Read more!
 Previous Page Next Page 
కాదేదీ కథకనర్హం పేజి 3

 


                                                 రొట్టె ముక్క
    
    రైలు కీచుమంటూ ప్లాట్ ఫారం మీద ఆగింది. అంతవరకు నిద్ర పోతున్నట్టున్న ఫాట్ ఫారం ఒక్కసారిగా మేల్కొంది. రైలు ఆగడం చూసి అంతవరకు చింతచెట్టు కింద గోటేబిళ్ళ ఆడుతున్న పెంటిగాడు, సిన్నిగాడు ఒక్క పరుగున వచ్చి గద్దల్లా వ్రాలారు రైలు దగ్గిర. అక్కడనించి వాళ్ళ ఆకలి పాట మొదలు "అమ్మా ఒక ముద్దపడేయి తల్లీ -- బాబూ నిన్నకాడ నించి గంజి నీళ్ళు లేవు ఒక పైసయియ్యి బాబూ, సిన్న రొట్టె ముక్క దెయ్యి తల్లీ మీకు పున్నెం వుంటది. అమ్మా- బాబూ మీ కాల్లకీ దండం బాబూ' అరిగిపోయిన గ్రామఫోను ప్లేటులా ప్రతి రైలు వచ్చేసరికి ఆ పాట మొదలుపెడ్తారు. యీగల్లా రైల్లో తింటున్న వాళ్ళ మీద ముసురుతారు. జలగల్లా పట్టుకు పీకుతారు. తింటున్న వాళ్ళు వాళ్ళ కాకిగోల భరించలేక, వాళ్ళ గజ్జి చేతులు, చింపిరి తలలు, కళ్ళ పుసులు, దినమొలలు చూసి తింటున్న తిండి మింగుడు పడక వాళ్ళని వదిలించుకుంటే చాలని తింటున్న అన్నం ఓ ముద్దో--- ఓ రొట్టె ముక్కో తిట్టుకుంటూ పడేస్తారు. యిచ్చే వరకు కంపార్ట్ మెంట్ కిటికీ పట్టుక వేళ్ళాడతారు--- రైలు కింద నించి పాముల్లా జరజర పాకి యీ ప్లాట్ ఫారం మీద నించి ఆ ప్లాట్ ఫారం కి యీ రైలు పెట్టె నించి మరో రైలు పెట్టెకి' ఎగబాకుతారు -----ప్లాట్ ఫారం అంతా కలయతిరుగుతారు. టీ స్టాలు వాడిని బతిమిలాడతారు -----కాంటినీవాడిని దేబిరిస్తారు ---బెంచీల మీద కూర్చున్న ప్రయాణీకుల ప్రాణాలు తోడ్తారు . ఓ ముద్ద అన్నం కోసం , ఓ రొట్టె ముక్క కోసం వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఆ చిన్న కడుపు కోసం వాళ్ళ ఆరాటం అంతా యింతా గాదు!
    పెంటిగాడు, సిన్ని గాడు కవలలు - ఎనిమిదేళ్ళ క్రితం అదే ఫ్లాట్ ఫారం మీద అదే చింతచెట్టు కింద ఓ గొనె పరదా చాటున, మరో గొనె పరదా మీద ఓ ముష్టి తల్లి వాళ్ళిద్దరిని కని పడేసింది. వాళ్ళిద్దరి తండ్రి ఎవడో ఆ తల్లికే తెలియదు. ముష్టి సింహాద్రికే పుట్టారో, లైసెన్సు కూలీల్లో ఎవడికి పుట్టారో, స్వీపర్ నర్సింహులు, రంగడికే పుట్టారో ఆ దేముడికే తెలియాలి. ముష్టిదైతేనేం శరీరం నిండా రోగాలుంటేనేం , వళ్ళంతా దుమ్ము కొట్టుకునుంటే నేం, తల నిండా పేలు కులకుల్లాడితేనేం , మైలు దూరానికి కంపు కొడితేనేం అవసరానికి అడదన్న నిజం మరచిపోలేని వాళ్ళలో ఏ పుణ్యాత్ముడో ఆమెకి మాతృత్వం ప్రసాదించాడు -- ఆ మాతృత్వం ఆమె పాలిట వరం గాదు, శాపం! ఒకరికి యిద్దరు భూమ్మీద పడ్డాక 'నా కడుపుకే లేదు, ఈ గుంటేదవల్ని ఏటి పెట్టి సాకను ,' అంటూ నెత్తి బాదుకుంది. 'నారు పోసినోడు నీరు పొయ్యడేటి , నీవు బతకడం లేదా, నాను బతకడం లేదా అల్లే పెరుగుతారు గాలికి ధూళికి' అంటూ ఓదార్చింది మరో ముష్టి తల్లి.
    అలాగే గాలికి, ధూళికి పెరిగినట్టే  ----- ఆ చెట్టు కిందే పెంటిగాడు, సిన్నిగాడు పెరిగారు. చింతచెట్టు కింద ఎండలో వళ్ళు కాచుకున్నారు, వర్షం నీళ్ళలో స్నానం చేశారు. చెట్టు కింద దుమ్ము పౌడరు రాసుకున్నారు --- పక్షుల కిలకిలా రావాలే జోల పాటలయాయి----- చింత చెట్టుకిందే పారాడడం నేర్చుకున్నారు --ప్లాట్ ఫారం మీద అడుగు లేయ్యడం నేర్చారు. రైళ్ళ కూతల మధ్య పలుకులు నేర్చారు. ముష్టితల్లి యిద్దర్నీ చెరో చంకని జోలె కట్టుకుని వచ్చే పోయే రైళ్ళ దగ్గిర అడుక్కునేది ---- దొరికినదేదో పిల్లల నోట్లో యింత పెట్టి తన నోట్లో యింత పెట్టుకునేది --- ఏం దొరకని నాడు తిని పారేసిన ఎంగిలాకులు నాకి, పంపులో నీళ్ళు కడుపు పట్టినన్ని తాగేవారు. చెట్టు కింద పిల్ల లిద్దరిని చెరో పక్కని పెట్టుకుని పడుకునేది ఆ తల్లి ---- పెంటిగాడు, సిన్నిగాడు నడక, మాటలు నేర్పిం దగ్గిర నించి తల్లి వెంట అడుగు వేసి , చిన్న చేతులు చాపి, 'అమ్మా బువ్వ - ఒక ముద్దా తల్లీ --- మీకు దండం తల్లీ ---' అని అడుక్కోడం నేర్చారు.
    పిల్లలకి అడుక్కోడం వచ్చేసింది. యింక తన అవసరం లేదన్నట్టు రెక్క లోచ్చిన పక్షులని వదిలిపోయిన పక్షిలా ఆ ముష్టి తల్లి కలరా సోకి ఆ చెట్టు కిందే కన్ను మూసింది --- ఆ మూడేళ్ళ దిక్కు మొక్కు లేని ఆ పిల్లలని చూసి తోటి ముష్టి వాళ్ళు జాలిపడి అడుక్కు తెచ్చుకున్నది తలో కాస్త ముద్ద పడేసేవారు. టీ స్టాల్ వాళ్ళు సీనా రేకు డబ్బాలో యింత టీ పోసి చెల్లని పాసిపోయిన రొట్టె ముక్కలు పడేసేవారు. కాంటీను దగ్గిర ఎంగిలాకులు ఏరుకుని నాకేవారు. రైలు ఆగగానే ప్రయానికుల ముందు చేతులు చాపెవారు. దొరికిందేదో తిని చెట్టు కింద పగలల్లా మట్టిలో దొర్లి దొర్లి ఆడి రాత్రి కాగానే వళ్ళేరగకుండా ఒకరి నొకరు కౌగలించుకుని నిద్ర పోయేవారు.
    ఒక్క తిండి విషయంలో తప్ప వాళ్ళిద్దరూ ఆప్తమిత్రులు --- తిండి దగ్గిరికి వచ్చేసరికి మాత్రం బద్దశత్రువుల్లా మారిపోతారు. ఒకడి చేతిలో ఏదన్నా పడిందంటే రెండోవాడు ఎక్కడ అడుగుతాడోనని చేతిలోది చటుక్కున నోట్లో పెట్టేసుకుని గుటుక్కున మింగేస్తారు. అప్పుడప్పుడు ఒకడి చేతిలోది ఒకళ్ళు గద్దలా వాలి తన్నుకుపోతారు. దానికోసం యిద్దరూ కుమ్ముకుంటారు. కుళ్ళ బోడుచుకుంటారు. జుత్తు పీక్కుంటారు. బండబూతులు తిట్టుకుంటారు. కాసేపు ఏడ్చుకుని తరువాత మరచిపోయి మరో రైలు వచ్చేసరికి యిద్దరూ కలిసి పరిగెత్తి ఏక కంఠంతో ముష్టి పాత మొదలుపెడ్తారు.

                                                *    *    *    *
    పెంటిగాడు , సిన్నిగాడు అప్పటికి తిండి మొహం చూసి ముప్పై గంటలయింది - నిన్నటి నించి ఎంగిలాకులలో పచ్చళ్ళు -- మిగిలిన కూర ముక్కలు అయినా తినడం కుదరలేదు. నిన్న ఉదయం జరిగిన ఒక ఉదంతం వాళ్ళిద్దరి నోట దుమ్ము కొట్టింది. నిన్న ఉదయం మెయిలు వచ్చి ఆగగానే పెంటిగాడు, సిన్నిగాడు యధాప్రకారం ముష్టిపాట మొదలుపెట్టి ప్రయాణీకులని పీడించడం మొదలు పెట్టారు. ఒక ఫస్టు క్లాసు కంపార్టు మెంటులో ఓ పెద్ద ప్రభుత్వాధికారి బ్రేక్ ఫాస్ట్ తింటున్నాడు -- పెంటిగాడు కిటికీ పట్టుకు వేళ్ళాడుతూ 'బాబూ చిన్న రొట్టెముక్క పడేయండి, మీ కళ్ళకి దండం బాబు, కడుపు మండి పోతంది బాబూ - "అంటూ - ఫో -- ఫో -- అని కసిరినా ,విసుక్కున్నా వదలకుండా జలగలా పట్టుకున్నాడు. --- అయన తింటున్న అమ్లేటు ఆశగా, ఆబగా చూస్తూ వాసన ఆఘ్రాణిస్తూ నోట చొంగ కారుస్తూ ఆకలి చూపులతో , గజ్జి చేతులతో దేబిరుస్తున్న వాళ్ళిద్దరినీ చూడగానే తింటున్న ఆమ్లెట్ గొంతు దిగనంది ఆయనకి. హాయిగా పేపరు చదువుకుంటూ బ్రేక్ ఫాస్టు ఎంజాయ్ చేయనీయకుండా , మూడు దవ్వ బిళ్ళల్లాంటి రూపాయలిచ్చి అర్దరిచ్చిన యీ బ్రేక్ ఫాస్ట్ ఈ ముష్టి వెధవల కోసం అన్నట్టు అడుగుతున్న వాళ్ళిద్దరిని చూసేసరికి దొరగారికి తిక్కరేగింది. ఆఫీసులో రెండు వేలు తెచ్చుకునే అధికారయినా ఎదురుగా చేతులు కట్టుకుని నిల్చుని చెప్పింది తుచ తప్పకుండా పాటించడం మాత్రం అలవాటయిన ఆ అధికారిగారికి ఆఫ్ ట్రాల్ ముష్టి వెధవలు తన మాటకి గడ్డి పోచకన్నా విలువ యీయకుండా , కేకలేస్తున్ననిర్లక్ష్యంగా నిలబడిన వాళ్ళిద్దరిని చూసేసరికి అయన కోపం కంట్రోలవలేదు - చేతిలో ఆమ్లెట్ ప్లేటులో విసిరికొట్టి - చరచర కంపార్టు మెంటు దిగి , బిరబిర స్టేషన్ మాస్టర్ రూమ్ వైపు నడిచాడు. అక్కడ అగ్నిపర్వతం బద్దలయినట్టు బరస్ట్ అయ్యాడు. అ స్టేషన్ మాస్టార్ని చెడామడా తిట్టాడు. దేశంలో ముష్టి వెధవలందరినీ శపించాడు. ముష్టి వెధవల్ని ప్లాట్ ఫారం మీదకి అడుగు పెట్టకుండా కంట్రోల్ చేయలేని అతని అసమర్ధతని దుమ్మెత్తి పోశాడు. స్టేషన్లనీ స్టేషను మాస్టర్లనీ , రైల్వే సిబ్బందిని, ముష్టి వెధవల్ని, పీడరీకన్నీ, డర్టీ ఇండియాని తిట్టి తిట్టి ఆఖర్ని ముష్టి వెధవన్న వాడు ఫ్లాట్ ఫారం మీద కనిపిస్తే నీ ఉద్యోగం ఊడదీస్తా, చిప్ప చేతికిస్తా ----- అంటూ రైలక్కడ యిరవై నిమిషాలు ఆగుతుంది కనక సావకాశంగా తిట్టి ---- ఆఖరి వార్నింగ్ యిచ్చి ఊపిరి పీల్చుకున్నాడు ఆ అధికారి.

 Previous Page Next Page