ప్రభుత్వన్ని ఇలాంటి పనులతో ఇరుకున పెట్టద్దు. తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించండి. లేదంటే తరువాత ఏం జరుగుతుందో ఆలోచించుకోండి. ఈ కేసు ఇంక పోలీసులకి హ్యండోవర్ చేశాం. ఈ నీరదని ఎక్కడ పెట్టారో, ఎవరు పెట్టారో గప్ చిప్ గా వదిలిపెట్టండి. లేదంటే బి ప్రిపేర్ ఫర్ ది వరస్ట్" అంటూ చాలా గట్టిగానే దులిపేశారు హోమ్ మంత్రి.
"మిమ్మల్ని వెనకేసుకు వచ్చి రక్షిస్తోందన్న అపవాదు ప్రభుత్వానికొద్దు... ఆలోచించుకోండి. రేపటిలోగా ఆ అమ్మాయి విడుదల కావాలి. ఇదే హెచ్చరిక..." గంభీరంగా అన్నారు.
"కిడ్నాప్ తో మాకేం సంబంధం..." ఏదో చెప్పబోయారు కొందరు.
హోమ్ మంత్రి వారిస్తూ "ఎవరికి సంబంధం వుందో వారికే ఈ హెచ్చరిక. ఎవరికీ సంబంధం లేకుండా ఊరికే ఆ అమ్మాయి గాలిలో మాయమైందా! పేపరుమీద కక్షతో చేసినపని ఇది. ఎవరు చేశారన్నది తేలదు కనుక అందరూ శిక్ష ఎదుర్కోవాల్సి వుంటుంది" గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. హోమ్ మంత్రి. మాడిపోయిన ముఖాలతో వెళ్ళారు అందరూ.
* * *
"మీ భార్యగారి ఫ్రెండ్ చెల్లెల్ని కిడ్నాప్ చేశారట గదా..." రంజని హేళనగా అంది.
"ఏం, ఇందులో కూడా నీకేదన్నా జోక్ కనిపిస్తోందా, అలా హేళనగా మాట్లాడుతున్నావు?" అన్నాడు కోపంగా రవీంద్ర.
"అబ్బో, మీ ఆవిడనే కాదు... ఆవిడ తరుపు ఎవరినన్నా ఏదన్నా అంటే కోపం వచ్చేస్తుంది తమరికి..."
"స్టాపిట్ రంజని. ఇది దెప్పే సందర్భం కాదు. ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకో..."
రంజని మొహం చిన్నబుచ్చుకుంది. "నీకు ఏ మాటన్నా కోపం వచ్చేస్తోందీ మధ్య... ఏదో సరదాకి అంటే."
"ఇది సరదా విషయమా! పాపం వాళ్ళలా ఏడుస్తుంటే నీకు వినోదంగా వుందా?"
"బాబోయ్ క్షమించు, ఊరికే అన్నానంతే" రంజని నమస్కారం పెడ్తూ కోపంగా అంది.
"శారద మా ఆవిడకే కాదు... నాకూ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్... మేమంతా ఇదివరకు ఎంత సరదాగా కలిసి పిక్నిక్ లకి వాటికి వెళ్ళేవారమో. నారాయణమూర్తి జంటిల్మన్. ఆయనకిలాంటి కష్టం వచ్చిందని అందరం ఎంతో బాధపడుతున్నాం" బాధగా అన్నాడు.
రంజనితో మాట్లాడుతూండగానే సునీతనించి అతనికి ఫోన్ వచ్చింది.
"రవీ, గౌతమ్ స్కూల్ నించి ఫోను వచ్చింది. గౌతమ్ బస్సు దిగి గేటులోకి వెళుతుండగా స్కూటరొచ్చి వీడిని గుద్దిందట. వీడు కిందపడిపోయాడు. చేయి విరిగినట్టుంది. రెండు మూడుచోట్ల గీరుకుపోయాయి. ఒకటే ఏడుస్తున్నాట్ట చెయ్యినొప్పి అంటూ. హెడ్ మిస్ట్రెస్ ఫోన్ చేసి, వెంటనే రమ్మంది. రవీ, ప్లీజ్! కారు తీసుకువస్తావా" సునీత గాభరాగా అంది.
"ఓగాడ్... ఎంతసేపైంది? ఇప్పుడే వస్తాను... నీవు రెడీగా వుండు. బయలుదేరుతున్నాను" అని కారుతాళాలు తీసుకుని బయలుదేరాడు.
"రంజనీ, నేను ఇంటికెళ్ళి స్కూల్ కి వెళ్ళాలి. మా గౌతమ్ కి చిన్న యాక్సిడెంట్ అయి చేయి విరిగింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. లంచ్ టైముకి రాగలనోలేదో, మేనేజ్ చెయ్యి" అంటూ గబగబా వెళ్ళిపోయాడు.
రంజని మొహంలో రంగులు మారాయి. 'మొగుడు డైవర్సు ఇచ్చినా అన్నింటికీ ఈయనగారు మళ్ళీ కావాలి... ఈయనకీ బుద్ధి లేదు. ఆవిడ పిలవడం, ఇతను పరిగెత్తడం' కసిగా అనుకుంది.
* * *
"ఏం సార్! అలా వున్నారు, ఒంట్లో బాగాలేదా?" సుప్రియ చాలా ఆదుర్దా కనబరుస్తూ అడిగింది. ఆఫీసుకి వచ్చిందగ్గిరనించి చాలా అసహనంగా వున్నాడు ప్రకాష్ ఆ రోజు.
"ఏంలేదు సుప్రియా ఉదయంనించి తలనొప్పి, ఏదో చికాకు. శారద కూడా లేదు. ఇంట్లో రాహుల్ ఒకటే విసిగిస్తున్నాడు" అన్నాడు.
"సార్! మాత్ర ఏం వేసుకోలేదా... తెప్పిస్తానుండండి. కాఫీతో వేసుకుందురుగాని" అంటూ ఫ్యూన్ ని పంపించి మాత్ర తెప్పించి కాఫీతో ఇచ్చింది. ఆమె బ్యాగులో ఎప్పుడూ అమృతాంజనం వుంటుంది. "సార్, అమృతాంజనం వుంది రాయమంటారా?" అంది.
"వద్దు... తగ్గిపోతుందిలే, ఇట్స్ ఒకే" అన్నాడు మొహమాటంగా.
"ఊహు అలా కాదు... తల అలా వెనక్కి వాల్చండి. చూడండి నా చేతి మహత్యం నిముషంలో తగ్గుతుంది..." అంటూ రెండు చేతులతో అమృతాంజనం తీసి అతని నుదురుమీద రాసి వేళ్ళతో మర్దనా చేసింది. నిజంగా ఆమె వేళ్ళలో ఏదో మహత్తువున్నట్టు అలా రాయడంలో ఏదో టెక్నిక్ వున్నట్టు చాలా హాయిగా సూదింగ్ గా వుంది. అలవోకగా ఆమె అలా రాస్తుంటే తల వెనక్కి వంచిన అతనికి ఆమెలోంచి ఏదో మంచి ఫెర్ ఫ్యూమ్ వాసన అదోరకం మత్తులాంటిది కలిగించి కళ్ళు మూసుకున్నాడు.
"బాగుందా సార్... తగ్గిందా" మృదువుగా అడిగింది.
ఆమె సాన్నిహిత్యాన్ని తనివితీరా అనుభవిస్తూ మైమరుపులో వున్న ప్రకాష్ కళ్ళు తెరిచాడు. "థ్యాంక్స్ సుప్రియా, ఇట్స్ ఎ మిరకల్. నీ చేతిలో ఏదో మహత్తుంది... నిజంగానే అలా చేత్తో తీసేసినట్టు నొప్పి మాయం అయింది" అభిమానంగా అన్నాడు.
సుప్రియ చిరునవ్వు చిందించింది. "చెప్పాగా సార్, నా చేతిలో మహత్యం వుందని" చనువుగా అంది.
"నీ చేతిలోనే కాదు నీలోనూ వుంది మహాత్యం" అతనికి తెలియకుండానే అనేశాడు.
"నిజంగానా" సిగ్గులొలకబోసింది.
"ఓకే, నీవిచ్చిన ట్రీట్ మెంట్ కివాళ ట్రీట్ ఇస్తాను నీకు. రాత్రి మంచి డిన్నరిస్తాను" అన్నాడు.
సుప్రియ సూటిగా కళ్ళలోకి చూసింది.