Previous Page Next Page 
జనవరి 5 పేజి 31

   

     పదవిలోకి వస్తే ప్రజల మనిషిగా ప్రవర్తిస్తారు. మన రాజకీయ నాయకులు తమ కుటుంబ సభ్యుల వ్యక్తులుగా, తమ బంధు, స్నేహవర్గాల మనిషిగానే ప్రవర్తిస్తారు. మిగిలిన కాలాన్ని ప్రజల బాధల గురించి ఆలోచించటానికి కాక పాత ప్రభుత్వాలు చేసిన ప్రతి పనిని తిరగదోడేందుకు ఉపయోగిస్తుంటారు. ఇంక వీళ్ళకు ప్రజల్ని పట్టించుకునే టైమెక్కడుంది పాపం....? ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడయినా ప్రజలను విస్మరించి తమ స్వార్ధం చూసుకునే వాళ్ళే అసలు మన దేశ రాజకీయ నాయకుల్ని, పొలిటీషియన్స్ అనే పాలిష్డ్ నేమ్ తో పిలువకూడదు. వ్యాపారవేత్తలైన రాజకీయ నాయకులంటే సబబుగా ఉంటుంది. ఇండియన్ పొలిటీషియన్స్ ఆర్ పాన్ బ్రోకర్స్, వడ్డీ వ్యాపారస్థులు...."
   
    కోడలు తనను, తన కొడుకును సమర్ధిస్తుందో లేక ఆమె మామగార్ని సమర్ధిస్తూందో అర్ధంకాక కొద్ది క్షణాలు తికమకపడింది.
   
    "నా భర్త సోమరితనంతో తన వ్యాపారాన్ని నష్టపరుచుకున్నాడు. జీవితంపట్ల, లక్ష్య సాధనపట్ల బద్దకానని, నిర్లక్ష్యాన్ని చూపే వ్యక్తులు ఖచ్చితంగా సఫరయి తీరాలి. ఏ వ్యక్తికయినా అనుకున్నది సాధించటానికి కష్టపడటంతప్ప, ప్రత్యామ్నాయం లేదని నమ్మే మనిషిని నేను. చేస్తున్న పనే దైవం. దాన్ని గాలికి వదిలేసి బార్లవెంట, భామామణుల వెంట తిరిగే వ్యసనపరుడ్ని, అతని తప్పుల్ని, ఒకసారి సమర్ధిస్తే అతను తిరిగి అవే పనులు చేసి, తనకొచ్చిన నష్టాన్ని, కష్టాన్ని పూడ్చుకునేందుకు తిరిగి అదికారాన్ని ఆశ్రయిస్తాడు. షల్ ఉయ్ ఎంకరేజ్.....?" ఆర్యభట్టు కోడలు ఒకింత గట్టిగానే తన అత్తగారితో వాదిస్తోంది.
   
    ఆమె చకితురాలయిపోతుంది తప్ప ఎదురు మాట్లాడలేకపోతుంది.
   
    "మామగారు నా భర్తకు సహకరించి దిగజారరని నాకు నమ్మకముంది. అసలైనా అలాంటి సోమరిపోతైన, వ్యసనపరుడయిన కొడుకును కన్నందుకు, మీరు కట్టుకున్నందుకు నేను సిగ్గుపడాలి. ఎవరు పండించిన గోధుమ గింజలున్నాయని మీ కొడుకింత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాడు? కన్న మమకారం కాఠిన్యమైనప్పుడే కన్నా కొడుకులు బాగుపడేది. మీ దగ్గర పనిచేసే వ్యక్తి ఒక్క క్షణం ఖాళీగా వుంటే మీరు క్షమిస్తారా? లేదు. మరి మీ కొడుకును దేశమెందుకు క్షమించాలి....? మీరు జన్మనివ్వటం లొక కళ్యాణమా? దేశ సౌభాగ్యమా? మీ కడుపునా పుట్టడం అన్నది పాపాల్ని కడిగే గంగానది పుణ్య స్నానమా....? ఆలోచించండి..... తోటకూర దొంగతనంనాడే మీరు మీ కొడుకును కఠినంగా శిక్షించి ఉంటే యిలా చేసేవాడా? ఎదగక ముందు అతని తప్పుల్ని క్షమించేందుకు మీ మమకారం అడ్డొచ్చింది. ఎదిగాక అతన్ని ఎదుర్కొని శిక్షించలేని మీ పిరికితనం  అడ్డొచ్చింది.
   
    శ్రమజీవి వ్యసనాలనయినా క్షమించవచ్చేమో కాని, సోమరిపోతు మంచితనాన్ని నేను క్షమించలేను.
   
    మన వ్యాపారంలో నేను ఇన్ వాల్వ్ అవుతానంటే మీ కొడుకు ఒప్పుకోలేదు. తన డామినేషన్ ఎక్కడ పడిపోతుందో అని ఆ పనినుంచి నన్ను దూరంగా వుంచాడు పోనీ తానైనా బాగా చేస్తాడా, అదీ లేదు కన్న మీకు అతన్ని క్షమించటం మీ బలహీనత, కట్టుకున్న నాకు ఆ బలహీనత లేదు. మరి కొన్నాళ్ళలో అతను మారకపోతే నిర్దాక్షిణ్యంగా నేను నీ కొడుకును వదిలేస్తాను.
   
    పగలంతా కష్టంతో అలసిపోయిన భర్త కండరాలతో, ఆత్మాభిమానం వున్న ఆడదాని సుకుమారమైన కండరాలు కలిసి పోయేందుకు యిష్టపడవచ్చుగాని, పగలంతా సుఖపడిన భర్త కండరాలతో ఏ భార్యా సంగమించకూడదని నా కచ్చితాభిప్రాయం. ఒక సోమరితో పక్కను పంచుకుంటే మరో ఇద్దరు సోమరిపోతులూ జెనిటికల్ పరంగా పుట్టుకొస్తే....? సో.... ఐయామ్ సారీ అత్తగారు....
   
    మీ కొడుకును మీరు మీ పొత్తిళ్ళలో పొదుపుకోవచ్చేమో కాని, నేను నా పవిట చాటుకు అతన్ని రానివ్వలేను.
   
    అతని మెదడునిండా ఇప్పుడు మానసిక వ్రణాలే ఉన్నాయి. మానసిక వ్యాదుల్ని మాన్పే మలాము పట్టీలు అంటిస్తే కాని అతన్ని సభ్య సమాజం గుర్తించదు. కనుక నేను మామగారి దగ్గరకు వెళ్ళి మాకు సహాయం చేయండని అడిగి దిగజారలేను. ఇప్పటికైనా శిక్షిస్తే దారి కొస్తాడనే వివేకమైన ఆలోచన మీకుంటే మంత్రిగారి భార్య ననే అహానికి వెళ్ళకండి. అన్ డ్యూ ఎడ్వాంటేజ్ తీసుకోకండి. లేదంటే మీ ఒక్కరే లోపలకు వెళ్ళండి" అంది తెగేసినట్లు ఆ యువతి.
   
    తన కోడలు తనకే అంత రిటార్ట్ ఇస్తుందని ఊహించని ఆమె ఖిన్నురాలై పోయింది.
   
    "శెభాష్...." అన్న మాటలు వినిపించి ఆ ఇద్దరూ గుమ్మంకేసి చూశారు. అక్కడ మంత్రి ఆర్యభట్టు గంభీర వదనంతో నించుని ఉన్నాడు. ఆయన చూపులు కోడల్ని అభినందిస్తున్నట్లున్నాయి.
   
    "లోపల ఉన్న పనికి మాలిన నా పుత్రరత్నమా.....బయటకు రా...నీకు సమాధాన మిచ్చేందుకు నీ భార్య ఇక్కడ సిద్దంగా ఉంది" అన్నాడు మంత్రి ఆర్యభట్టు తల మాత్రం తన ఛాంబర్ కేసి తిప్పి.
   
    అప్పటి వరకు గుమ్మానికి వేలాడే కర్టెన్ చాటు నుండి తన మాటల్ని తన మామగారు విన్నారని తెలియగానే ఆమె ఆశ్చర్యపోయింది.
   
    కన్న కొడుకును వదిలేసి, కన్న కొడుకును నిరసిస్తున్న కోడల్ని తన భర్త సమర్ధించడంతో ఆమె కొద్ది క్షణాలు స్తంభీ భూతురాలైంది.
   
                        *    *    *    *    *
   
    సెల్వరాజ్ కి ఏం చేయాలో అర్ధంకాలేదు.
   
    తన తండ్రిది చాదస్తమని కొట్టిపారేయాలో.....ఆయనకు నీతి నిజాయితీ లెక్కువని కన్నకొడుకుగా తను గర్వపడాలో అర్ధం కాలేదు.
   
    కొడుకు దిగులుగా, ఒంటరిగా తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ పదే పదే తన ముందున్న ఫైల్ కేసి చూడటాన్ని అతని తల్లి భరించలేకపోతోంది. అలా అని భర్తకు చెప్పలేని నిస్సహాయత కూడా ఆమెను కృంగదీస్తోంది. ఆర్యభట్టు తన ఇంటిలో జరుగుతున్న పరిణామాల్ని గ్రహించగలిగాడు. ఈ దేశంలో యువతకు డబ్బు, ఉద్యోగాలు, వ్యాపకాలు లేకపోవచ్చేమో కాని, తెలివి తేటలు మాత్రం వున్నాయి. నా నమ్మకాన్ని నువ్వు రుజువు చేస్తే నీ సమస్య పరిష్కారమయి పోతుంది అన్నాడు మంత్రి ఆర్యభట్టు సెక్రటేరియట్ కి వెళ్ళిపోతూ.
   
    ఆయన మాటల్ని సెల్వరాజ్ విన్నాడు.
   
    మంత్రి ఆర్యభట్టు కారు అలా వెళ్ళి పోవడం ఆ వెనుక కొద్ది నిమిషాల వ్యవధిలో సెల్వరాజ్ మారుతికారు రోడ్డెక్కడం జరిగిపోయింది.
   
    అతని కారిప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ కేసి వేగంగా దూసుకుపోసాగింది.
   
    ఈ దేశయువతకు తెలివితేటలున్నాయని రుజువు చేస్తే తను ఒడ్డున పడిపోతాడు. తన తండ్రి తెలివితేటలు, అంచనాలు, ఆలోచనలెప్పుడూ గాడితప్పవు.
   
    చేయి తిరిగిన చిత్రకారుడి చేతిలో కుంచె ఏ గీత గీసినా అది ఓ అందమైన బొమ్మయి పోయినట్లు తన తండ్రి నోటివెంట ఏ మాట వచ్చినా అది నిజమై తీరుతుంది. సెల్వరాజ్ ఆలోచనలు తెగకముందే టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ వచ్చేసింది.
   
                      *    *    *    *    *
   
    ఆ మరుసటి రోజు ఉదయం టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక అన్ని ఎడిషన్స్ లో ఇచ్చిన ప్రకటన వచ్చింది.
   
    "ఫైనాన్షియల్ జీనియస్ కి భారీ పారితోషికం" అనే మకుటంతో మొదలైంది ఆ ప్రకటన.
   
    నాకు వెయ్యి ఎకరాల భూమి వుంది.
   
    అది చిత్తడి భూమి. దాన్ని బాడవనేల, లేక బురదనేల అనవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అసంఖ్యాకమయిన బురద గుంటలలో నిండివున్న ఉప్పు పర్ర. MARSHY LAND అది ఎందుకూ పనికిరాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు తేల్చివేశారు. దాన్ని పూడ్చందే ఏ పనికైనా ఉపయోగించుకోవటం చాలా కష్టమని మరి కొందరి సలహా. దాన్ని పూడ్చాలంటే కనీసం పది కోట్లు ఖర్చు పెట్టవలసి వుంటుంది. అది పూర్తిగా అన్ ఎకనామికల్. నా ఈ సమస్య పరిష్కరించి ఆ భూమి మీద నాకు ఏదో విధంగా లాభాలొచ్చేలా సలహా యిచ్చే ఫైనాన్షియల్ జీనియస్ కి భారీ పారితోషికం అందించడం జరుగుతుంది. అనే మేటర్ కింద సెల్వరాజ్ అడ్రస్ వుంది.
   
    ఫ్రంట్ పేజీలో ముద్రించబడిన ఆ ప్రకటన దేశ వ్యాప్తంగా చాలా మందిని ఆకర్షించింది.
   
    అందులో కొంత మంది బుర్రలని బ్రద్దలు చేసుకుని ఆలోచించారు.....
   
    యింకొంత మంది మెదడుకి పదును పెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
   
    మరి కొంతమంది అదొక పిచ్చి ప్రకటనని నవ్వుకున్నారు.
   
    జీవితాన్ని తేలిగ్గా తీసుకునేవాళ్ళు మాత్రం దానిని పేరడి క్రింద తీసుకున్నారు.
   
    కానీ మేఖల మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకుని లైబ్రరీ లోపలనించి బయటకు వచ్చి ఆటో ఎక్కి ఎయిర్ పోర్టుకి బయలుదేరింది.
   
                        *    *    *    *    *

 Previous Page Next Page