"నేనెందుకూ?" అయిష్టంగా అడిగాడతను.
"ఎందుకేమిటి? భార్యవెంబడి రావడం చిన్నతనమా మీకు?" కోపంగా అందామె.
మాధవరావు ఆమెను నొప్పించడం ఇష్టంలేక తనూ త్వరగా స్నానం ముగించి రెడీ అయ్యాడు.
ఆరుగంటలకు బయట కారు హారన్ మోగింది.
ఇద్దరూ మేడ దిగి బయటకు నడిచారు. కారులో అప్పటికే మరో ఇద్దరు పెద్దమనుషుల్తో కూర్చుని ఉన్నాడు వర్ధనరావు.
"వీరు మన పిక్చర్ కి డైరెక్టరు. పేరు రమణరాజు. ఈమె మన రైటరు సీతండీ! వారు ఆమె భర్త మాధవరావు" తన పక్కన కూర్చున్నతనికి పరిచయం చేశాడు వర్ధనరావు.
అంతా కారులో ఆఫీసుకు చేరుకొన్నారు.
అప్పటికే సినిమా పత్రికల వాళ్ళు కొద్దిమంది వచ్చి ఉన్నారక్కడ. నిర్మాణం పూర్తి అయి రిలీజవబోతున్న తమ సినిమా గురించి మాట్లాడారు రమణరాజూ, వర్ధనరావులు. తరువాత తమ తదుపరి చిత్రం గురించి ప్రకటించారు. సీతను అందరికీ పరిచయం చేశారు. పత్రికలవాళ్ళు ఆమె చుట్టూ మూగారు. ఒకటే ప్రశ్నలు. అన్నిటికీ చిరునవ్వుతో జవాబిస్తోంది సీత, మాధవరావు ఒక్కడే ఓ మూల కూర్చుండిపోయాడు. ఆ ఆఫీస్ లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచీ అతని గురించి పట్టించుకున్నవారే లేరు. అంతా సీతకే ప్రాముఖ్యం. టీ పార్టీ కూడా ముగిసింది. సీతా వర్ధనరావు మాట్లాడుకుంటూ టీ త్రాగారు. ఆ సమయంలో వారిద్దరికీ కూడా మాధవరావు విషయం గుర్తుకురాలేదు. తీరా ఇంటికి బయల్దేరే సమయానికి సీతకి మాధవరావు గుర్తుకొచ్చాడు. అయితే ఎక్కడా అతని జాడ కనిపించలేదు.
"పదండి! ఇక ఇంటికి పోదాం!" అన్నాడు వర్ధనరావు ఆమె దగ్గరకొచ్చి.
"మావారికోసం చూస్తున్నాను! ఎక్కడా కనిపించటం లేదు" అటూ ఇటూ చూస్తుందామె.
"ఒకవేళ ఈ మీటింగ్ బోరు కొట్టి ఇంటికెళ్ళిపోయారేమో!" నవ్వుతూ అన్నాడతను.
"అదే జరిగుండాలి" అందామె అతనితోపాటు బయటకు నడుస్తూ. ఆమెకు లోలోపల కోపంగా వుంది మాధవరావు మీద అలా చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. తనతోపాటు వచ్చినప్పుడు ఎంత ఆలస్యమయినా మళ్ళీ తనతోనే ఇంటికి తిరిగిరావాలి. కారు ఆమె ఇంటిముందాగింది.
"ఓకే! గుడ్ నైట్" అన్నాడు వర్ధనరావు. తను డోర్ తెరచి పట్టుకొని.
సీత దిగి "గుడ్ నైట్" అంది నవ్వుతూ.
కారు వెళ్ళిపోయింది.
ఇంట్లోనే పాపాయితో ఆటలాడుతూ కనిపించాడు మాధవరావు.
"ఎందుకలా చెప్పకుండా వచ్చేశారు?" కోపంగా అడిగిందామె.
"ఏం చేయను? నీతో చెప్దామంటే నీ చుట్టూ పదిమంది. సినిమా తారకంటే ఎక్కువ పబ్లిసిటీ జరుగుతోంది. సరే అలా కాదని చల్లగా జారుకున్నాను."
"కాసేపుంటే ఏంపోయింది? ఇంటికొచ్చి మీరు చేసింది మాత్రం ఏముంది?"
"ఏమీలేదు. అక్కడ ఉండికూడా చేసేదేమీ లేదుగదా!"
"ఇంకోసారి అలా చేయకండి! అసహ్యంగా మీకోసం నేనా ఆఫీసంతా వెతకాలా? అందరూ ఏమనుకుంటారు?"
"అసలు ఇంకోసారి నేనొస్తే కదా నీతో!" నవ్వుతూ అన్నాడతను.
"ఎందుకని? మీకేమయినా అగౌరవం జరిగిందా అక్కడ?" రోషంగా అందామె.
"అదికాదు పాయింటు! నేను మా ఆఫీసు వాళ్ళందరినీ మనింటికి పార్టీకి పిలుస్తాననుకో! నిన్ను కూడా వచ్చి మా అందరి మధ్యా కూర్చుని టైమ్ పాస్ చెయ్యమంటే ఎలా వుంటుంది నీకు? ఇదెక్కడి గొడవరా బాబూ, ఎప్పుడు ఇక్కడినుంచి బయటపడతానా అని ఎదుర్చూడవూ? అదే నా పరిస్థితి కూడా! అక్కడ ఒక్కడు కూడా పరిచయస్థుడు లేడు. పైగా అందరూ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్ళే. సినిమాల గురించి నాకు "ఓనమాలు" కూడా తెలీవు. అంచేత నెమ్మదిగా ఇంటికొచ్చేశాను, ఎలాగూ నువ్వు వర్ధనరావుగారి కారులో ఇంటికొచ్చేస్తావని తెలుసుగా..."
"సరే_సరే మీతో వాదించి ఎవరు గెలవగలరు గనుక...పదండి భోజనం చేద్దాం!" కోపంగానే అందామె.
మాధవరావు ఆమె వెనుకే నడిచాడు.
భోజనం చేసి తన గదిలో రాసుకుంటూ కూర్చుందామె. పడగ్గదిలో చాలాసేపు ఆమెకోసం ఎదురుచూశాడు మాధవరావు. ఆమెను తన కౌగిట్లోకి లాక్కొని, ఏవో కబుర్లలోకి దించి ఆమె కోపాన్ని పోగొట్టాలని అతని ఉద్దేశం. కానీ సీత రాయడం ముగించేసరికి అతనే నిద్రలోకి జారిపోయాడు.