Previous Page Next Page 
కోరికలే గుర్రాలైతే పేజి 32

    ఆమె మనసు పూర్తిగా చెదిరిపోయింది. ఏదో చెయ్యాలి - చెయ్యాలి. ఏం చెయ్యాలి?
    ఆమె ఆలోచనలు తెగకముందే సినిమా పూర్తయి, లైట్లు వెలిగాయి. జ్యోతి ఉలిక్కిపడింది. పక్కనేవున్న ఆమెలో ఇంతసేపూ చెలరేగిన భావోద్వేగం మురారి గుర్తించలేదు.
    లైట్లు వెలిగాక జ్యోతి మొహం అదోలా వుండడం చూసి - "అదేమిటలా అయిపోయారు? వంట్లో బాగాలేదా?" ఆదుర్దాగా అన్నాడు మురారి.
    "లేదు.... లేదు.... కొంచెం తలనొప్పి..... అంతే" తడబడింది జ్యోతి.
    "మార్నింగ్ షో కదా - తలనొప్పి అందుకు వచ్చివుంటుంది. ఎండలో వచ్చాం" అన్నాడు.
    కారులో కూర్చున్నాక - "మీ ఇంటికి పదండి. ఏమైనా పుస్తకాలు తీసుకుంటాను. బొత్తిగా ఏం తోచడంలేదు" జ్యోతి ధైర్యంచేసి అంది.
    మురారి ఒక్కక్షణం సందేహించాడు. సుబ్బారావు లేకుండా బాగుంటుందా అన్పించింది. అంతలో మళ్ళీ ఇందులో ఏంవుంది? ఇంట్లో నాయర్ ఎలాగూ వుంటాడు.
    "సరే! పదండి" ఇంటివైపు పోనిచ్చాడు మురారి.
    ఇంటిముందు కారు ఆపి - "రండి లోపలికి. తలనొప్పి అంటున్నారు కాఫీ తాగి, పుస్తకాలు తీసుకు వెళుదురుగాని" మురారి ఆహ్వానించాడు.
    జ్యోతికి కావల్సింది అదేగనక సంతోషంగా దిగింది.
    మురారి జ్యోతిని డ్రాయింగ్ రూమ్ కి తీసికెళ్ళి కూర్చోపెట్టి నాయర్ని కాఫీ కలపమని పురమాయించాడు.
    "బుక్స్ తీసుకొస్తాను" అంటూ బెడ్ రూమ్లోకి వెళ్ళాడు మురారి.
    జ్యోతి ఒక్కక్షణం సందేహించి తనూ వెళ్ళింది.
    "కొంచెం బాత్ రూంలోకి వెళతాను. కాస్త మొహం కడుక్కుంటాను. తలనొప్పి తగ్గుతుందేమో!" అంది చనువుగా లోపలికివెళ్ళి.
    "ష్యూర్! అదిగో.... వెళ్ళండి. సోపు అక్కడే వుంటుంది. ఇదిగో టవల్ తీసుకోండి" చాకింటి తువ్వాలు అలమరానించి తీసి అందించాడు.
    జ్యోతికి నిజంగా బాత్ రూంకి వెళ్ళవలసిన అవసరంకంటే మురారితో ఏకాంతంగా ఉండే క్షణాలు కల్పించుకోడానికే అలా అడిగింది. అతను తను కలలుకన్న హీరోలా - తను వంటరిగా గదిలోకి రాగానే, ఆ క్షణం వృధాపుచ్చడని, చటుక్కున దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకుంటాడు.
    టవల్ అందిస్తూ చేయి పట్టుకుని కొంటెగా నొక్కుతాడు..... ఏదో జరగాలని ఆశించి వచ్చిన జ్యోతికి అలా జరగనందుకు నిరుత్సాహపడింది. బాత్ రూంలోంచి మొహం కడుక్కుని వచ్చేసరికి మురారి బుక్ షెల్ఫ్ నించి కొన్ని పుస్తకాలు ఎంచి వేరే పెడుతున్నాడు జ్యోతి కోసం.
    శాండిల్ వుడ్ పరిమళాలతో ఫ్రెష్ గా వచ్చిన జ్యోతి ఇప్పుడైనా ఆ అవకాశం వినియోగించుకోడా అన్నట్టు చూసింది.
    మురారి జ్యోతి గదిలోకి రాగానే తలెత్తి -
    "బాచ్ లర్ ని. మీకు బొట్టు, కాటుకలు ఇవ్వలేనుగాని అదిగో పౌడరు, దువ్వెన వున్నాయి. అబ్జక్షన్ లేకపోతే ఉపయోగించుకోండి" అంటూ అలా లేచివచ్చి దువ్వెన తువ్వాలుతో తుడిచి యిచ్చాడు.
    ఆ లేచిరావటం కేవలం వంకని, ఆ వంకతో. ఏం చేస్తాడో.... జ్యోతి గుండెలు ఆరాటంతో, ఉత్కంఠతతో కొట్టుకున్నాయి ఒక్కక్షణం.
    జ్యోతి మొహం చూసి ఆమె తనా గదిలో ఉండటంతో సిగ్గు పడుతుందని భావించి ఏరిన పుస్తకాలు, కొన్ని మాగజైన్స్ తీసుకుని బయటికి వెళుతూ -
    "మీ ముస్తాబు కానిచ్చి రండి, కాఫీ తాగుదాం" అని బయటికి వెళ్ళిపోయాడు.
    జ్యోతి నీళ్ళుగారిపోయింది. నిరాశగా డ్రస్సింగ్ టేబిల్ ముందు కూలబడింది. అద్భుత అవకాశం ఇంత చప్పగ జారిపోయినందుకు ఆమె మనసు మూలిగింది.
    మురారి తనేమన్నా అనుకుంటుందని కొంచెం జంకి వుంటాడు. అంతే - అదే అయివుంటుంది. లేకపోతే చొరవ చేసేవాడేమో. ఛా..... తను కొంచెం చనువు చూపాల్సింది.
    జ్యోతి నిర్లిప్తంగా జుట్టు కాస్త పైపైన దువ్వుకుని, పౌడరు అద్దుకుంది. అద్దంలోంచి బెడ్ రూము అంతా కన్పిస్తోంది. ఎంత బాగుంది ఆ కాట్. ఆ దుప్పటి ఎంత ఆర్టిస్టిక్ గా వుంద
    ఆ పక్కమీద మురారితో.... తన ఆలోచనలకి తనే ఒక్క అరక్షణం సిగ్గుపడింది జ్యోతి. కొత్త పెళ్ళికూతుర్లా తలవంచుకుంది. ఇలాంటి బెడ్ రూమ్, ఇలాంటి ఇల్లు తను కోరుకుంది.
    జ్యోతి డ్రస్సింగ్ టేబుల్ మీద ఉన్న మురారి ఫోటోని తదేకంగా చూసింది.
    ఎంత బాగున్నాడు! ఆ కళ్ళు ఎంతలా నవ్వుతున్నాయి! అప్రయత్నంగానే ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని అతని మొహం వేలితో రాసింది. అతని పెదాలమీద వేలు ఆనించి చటుక్కున ఆ వేలు తీసేసి ఫోటో పెదాలకి ఆనించుకుంది.
    అంతలోనే ఉలిక్కిపడి ఫోటో యధాస్థానంలో పెట్టేసింది. తను ఏమయిపోతుందో జ్యోతికి అర్థంకావడంలేదు. డ్రస్సింగ్ టేబిల్ మీద ఫారన్ ఉడుకులాం సీసా తీసింది.
    అబ్బ! ఎంత చక్కని పరిమళం! ఇదే అతను వాడతాడు. అందుకే ఎప్పుడూ ఘుమఘుమలాడతాడు. సుబ్బారావులా చెమటకంపు కొట్టకుండా. హుఁ! ఈ సీసా ఒకటే ఏ ఏభై రూపాయలుంటుందేమో.
    తమ బతుక్కి ఇలాంటివి కొనగలరా? స్ప్రే నొక్కబోయింది. మురారి తన దగ్గిర వాసన పసిగట్టి ఏమనుకుంటాడోనని మళ్ళీ పెట్టేసింది. అతను వాడే ఖరీదయిన పౌడరు, నూనెలు, ఆఖరికి షేవింగ్ సెట్టు అన్ని అత్యంత ప్రియమైన వాటిగా కన్పించి ప్రతిదీ చేత్తో తాకి చూసింది.
    రేడియోగ్రాంమీద ఏదో ఫారెన్ మాగజైన్స్ వున్నాయి.           

 Previous Page Next Page