Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 31



    షా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "నీ మాట నిజమై నా కొడుకు దొరికితే అంతకన్నానా దోస్త్! అలాగే" అని హామీ ఇచ్చాడు.

    లోకనాధం ఆనందంగా సీసాలో మిగిలిన ద్రవం అంతా ఎత్తుకుని గటగటా త్రాగేసాడు.

    ఆ తర్వాత ఇద్దరూ చాలా రకాలైన కలలు కంటూ నోరు నెప్పి పుట్టేదాకా మాట్లాడుకుని మంచం మీద అడ్డంగా పడి నిద్రపోయారు.

    తెల్లవారాకా షా హైదరాబాద్ లోని తన లోకల్ ఆఫీసు అడ్రెస్, ఫోన్ నెంబర్ ఇచ్చి లోకనాధం దగ్గర శలవు తీసుకుని బయలుదేరాడు. లోకనాధానికి కూడా అతనితో కలిసి హైద్రాబాద్ ప్లైన్ లో వెళ్ళాలనే వున్నా షా తను అవసరమైన పనిమీద మద్రాసు వెళ్ళాల్సొచ్చిందనీ అక్కడి నుండి హైద్రాబాద్ వచ్చినప్పుడు లోకనాధాన్ని తప్పక కలుస్తాననీ చెప్పి వెళ్ళిపోయాడు.

    షా వదిలేసిన ఫోటోని చూసి దీర్ఘంగా నిట్టూర్చి, దాన్ని తన సూట్ కేసులో పట్టుకుని లోకనాధం హైద్రాబాద్ ప్రయాణం అయ్యాడు.


                            *    *    *    *

    మధు ఆఫీసు నుండి వచ్చేటప్పటికి ఆ రోజు నాలుగిళ్ళ ప్రజలూ డాబా మీదే సమావేశమై కనిపించారు.

    రిషి మడత మంచం మీద పడుకుని ఆకాశం వైపే చూస్తున్నాడు.

    క్రింద బట్ట పరిచి బామ్మగారూ, ఆవిడ మనవరాలు సుబ్బలక్ష్మీ, వనజాక్షీ వడియాలు పెడ్తున్నారు.

    తాతగారు ఓ చోట నిలబడకుండా కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన కొడుకు కుర్చీలో కూర్చుని రిషితో అనునయంగా ఏదో మాట్లాడ్తున్నాడు. మల్లేష్ మధుని చూడగానే గొంతు పెంచి "గింతదానికే ఇంత పరేషాన్ అయితవేంది బే.... నేను లేనా! నాతోని పదిమందిని తోల్కపోత.... మధన్న బీ వచ్చిండు. నువ్వైన సజాయించరాదే" అన్నాడు.

    "ఏవిటి మళ్ళీ ఏమైంది?" మధు కంగారుగా అడిగాడు.

    "ఏవైందా? నేను చెప్తాను" అంటూ శ్రీజ బయటికి వచ్చింది.

    శ్రీజని అలా చూడగానే మధుకి తల తిరిగినంత పనైంది. శ్రీజ మధు షర్ట్, ప్యాంట్ వేసుకుని జుట్టు విరబోసుకుని పరమ స్టెయిల్ గా వుంది.

    "ఏయ్! ఏవిటా వేషం? సిగ్గులేదూ నా బట్టలు వేసుకోవడానికి" అంటూ అరిచాడు మధు.

    "ఏం చెయ్యను? తెచ్చుకున్న రెండు చీరలూ ఎంతకాలం కట్టుకోనూ? కొంటావేమోనని ఓపిక పట్టాను. నువ్వు కొనవని రూఢీ అయ్యాక నీ బట్టలు వేసుకుంటున్నాను" ఆమె ఇంకా గట్టిగా అరిచింది.

    "అబ్బబ్బా! ఊరుకోండర్రా.... అది నీ బట్టలు కట్టుకుంటే ఏమైందయ్యా! రేపు దానినే నువ్వు కట్టుకోబోతున్నావుగా?" బామ్మగారు సమాధాన పరచటానికి అంది.

    "దాన్నా....నేనా!" అంటూ మధు ఏదో అనబోతుండగా.

    "ముందు రిషి పారేషానీ ఇనుండ్రి. మీ ముచ్చట తర్వాత చూద్దాంగాని" అని మల్లేష్ అడ్డుపడ్డాడు.
    వనజాక్షి మూతి తిప్పుతూ "వజ్రాన్ని చూసి మట్టిబెడ్డ అనుకుంటుందేమో ఆ పిల్ల! ఆదివారం తాంబూలాలు ఎలా ఆపుతావో చూస్తాను అని తన మానాన తను ముస్తాబై కూర్చుంటుందా?" అంది.

    తాతగారు పచార్లు ఆపి కోడలితో---- "ఆ పిల్ల కాకపోతే ఇంకొకత్తె రేపీపాటికి రాజాలాంటి సంబంధం తెచ్చి ఆదివారాని కల్లా పెళ్ళి చెయ్యలేమా?" అన్నాడు.

    "పిల్లకోసం ఎక్కడిదాకానో ఎందుకో? మా సుబ్బలక్ష్మి లేదూ?" అంది సంబరంగా బామ్మగారు.

    వడియాలు పెడుతున్న సుబ్బులు సిగ్గుతో మెలికలు తిరుగుతూ-

    "వద్దే బామ్మ ఆయన సిగరెట్లు తాగుతాడు" అంది.

    "నువ్వు తాగు! నిన్నెవరు వద్దన్నారు? నువ్వు వారానికోసారి ఆముదం తాగుతావు మా రిషి వద్దంటే వింటావా?" అంది శ్రీజ.

    వనజాక్షి విసుగ్గా "అబ్బ! మీగోల మీదేగాని అతని గురించి పట్టించుకోరేం? అతను ఆ అమ్మాయిని మనసారా ప్రేమించాడు పాపం!" అంది.

    మధూ తానూ గోడమీద కూర్చుంటూ "అవును! అయితే ఇప్పుడేమైందీ?" అన్నాడు.

    శ్రీజ అతని పక్కకొచ్చి "ఇంకా ఏం కావాలి? మనసున మనసై, బ్రతుకున బ్రతుకై అని పాడుతూ తోడొకరుండిన అదే భాగ్యం అనుకోకుండా ఆశ్రిత అన్ని భోగాలూ కోరుతూ, అవన్నీ నువ్వు నాకివ్వగలవా? అని మన రిషిని సవాల్ చేసిందట. పైగా ఆదివారం ఎవరో కోటీశ్వరుడి కొడుకుతో నిశ్చితార్ధంట! చూడు.... రాజాలాంటివాడు బూజుపట్టిన గాజుకుండలా ఎలా తయారయ్యాడో!" అంది.

    మధు రిషి వేపు చూసాడు. రిషి ఇవన్నీ తనకి పట్టనట్లుగా నిశ్చలంగా ఆకాశంకేసి చూస్తూ పడుకున్నాడు.

    బామ్మగారు రిషి మంచం దగ్గరగా వెళ్ళి చేతులు తిప్పుతూ "ఆ ప్రేమలకేం కరువు? కావాలంటే ఈరోజునుంచీ మా సుబ్బుల్ని ప్రేమించు నాయనా! ఇంటెడు పని ఎంచక్కా బండిలా చేస్తుంది. ఇంత వంక పెట్టలేం" అంది.

    "ఆ! ఆ! చేస్తుంది. నాలుగుసార్లు భోజనం. గుండ్రంగా వడియాలు కూడా పెట్టలేక ప్రపంచ పటాలు వేస్తోంది ఇందాకట్నుంచీ" వ్యంగ్యంగా అంది వనజాక్షి.

    బామ్మగారు ఆ వ్యంగ్యానికి తోకతొక్కిన తాచులా లేస్తూ.... "ఏవమ్మా ఇందాకట్నుంచీ చూస్తున్నాను నీ వ్యవహారం? మా సుబ్బులు పెళ్ళి అవడం నీకిష్టంలేదా ఏమిటీ? వడియాలు పెట్టలేకపోయినా, అప్పడాలు వత్తలేకపోయినా మా ఆడపిల్లలు ఒద్దికగా ఇంటిలో పడుంటారు గానీ మేం ఎవరికీ అమ్ముకోము" అంది.

    ఆ మాటకి వనజాక్షి నెత్తిన వున్న కుండ భళ్ళున బద్ధలయినట్లు ఏడుస్తూ "మా అమ్మమ్మని పాలఘాట్ నుంచి కొని తెచ్చుకున్నారన్న విషయం మీతో ఎప్పుడో అన్నందుకేగా ఇంతమాట అనేసారు? మా వంశానికే మచ్చ పెడతారా? ఇంత అవమానం జరిగాక అసలు నేనెందుకు బ్రతకాలి?" అని అరిచింది.

    ఈ ఆడవాళ్ళ గొడవకి మల్లేష్ కి కోపం వచ్చింది.

 Previous Page Next Page