Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 29


    "ఆశ్రితా!" రిషి వినలేనట్టు అరిచాడు.

    "ఏం అబద్ధమా? ఇలా కాకుండా మరోలా జరిగే ఆస్కారం వుందా? తాడూ, బొంగరం లేనివాడ్ని ప్రేమించి, లక్షల ఆస్తిని వదులుకుని ఎందుకు పోతున్నావు? అని నా తండ్రి అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు? అడవిలో చెక్కలతో ఇల్లు కట్టుకుని, ఇంటి ముందు నుండి పారే సెలయేర్లో కడవతో నీళ్ళు ముంచుకుంటూ పాటలు పాడడానికి 'లవ్ స్టోరీ' సినిమా కాదిది- జీవితం! ఉండడానికి ఇల్లూ, తినడానికి తిండీ, కట్టుకోవడానికి బట్టా ఇంకా చాలా అవసరాలుంటాయి. అవన్నీ ప్రేమతో సరిపెట్టుకోలేము. నేను మా నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని. ఆయన ఆస్తంతా నాకే వస్తుంది. ప్రేమ కోసం ఆయన్నీ, ఆయన ఆస్తినీ వదిలేసుకుని నీ దగ్గరకి వచ్చేస్తే ఒక్క పైసా కూడా ఇవ్వడు. ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఒక్క ఆయన మనస్తత్వమే ఏమిటీ- సైకాలజీ స్టూడెంట్ గా నేను అందరి మనస్తత్వాల గురించీ అంతో ఇంతో అంచనా వెయ్యగలను. మనమూ ఈ ప్రేమ వేడి తగ్గాకా అంత ఆస్తిని వదిలేసుకున్నందుకు బాధపడచ్చు! మన కోసం కాకపోయినా, రేపు మనకి పుట్టబోయే పిల్లల కోసమైనా ఆలోచించాలిగా. నన్నో కోటీశ్వరుడి కోడల్ని చెయ్యాలని నా తండ్రి ఆశ పడ్తున్నట్లు!"

    "అయితే ఇప్పుడేమంటావు?" రిషి ఆత్రంగా అడిగాడు.

    "ఆయన్ని ఒప్పించాలి. నన్ను నిజంగా ప్రేమిస్తే నాకోసం ఏమైనా చెయ్యాలి. నా కోసం అన్నీ వదులుకుని రా! అన్న పంధాలో కాకుండా, నువ్వు సుఖంగా వుండడానికి నేను ఈ ఏర్పాట్లు చేసాను అనేదే నా దృష్టిలో ప్రేమ. నన్ను ప్రేమించినందుకు నువ్వూ, నిన్ను ప్రేమించినందుకు నేనూ ఒక్కసారి కూడా విచారించకూడదు. ఇద్దరం సుఖపడాలి. సుఖపడాలంటే ప్రేమతోబాటు డబ్బు కూడా వుండాలి. నేను స్వార్ధంగా మాట్లాడ్తున్నాననుకోకు. మెటీరియలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఆలోచించు. ఏం చేస్తావో, ఎలా చేస్తావో- నిర్ణయాన్ని నీకే వదిలిపెడ్తున్నాను" అంది ఆశ్రిత.

    ఆశ్రిత లేచి వెళ్ళిపోతూ వుంటే, ఆపడానికి కూడా శక్తిలేనివాడిలా అలాగే పడుకుని నిస్సహాయంగా చూస్తుండిపోయాడు రిషి.


                                          *    *    *    *

    లోకనాధం పొగాకు కాడలు జేబులోకి తోసి, డన్ హిల్స్ పెట్టె చేత పట్టుకుని విలాసంగా లిఫ్ట్ లోంచి క్రిందికి దిగి, హోటల్ రిసెప్షన్ కౌంటర్ ఎదురుగా వున్న సోఫాలో చతికిలపడ్డాడు.

    "ఐ వాంట్ రూమ్. పైసా కీ పర్వానియ్యే, ముజే రూం చాహియే" అన్న మాటలు గట్టిగా వినిపించి లోకనాధం తల తిప్పి చూసాడు.

    బట్టతలతో తెల్లగా, పొట్టిగా వుండి, ఖరీదైన సూటు వేసుకున్న వ్యక్తి రిసెప్షనిస్టు మీద అరుస్తున్నాడు.

    రిసెప్షనిస్టు చిలకలా అవే మాటలు 'రూం లేదు' అన్న భావం వచ్చేలా ఇంగ్లీషులో, హిందీలో పలుకుతోంది. ఆ తర్వాత 'కూర్చోండి ఎవరయినా ఖాళీ చేస్తారేమో ట్రై చేస్తాను' అంది.

    అతను సణుగుతూనే వచ్చి లోకనాధం ఎదురుగా కూర్చుని పేపర్ చదవసాగాడు.

    లోకనాధం సగటు భారతీయుడి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్నవాడే కావటం చేత అతని చేతిలోని పేపర్ లో సగభాగం నిర్మొహమాటంగా అడిగి పుచ్చుకుని "థాంక్యూ.... భాయిసాబ్" అంటూ తన హిందీ పాండిత్యంకూడా చూపించాడు.

    అతను లోకనాధంవైపు చూసి "మీకు హిందీ వచ్చునా?" అని హిందీలో అడిగాడు. లోకనాధం నవ్వి "నేను హైద్రాబాద్ నుండి వచ్చాను. "నాకు హిందీ బాగా వచ్చు" అని ఉర్దూ కలిపి చెప్పాడు.

    అతను వెంటనే తన గోడు వెళ్ళబోసుకుంటూ "వ్యాపారం పనిమీద విజయవాడ వచ్చాను. ముందుగా రూమ్ బుక్ చేసుకునే వ్యవధి లేకపోయింది. ఈ వూరంతటికీ ఇదే పెద్ద హోటల్ అనుకుంటాను. నేను అసలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో తప్ప దిగను. అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ఫైవ్ స్టార్ హోటల్స్ వున్న నేను ఓ దరిద్రుడిలా యిక్కడ రూం దేబిరించడం కర్మ కాకపోతే ఏమిటి చెప్పండి?" అన్నాడు.

    లోకనాధం ఆశ్చర్యంగా "మీకు అంత పెద్ద స్టార్ హోటల్సు వున్నాయా? మీ పేరేమిటీ?" అని అడిగాడు.

    అతను చిరాగ్గా "కుందన్ షా నా పేరు. ఎవరెస్ట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అన్నీ మావే" అన్నాడు.

    లోకనాధానికి తను మాట్లాడుతున్నది సామాన్యుడితో కాదని వెంటనే తెలిసిపోయింది, మరింత నమ్రతగా ముందుకి వంగి "మిమ్మల్ని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అన్నాడు.

    అతడు నిర్లిప్తంగా నవ్వి "భారీగా టాక్స్ పేచేసే అతి కొద్దిమంది భారతీయుల్లో నేనూ ఒకడ్ని! నగల ఎగుమతి, దిగుమతి వ్యాపారం చేస్తుంటాను. నేను నా స్వంత ప్లేన్ లోనే గన్నవరం వచ్చాను. ఈ రాత్రికి విజయవాడలో గడిపి రేపు ఉదయం హైద్రాబాద్ వెళదాం అనుకున్నాను. అన్నట్లు మీదీ హైద్రాబాదే కదూ! ఫలక్ నామా ప్యాలెస్ అమ్మకం విషయం మీకేమైనా తెలుసా? ముక్రంజా నాకు మిత్రుడే అనుకోండి...." అన్నాడు.

    లోకనాధం నోరు అతనికి తెలియకుండానే విశాలంగా తెరుచుకోబోయింది.

    "220 గదులున్న ఆ నిజాం ప్యాలెస్ కొని అందులో స్టార్ హోటల్ పెట్టాలనుకుంటున్నాను. ఎలా వుంటుందంటారు?" అని అడిగాడు.

    లోకనాధానికి చూస్తున్నదీ, వింటున్నదీ నిజమో లేక కలో? అర్ధం కాలేదు. అంతటి భాగ్యవంతుడు తనతో మాట్లాడటం అతనికే విచిత్రం అనిపించింది. అమాంతం లేచి కాళ్ళమీద పడిపోవాలనిపించింది.

    ఇంతలోనే కుందన్ షా లేచి "ఎక్స్యూజ్ మీ" అంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు.

    లోకనాధం వెంటనే మనసులో నిశ్చయించేసుకున్నాడు. ఇతనితో స్నేహం గట్టిపడే ప్రయత్నం చెయ్యాలని.

    కుందన్ షా కోపంగా వచ్చి "అందుకే ఈ సౌత్ వాళ్ళంటే నాకు వళ్ళుమంట. మంచీ మర్యాదా లేదు. నేను నా ప్లేన్ తీసుకుని హైద్రాబాద్ పోతాను" అన్నాడు.

 Previous Page Next Page