Read more!
 Previous Page Next Page 
నేను పేజి 3


    అమ్మ చాలా అందంగా ఉండేది. నాన్నగారు కురిపిస్తున్న ప్రేమ ఆమె మీద పూలవానలా పడి ఆ అందం మరింత ద్విగుణీకృత మవుతూ ఉండేది.


    వాళ్ళిద్దరి మధ్యా ఉన్న ప్రేమానురాగాలు అనుబంధం, శృంగారం, సెక్స్..... అన్నీ చాలా అందంగా కనిపించేవి.


    ఆమె ప్రవర్తనలో ఓ విశిష్టత ఉండి విలక్షణమైన పాత్రలా కనిపించేది.


    ఆమె పట్ల నాకో ఆరాధనా భావం.


    వాళ్ళకు నేనొక్కదాన్నే పుట్టాను. ముందూ తర్వాత ఎవరూ లేరు. అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. ఇంకా సంతానం ఉండాలనీ, మగపిల్లలు కావాలనే అభిలాష వాళ్ళిద్దర్లో ఎవరికీ ఉన్నట్లనిపించేది కాదు. నాలోనే సర్వస్వం చూసుకునేవారు. అలాంటి తల్లిదండ్రులున్నందుకు గర్వంగా ఉండేది. ఆ చిన్న వయసులోనే ఆశ్చర్యకరమనిపించే అనేక సంఘటనలు నా హృదయంలో, ముద్రితమై పోయాయి. నాలో సహజ సిద్ధమైన జ్ఞాపకశక్తి ఎక్కువ. ముఖ్యమైనవీ, అక్కరలేనివీ..... ఏవేవో సన్నివేశాలు..... జీవితంలో తారసపడ్డవి. రకరకాల దృశ్యాలుగా కళ్ళముందు ఉన్నట్లుండి మెదిలి మాయమైపోతూ ఉంటాయి. ఎందుకు గుర్తొస్తాయో తెలీదు. ఒక అర్థం పర్థం అంటూ ఉండదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను? ఆ చిన్నవయసులోనే నేను చూసిన సంఘటన విభ్రాంతి గురించి, సరళ రేఖల్లా సాగిపోవాల్సిన జీవితాలు భయంకరమైన మలుపులు తిరిగిన వెన్నో తారసపడ్డాయి.    


    జీవితాలు.....!


    ఈ పదం నాకెందుకో నవ్వు తెప్పిస్తుంది. బహుశా ఇంత అర్థం లేనిదీ, అవకతవకలతో కూడుకున్నది, క్షణాల మీద విలువల్ని పోగొట్టుకునేది ప్రపంచంలో ఇంకొకటి లేదేమో అయినా ఎంతో ప్రాముఖ్యతనూ, విలువల్ని సంతరించుకుంటున్నట్టిది. ఎందుకంటే దీనికి మరో ప్రత్యామ్నాయం, ఇంకో ఉనికి లేదు గనుక.


    ఇదో విచిత్రమైన భావన అంతే....


                                                                     *    *    *


    నాన్నగారు మమ్మల్నెంత ప్రేమగా గారాబంగా చూసేవారో బయటి స్నేహితుల్తో కూడా అంత ప్రేమగా మర్మం లేకుండా మనసిచ్చి మాట్లాడుతూ తన అమృతమయమైన స్నేహాన్ని పంచి పెడుతూ ఓ దివ్య పురుషుడిగా గోచరించేవారు. జాలి ఓ బలహీనత అనీ, వ్యసనమనీ, స్వార్థం, కఠినత్వం కరుడుగట్టుకుపోయిన పాషాణమూర్తులు, క్రూరమైన విజయాలు సాధించే రాక్షస ప్రవృత్తి గల మనుషులు వెక్కిరిస్తారు గాని, అందులోని అమూల్యత్వం అర్థం చేసుకునే సంస్కారానికి ఈ కుటిల ప్రపంచంలో చోటేది? నాన్నగారు బంధువుల్లోగాని, స్నేహితుల్లోకాని, అడిగినవారికి కాదనకుండా సాయం చేసేవారు. అందువల్ల ఒక్కోసారి  ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉండేవారు. అయినా ఆ ఇబ్బందుల్ని చిరునవ్వుతో భరిస్తూ ఉండేవారు. ఎలాంటి విషమ పరిస్థితుల్లోనైనా ఆయన పెదవుల మీద చిరునవ్వు చెరగటం నేను చూడలేదు.     


    ఆయనకు చిన్న చిన్న సరదాలు ఉండేవి. అప్పుడప్పుడు డ్రింక్ చెయ్యడం, డబ్బెట్టి పేకాడటం --- ఇంకా కొంచెం ముందుకు పోయే సరదాలున్నాయేమో తెలీదు. అయినా అవన్నీ నా కళ్ళకు తప్పులుగా కాక ఓ ముచ్చటగా కనిపించేవి. మనిషిలోని పొరపాట్ల కన్నా ఆ మనిషి గొప్ప వాడయినప్పుడు, వాటిని పొరపాట్లుగా తీసుకునే హక్కెవరికీ లేదు. ఆ మనిషి గొప్పతనం ముందు ఈ చిన్న చిన్న వ్యసనాలు వ్యాఖ్యానం చెయ్యటానికి వీల్లేనంతటి అల్పపు విషయాలుగానో, సహజ సౌందర్యాలుగానో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పటికి నిర్దాక్షిణ్యంగా గుర్తొస్తూ త్రాచుపాములా కాటేసిన ఆ రోజు....     


    నాన్నగారు ప్రొద్దుటే క్యాంప్ వెళ్ళిపోయారు. సాయంకాలం ఆరుగంటలకల్లా అమ్మతో వస్తానని చెబుతూ ఉండగా విన్నాను. ఆరు.... ఏడు ఎనిమిది దాటిపోయినా రాలేదు. అలా జరగటం మధ్య మధ్య అలవాటే. అమ్మా నేను భోజనాలు చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయాం. పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూ, ఆలోచనలు వచ్చినప్పుడు పరధ్యానంలో పడిపోతూ నేను కాలక్షేపం చేస్తున్నాను. పదయిపోయింది. అమ్మ గదిలో లైటారిపోయింది. ఓ అరగంట గడిచాక నాకూ కళ్ళమీదకు నిద్రతూగుతూండగా ప్రక్కమీదకు చేరి దుప్పటి కప్పుకుని పడుకున్నాను. చలి చలిగా వాతావరణం ఉన్నప్పుడు మెత్తటి దుప్పటి హాయిగా కప్పుకుని పడుకోవటం చక్కటి అనుభూతి, వెంటనే నిద్రపట్టేసింది. విశ్రాంతి శరీరానికి ఎంతటి కమ్మదనాన్నిస్తుందో.


    ఏదో గోల, అలజడితో కూడిన శబ్దాలు వినిపించి మెలకువ వచ్చింది. ఆ ధ్వనులలో ఏవో అపశృతులు. ఉలికిపాటుతో వొళ్లు గగుర్పొడిచినట్లయి లేచి కూర్చున్నాను.


    క్రింద గలభా, హడావుడితో కూడిన మాటలు. జరగకూడనిదేదో జరిగినట్లర్థమయింది. ఇంట్లో లైట్లన్నీ వెలుగుతున్నాయి. నిలబడి ఇంచుమించు పరిగెత్తినట్లు మెట్లు దిగాను.

 

    హాల్లో పది పదిహేను మంది ప్రోగయి ఉన్నారు. అమ్మ కూడా అక్కడే ఉంది.


    సోఫాలో నాన్నగారు పడుకోబెట్టబడి ఉన్నారు. శరీరమంతా గాయాలతో రక్తసిక్తమై ఉంది.    


    "యాక్సిడెంట్, కారులో వస్తోంటే లారీ వేగంగా వచ్చి ఢీకొందట."


    "బతికి ఉన్నాడా?"


    "తెలీదు."


    "హాస్పిటల్ కి తీసుకెళ్ళకుండా ఇంటికి తీసుకొచ్చారేమిటి?"


    "ఆవిడకు చెప్పకుండా."


    మెదడు మొద్దు బారినట్లయి పోయి, అచేతనంగా నిలబడి ఉన్నాను.


     ఏం జరుగుతున్నదో తెలీటం లేదు.    


    ఎవరో నాడి చూశారు. "ప్రాణం ఉంది" అలా చూస్తూ నిలబడ్డారేమిటి రండి హాస్పిటల్ కి తీసుకెళదాం అరిచారు.


                                                              *    *    *


    గవర్నమెంట్ హాస్పిటల్ లో మూడు రోజులున్నారు.


    ఈలోగా షాక్ లోంచి శోకంలోకి వెళ్ళిపోయాను. జరగబోయేది నాకు అర్థం అవుతోంది.

 Previous Page Next Page