గుండె శబ్దం, అతనికి స్పష్టంగా విన్పిస్తోంది.

    ట్రిగ్గర్ మీద కెళ్ళిన యువరాజు వేలు, అనూహ్యంగా పక్కకు జరిగిపోయింది. మెత్తగా, భారంగా ఏదో భుజమ్మీదకు ప్రాకుతోంది. తలతిప్పి చూసిన యువరాజు పై ప్రాణాలు పైనే పోయాయి-

    కొండచిలువ...

    పై కొమ్మ మీంచి బరువైన తాడులా భుజానికి చుట్టుకుని, చేతిని పాకుతూ నడుమును చుట్టుకుంటోంది.

    గడియారం ముల్లులా, చిన్నశబ్దం చేస్తున్న నాలికల కదలికలు- ఒక జంతువు, అందులోనూ ప్రమాదకరమైన కొండ చిలువ ఉచ్చ్వాస, నిశ్వాసల్ని దగ్గరగా వినడం... యువరాజుకి అదే ప్రధమం.

    మనిషిని పూర్తిగా మింగేసి, తన శరీరాన్ని, ఏ చెట్టుకో చుట్టుకుని మనిషి ఎముకల్ని పటపటా ముక్కలు చేసేసి... నెమ్మదిగా జీర్ణం చేసుకునే శక్తి ఒక కొండచిలువకే ఉంది. 

    యువరాజు అణువణువూ స్థంభించిపోయింది. చేతుల కదలికలు ఆగిపోయాయి. కొండచిలువ శరీరం నెమ్మదిగా బిగుసుకుంటోంది యువరాజు శరీరం చుట్టూ-

    పెద్దతాడుతో కట్టేసినట్లుగా అయిపోయింది యువరాజు శరీరం. చేతివేళ్ళ బిగువు సడలిపోతోంది.

    వేళ్ళ మధ్యలోంచి రైఫిల్ పట్టు తప్పుతోంది.

    ఒక చేతితో రైఫిల్ ని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ, మరొక చేతితో కొండ చిలువ తోకను కిందకు లాగుతున్నాడు.

    యువరాజు ముఖానికి, కొండచిలువ ముఖానికి మధ్యనున్న దూరం దగ్గరవుతోంది.

    భయం... పెనుభయం... దట్టమైన చీకటిలా ఉంది. వంద రాక్షస బల్లులు- వంటిమీద పరుగెడుతున్నట్టుగా భయం. నరాల్లోంచి, రక్తానికి బదులు చెమట స్రవిస్తున్నట్టుగా ఉంది.

    అదే సమయంలో యువరాజు చేతిలోని రైఫిల్ కిందపడి పోయింది. పైనుండి కిందపడిన వస్తువును తలదించి చూసి- ముక్కుతో దాన్ని వాసన చూసి, అటూ, ఇటూ విసురుగా తలతిప్పి చూస్తోంది మేనీటర్-

    పైన-

    కొండచిలువ బారినుండి, తప్పించుకోవడానికి నరకయాతనలు పడుతున్నాడు యువరాజు-

    కిందకు దూకి ప్రాణాల్ని కాపాడుకోవాలనుకుంటే... కింద పెద్ద పులి- దాదాపు పదహారు అడుగుల పొడవున్న కొండచిలువ ఒక్కసారిగా నోరు తెరిచింది.

    మరోక్షణంలో...

    యువరాజు కొండచిలువకు ఆహారంగా మారిపోయేవాడు. యువరాజు శరీరం-

    ఒక్కసారి చల్లబడిపోయింది. వళ్లంతా వణుకుతోంది- దాని నుంచి తనను తాను ఎలా రక్షించుకోవాలి? ఊహించడానికి కూడా సమయము లేదు-

    కొండచిలువ కాటు వేయడానికి తలని వెనక్కి వంచింది. కొమ్మ మీదున్న అతని శరీరం బ్యాలెన్స్ తప్పుతోంది.

    మరోక్షణంలో, ఆ కొమ్మమీద నుంచి కిందపడిపోయేవాడే-

    అప్పుడు-

    "ముత్యాలనాయుడూ..." అరిచాడు యువరాజు శక్తినంతా కూడదీసుకుని అరిచాడు.

    అంతవరకూ, గుట్టలపక్క, రెండో దిశలో మాటువేసి కూర్చున్న ముత్యాలనాయుడు, యువరాజు కేక వినబడగానే, సర్రున లేచి, రెల్లు పొదలవేపు పరుగెత్తుకొచ్చాడు- వస్తూనే తురాయి చెట్టుకేసి చూశాడు.

    ఆ దృశ్యాన్ని చూడగానే నిశ్చేష్టగా నిలబడిపోయాడు ముత్యాలనాయుడు. మృత్యువు అంచుల్లో యువరాజు... తమ బృందాన్ని మృత్యువు నుంచి కాపాడటానికొచ్చి, తనే మృత్యువు అంచుకు చేరిన యువరాజు-

    కింద నరమాంసానికి అలవాటుపడిన పులి... పైన కొండచిలువకు ఆహారమవబోతున్న యువరాజు.

    పరుగు, పరుగున అక్కడకొచ్చిన ఇంకో మనిషిని చూడగానే తత్తరపడి ఆరేడడుగులు వెనక్కి వెళ్ళింది పులి. ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు ముత్యాలనాయుడు. పులి గురించి, పులి దాడి గురించి, ప్రమాదకరమైన మేనీటర్ గురించి ఆలోచించే దశలో లేడతను.

    ముందుకి పరుగెత్తికొచ్చి, తురాయికొమ్మను పట్టుకుని, వంచి, చేతిలోని కత్తితో-

    కొండచిలువ మీద ఒక్కవేటు వేశాడు.

    మరొక చేత్తో యువరాజుని కిందకు లాగాడు.

    యువరాజు కొమ్మమీంచి కింద పచ్చికలో దబ్ మని పడిపోయాడు అంతే.

 Previous Page Next Page