Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 28


              త్రాగుడు హానికరము- ఇట్లు - తాగుబోతులు
    కృష్ణయ్య రోజూ ఫుల్ గా మందుకొట్టేసి రావడం అలవాటయిపోయింది. దీనివల్ల మా కాలనీలో అందరికీ అతనో టాపిక్ అయిపోయాడు. అతని భార్య మా అందరి దగ్గరా అతను చేసుకున్న ఆ ముదనష్టపు అలవాటు గురించి రోజూ కన్నీటితో చెప్పుకోవడం ప్రారంభించింది.
    "నిన్న రాత్రి ఏం జరిగిందో చూశారా అన్నయ్యగారూ! తాగిన మైకంలో ఇంటికొచ్చి నన్ను నిద్రలేపకుండానే వంటింట్లోకెళ్ళి గిన్నెలో పట్టించి వుంచిన సున్నిపిండినే అన్నం అనుకుని అందులో మా అమ్మాయి నూరిపెట్టుకున్న గోరింటాకు ముద్దను పచ్చడి అనుకుని కలుపుకుని తినేశారు" అందామె ఓరోజు మా ఇంటికొచ్చి ఏడుస్తూ. "పైగా పచ్చడి అద్భుతం అంటున్నారు."
    "మరి నువ్వాసంగతి కృష్ణయ్యకు చెప్పలేదూ?"
    "చెప్పినా నమ్మడంలేదన్నయ్యగారూ! నేనెంత తాగుబోతునయినా అన్నమేదో సున్నిపిండేదో తెలుసుకోలేననుకున్నావంటే! వెళ్ళెళ్ళు" అంటూ తరిమికొట్టారు. కొంచెం మీరయినా చెప్పండన్నయ్యగారూ! ఎలాగయినా ఆయన్ని ఆ అలవాటునుంచి తప్పించకపోతే నా కోపం గుల్లయిపోతుంది- ఆయన నాకిక దక్కరు"
    మేమందరం చేరి కృష్ణయ్యకు తాగుడు వల్ల ఎన్ని అనర్ధాలున్నాయో- ఓ రోజంతా నూరిపోశాము. ఆ రాత్రి మేమంతా కాలనీ కమ్యూనిటీ హాల్లో టీ.వీ. చూస్తుంటే అందులో కూడా ఓ వ్యక్తి ఎర్రగా తాగినట్టున్న కళ్ళతో వచ్చి "త్రాగుడు హానికరము, నమస్కారం" అని చెప్పేసి వెళ్ళిపోయాడు.
    "చూశావా టీ.వి. వాళ్ళు కూడా తాగొద్దంటున్నారు" అన్నాడు రంగారెడ్డి కృష్ణయ్యతో. వాళ్ళావిడవచ్చి బోరున ఏడ్చేసింది.
    "తాగుబోతు కాదని తెలిశాకే మావాళ్ళు లక్ష రూపాయలు కట్నం ఇచ్చి పెళ్ళి చేశారన్నయ్యగారూ! ఇలా తాగుబోతు అవుతారని తెలిస్తే ఆ కాకినాడ సంబంధమే చేసుకునేదాన్ని-" అందామె.
    "టీ.వీ.లో ఎవరో మంత్రి వచ్చి తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయిపోతున్నాయ్. అంతేకాదు, లివర్ కూడా పాడవుతుంది" అంటూ ఉపన్యాసం ఇచ్చాడు. కృష్ణయ్యకు పశ్చాత్తాపం కలిగింది.
    "ఇంతమంది ఇన్ని విధాల చెప్తుంటే తాగడం నిజంగా చాలా ఘోరం! ఇవాళ్టినుంచే తాగుడు మానేస్తున్నాను" అంటూ ప్రతిజ్ఞ చేశాడతను. అందరం ఆనందంతో కృష్ణయ్యను కౌగిలించుకున్నాం! వాళ్ళావిడ ఆనందభాష్పాలు రాల్చింది. ఇది జరిగి వారంరోజులయిన తర్వాత కృష్ణయ్య కనిపించాడు మాకు. "ఇవాళ్టికి వారం రోజులు గురూ మందు మానేసి! హెల్త్ భలే బావుంది! మీ అందరికీ ఋణపడి వున్నాను" అన్నాడు. మేమందరం సంతోషించాం.
    ఆ తర్వాత వారంరోజులకు వాళ్ళావిడ ఏడుస్తూ వచ్చింది. మేమందరం మాట్లాడుకుంటుంటే ఆమె ఇంట్లో నుంచి కృష్ణయ్య బిగ్గరగా వేస్తున్న కేకలు వినిపించసాగినయ్.
    "ఆ తాగుడు ఉన్నప్పుడేనయం అన్నయ్యగారూ! రాత్రి ఏ పదింటికో ఇంటికొచ్చి ఏ సున్నిపిండి అయినా పరమానందంగా భోజనం చేసి బాత్ రూమ్ కెళ్ళేదార్లోనే పడి నిద్రపోయేవారు. ఇప్పుడు ఆఫీస్ అవగానే తిన్నగా ఇంటికొచ్చి నన్ను సాధించుకు తింటున్నారు. కూరలో కారం ఎక్కువయిందని ఓ రోజు, ఉప్పు తక్కువయిందని ఓ రోజు గిన్నె నా మొఖాన కొడుతున్నారు. పిల్లల్ని కూడా పాఠాలు చెప్తానని పిలిచి చీటికిమాటికి చావగొడుతున్నారు. వాళ్ళసలు తండ్రంటేనే భయపడి పోతున్నారు- ఇంట్లో ఎవ్వరికీ నిద్రలేదు, సుఖం లేదు" అంటూ బావురుమంది.
    "సరేలేమ్మా! మేమంతా కృష్ణయ్యకు సర్దిచెప్తాం! నువ్వు కూడా అతనికి కోపం రాకుండా చూడు! కూరలూ వగైరాల్లో ఉప్పూ కారాలు సరిగ్గా సరిపోయేట్టు వేయి" అన్నాం ఆమెతో. ఆమె కన్నీరు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది.
    మర్నాడు కృష్ణయ్య విచారంగా వచ్చాడు మా దగ్గరకి. "మా బాస్ కి నాకూ నిన్న గొడవయిపోయింది గురూ!" అన్నాడతను.
    "ఎందుకని?"
    "ఇదివరకు మా బాస్ లిద్దరూ, మా గుమస్తా నలుగురం కలసి కాంట్రాక్టర్ల కార్లో బారుకెళ్ళి రాత్రి ఎనిమిదింటివరకూ మందు కొట్టి మళ్ళీ ఆఫీస్ కొచ్చి రాత్రి పదకొండింటివరకూ కూర్చుని అర్జెంట్ ఫైల్సన్నీ క్లియర్ చేసేవాళ్ళం! నేను తాగుడు మానేశానని చెప్పి అయిదింటికే ఇంటికొస్తుంటే మా బాస్ రావడానికి వీల్లేదన్నాడు. దాంతో గొడవయింది. నన్ను శ్రీకాకుళం బదిలీ చేయిస్తానంటున్నాడిప్పుడు-"
    "ఫరవాలేదు. త్రాగుడు హానికరము౧ కనుక నీకు బదిలీ అయినా ఫర్లేదు గానీ తాగుడు మాత్రం ప్రారంభించకు! నిజం చెప్పు! తాగుడు మానేశాక నీకు ఆనందంగా లేదూ?"
    "చాలా హాయిగా వుంది గురూ!" అన్నాడతను ఆనందంగా.
    మర్నాడతను వాచిన కన్నుతోను, చిరిగిన చొక్కాతోనూ ఇంటికొచ్చాడు.
    "ఏం జరిగింది?" అందరం అతని చుట్టూ మూగి అడిగాం.
    "బస్ కండక్టర్ అమర్యాదగా మాట్లాడాడు. దాంతో ఇద్దరం కొట్టుకున్నాం! ఇదివరకు తాగి వుండేవాడిని కాబట్టి ఎవడేమన్నా మనకి తెలిసేదికాదు" అంటూ ఇంట్లోకెళ్ళిపోయాడు. ఆ తరువాత వారంరోజులకు మాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది కృష్ణయ్య లాకప్ లో వున్నాడని.
    అందరం విడిపించుకురావడానికి వెళ్ళాం.
    "ఏం జరిగింది?"
    "ఏంలేదు గురూ! అదివరకు తాగిన మత్తులో కాంట్రాక్టర్లు 'నోట్' ఎలా రాయమంటే అలా రాసేవాల్లమ౧ ఇప్పుడు తాగడం మానేశాం గదా! అందుకని ఉన్నదున్నట్టు రాస్తుంటే వాళ్ళకి మనకూ గొడవయిపోయింది. కుర్చీలతో కొట్టుకున్నాం! ఒక కాంట్రాక్టర్ తల, ఇంకొకడి చేయి విరిగినయ్..."
    అందరం చందాలేసుకుని కృష్ణయ్యను లాకప్ నుంచి విడిపించాం.
    ఇది జరిగిన వారంరోజులకు అతనిని సస్పెండ్ చేశారు ఆఫీసులో. జీతం రాకపోయేసరికి కాలనీలో ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది.
    ఆ తరువాత చాలారోజులకు కనబడ్డాడు మళ్ళీ చిరిగిన బట్టలేసుకుని.
    "మీ ఆవిడా, పిల్లలూ ఎలా వున్నారు?" అడిగాము మేము.
    "ఏమో నాకేం తెలుసు? మా ఆవిడని వదిలేసి చాలారోజులయిపోయిందిరా!" మేము ఆశ్చర్యపోయాం.
    "ఎందుకని?"
    "దాని మొఖం చూస్తేనే చిరాగ్గా వుంది నాకు! అదివరకు తాగిన మైకంలో దాని మొఖం బాగానే కనిపించేది. అదేమన్నా కూడా వినిపించేది కాదు- నిజంగా తాగుడు మానిపించి మీరంతా నాకు గొప్ప సహాయం చేశారు" అన్నాడతను మా అందరికీ నమస్కరిస్తూ.
    మాకు మతిపోయినట్టయింది.
    "మరి నీ ఉద్యోగం?"
    "అదీ పోయింది! అయినా ఆ తాగుబోతుల దగ్గర ఎవడుద్యోగం చేస్తాడు? అంతా మోసమే! మొత్తం గవర్నమెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా చేయాలి- థూ!"
    మేమంతా మాలో మేము చర్చించుకుని కృష్ణయ్యని బార్ కి లాక్కెళ్ళాం.
    "గురూ! త్రాగుడు హానికరం అని ఊరికే అన్నాఅమ౧ సీరియస్ గా తీసుకోకు! మనదేశంలో తాగని వాడెవడు చెప్పు- అదిగో? ఆ మూల చూడు ఆరోజు టీ.వీ.లో త్రాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయిపోతున్నాయ్" అని చెప్పిన మంత్రిగారు, ఈ మూల చూడు 'త్రాగుడు హానికరం' అంటూ టీ.వీ.లో చెప్పే అనౌన్సర్! మరి మేము! వీలు దొరికినప్పుడల్లా మేమూ మందు కొడుతూనే వుంటాం! అంచేత ఇదిగో- చీర్స్" అంటూ గ్లాస్ అందించాం.
    ఆ తరువాత వారం రోజులకే మళ్ళీ భార్యాపిల్లలతో మా కాలనీలో కొచ్చేశాడతను. పోయిన అతని ఉద్యోగం కూడా అతనికిచ్చేశారు. ఇప్పుడతని భార్య తాగుడు అలవాటు గురించి ఏమాత్రం గొడవ చేయడం లేదు.
                                                      *    *    *

 Previous Page Next Page