Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 31


    ఒక విషయము పదే పదే చూచుటవలన అదికలలో కనిపించును. కలగన్నప్పుడు అది నిజమని భ్రమ కలిగించును. సంసారము కూడా అట్టిదే. దానికి అస్తిత్వము లేకున్నను ఉన్నట్లు కనిపించును.
    జీవి బంధమోక్షములకు మనసే ప్రధానము. పరమాత్మతో అనురక్తి పొందిన అదే మోక్షమునకు హేతువగును. దుష్టమార్గములకు పరుగెత్తు మనసును భక్తియోగమునను, వైరాగ్యమునకు లొంగదీసి యోగసాధన చేయవలెను. ఏకాగ్ర చిత్తుడై నిష్కపట భావమున భగవత్కథలు వినవలెను. సర్వప్రాణుల ఎడ సమ భావము కలిగి ఆసక్తిని విడిచిపుచ్చవలెను. బ్రహ్మచర్యము, మౌన వ్రతము పూని స్వధర్మమును పాలించవలెను. దొరికినదానితో తృప్తిపడి మితముగా భోజనము చేయవలెను. ఏకాంతవాసమున శాంతముగా జీవించవలెను. సర్వజనప్రియముగా ఉండి దాయము ధృతియు కలిగి ఉండవలెను. తన శరీరము మీద, భార్యాపుత్రుల మీద అహంకారమును విడువవలెను. అట్లు సాధన చేసిన వానికి ప్రకృతి పురుషుల తత్వము అవగతమగును.
    సూర్యుడు అధిదేవతగా ఉన్న కంటితో ఆకసము మీది సూర్యుని చూచినట్లు యోగి అహంకారము వదలిన ఆత్మ ద్వారమున పరమాత్మను చూచును. తుదకు శరీరము మున్నగునవి వదలి అహంకారము మొదలగు అసత్య వస్తువులలో సత్య రూపమున ప్రకాశించు పరమాత్మను అతడు పొందును.
    ఆకాశమున ఉన్న సూర్యుని ప్రతిబింబము నీటిలోపడును. దాని ప్రతిబింబము ఇంటి గోడమీద పడును. ఇంటిలోని వారు ముందు గోడమీది ప్రతిబింబమును, తదుపరి నీటిలోని ప్రతిబింబమును చూచి తుదకు ఆకాశమున ఉన్న సూర్యుని చూతురు. అదేవిధముగా యోగియైనవారు భూతములు, ఇంద్రియములు, మనసు స్వరూపముగా కలిగి త్రిగుణాత్మకమైన అహంకారమున ప్రతిబింబించిన పరమాత్మ స్వరూపమును అహంకారము నుండియే చూచును.
    ఆత్మశుద్దమై పరమాత్మ జ్ఞాన స్వరూపమైనది. నిద్రావస్థ యందు భూతసూక్ష్మములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ది పనిచేయవు. అపుడు ఆత్మ అహంకారము లేక మేలుకొనియే యుండును. నిద్రావస్థలో నశించినది అహంకారము. కాని తానే నశించినట్లు భ్రమపడును మానవుడు. ధనము నావనమైనవాడు తానే నాశనమైనట్లు కలతపడును. అదేవిధంగా అహంకారము నశించుటవలన అసత్యముగా తాను నాశనమైపోయినాను అనుకొనును.
    ప్రకృతిని పురుషుని నుండిగాని, పురుషుని ప్రకృతినుండి గాని విడదీయుట కష్టము కదా! ప్రకృతి గుణములతో ఉన్నట్టి పురుషునకు కైవల్యము ఎట్లు లభించును? అన్న ప్రశ్నకు భగవానుడు సమాధానము చెప్పుచున్నాడు:
    అగ్నిలో దాచిపెట్టిన అరణి అగ్నిచేత కాలిపోయినట్లు, ఆత్మను మరుగుపరచిన ప్రకృతి, ఆత్మజ్ఞానమున తొలగిపోవును. సాధన వలన ఆత్మ ప్రతిబంధకమైనది. ప్రకృతి క్రమక్రమముగా పురుషుని వదలిపోవును.
    నిద్రపోయినవానికి కలలు ఎన్నో అర్ధములు కలిగించును. మేలుకున్న వానికి ఏ అర్ధము కలిగించవు. అట్లే అజ్ఞానికి ప్రకృతి సంసారరూపమైన అనర్ధములు కలిగించును. కాని జ్ఞానియైన వాడు భగవంతునిమీద చిత్తమున కేంద్రీకరించి ఆత్మారాముడైనచో అతనిని ప్రకృతి ఏమియు చేయలేదు, ఇట్లు పురుషుడు ఆత్మారాముడై, ఎన్నో జన్మముల వరకు ఆత్మతత్వము నెరిగి, బ్రమ్మలోకము వీక్షించక భగవానుని మీద భక్తికలిగి భగవంతుని సాక్షాత్కారము పొంది అమితానందమును అనుభవించును. అప్పుడు అతని అంగశరీరము నశించి, అవయవములన్నియు వదిలించుకొని కైవల్యపదము చేరును.
    
    అష్టాంగయోగ విధి
    
    దేవహూతికి సాలంబన యోగము ఉపదేశించుచున్నాడు భగవానుడు.
    ప్రతనియమాది మార్గములనవలంబించి, చెడుమార్గములకు పరుగెత్తు మనసును కట్టివేసి ప్రాణవాయువును జయించవలెను. అందుకు ఎనిమిది సోపానములు కలవు. అభ్యాసము వలన అన్నింటిని సాధించవలెను.
    
    1. ఆసనము: పవిత్ర ప్రదేశమున కుశలు వేసి, లేడి చర్మము పరచి, స్వస్తికాసనమున శరీరము చక్కగా         చేసుకొని అభ్యాసము చేయవలెను.
    2. పూరకము: ఊపిరి లోపలికి పీల్చుటకు అభ్యసించవలెను.
    3. కుంభకము: పీల్చిన గాలిని లోపల నిలుపవలెను.
    4. రేచకము: పీల్చిన గాలిని బయటకు వదలవలెను.
    5. అనులోమ: ప్రతిలోమములు - చంచలత్వమును పొందక, చిత్తము స్థిరమగునట్లు
    చక్కగా పరిశోధించి ప్రాణాయామము చేయవలెను. గాలిలోనూ, అగ్నిలోను, కాలిన బంగారమువలె శ్వాసను జయించిన యోగి మనసు నిర్మలమగును. ప్రాణయామము వలన వాత పిత్తాది దోషములు తొలగిపోవును.
    6. ధారణ : శ్రీమద్భాగవత్ రూపమును ధరియించుట, నిలుపుట, గ్రహించుట.
    7. ఇంద్రియ ప్రత్యాహారము: మనసు, ఇంద్రియములను విషయవాసనల నుండి మరలించుట.
    8. ధ్యానము: ప్రానాయామములు మున్నగు వానిచేత మనసు భగవంతునిపై నిలిపి,
        నాసికాగ్రమున దృష్టి నిలిపి భగవానుని మూర్తిని ధ్యానించవలెను.
        స్వామి భయముననే గాలి వీచుచున్నది. సూర్యుడు ఉదయించుచున్నాడు. అతని
        భయముననే ఇంద్రాగ్నులు - పంచమమగు మృత్యువు పరుగులు తీయుచున్నది.
        ఈ క్రిందిది ఆనందపు మీమాంస అగుచున్నది.
    ఒక యువకుడు జీవితపు పరమదశలో ఉన్నాడు. మంచివాడు, విద్యావంతుడు, సాహసి, బలిష్టుడు, శక్తివంతుడు. ఈ జగత్తు - జగత్తులోని సంపద సాంతం అతనికి చెందుతుంది. అది ఒక మానవానందం అవుతుంది.
    శత సంఖ్యాక మనవానందములు ఒక మనుష్య గంధర్వానందమగు చున్నది.  నిష్కామ వేదవిదుని ఆనందం అంతటిది.
    శత మనుష్య గంధర్వానందములు ఒక గంధర్వానందమగు చున్నది. శ్రోత్రియస్య చాకామహోతస్య - నిష్కామ వేదవిదుని ఆనందం అంతటిది.
    శత గంధర్వానందములు చిరలోకమగు పితరుల ఆనందము అగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    శత చిరలోక పితరుల ఆనందము స్వర్గమున గల దేవతల ఆనందమగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    స్వర్గదేవతల నూరు ఆనందములు కర్మదేవతల ఒక్క ఆనందము  అగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    కర్మదేవతలు కర్మ వలన దేవత్వము సాధించినవారు.
    కర్మదేవతల నూరు ఆనందములు దేవతల ఒక్క ఆనందము అగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    దేవతల నూరు ఆనందములు ఇంద్రుని ఒక్క
    ఆనందము అగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    ఇంద్రుని నూరు ఆనందములు బృహస్పతి ఒక ఆనందము అగుచున్నది. శ్రోరతియస్య చాకామహతస్య.
    బృహస్పతి నూరు ఆనందములు ప్రజాపతికి ఒక్క ఆనందము అగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    ప్రజాపతి శత ఆనందములు బ్రహ్మకు ఒక్క ఆనందము అగుచున్నది. శ్రోత్రియస్య చాకామహతస్య.
    సాంఖ్యయోగమను రెండవ అధ్యాయము ముగిసింది.
    
                                ఓం శాంతిః శాంతిః శాంతిః

 Previous Page Next Page