ముక్కాలి పీటమీద ఉన్న దీపం పాక నలువైపులా కాంతి వ్యాపింపజేస్తోంది. మాసిన దుప్పటి పరిచిన మంచంమీద కూర్చుని శాయి మద్యం తాగుతున్నాడు. అతని కళ్ళు ఎర్రగా, చింతనిప్పుల్లా, ఉన్నాయి. జుట్టు చిందరవందరగా చెదిరి ఉంది. దుస్తులు నలిగి ఉన్నాయి. పాము కాటు తిన్నదానిలా అదిరిపడి, గభాలున లేచి నిల్చుంది వేదిత.
శాయి ఏమీ జరగనల్టు ఆమెవంక తన మండే కళ్ళతో చూస్తూ "ఏం చెయ్యను చెప్పు? చివరికీ పాడుపని చేయాల్సి వచ్చింది. ఈ రోజు యిలా జరగాల్సి ఉందని నీ దేవుడు మన జాతకాల్లో రాశాడు. ఇది వొట్టి అడవి. నేను అడవి మనిషిని" అన్నాడు.
వేదిత శరీరమంతా కోపంతో, అసహ్యంతో ఉడుకెత్తిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఎందులోనన్నాపడి చావాలనిపించింది. "చివరకు నువ్వు యింత నీచానికి ఒడిగట్టావా శేషబాబూ!" అంది అసహ్యంగా అతనివంక చూస్తూ.
"శేషబాబూ! నువ్వలా పేరు పెట్టి పిలుస్తోంటే నాకెంత ఆనందంగా ఉంది" అని శాయి ఆమె ముఖంలోకి చూస్తూ, తాగుతున్న గ్లాసు క్రింద పెట్టి లేచి నిలబడ్డాడు. అతని వళ్ళు తూలి క్రిందపడబోయి సర్దుకున్నాడు. అతని శరీరం అతనికి చాలా భారంగా తోచింది. కష్టంమీద తనని తాను నిలద్రొక్కుకుంటూ "నిన్ను అంతా అమ్మా అని పిలుస్తారు. మా సీత అక్కా అంది. నేను వేదితా అని పిలుస్తాను. నువ్వు నా స్నేహితురాలివి. ప్రియురాలివి.నా...."
"ఛీ!" అని ఆమె అతన్ని విదిలించి వేసింది. "నువ్వు మూర్ఖుడివి, పాపివి, దుర్మార్గుడివి. రాక్షసుడివి ."
"అవును. అవన్నీ నేనే. నేనే అవన్నీ అని ఒప్పుకుంటున్నాను. కాని వేదితా! నీకు నిందించటం తెలుసుగాని, పనికిమాలిన ఆ దేవుడ్ని ప్రార్థించటం తెలుసుగాని, ఒక తోటి మానవుని గుండెను చదవటం తెలుసా? నా గుండెల్లో దూరి, నరాల్లోకి దూకి చూడు ఏమంటున్నాయని? వేదితా! వేదితా! అని అలమటిస్తున్నాయి. ఈ లోకంలోలేని అందాలు నీలో దాచుకున్నప్పుడు నిన్ను ప్రేమించటం నా తప్పు ఎలా అవుతుంది? నువ్వే చెప్పు."
వేదిత కష్టంమీద అతనిమీద కలిగిన కోపాన్నీ, అసహ్యాన్నీ దిగమ్రింగుకుంది. బలవంతంగా తనని తాను శాంతపరుచుకుని "శేషబాబూ! నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నీకు ఉన్నత విద్య ఉంది. గుణవతి అయిన భార్య వుంది. అయినా కూడా ప్రలోభంలోపడి కొట్టుకుపోతూ వళ్ళెరగకుండా ఉన్నావు. కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. వ్యామోహం అనేది ఓ భ్రమ. ఆ భ్రమ అనే పొద నీ మనసు చుట్టూ క్రమ్మివేసింది. కోరిక కలిగింది కదాని ప్రతి వస్తువునూ ఆశించటం అవివేకం. మనం కోరిన ప్రతీదీ మనకు జీవితంలో లభించదు. ఆవ్యక్తపు కోరికను నిర్ధయంగా త్రుంచివేస్తూ ఉత్తమ లక్ష్యాన్ని చేపట్టి ముందుకు నడవటమే జీవిత ధ్యేయం" అన్నది ఆర్థ్రస్వరంతో.
"ఎంత తేలిగ్గా చెప్పావు?" అన్నాడు శేషుశాయి. నిట్టూర్చి. "మన అన్ని కోరికలనూ త్రుంచివేసుకోగలమా? ఇదేమన్నా సామాన్యమైన కోరికా? ఆనాడు దేవాలయంలో నిన్ను కౌగిట బంధించటమే నీకు తెలుసు. ఈనాడు నిద్రలోవున్న నిన్ను తట్టి బలవంతంగా తీసుకురావటమే నీకు తెలుసు కాని ఈ కోరిక వెనుక ఎంత చిత్రవధకు ఈ జీవి గురి అయినదీ, ఎంత ఆవేదన దాగివుందీ, ఎంత విషాద మనస్తత్వం, సంఘర్షణ అణిగివుందీ నీకు తెలియదు.ఈ తీర్పు నేను తీసుకోవటానికి ఎన్ని రాత్రింబవళ్లు ఎంత మధనపడి, హింసకు గురి అయానో నీకు తెలియదు. వేదిత! కళ్ళు మూసుకుంటే అంతా చీకటిగా ఉంటుంది. అలాగే ఏకాగ్రతగా ఉంటే ఆ కారు చీకటిలోంచి సన్నని కాంతిరేఖ ఆవిర్భవించి ,పెద్దదై మరింత పెద్దదై కనులముందు జ్యోతిలా వెలుగుతుంది. ఆ కాంతి రేఖలే నువ్వు! ఆ జ్యోతివే నీవు వేదితా! నా నరనరానా నీ పిచ్చి ఆవహించింది. నా రక్తంలోని ప్రతి అణువులోనూ నీ వ్యామోహం ఆక్రమించింది. నిండా నీ రూపమే ఆవరించింది. నిన్ను ఎలా మరిచిపోను? నీవు లేకుండా ఎలా బ్రతకను? నీ పొందుకోసం, ప్రేమకోసం విరహంతో, తాపంతో మగ్గి మగ్గి నా శరీరం పరవళ్ళు తొక్కుతోంది వేదితా. నీది విరగబూచిన యవ్వనం. నా కోసం పెరిగిన అందం ఈ శుష్క పూజలతో, వ్యర్థ ప్రార్థనలతో లోకుల మన్ననకోసం ఎందుకు వ్యర్థం చేసుకుంటావు? నీ యవ్వనం ఉడిగిపోయాక, నీ శరీరం ముడతలతో నిండిపోయాక పశ్చాత్తాపంతో నువ్వు కుమిలిపోతే నీ దేవుడు ఆరుస్తాడా తీరుస్తాడా? వేదితా! ఈ భగ్న హృదయుని అంతర్గత వేదన అర్థం చేసుకో. నన్ను కృతార్థుడ్ని చెయ్యి."
ఆమె ఊహించనంత వేగంతో, అతను ఆకస్మికంగా ముందుకు వచ్చి ఆమె పాదాలముందు మ్రోకరిల్లాడు. చేతుల్తో ఆమె సుందరమైన పాదాలను తాకాడు.
వేదిత గభాలున పాదాలను వెనక్కి లాక్కుంది. "ఏమిటీ ఉన్మాదం శేషుబాబు!" అంది కంపిత స్వరంతో.
శాయి ముందుకు జరిగి ఆమె మోకాళ్ళను తన చేతుల్తో చుట్టేశాడు. "వేదితా! నన్ను కరుణించు. నాకు నీ ప్రేమభిక్ష పెట్టు" అని అర్థించాడు.
వేదిత క్రిందికి వంగి బలవంతంగా అతని పట్టు విడిపించుకుని దూరంగా జరిగింది. ఆమెలో ధైర్యం, శాంతం, మనోనిబ్బరం అన్నీ అంతరించి పోయాయి. విహ్వల దృష్టితో అతనివంక చూస్తూ "ఛీ! ఎంత అసహ్యం? నువ్వు ప్రేమ అనుకుంటున్నది ప్రేమకాదు శేషుబాబూ! నీలోని మనోవికారం, నీలోని పైశాచిక ప్రవృత్తికి మారుపేరు పెట్టి నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోకు శేషుబాబూ! ఈ స్థితిలో నా మనుగడే అత్యంత ప్రమాదంగా పరిణమించింది. స్వచ్ఛందంగా, నిష్కంటకంగా తిరిగే నా శరీరంమీద నీ మోహపు దృక్కులు ప్రసరించబడటం నా దురదృష్టం. నా ఉనికి ఇంత హేయంగా తయారైనప్పుడు నా ప్రాణాల్ని సంతోషంగా త్యజిస్తాను. అటువంటి కోరిక కోరే బదులు నా ప్రాణాలు తీసుకో శేషుబాబూ! ఈ భూమ్మీద నేను లేకుండా చెయ్యి" అన్నది.
శాయి నేలమీద కూర్చునివుండే ఆమెవంక దీనంగా చూస్తూ "అలా అనకు వేదితా! అలా అనకు. నువ్వు నీ గతాన్ని మరిచిపో, నీ సిద్థాంతాలను విడిచిపెట్టు నాతోరా, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మళ్లీ ఈ ఛాయలకు రావద్దు ఇప్పుడే.... ఇప్పుడే వెళ్ళిపోదాం రా" అన్నాడు.
"శేషుబాబూ!" అంది వేదిత ఓర్పు విడిచి. నేను చెప్పేది నీ తల కెక్కదు. నీ పీడనుంచి తప్పుకోవటానికైనా నేను మరో ప్రదేశానికి వెళ్ళిపోతాను. ఇహ ఇక్కడ నాకు జరగదు."
"నీ సమాధానం అదేనా?" అంటూ శాయి లేచి నిల్చున్నాడు. అతని కంఠస్వరంలో మార్పు వచ్చింది. ప్రవర్తనలో మార్పు వచ్చింది. "నేనెంత ప్రాధేయపడినా, సత్యాన్ని స్పష్టంగా చెప్పినా నీ మొండితనం మానటంలేదు వేదితా. నిజమే, నువ్వన్నట్లు నన్ను ఉన్మాదం ఆవహించింది. నువ్వు నన్ను ఎలాగు అర్థం చేసుకోవు. అందుకని ఆ అర్థాన్ని నేనే సృష్టిస్తాను". అన్నాడు.