Read more!
 Previous Page Next Page 
కన్నీటికి వెలువెంత? (కథలు) పేజి 3


    మహా అయితే "మాయదారికాలం. మాయదారి డాక్టర్లు యిలా జలగల్లా పీల్చేస్తున్నారు. యిలా గుంజేస్తున్నారు. డాక్టర్ల పని బాగుంది" అంటూ తిట్టుకుంటారు కాసేపు.
    అంచేత డాక్టరు సరోజినీదేవి మనకోసం ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినా అవి జిత్తులు ఎత్తులు అని తెల్సినవారు తెలియనివారూ ఆ వూర్లో ఆవిడ నర్సింగ్ హోమ్ కి వెళ్ళకమానకు! వెళ్ళక తప్పదు.
    అలా సంపాదించిన మనీతో ఆవిడ ఊర్లో దివ్యమయిన బంగళా కట్టించింది! అంతకంటే దివ్యమైన నర్సింగు హోము కట్టించింది. కారు కొంది. కంపెనీలో షేర్లు తీసుకుంది. బ్యాంకీల్లో ఎకౌంట్లు ఓపెన్ చేసింది. సోఫా సెట్లు, రేడియో గ్రాములు, ఫ్రిజిడీర్లు, డన్ లప్పులు, ఎయిర్ కూలర్లు వగైరా యింటికి కావాల్సిన హంగులన్నీ అమర్చుకుంది. వంటకి అయ్యరు, పిల్లలకి ఆయా, కారుకి డ్రైవరు మొదలైన పరివారాన్ని ఏర్పరచుకుంది. ముగ్గురు పిల్లలు ముచ్చటగా కాన్వెంటులో చదువుకున్నారు. ముగ్గురుకీ మూడు ఇన్సూరెన్సు పాలసీ లున్నాయి!
    ఆవిడభర్త ఆనందరావు సార్థక నామధేయుడు! ప్రపంచంలో తను పొందగలిగినంత ఆనందాన్ని, సరోజినీదేవి డబ్బుతో పొందుతూ ఆనందిస్తుంటాడు. అతను నలుగురికీ మిస్టర్ సరోజినీదేవిగానే తెలుసు. అతనికీ ఓ బ్యాంకి ఎకౌంటు ఇన్సూరెన్సుపాలసీ తీసుకుంది సరోజినీదేవి! అతని ప్రైవేటు తిరుగుడికి 'ఓ వెస్పా' కొనిచ్చింది. ఆమె పురుళ్ళు గర్భస్రావాలు చేసి సంపాదించిన డబ్బుని పేకాటద్వారా చేతనయినంతగా ఖర్చుచేయడం అతని హాబీ. భర్త అన్నపదానికి నిజమైన అర్థం చెప్పాలంటే వారి సంసార జీవితంలో సరోజినీదేవే భర్త! ఆనందరావు విశ్వాసపాత్రుడైన భార్య!
    ఇంక డబ్బు కాపీనం ఆవిడకెందుకు? నెలకి ఎంతలేదన్నా ఐదారు వేల పైన సంపాదిస్తుంది. ఇంకా ఇంకా ఇలా ఈ డబ్బుకోసం ఆవిడకీ కక్కుర్తి ఎందుకు చెప్మా అని, ఆవిడంటే గిట్టనివాళ్ళు కసిగా అనుకుంటారు. ఖర్చుపెట్టే మొగుడున్నాడు. ముగ్గురు పిల్లలున్నారు. నల్గురు నర్సులున్నారు. నర్సింగ్ హోమ్ వుంది. నలుగురు నౌకర్లున్నారు. ఇన్ కంటాక్స్ వాళ్ళున్నారు. స్టేటస్ ఉంది. ఇవన్నీ మెయిన్ టెయిన్ చెయ్యాలంటే డబ్బు వద్దా ఏమిటి, పాపం ఆడది సంసారం లాగుకొస్తూంది" అంటారు ఆవిడ అభిమానులు.
    మొత్తానికి ఆవిడ డబ్బుమనిషని పేరు పడింది ఆ వూర్లో! అయినా ఆవిడ నర్సింగ్ హోమంత బిజీ నర్సింగ్ హోమ్ ఆవూళ్ళో లేదు.

                                               *    *    *    *

    సరోజినీదేవి నర్సింగు హోము వరండాలో ప్రొద్దుటనుంచి అతి ఆదుర్దాగా వినబోయే కబురుకోసం ఆందోళనపడుతూ డ్రైవరు రంగయ్య కూర్చున్నాడు.
    లోపల వెయిటింగు రూములో మాధవి తల్లిదండ్రులు అంతకంటే ఆందోళనగా ఎదురుచూస్తున్నారు కబురుకోసం.
    లోపల డాక్టరు సరోజిని అంతకంటే గాభరాగా వుంది. రెండు డెలివరీ కేసులు. అందులో ఒకటి డబ్బొచ్చే కేసు! రెండోది ఉల్ఫాకేసు! రంగయ్య భార్య సీతాలుకి, మాధవికి మధ్య స్క్రీన్ మాత్రం అడ్డువుంది. అటు సీతాలు యిటు మాధవి ఇద్దరు నొప్పులు పడుతున్నారు. ఇద్దరూ స్త్రీలే. ఇద్దరి బాధ ఒకటే.
    ఈ లోకంలో డబ్బుకెంత విలువుందో తెలియని మనుషుల్ని ఒక్క క్షణం అక్కడికి తీసుకొచ్చి నిల్చోపెడితేనే చాలు. డబ్బు విలువ ఎంతటిదో ఎవరూ నోరు విప్పి చెప్పక్కర లేకుండానే క్షణంలో గ్రహిస్తారు. నైతిక విలువల్ని కూడా డబ్బు ఎలా తారుమారు చేస్తుందో తెలుసుకోడానికి నిరంతర సృష్టి జరిగే ఆ గదే ఆటపట్టు.
    డాక్టరు సరోజిని స్వయంగా మాధవి ప్రక్కన కూర్చుని కాలు రాస్తూంది. కడుపు రాస్తూంది. చెమటలు పట్టిన ఆమె మొహంమీద అతుక్కుపోయిన వెంట్రుకలని ఆప్యాయంగా సవరిస్తూంది. కాస్త ఓర్చుకోవాలమ్మా.... అయిపోయింది కాస్త గట్టి నొప్పులు వస్తే కాన్పు అయిపోతుంది. కాస్త వేడి వేడి కాఫీ త్రాగుతావా.... ఇదిగో డైల్యూషన్ పూర్తికాగానే ఇంజక్ష నిచ్చేస్తాను నిమిషంలో పురుడు వస్తుంది. కాస్త ఓపికపట్టు అంతగా అయితే ఫోర్స్ సెప్స్ వేస్తాను.... నీకు భయంలేదు. అలా కాళ్ళు చాచుకో.... బాగా బాధగా వుందా...." అంటూ ఉపశమనాలు పలుకుతూంది బయట కూర్చున్న ఆమె తల్లిదండ్రులకి "మరేం ఫరవాలేదు, భయం లేదు. నేనున్నాగా" అంటూ ధైర్యం చెప్పి వస్తూంది.
    ఆ స్క్రీన్ అవతల- సీతాలుని ఎటెండ్ అవుతున్న నర్సు సీతాలు ఖర్మానికి సీతాలుని వదిలి ఓ పుస్తకం చదువుకుంటూంది. మధ్య మధ్య సీతాలు గట్టిగా మూలిగి, అరిచినప్పుడల్లా "అబ్బ అబ్బ ఏమిటలా అరుస్తావు. కాస్త ఓర్చుకోలేవూ చిన్నపిల్లలా ఏమిటా కేకలు, ఇప్పుడప్పుడే ఏం పురుడు రాదులే" అని కసురుతూంది. "ఇదిగో అలా ఊపిరి పైకిలాగు తావేం. క్రిందికి వదులు, మూడు కాన్పులయ్యాయి. ఇంకా తెలియదా" అని మరోసారి కేకలు వేస్తూంది. "అబ్బబ్బ అలా గొడవ చెయ్యకు. ఇది ఆస్పత్రి అనుకున్నావా? నీ ఇల్లనుకున్నావా? ఏం మొగుడి దగ్గర పడుకున్నప్పుడు తెలీవా ఏమిటి? కడుపొస్తుందని, నొప్పులు పడాలని...." అంటూ విదిలించి పారేస్తూంది. పాపం సీతాలు గట్టిగా మూలగడానికి కూడా భయపడ్తూంది. అవతల రంగయ్య ఏ నర్సన్నా కనిపిస్తే ఆరాటంగా భార్యకి ఎలా వుందోనని అడిగితే జవాబు చెప్పినపుడు చెపుతున్నారు. లేనప్పుడు విసుగ్గా మొహం చిట్లించి వెళ్ళిపోతున్నారు. డాక్టరయితే "ఇదిగో అలా పదిసార్లు అడక్కు. కాన్పు అంటే నిమిషాలలో అయిపోతుందనుకుంటున్నావేమిటి" అని గదమాయించింది.
    అసలే డాక్టరుకి చాలా విసుగ్గా చిరాగ్గా, కోపంగా వుంది రంగయ్య మీద. ఇలాంటి ఫ్రీకేసులు ఎటెండు అవడం ఎంతమాత్రం ఇష్టంలేదు ఆవిడకి. ఏదో మాటవరసకి అన్నమాట పట్టుకుని రంగయ్య తన పెళ్లాన్ని తన నర్సింగుహోముకు తీసుకురావడం ఆవేళకి రెండు రూములు ఖాళీ వుండి సరేననక తప్పకపోవడం, తీరా చేసి సీతాలు వచ్చిన ఓ గంటకే మాధవిని తీసుకురావడం, అలాంటి డబ్బు వచ్చే కేసు పక్కన సీతాలు లాంటి కేసుమీద ఎటెండవడం ఆవిడకి ఇష్టం లేదు. కాని టేబిల్ ఎక్కించాక తప్పదు. పొమ్మనలేక రంగయ్యమీద విరుచుకు పడింది ఆవిడ.
    చెబితే విన్నావు కాదు, ఇలా ప్రాణం తీస్తే ఎలా అంది. నీ నించి నా పరువు పోతూంది అంటూ తిట్టింది.కసిరింది, విదిలించింది, విసుక్కుంది.... ఏం చేసినా ఈ సమయంలో బయటికి తీసుకు పొమ్మనదులే అనే భరోసాతో డాక్టరమ్మగారి విసుగు, కోపం అంతా భరిస్తూ కిక్కురుమనలేదు రంగయ్య.
    సీతాలుకు నొప్పులు ఎక్కువయ్యాయి. అవతల మాధవికి నొప్పులు ఎక్కువయ్యాయి! డాక్టరు కంగారు చెప్పనలివికాదు. నర్సు ఏం కంగారు లేకుండా సీతాలు పక్కన నిల్చుంది. మాధవి నొప్పులు భరించలేకపోతూంది. సీతాలు అంతకంటే ఎక్కువ నొప్పులు వస్తున్నా నోరుమూసుకు భరిస్తూంది. ఇంక ఓర్చుకోలేదు. ఫోర్ సెప్స్ వేసేస్తాను. అనుకుంటూంది డాక్టరు! ఫోర్ సెప్స్ వేయడం ఆ దండుగకూడా ఎందుకు ఫ్రీ కేసుమీద. చచ్చినట్టు కాసేపు నొప్పులు పడితే అదేవస్తుంది పురుడు అనుకుంటూంది సీతాలు పక్కన నర్సు.

 Previous Page Next Page