Previous Page Next Page 
జనవరి 5 పేజి 33

 

          "ఒక కీకారణ్యంలో ఒక ముసలమ్మ తన అందమైన మనుమరాలితో జీవన్మ సాగిస్తోంది...." క్రనతికి అడ్డు తగులుతూ "అడవిలో ఎందుకుంటున్నాడు?" అంటూ ప్రశ్నించాడు అభిరామ్.
   
    ఆమె చురుగ్గా చూసింది అభిరామ్ వేపు.
   
    "సర్లే.....చెప్పు" అన్నాడు అభిరామ్ తిరిగి.
   
    "మధ్యలో నాకు అడ్డు రావద్దన్నాను కదా....?" క్రాన్తి రాబోతున్న నవ్వును పెదాల వెనక బిగబట్టుకుంటూ అంది.
   
    అతను బుద్దిమంతుడైన విధ్యార్ధిలా తలూపాడు.
   
    "మూడు, నాలుగు గదులున్న ఇల్లు నిర్మించుకుని వుంటున్నారు. ఓ రోజు ఓ గజదొంగ అటుకేసి వచ్చినట్లు ముసలమ్మకు వర్తమానం అందింది పైగా అతను వయస్సులో వున్న గజదొంగ. దోచుకుపోగలంత విలువైన వస్తువులేమీ లేవనే ధీమా మనుమరాలిది. ముసలమ్మ ఆలోచనలు వేరుగా వున్నాయి వయస్సులో వున్న మనుమరాలు అతని దృష్టిలో పడితే ప్రమాదమని భావించింది. అందుకే రోజూ రాత్రిళ్ళు పడుకునే ముందు గది తలుపులు గట్టిగా వేసుకోమని చెబుతూ మరికొన్ని సూచనలు కూడా ఇచ్చింది. అతను ఒకవేళ నీ గదిలోకి దూరి దౌర్జన్యంగా నీ పెదాల్ని తాకితే ఒకటి అని, నుదుటిని తాకితే రెండూ అని, చేతుల్ని తాకితే మూడు అని అరువు నేను వెంటనే నా గదిలోంచి లేచి వస్తాను అని చెప్పింది. అంటే ఒక్కో అవయవానికి ఒక్కో నెంబర్ చెప్పింది. మనుమరాలు వాటిని మననం చేసుకుంటూ ఓ రోజు రాత్రి తన గది తలుపుల్ని గట్టిగా బంధించుకొని పడుకుంది.
   
    అర్ధరాత్రయింది. ముసలమ్మ అప్పుడే నిద్రలోకి జారుకుంటోంది.
   
    అప్పుడే వినిపించింది. ఆమె మనుమరాలి గొంతు పెద్దగా....
   
    "ఏ నెంబర్...?" అంటూ అభిరామ్ ఆసక్తిగా ముందుకు వంగుతూ అడిగాడు.
   
    అతనిలో తొంగి చూసిన ఆసక్తిని చూసి వెన్నెల వర్షించినట్లుగా నవ్వింది.
   
    "ఫస్ట్.....?"
   
    "వూ....హు...." ఆమె క్రింద పెదవిపై పంటితో నొక్కి పెడుతూ అంది.
   
    "సెవెన్....?"
   
    "వూహు....?"
   
    "ఎయిటీస్...?"
   
    "వూహు...?"
   
    "పోనీ థర్టీఫోర్...?"
   
    "వూహు...?"
   
    "థర్టీ సిక్స్" క్షణ క్షణానికి అభిరామ్ లో ఆతృత రెట్టింపవుతుండగా అడిగాడు.
   
    "లెవెన్....?"
   
    "అదీ కాదు"
   
    "మరేమని అరిచింది....? ఇంతకీ అసలు ఆమె గదిలోకి దొంగదూరాడా?"
   
    "దూరాడు" ఆమె సీరియస్ నెస్ ని అభినయిస్తూ అంది.
   
    "పోనీ నువ్వు చెప్పు... ప్లీజ్" అభిరామ్ ఆమెను బ్రతిమాలాడాడు.
   
    "కనుక్కో చూద్దాం" ఆమె కవ్విస్తున్నట్లుగా అంది.
   
    "ప్లీజ్..." అంటూ అసంకల్పితంగా ఆమె చుబుకాన్ని పట్టుకొని కొద్ది క్షణాల తఃరువాత వదిలేశాడు.
   
    "ఏది, మరోసారి నా చుబుకాన్ని పట్టుకో... పట్టుకుంటేనే చెబుతాను" అంది మరింత కవ్విస్తున్నట్లుగా.
   
    అతనో క్షణం అర్ధం కానట్లుగా చూసి-
   
    "పోనీ చిన్న క్లూ ఇవ్వు" అన్నాడు ఆమె చెప్పింది చేయకుండానే.
   
    "పాపం...క్లూ ఇస్తాలే....ఆమె అరిచింది కాని ఏ సంఖ్యా కాదు"
   
    "మరి....?!!" అభిరామ్ విస్తుపోయి అడిగాడు.
   
    "బ్రతిమలాడుకో... అభినయిస్తూ ఉత్త మాటలతో కాదు" అంది చిన్నగా నవ్వుతూ.
   
    అతను చటుక్కున మధ్యలో చొట్టబడి మంచుకొండ మలుపులా వున్నా ఆమె చుబుకాన్ని పట్టుకున్నాడు.
   
    ఒక్కక్షణం ఆమె గుండె ఝల్లుమంది.
   
    ఉప్పెనలాంటి ఉద్వేగం ఆమెను కొద్ది క్షణాలు వివశురాల్ని చేసింది.
   
    మత్తుగా, తీయగా, గమ్మత్తుగా వున్న ఆ అనుభూతి నుంచి తేరుకొనేలోపే అతను తన చేతిని వెనక్కి తీసుకున్నాడు "ఇప్పుడు చెప్పు.... ఇంకా సస్పెన్స్ నేను భరించలేను" అన్నాడు అభిరామ్ తనలో పెల్లుబుకుతున్న ఉత్కంఠతను నిగ్రహించుకుంటూ.
   
    ఆమె అప్పుడు కళ్ళు తెరిచింది.
   
    చిరునవ్వుతో అతనికేసి చూసింది. కనురెప్పల్ని ఆర్పకుండా చూసింది అతని రూపాన్ని తన కళ్ళనిండా నింపుకుంది "చెబితే నాకేమిస్తావు...?" అంది తమాషాగా కనురెప్పలని కదిలిస్తూ.
   
    "అదీ నువ్వే అడుగు."
   
    "అడిగాక కదనకూడదు."
   
    "ఇచ్చిన మాట తప్పను."
   
    "తప్పవద్దు. ఎట్టి పరిస్థితిలోనూ తప్పవద్దు."
   
    "తప్పనన్నాగా......చెప్పు"
   
    కొద్ది క్షణాలు మౌనంగా వుంది.
   
    "ఆ అమ్మాయి ఆల్ కౌంట్ అని అరి...." క్రాంతి మాటలు పూర్తి కాకుండానే ఒక్కసారి ఫెళ్ళున నవ్వాడు అభిరామ్. అతను ఆపేవరకూ అలాగే, అతనికేసి మౌనంగా చూస్తుండిపోయింది క్రాంతి.
   
    "ఇలాంటివన్నీ నీకెలా తెలుసు?" అభిరామ్ అడిగాడు.
   
    "నేనొకటి అడగబోతున్నాను" అంది క్రాన్తి సీరియస్ గా.
   
    "అడుగు. నేను వెనక్కి వెళితే గదా....?" పౌరుషంగా అన్నాడు అభిరామ్.
   
    "అడిగాను"
   
    "ఎప్పుడు?"
   
    "ఇప్పుడే"
   
    "ఇప్పుడా....? ఏమడిగావు" అభిరామ్ పిచ్చెక్కిపోతూ అన్నాడు.
   
    "ఒకటి...." అంది కళ్ళు మూసుకుంటూ.
   
    అభిరామ్ కి కొద్ది క్షణాలకు గాని ఆమె అడిగింది అర్ధం కాలేదు. అర్ధమయ్యాక కొద్దిక్షణాలు సందేహించాడు.
   
    "నాలుగు.....ఒకటి.... యూ నాటీ" అంటూ ఆమె పైకి వంగాడు.
   
    నాలుగు పెదాలు ఒకటయ్యాయి.
   
    అద్భుతమయిన అరవై క్షణాల్ని వారి సొంతం చేసుకున్న తర్వాత యిద్దరూ అయిష్టంగానే విడిపోతుండగా "ఐయామ్ ఏ ఫూల్....లేదంటే ఆల్ కౌంట్ కావాలనే అడిగేదాన్ని" అంది క్రాంతి.
   
    అభిరామ్ ఆమె ధైర్యాన్ని తెగువని చూసి విస్తుపోయాడు.
   
                       *    *    *    *    *
   
    ఉదయం తొమ్మిది గంటలకు విమల్, మేఖల ట్రైన్ దిగి, టాక్సీ వేసుకుని ఆంద్రప్రదేశ్ హౌస్ కి వెళ్ళిపోయారు.
   
    ట్రైన్ లో ఇద్దరూ కలిసిరావటం, ఆపైన ఒకే గదిలో వుండటం, క్లోజ్ గా మూవ్ అవడంతో యిద్దరి మధ్య ఒకింత చనువు ఏర్పడింది.
   
    "ఓసారి ఫోన్ చేద్దామా?" అంది మేఖల స్నానానికి సిద్దమవుతూ.
   
    "తెలీదు కదా...." అన్నాడు విమల్ కాఫీ తీసుకుంటూ.
   
    "ముందు పేపర్ లో ప్రింటయిన అడ్రస్ ని బట్టి, అక్కడ ఏ మినిస్టర్ వుంటున్నారో తెలుసుకుంటే-ఫోన్ నెంబర్ తెలుసుకోవడం చాలా సులభం" అంది మేఖల తనో కప్పు అందుకుంటూ.
   
    ఎవరు ఎవరో....ఎవరికీ తెలీదు.
   
    ఎందుకు కలిసారో అంతకంటే తెలీదు.
   
    ఒకరంటే ఒకరికి ఇష్టముందా? అభిమానముందా-అదీ యిద్దరూ తెలుసుకోలేని స్థితిలో వున్నారు.
   
    కానీ ఒక్కటి మాత్రం నిజం.....
   
    ఇద్దరి మధ్యా స్నేహం వుంది. ఇద్దరూ నిరుద్యోగులే....బ్రతుకు పోరాటపు బరిలోకి ఎన్నో ఆశలతో, కలలతో దిగినవాళ్ళే! ఇద్దరూ తమ తమ తల్లిదండ్రుల నుంచి వేరయి వచ్చిన వారే.
   
    యిద్దరికీ ఆశయాలున్నాయి. ఆదర్సాలున్నాయి. అందరికీ అందనంత యెత్తులకు యెదగాలానే పట్టుదలా వుంది.
   
    పెళ్ళికాని యువతీ యువకులు-గతంలో స్నేహంగాని, పరిచయం గాని, బంధుత్వం గాని లేకుండా- తమ మధ్య వున్న లింగభేదాన్ని మరచి- వయస్సు పరమైన కోర్కెలను విస్మరించి ఒక ఆశయం కోసం ఒకే లక్ష్య సాధనతో ముందుకు సాగటం అన్నది నేటి జనరేషన్ లో వచ్చిన మార్పా? అది మార్పే అయితే దాని ఫలితాలు భవిష్యత్ లో ఎలా ఉన్నా ఎలా పరిణమించినా, లక్ష్యసాధనపై దృష్టిని సారించేందుకు తాత్కాలిక ఆకర్షణ... వ్యామోహాల నుంచి బయటపడగలరేమో?
   
    యువతీ యువకులు పదహారవ యేట నుంచి ప్రారంభమయ్యే ఆపోజిట్ సెక్స్ రియాక్షన్ ప్రభావం మూలంగా, వారికి 20 యేండ్లు వచ్చేవరకు తమ తమ జీవిత లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ప్రొఫెషనలిజాన్ని కోల్పోయే ప్రమాదం కూడా వుంది.

 Previous Page Next Page