Read more!
 Previous Page Next Page 
తీరం చేరిన నావ పేజి 3


    వాణి గొంతు పెగల్చుకుని- "నేను... నేను...మీరు మీరెక్కడ నేనెక్కడ-నన్ను ఎందుకు చేసుకోవాలను కుంటున్నారు -మీ కేవిధంగానూ..." వాణిమాట పూర్తికాకముందే అతను చేత్తో వారిస్తూ-"నీ గురించి అన్ని సంగతులు ఆదిశేషయ్యగారి ద్వారా తెలుసుకున్నాను- నీకు తండ్రి లేడు-డబ్బులేదు- నీసంపాదనే యింటికి ఆధారం. నీపై ఆధారపడి ముగ్గురున్నారు. నీకు సంగీతమే జీవనోపాధి-ఇంతేనా యింకేమన్నా నీవు చెప్పేది ఏమన్నా వుందా- నిజమే! నీకు నాకు అంతస్థులలో చాల తేడావుంది. నేనెందుకు నిన్ను కోరి అడుగుతున్నానా అని సందేహించవచ్చు
    అతను చెప్పడం ఆపి గార్డెన్సు గేటు లోంచి కారు తీసుకెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో ఆపాడు. వాణి ఆరాటంగా కుతూహలంగా ఏం చెప్తాడోనని చూసింది. అసలు వాణికి ఇప్పటికీ యిదంతా నమ్మశక్యముకాని నిజంలా ఏదో కలలో మాదిరి అన్పిస్తూంది.
    రాజారావు సావకాశంగా సిగరెట్టు తీసి వెలిగించుకున్నాడు. ఓసారి వాణిని చూశాడు- "చూడు వాణీ నా వయసు ముఫ్ఫై నాలుగేళ్ళు నాకు యిదివరకు ఒక పెళ్ళయింది. భార్య లేదు పిల్లలు లేరు- కావల్సినంత డబ్బుంది-బోలెడన్ని భూములు-వూర్లో లంకంత యిల్లు-నా అనిచెప్పుకోడానికి ముసలి తల్లి తప్ప ఎవరూ లేరు.ఇవీ నాగురించిన వివరాలు రెండోపెళ్ళి అయినంత మాత్రాన నాలాంటి డబ్బున్న వాడికి-అట్టే వయసులేనివాడికీ పిల్లనివ్వడానికి చాలామందే తయారుగా వున్నారంటే నీవు నమ్ముతావా. అంచేత నాకెవరూ దొరక్క రెండో పెళ్ళివాడినని నిన్ను చేసుకుంటాననడం లేదు అర్ధమైందా" దర్పంగా అన్నాడు.
    తల ఆడించింది వాణి- నిజమే ఈ దేశంలో ఆడపిల్లకి పెళ్ళయితే చాలుననుకునే తమలాంటి దౌర్భాగ్యులు ఎందరో వున్నారు.
    "మరి అయితే....నన్ను ఏ ప్రత్యేకతాలేని నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు" ఇంతసేపటికి ధైర్యం తెచ్చుకుని కూడా బలుక్కుని అంది వాణి.
    "ఏమో- నీవు నచ్చావు- చేసుకోవాలనిపించి యింట్లో అమ్మ ముసలిదయిపోయింది- పెళ్ళి పెళ్ళని చంపుతూంది- ఎవరినో ఒకరిని చేసుకోవాలి నిన్ను చూశాక చేసుకోవాలనిపించింది- అంతే" అన్నాడు అతను సూటిగా వాణిని చూస్తూ.
    ఏం అనాలో తోచలేదు వాణికి-అతనంత కుండబద్ద కొట్టినట్టు మాట్లాడుతుంటే నిరుత్తరయి చూసింది.
    "నీకు వున్న సంగతి చెప్పాను. నీ కిష్టమైతే మీ అమ్మ గారితో వచ్చి మాట్లాడుతాను."
    "నేను-నేను ఆలోచించాలి- మీకు మా యింటి పరిస్థితి తెల్సుగదా."
    "తెల్సు.....తెల్సు-దానికి ఏదో ఏర్పాటు చెయ్యచ్చు- మీ తమ్ముడికి ఏదో ఉద్యోగం వేయిస్తాను. అప్పుడప్పుడు ఏదో పంపిస్తూ ఆదుకోవచ్చు నీవు-ఆ విషయం ఆలోచించనవసరంలేదు" అన్నీ అతనే మాట్లాడుతూ నిర్ణయం చేసేస్తుంటే వాణికి ఏం మాట్లాడాలో తోచలేదు.
    "నేను యింటికెళ్ళి అమ్మతోచెప్పి...." వాణి మాట పూర్తిచెయ్యనేలేదు- అతను అసహనంగా "మీ అమ్మగారి సంగతి తరువాత- నీ యిష్టం ముందు చెప్పు" అన్నాడు. వాణికి వళ్ళు మండింది. ఏమిటీయన ఉద్దేశం- ఆలోచించకుండా, అమ్మకైనా చెప్పకుండా తను అడగగానే, అతని అంతస్థు, ఐశ్వర్యం చూసి ఎగిరి గంతేసి వప్పుకోవాలనా? వాణి కాస్త చురుగ్గా చూసింది. "ఇంటికెళ్ళి అమ్మ నేను మాట్లాడి కాని ఏం చెప్పలేను- క్షమించండి" అంది. అతని మొహం ఒక్కక్షణం ఎర్రబడింది. ఏదో అనబోయి అంత విరమించుకుని "సరే- అయితే ఎప్పుడు చెపుతావు - నేను హోటల్ నటరాజ్ లో వుంటున్నాను- వచ్చి చెపుతావా?"
    "సాయంత్రం మీరే రండి- అమ్మతో మాట్లాడినట్టు వుంటుంది" వాణి స్థిరంగా అంది.
    రాజారావు ఒక్కక్షణం మాట్లాడకుండా ఆలోచించాడు- కారుస్టార్టు చేస్తూ "సరేపద. మీ యిల్లెక్కడో చెప్పు డ్రాప్ చేస్తాను" అన్నాడు.
    ఇంటిముందు కారాపి యింజను ఆపకుండానే వాణి దిగడానికి వాణి మీదనుంచే వంగి కారు తలుపుతీశాడు-వాణిదిగగానే "సాయంత్రం ఆరుగంటలకి వస్తాను" అంటూ కారు ముందుకు ఒక్క ఉరుకుతో పోనిచ్చి వెళ్ళిపోయాడు. అలా చూస్తున్న వాణి ఏదోకల ముగిసినట్టు తేరుకుని. తెప్పరల్లి లోపలికి అడుగుపెట్టింది.
    
                                     *    *    *    *
    
    కూతురినోట సంగతివిన్న సత్యవతమ్మ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయింది.
    "నిజమేనుటే- అతను నిజంగా అలా అన్నాడుటే" అంటూ అపనమ్మకంగా నాలుగుసార్లు అడిగింది.
    "ఏమిటమ్మా జరిగిన సంగతి చెప్తుంటే నిజమా అంటావేమిటి?" విసుక్కుంది వాణి
    "అదికాదే అంత డబ్బున్న వాడు- అంత గొప్పవాడు నిన్నెలా పెళ్ళాడుతానన్నాడే?"
    "రెండో పెళ్ళిగా-"
    "అయితే మాత్రం- ముఫ్ఫై నాలుగేళ్ళంటే ఎంత ఈ రోజుల్లో కొందరికింకా మొదటి పెళ్ళి యీడే. అందులో పిల్లలులేరు. కావాలంటే బోలెడుమంది దొరుకుతారుగా.

 Previous Page Next Page