ఇండో - రూసీ భాయీ భాయీ
ఎయిరిండియా పైలట్లు సమ్మె గురించి పేపరులో చదివాం. ప్రభుత్వం సమ్మె విషయంలో నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నందుకు మాకందరికీ ఆనందం కలిగింది.
"లేకపోతే ఏమిటి? అంతంత జీతాలిచ్చినా కూడా ఇంకా చాలదంటే ఎలా? మనం చూడు ఎంత అల్ప సంతోషులమో! ఒక ఇన్ స్టాల్ మెంట్ డి.ఎ. ఇవ్వగానే ఆనందంతో పొంగిపోయి ఆరేళ్ళు మళ్ళీ నోరెత్తకుండా పనిచేస్తాం" అన్నాడు రంగారెడ్డి.
"మనకున్న దేశభక్తి ఆ పైలట్ల కెందుకుంటుంది?" అన్నాడు జనార్ధన్.
"అఫ్ కోర్స్ మనం ప్రబుత్వోద్యోగులం కనుక, పబ్లిక్ కి మనతో పనులెక్కువగా ఉంటాయ్ కనుక మనకు జీతంకాక తృణమో పణమో వస్తుందనుకో! ఆ పైలట్లకు అలాంటి వసతి లేదు కాబట్టి అడపా దడపా సమ్మెలు చేస్తుంటారు" అన్నాడు సాయిరామ్ సానుభూతితో.
"అదీగాక పైలట్లది చాలా రిస్క్ తో కూడిన ఉద్యోగం కదా?" అన్నాడు గోపాల్రావ్.
"ఏదేమయినా వాళ్ళు సమ్మెను భగ్నం చేయడానికి భారతప్రభుత్వం రష్యన్ విమానాలను, రష్యన్ పైలట్లను తీసుకొచ్చి విమానాలను నడుపుతూండడం నిజంగా చాలా గొప్ప నిర్ణయం."
"ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారో గాని వాళ్ళకు భారతరత్న అవార్డ్ ఇవ్వాలి!" అన్నాడు రంగారెడ్డి.
"ఆ నిర్ణయం వల్ల ఓ చిన్న ప్రమాదం కూడా ఉందని నాకనిపిస్తోంది" అన్నాడు గోపాల్రావ్.
"ఏమిటది?"
"విదేశీయులు మనదేశంలో విమానాలు నడపడం వల్ల మన రక్షణ స్థావరాలు, రక్షణకు చెందిన రహస్యాలు అన్నీ విదేశాలకు పూర్తిగా తెలిసిపోయే ప్రమాదం వుంది."
అతని మాటకు అందరూ ఘొల్లున నవ్వారు.
"పిచ్చి గోపాల్రావ్! నిజంగా నువ్వంత అమాయకుడివని మేమనుకోలేదు గురూ! మనదేశానికి సంబంధించిన మిలటరీ రహస్యాలన్నీ అమెరికా, రష్యాలకు మనకంటే ఎక్కువ తెలుసు! ఇప్పుడు కొత్తగా తెలుసుకునేదేముంటుంది?" అన్నాడు రంగారెడ్డి.
"అవునవును! అందాకా ఎందుకు! కిందటి పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ సబ్ మెరైన్ ఒకటి ఇండియా చేరుకున్న విషయం మనకు తెలియలేదు కాని రష్యాకు తెలిసి దాన్ని కాల్చి పారేసింది. కనుక రష్యా విషయంలో మనం భయపడాల్సిందేమీలేదు. వాళ్ళకు మనదేశంలో ప్రతి అంగుళం క్షుణ్ణంగా తెలుసు."
ఆ మాట నిజమేనని అందరూ ఒప్పుకున్నారు.
"అసలు మనదేశంలో అన్ని రంగాల్లోనూ ప్రబలిపోతున్న సమ్మెలూ, లాకౌట్ లూ సామూహిక రాజీనామాలు లాంటి విషయాల్లో కూడా ప్రభుత్వం ఇలా నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తేగాని దేశం బాగుపడదు" అన్నాడు సాయిరామ్.
"అంటే ప్రభుత్వం ఏం చేయాలంటావ్?"
"ఇప్పుడు పైలట్ల సమ్మె విషయంలో అనుసరించిన వైఖరే అనుసరిస్తే ఫలితాలు అద్భుతంగా వుంటాయ్."
"అవును" చాలామంది వంత పాడారు "అద్భుతమైన ఆలోచన."
"అంటే ఉదాహరణకు రైల్వే కార్మికులు సమ్మె చేశారనుకోండి! రష్యా నుంచి రైల్వే వాళ్ళు వచ్చి మనదేశంలో పనిచేసి మనవాళ్ళ సమ్మెను భగ్నం చేస్తారన్నమాట"
"కాని మనదేశంలో మనవాళ్ళు నడిపే ఇంజనులు, బోగీలు, ట్రాక్ లు వగైరాలు ఎంత దుస్థితిలో వుంటాయంటే వీళ్ళు తప్ప వీటిని ప్రపంచంలో ఇంకెవరూ నడపలేనంత దారుణంగా వుంటాయ్ కదా! పాపం మరి ఆ రష్యా వాళ్ళెట్టా నడుపుతారు?" అడిగాడు రంగారెడ్డి.
"అందుకని ఇప్పుడు విమానాలు తెచ్చుకున్నట్టే వాళ్ళ దేశం నుంచి రైలింజనులు, సిగ్నల్స్, ట్రాక్ లు, బోగీలు కూడా తెచ్చుకుని నడుపుతారన్న మాట." అందరూ చప్పట్లు కొట్టారు.
"ఒకవేళ బ్యాంకు వాళ్ళు సమ్మె చేస్తే?" ఎవరో అడిగారు.
"వెంటనే రష్యా నుంచి బ్యాంకు ఉద్యోగాలు అక్కడి కరెన్సీయే తీసుకొచ్చి దానినిక్కడ ప్రవేశపెట్టి పనిచేస్తారు."
"ఒకవేళ ఎన్జీవోలు సమ్మె చేస్తే?"
"రష్యా ఎన్జీవోలు వచ్చి పనిచేస్తారు."
"ఒకవేళ మనదేశంలో విద్యార్థులు సమ్మె చేస్తే?"
"ఈ విద్యార్థులు వచ్చి వారి స్థానంలో చదువుకుంటారు."
"మరి వారిక్కడి సిలబస్, ఇక్కడి పుస్తకాలు, ఇక్కడి భాష తెలీవు కదా?"
"అందుకే అక్కడ పుస్తకాలు తెచ్చుకుంటారు. ఆ భాష మన ప్రొఫెసర్లకు తెలీదు కాబట్టి టీచర్స్ కూడా అక్కడినుంచే వస్తారు."
"వండర్ ఫుల్! మన ప్రభుత్వం ఇంత తెలివిగలదని నేనెప్పుడు అనుకోలేదు" అంది రాజేశ్వరి.
"ఒకవేళ మన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే"
"మరీ మంచిది! రష్యా నుంచి వాళ్ళ బస్ లు, వాళ్ళ సిబ్బంది వస్తారు. దానివల్ల బస్ లన్నీ టైమ్ కి నడుస్తాయ్, స్టేజీల్లో కరెక్ట్ గా ఆగుతాయ్" అన్నారు పిల్లలంతా ముక్త కంఠంతో.
కొద్దిక్షణాల్లో మా అందరికీ రష్యా మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది.
"మనదేశం బాగుపడాలంటే రష్యా మీద పూర్తిగా ఆధారపడాల్సిందే" అన్నారు చాలామంది.
"ఒకవేళ మన రక్షణ దళాలు సమ్మె చేస్తే?" అడిగాడు మా కాలనీలో బీటు కొచ్చిన కానిస్టేబుల్ ఓ మూల నుంచి.
"వెంటనే రష్యా రక్షణదళాలు వచ్చి దేశాన్ని ఆక్రమించి మనకు రక్షణ కల్పిస్తాయ్."
ఈసారి ఎవరూ చప్పట్లు కొట్టటంలేదెందుకనో!
"అదంత మంచిది కాదనుకుంటాను" అన్నాడు రంగారెడ్డి.
"అదే మంచిది. మనకు రక్షణ కోసం పెట్టే ఖర్చుని దేశాభ్యుదయానికి ఉపయోగించవచ్చు."
"ఒకవేళ మన రాష్ట్రమంత్రులుగాని, కేంద్రమంత్రులుగాని, ప్రధానమంత్రిగాని రాజీనామా చేస్తే?"
"రష్యా ప్రధాని మనకు ప్రధానమంత్రిగా వస్తాడు." అందరూ చప్పట్లుకొట్టారు.
* * *