"నేను టైమ్ కే వచ్చాను. 7.30 నిమిషాల ఇరవై సెకండ్లకు నేను నా ఫోన్ దగ్గరున్నాను" చెప్పాడు.
"నేను నమ్మను. నువ్వు 7.35 నిమిషాల వరకు కూడా నీ ఫ్లాట్ కి చేరుకోలేదు. ఐయాం ష్యూర్ ఎబౌటిట్.
ఉద్యోగాలకు, రాజకీయ నాయకులకు టైం సెన్స్ లేకపోయినా కొత్తగా ఈ దేశానికి, దేశ ప్రజలకొచ్చిన నష్టమేమీలేదు. కాని స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య మాత్రం టైం సెన్స్ వుండితీరాలి. ఎందుకంటే గౌరవంతోటే స్నేహమయినా, ప్రేమయినా ప్రారంభమవుతాయి గనుక..."
"నిజంగా...నిజంగా నిజం...నా ప్రతి ఇంటిమేట్ మూమెంట్ ని ఫాలో అవుతున్న నువ్వు నేను చెబుతున్నది నిజమో, అబద్ధమో తెలుసుకోలేకపోయావా? ఈసారెందుకు పప్పులో కాలేసావు?" ఓ పక్క ఆశ్చర్య పోతూనే అడిగాడు శ్రీధర్.
ఫోన్ కి అవతలివేపు నుంచి గొంతు పొలమారిన శబ్దం. ఆపైన చిన్నగా కాఫ్. అది రియల్ గా వున్నట్టులేదు.
"ఏమిటి...ఏమైంది...ఆర్యూ ఓ.కె?" ఆతృతగా అడిగాడు శ్రీధర్. అవేమీ పట్టించుకోకుండానే.
ఇక్కడే ఈ రెండు కాల్స్ కి మధ్య ఏం జరిగుండవచ్చని గాని, తన ప్రతి ఇంటిమేట్ మూవ్ మెంట్ ని పసిగడుతున్న అపరిచితురాలు తను 7:30:20 తన ఫోన్ పక్కనున్నా, 7.35కే ఫ్లాట్ కి చేరుకున్నానని, అన్నప్పుడుగాని రవ్వంత ఆలోచించినా, అనుమానించినా కొన్ని ముఖ్యమైన వివరాలు దొరికిపోయుండేవి శ్రీధర్ కి.
"ఐయాం ఫైన్...థ్యాంక్యూ" అందామె గొంతుని సవరించుకుంటూ.
"ఇంతకీ నీ వుద్దేశమేమిటి? మనసులో ఏం వుంచుకుని ఇలా కాల్స్ చేస్తున్నావు?"
"నా మనసులో ఏముందో ఇంతవరకు తెలుసుకోలేకపోయావు. నువ్వేం మగాడివయ్యా బాబు."
"ఓ.కె... నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని నమ్ముతాను. నాలో ఏం చూసి? నా వెనక లక్షల ఆస్థులేం లేవు. ఉంటే ఆటోల్లోనో సిటీబస్సుల్లోనో ప్రయాణించవలసిన అవసరం నాకుండేది కాదు. ఇక నా క్వాలిఫికేషన్ జస్ట్ ఎం.బి.ఏ. ఈ రోజుల్లో అదేమంత గొప్ప క్వాలిఫికేషన్ అని నేననుకోను. ఇప్పుడు నా జీతం ఐదువేలు. ఇక నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావ్?"
శ్రీధర్ మాటలు పూర్తవుతూనే పెద్దగా నవ్విందామె.
"నేను నిన్ను ప్రేమిస్తున్నట్లు నువ్వే కన్ ఫర్మ్ చేసుకుంటున్నా వేమిటి చిట్టికన్నా...నేనింకా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పలేదే...నీతో స్నేహం నాకు ఇష్టం. నువ్వంటే ఇష్టం. అంతే!"
"సరే...అలాగే అనుకుంటాను. స్నేహానికయినా నాలో ఏంచూసావు?"
"చాలా చూసాను. నీ డ్రాయింగ్ రూం గోడలకి, నీ బెడ్ రూం కర్టెన్స్ కి నా కనుపాపల్ని అతికించేసుకున్నాను.
నీ బాడీటైప్ -50 పర్సెంట్ ENVOMORPH
50 పర్సెంట్ MESOMORPH ఏమై రైట్?"
అది వింటూనే చిన్న జలదరింపుకి గురయ్యాడు శ్రీధర్.
ఈ పోకిరిపిల్ల సాధారణమయింది కాదు. ఎండోమార్ఫ్, మెసోమార్ఫ్ అంటూ తన బాడీ గురించి నూటికి నూరుశాతం చెప్పింది. కొంప దీసి తన ఫ్లాట్ గోడలకి చెవులకు బదులు కళ్ళున్నాయా? అతనలా ఆలోచిస్తుండగానే తిరిగి ఆమె అంది.
"పురుషుడిలో నన్నాకర్షించేది అతని ఆత్మ సౌందర్యం. నీలోని ఆ సౌందర్యమే నాకు నచ్చింది. కాని పురుషులు, స్త్రీలలో బాహ్య సౌందర్యాన్నే ముందుగా వీక్షిస్తారు. సారీ...ఇలా అంటున్నందుకు. 95 శాతం పురుషుల గురించే నేనిప్పుడు చెపుతున్నది."
"అతికొద్ది రోజుల్లోనే నిన్నెలాగైనా పట్టుకుంటాను. ఛాలెంజ్" పట్టుదలగా అన్నాడు శ్రీధర్.
"ఛాలెంజ్ అనేది బయట ఎదగడానికి, బెడ్ రూంలో సుఖపడటానికే వర్తింపజేయాలి. ప్రతి చిన్న విషయానికి కాదు.
నీమీద నీకు నమ్మకం వుంటే, నీ ఫోన్ ని టాపింగ్ లో పెట్టకుండా నా జాడ తెలుసుకోవాలి. ట్యాపింగ్ అన్నది చాలా ఓల్డ్ టెక్నిక్. ఒకప్పుడు అది తెలివైన ఆలోచనే కావచ్చు. ఇప్పుడుకాదు. ట్యాపింగ్ లో పెడితే కావాలనే నన్ను, నువ్వు యిబ్బంది పెట్టిన వాడివవుతావు. అప్పుడు నేను మా యిల్లువదిలి వేరే చోటకెళ్ళి నీకు ఫోన్ చేయాల్సి వుంటుంది.
ఎంతయినా ఆడపిల్లనుగదా ? ఆడపిల్ల అర్థరాత్రి చేసే కాల్స్ కుండే మాధుర్యం, పట్టపగలు చేసే కాల్స్ కుండదు...నువ్వు నీ ఫోన్ ని ట్యాపింగ్ లో పెడితే రాత్రులెలా నీకు ఫోన్ చేయగలను చెప్పు. నువ్వు క్రిందుండే ముల్లు గుచ్చుకోకుండా, గులాబీని త్రుంచుకున్నప్పుడే అది కుశలత్వానికి నిదర్శనమవుతుంది. కాదంటావా ?"
"ఆ పని చేయను. వేరే మార్గాల ద్వారానే నీ జాడ తెలుసు కుంటాను."
పట్టుదలగా అన్నాడు శ్రీధర్.
"శభాష్! అదీ ఆత్మవిశ్వాసమంటే."
"నా ఆత్మవిశ్వాసాన్ని తరువాత తీరిగ్గా మెచ్చుకుందూగాని. నీలాగే నీ ఆత్మ సౌందర్యం గురించి తెలుసుకోవాలని నాకూ వుంటుందిగదా? నువ్వేమో నన్ను ప్రతిరోజూ చూస్తూ తెలుసుకున్నావు. మరి నేనెలా?"
"ఆత్మ సౌందర్యమనేది బాహ్యరూపం, ప్రవర్తన ద్వారే కాదు. మాట తీరుని బట్టి కూడా అంచనా వేయవచ్చు. ఇన్ని రోజులుగా మాట్లాడు తున్నాను. ఆ మాత్రం అంచనా వేయలేకపోయావా?" ఆమె మాటలు కవ్విస్తూన్నట్టుగా లేవు. సిన్సియర్ గానే వున్నాయి.
శ్రీధర్ కేం మాట్లాడాలో, ఏం చేయాలో తోచక పిచ్చిపట్టినట్టయింది.
"సరే...కనీసం నీ పేరయినా చెప్పు."
"ఎందుకు?" అడిగిందామె.
"కనీసం పేరు కూడా తెలీకుండా మాట్లాడటం నా కిష్టముండదు. ఐ డోంట్ లైకిట్."
ఒకింత అసహనంగానే అన్నాడు శ్రీధర్.
"ఎందుకలా?"
"నేను నీకు తెలుసు. నా పేరు తెలుసు. నా ఫోన్ నెంబరు...నా మిగతా వివరాలన్నీ నీకు తెలుసు. కాని, నువ్వెవరివో ఏమిటో నాకేమాత్రం తెలియదు. ఎలా మాట్లాడటం? పోనీ ఒకటి చెప్పు. నువ్వు నాకు తెలుసా?"