Previous Page Next Page 
పెళ్ళాంతో పెళ్ళి పేజి 32


    వీటికి తోడు పతిభక్తి!


    ఇల్లు స్వాములవారి మఠంలా మారింది. కాశీ నుంచి రామేశ్వరం దాకా సాధువులందరికీ పుణ్యవతి పేరు తెలిసిపోయిందేమో అనిపించేది అర్జున్ కి. ఓ రోజున హిమాలయాల్లో ఉండే ఓ సాధువు వస్తే, ఓ రోజున మధురైలో ఉండే మఠాధిపతి!


    స్వాములవారినీ, శాస్త్రులవారినీ దర్శించుకోవడానికి తండోపతండాలుగా జనం! ఇరుగమ్మలకీ, పొరుగమ్మలకీ ఆమె తల్లో నాలుక. ఎవరికి ఏ అవసరం వచ్చినా తగుదునమ్మా అని ముందుగా తను తయారయ్యేది. ప్రతిరోజూ వాళ్ళింట్లో అరవై విస్తళ్ళు లేచేవి.


    తెల్లారి మూడింటికి లేచేది పుణ్యవతి. మళ్ళీ పదకొండింటిదాకా నడుం వాల్చేది కాదు. నడుం విరిగే చాకిరీ చేస్తున్నా, మొహంలో నవ్వు చెరిగేది కాదు.


    ఈ గోలంతా చూసి తనకి తిక్కరేగినట్లు ఉన్నా, తనవైపు అమాయకంగా, ఆప్యాయంగా, ఆరాధనగా చూసే ఆమె మొహం చూడగానే చల్లబడిపోయేవాడు - ఎప్పటికప్పడు!


    "ఇవన్నీ నాకు ఇష్టం లేదు!" అన్నాడు ఒక రోజున.


    "మీ ఇష్టం నా ఇష్టం కొన్ని విషయాల్లోనే! ఇవి దైవ కార్యాలు - దేవుడి ఇష్టప్రకారం పోవాలి" అంది పుణ్యవతి.


    "మీ అన్నకు కనబడినట్లుగా నీకూ దేవుడు కనబడుతూ ఉంటాడా?" అన్నాడు విసుగ్గా.


    "నాకు ప్రతి రోజూ, ప్రతి మనిషిలోనూ దేవుడే కనబడతాడండీ!"


    "అయితే నేను? నేను కూడా నలుగురితో బాటు నారాయణనా? అవునా?"


    "కాదు! మీరు నా కోసం ప్రత్యేకం! పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా! ఎవరో వచ్చి మీమీద నాకు చాడీలు చెప్పబోతుంటారు. మీకు చాలామంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని, ఆయనకి ఏం అవసరం? నేను లేనా? అంటాను నేను. క్లబ్బులో చాలా చిత్రాలు జరుగుతుంటాయని చెప్పారు. ఏడుకొండలవాడి దయ ఉంటే కొండంత కష్టాలు కరిగిపోతాయనీ, ఆయన తలచుకుంటే క్లబ్బు మూతబడుతుందనీ చెప్పాను. సావిత్రమ్మగారి మొగుడు మీ క్లబ్బులోనే చీట్ల పేక ఆడి ఆడి కట్టుబట్టల్తో మిగిలాడుట కదా! ఏమండీ! నా మాట వినండీ! మీకు ఇంత ఆస్తి ఉంది. నాకేమో చిన్నమెత్తు ఆశ కూడా లేదు. ఉన్నదాంతోనే వైభవంగా బతకొచ్చు. నలుగురికి పెట్టొచ్చు. ఇంకా సంపాదన ఎందుకండీ! పైగా క్లబ్బు అందులో సారా... సారా తాగడమే తప్పండీ! అమ్మడం ఇంకా పాపం!"


    విసురుగా ఆమె నోటికి అడ్డం వచ్చాడు అర్జున్.


    "ఇదిగో! ఒక్కమాట క్లియర్ గా చెబుతున్నాను. నా పద్ధతిలోకి నిన్ను రమ్మని అడగను! నీ పద్ధతిలోకి నేను రాను! ఈ చెక్క భజనలు నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం. కానీ బయట నేను మగమహారాజుని! ఇంట్లో నువ్వేం చేస్తావని నేను అడగను. నోములే నోస్తావో! స్వాముల వాళ్ళకి భిక్షలే పెడతావో, అడక్కపోవడం పాపంగా అడిగిన వాళ్ళందరికీ దానధర్మాలు చేస్తావో నీ ఇష్టం! అలాగే, నేను బయట తాగితందానా లాడతానో, ఢంకా పలాసే ఆడతానో, రోజుకో ఆడదానితో వెళ్తానో... అదంతా నా ఇష్టం! నాకు నీతులు చెప్పాలని చూడకు. నీతులు చెప్పి చెప్పి మా అమ్మ చచ్చింది గానీ నేను మారలేదు. నువ్వు నీతులు చెప్పబోయినా, నువ్వు చచ్చేదాకా ఆగను. నరికి చంపేస్తాను" అన్నాడు.  


    భయపడి ఇంక ఆ రోజు నుంచి ఈ విషయం ఎత్తడం మానుకుంది పుణ్యవతి.


    సంవత్సరం గడిచింది. పాపారావు ఊహించినట్టుగా అర్జున్ బాల్చీ తన్నెయ్యలేదు. పుణ్యవతి నోముల ఫలితమో, ఆమె చేస్తున్న సేవల ఫలితమో గానీ, అర్జున్ రోజురోజుకీ ఆరోగ్యం కోలుకుంటున్నట్లే కనబడుతున్నాడు.


    ఒకరోజు పొద్దున్నే అడిగింది పుణ్యవతి.


    "ఏమండీ!"


    "చెప్పు"


    "ఒక్కటి అడగనా?"


    "క్లబ్బు గురించేనా?" అన్నాడు విసుగ్గా.


    "క్లబ్బుకెళ్తారో, విస్కీ తాగుతారో - మీ ఇష్టం! కానీ ఇవాళ ఒక్క రోజుకి మాత్రం సాయంత్రం ఆరింటికల్లా ఇంటికి వచ్చెయ్యండి"


    "ఎందుకు?" అని అడిగాడు అర్జున్ చిరాకుని అణుచుకుంటూ.


    "ఇవాళ మీ పుట్టినరోజండీ!"


    "అయితే?"


    "గుడికి వెళ్ళాలి... ఈ ఒక్కరోజుకీ!"


    ఇంతెత్తున ఎగిరిపడ్డాడు అర్జున్.


    "గుడికా? గుడికి వెళ్ళి ఆ రాతి బొమ్మకి దణ్ణం పెట్టాలా? చచ్చినా జరగదు!"


    "నాకోసం... ఈ ఒక్కరోజు..."


    పట్టరాని కోపంతో, చాచి లెంపకాయ కొట్టాడు అర్జున్.


    "మనిషికొక మాటా, గొడ్డుకొక దెబ్బా అన్నారు. నిన్ను మనిషిలాగా చూడబోయాను. గొడ్డువనిపించుకున్నావ్!"


    పుణ్యవతి కళ్ళలో నీళ్ళు నిండాయి. బాధగా, దిగులుగా అతనివైపు చూస్తూ నిలబడిపోయింది.


    విసురుగా వెళ్ళి కారు ఎక్కాడు అర్జున్.

 Previous Page Next Page